
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 304–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.
తద్వారా రూ. 2,981 కోట్లు సమీకరించనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఈ ఇష్యూలో ఒక్కో షేర్ ముఖ విలువ రూ.1గా ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ కనీసం 46 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
యాంకర్ ఇన్వెస్టర్లకు ఏప్రిల్ 25నే బిడ్డింగ్ ప్రారంభం కానుంది. ఇక తమ ఉద్యోగులకు లక్ష షేర్ల వరకూ కేటాయించిన ఏథర్.. వారికి ఒక్కో షేర్‌పై రూ.30 తగ్గింపు అందిస్తోంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది.