
రిక్రూట్‌మెంట్ అండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో మరింత వృద్ధిపై దృష్టి సారించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.300 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఉత్సాహంతో 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.500 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రాబోయే ఐపీఓ అరంగేట్రం కోసం కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
ఐపీవో సన్నాహాల్లో భాగంగా సీనియర్ లీడర్ షిప్‌లో కీలక మార్పులు చేసింది. గతంలో సహ వ్యవస్థాపకులు కమల్ కారంత్, అనిల్ ఎథనూర్ నిర్వహించిన బాధ్యతలను క్రమబద్ధీకరిస్తూ ఫ్రాన్సిస్ పడమడన్‌ను కాబోయే సీఈఓగా ప్రకటించింది. ఈ నాయకత్వ మార్పుతో కంపెనీ స్పెషలిస్ట్ సిబ్బంది, వ్యూహాత్మక గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ భాగస్వామ్యాల అభివృద్ధి, కొత్త ప్రాంతాలకు విస్తరించడంపై దృష్టి పెడుతోంది.
"ఎదుగుదలలో మేమిప్పడు కీలక దశలో ఉన్నాం. ఫ్రాన్సిస్ నాయకత్వంలో మా నాయకత్వ బృందం నడవడం స్పెషలిస్ట్ స్టాఫింగ్ స్పేస్‌లో ఆధిపత్య కంపెనీగా మారడానికి ఒక కీలకమైన దశ" అని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ అన్నారు.
భారతదేశ 6 బిలియన్ డాలర్ల స్పెషలిస్ట్ స్టాఫింగ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏటా 40 కి పైగా కొత్త జీసీసీలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఐటీ టాలెంట్ పూల్స్ నుండి సుమారు 20,000 కొత్త నియామకాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా సాఫ్టవేర్ ఇంజనీర్లు భారత్ నుండి వలసపోతున్నారని, ఇది ప్రత్యేకమైన సిబ్బంది అవకాశాలను సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది.
2017లో స్థాపించిన ఎక్స్‌ఫెనో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ. ఇది జీసీసీలు, పెద్ద సంస్థల కోసం 23,000 మందికి పైగా టెక్ నిపుణులను నియమించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ సహా ముఖ్యమైన భారతీయ నగరాలతో పాటు అంతర్జాతీయంగా యూఎస్‌లోనూ ఉనికిని కలిగి ఉంది.