సూపర్ మార్కెట్ లీడర్ ’డీమార్ట్’ ఐపీవో
ముంబై: రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ , సూపర్ మార్కెట్ లీడర్ డీమార్ట్ త్వరలో ఐపీవోకి రానుంది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న డీమార్ట్ మార్చి 8న పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. మార్చి 10న ముగియనున్న ఇష్యూకి రూ. 290-299 ప్రైస్ బ్రాండ్‌గా ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా రూ. 1,810-1866 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా 6.23 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 1.87 కోట్ల షేర్లను విక్రయించనుంది. మరో 1.24 కోట్ల షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు(క్విబ్), 93.59 లక్షల షేర్లను సంపన్న వర్గాలకు రిజర్వ్ చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 2.18 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది. ఇష్యూ తరువాత డీమార్ట్ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి.
ఈ ఇష్యూకు గ్లోబల్ కోఆర్డి నేటర్‌గా, లీడ్ మేనేజర్ కొటక్ మహీంద్రా క్యాపిటల్ వ్యవహరిస్తోంది. ఇతర లీడ్ మేనేజర్లుగా యాక్సిస్ క్యాపిటల్, ఎడెల్‌వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇంగా కాపిటల్, జెఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ క్యాపిటల్ అడ్వైజర్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తున్నాయి.
కాగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో అత్యధిక శాతం స్టోర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల తెలుగు రాష్ట్రాలలోనూ వేగంగా విస్తరిస్తోంది. సుమారు 120 స్టోర్లను ఇప్పటికే నిర్వహిస్తున్న సంస్థ 2016 మార్చికల్లా రూ. 8,600 కోట్ల అమ్మకాలతో 320 కోట్ల నికర లాభం ఆర్జించింది. రూ. 5.72 ఈపీఎస్ నమోదైంది. గత రెండేళ్లలో కంపెనీ లాభార్జన సగటున 31 శాతం చొప్పున జంప్‌చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7.6 ఈపీఎస్‌ను కంపెనీ అంచనా వేస్తోంది. ఇష్యూ ధర రూ. 300కాగా.. 40 పీఈలో షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.