
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 25న షేర్లను ఆఫర్ చేయనుంది.
ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. అంతేకాకుండా రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్స్చేంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే.
మూన్ బెవరేజెస్ ఐపీవో యోచన
గ్లోబల్ పానీయాల దిగ్గజం కోక కోలా బాట్లర్ మూన్ బెవరేజెస్ (Moon Beverages IPO) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో భారీగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఎంఎంజీ గ్రూప్ కంపెనీ వైస్‌చైర్మన్ అనంత్ అగర్వాల్ తెలియజేశారు. రానున్న మూడు, నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా ఇప్పటికే రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
వెరసి కొత్త ప్లాంట్లు, సామర్థ్య విస్తరణ, కొత్త మార్కెట్లలో ప్రవేశం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. అస్సామ్‌లోని గువాహటి, ఒడిషాలోని రూర్కెలాలో ఏర్పాటవుతున్న ప్లాంట్లపై మరిన్ని పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. దీంతో నిమిషానికి 7,000 బాటిళ్ల సామర్థ్యం జత కలవనున్నట్లు తెలియజేశారు.
ఐపీవోకు కాంటినుమ్ గ్రీన్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ( Continuum Green Energy IPO) పబ్లిక్ ఇష్యూకి అనుమతించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్స్ రూ. 2,400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ లిస్టింగ్ ద్వారా రూ. 3,650 కోట్లు సమీకరించనుంది. 2024 డిసెంబర్‌లో కంపెనీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.
ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,100 కోట్లు అనుబంధ సంస్థలు తీసుకున్న కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటి అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ తదితరాలను చేపడుతోంది. 2023–24లో కంపెనీ ఆదాయం 33 శాతం ఎగసి రూ. 1,294 కోట్లను తాకింది.