
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఐపీవో జూన్ 16న ప్రారంభం కానుంది. 18న ఇష్యూ ముగియనుంది. రూ.10 ముఖ విలువతో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ రూ.815–825గా నిర్ణయించారు. ఐపీవో ద్వారా రూ.2,144 కోట్లు సమీకరిస్తారు. ఫ్రెష్ ఇష్యూ రూ.200 కోట్లు ఉంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 2.35 కోట్ల షేర్లను జారీ చేస్తారు. ఇందులో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ కేహెచ్ 1.60 కోట్ల షేర్లు, భాస్కర్ రావు బొల్లినేని 3.88 లక్షలు, రాజ్యశ్రీ బొల్లినేని 7.76 లక్షలు, బొల్లినేని రమణయ్య మెమోరియల్ హాస్పిటల్స్ 3.88 లక్షలు, ఇతరులకు చెందిన 60 లక్షల షేర్లున్నాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు 75 శాతం, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్స్‌కు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను కేటాయిస్తారు.
పొరుగు రాష్ట్రాలకు విస్తరణ..
ఐపీవో ద్వారా వచ్చిన నిధులను మధ్య భారత్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సంస్థ విస్తరణకు వినియోగిస్తామని కిమ్స్ సీఈవో బొల్లినేని అభినయ్ తెలిపారు. ఎండీ భాస్కర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన మీడియాకు ఐపీవో వివరాలను వెల్లడించారు. హాస్పిటల్స్ బెడ్స్ సామర్థ్యం సైతం పెంచుతామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంస్థకు ప్రస్తుతం 9 ఆసుపత్రులు ఉన్నాయి. మొత్తం పడకల సంఖ్య 3,064. కిమ్స్ 2020–21లో రూ.1,340 కోట్ల టర్నోవర్‌పై రూ.205 కోట్ల నికరలాభం ఆర్జించింది. కాగా, కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూసే సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్లను నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment