Staffing and Recruiting
-
కేంద్రీయ వర్సిటీల్లో కోటా తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: అడ్మిషన్లు, ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. అన్ని కోర్సులలో అడ్మిషన్లకు కేంద్రీయ విద్యా సంస్థలు(అడ్మిషన్లలో రిజర్వేషన్లు) చట్టం-2006 అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాసింది. బోధనేతర సిబ్బంది నియామకాల్లో గ్రూప్ ‘ఏ’, గ్రూప్ ‘బి’ పోస్ట్‌లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అయితే బోధనా సిబ్బంది నియామకాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే అమలు చేయాలని పేర్కొంది. -
రానున్నది కొలువుల జాతర...
మైహైరింగ్‌క్లబ్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ : వచ్చేది పండుగ సీజనే కాదండీ.. నిరుద్యోగులకు ఆనందాన్ని పంచే కాలం కూడా. ఎందుకంటే వచ్చే మూడు నెలల కాలంలో ఉద్యోగ నియామకాలు జోరు మీద ఉండనున్నాయి. ప్రముఖ నియామకాల ప్లాట్‌ఫామ్ మైహైరింగ్‌క్లబ్.కామ్ నిర్వహించిన ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే ప్రకారం.. గత త్రైమాసికంతో పోల్చినా, ఏడాది క్రితంతో పోల్చినా రానున్న త్రైమాసికంలో అధిక ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. ఈ ట్రెండ్ అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో కనిపించనుంది. సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది రానున్న కాలంలో ఉద్యోగ నియామకాల జోరు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే 10 శాతం మంది ఉద్యోగ నియామకాల్లో తగ్గుదల ఉంటుందని, 8 శాతం మంది ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. వచ్చే త్రైమాసికంలో కంపెనీలు అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టనున్నాయని మైహైరింగ్‌క్లబ్.కామ్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. దీనివల్ల నిరుద్యోగులకు అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్-ఫైనాన్షియల్, తయారీ-ఇంజనీరింగ్ రంగాల్లో ఈ అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఆగస్ట్‌లో ఆన్లైన్ నియామకాల జోరు: మాన్స్టర్ దేశంలో ఆన్లైన్ నియామకాల వృద్ధి ఆగస్ట్ నెలలో 36%గా నమోదైంది. ఈ ఏడాది మొత్తంలో ఇదే అధిక వృద్ధి. దీంతో రానున్న కాలంలో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా ఉండనుందని మాన్స్టర్.కామ్ సర్వేలో పేర్కొంది. మాన్ స్టర్.కామ్ ఉద్యోగ సూచీ ఆగ స్ట్ నెలలో 55 పాయింట్ల వృద్ధితో 208కి పెరిగింది. ఈ సూచీ గతేడాది ఇదే సమయంలో 153గా, జూలై నెలలో 204గా ఉంది. తయారీ/ఉత్పత్తి, బ్యాంకింగ్, బీమా రంగాల్లో అధిక నియామకాలు జరగనున్నాయి. -
కొలువుల గని సింగరేణి
2019-20 నాటికి అదనంగా మరో 11,504 ఉద్యోగాలు సాంకేతికపరమైన ఉద్యోగాలే ఎక్కువ.. 19 కొత్త గనుల్లో భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు గోదావరిఖని: తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమవుతోంది. సింగరేణిలో ఇరవై ఏళ్ల క్రితం ఉద్యోగ నియామకాలు జరగగా.. తాజాగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నాడు గనుల్లో బొగ్గును ఎత్తి టబ్బుల్లో పోసేందుకు అవసరమైన కోల్‌ఫిల్లర్, బదిలీఫిల్లర్ కార్మికులను తీసుకోగా... తాజా నియామకాల్లో ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, సివిల్, మెకానికల్ ఇంజనీర్లు, మైనింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,178 ఉద్యోగాలకు, మార్చిలో 779 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ నియామక ప్రక్రియను పూర్తి చేస్తోంది. మరో 272 పోస్టులకు మే 11న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టు నాటికి మరణించిన, తీవ్ర అనారోగ్యానికి గురైన కార్మికుల స్థానంలో వారి వారసులైన 2,744 మందికి ఉద్యోగావకాశం కల్పించాల్సి ఉండగా... ఇప్పటికే సగానికిపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది. కొత్త గనుల్లో వేలాది ఉద్యోగావకాశాలు సింగరేణిలో ఆధునిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో నైపుణ్యం ఉన్న కార్మికుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న ఏడాదిలోగా రామగుండం ఓసీపీ-3 ఎక్స్టెన్షన్ ఫేజ్-2, బెల్లంపల్లి ఓసీపీ-2 ఎక్స్టెన్షన్ బ్లాక్, కొండాపురం భూగర్భ గనిని యాజమాన్యం ప్రారంభించనుంది. 2016-17లో మణుగూరు ఓసీపీ, కేకే ఓసీపీ, కాసిపేట-2 భూగర్భ గని, 2017-18లో జేవీఆర్ ఓసీపీ-2, కేటీకే ఓసీపీ సెక్షన్-2, తాడిచెర్ల ఓసీపీ-1, ఇందారం ఖని ఓసీపీ, 2018-19లో తాడిచర్ల ఓసీపీ-2, శ్రావణ్‌పల్లి ఓసీపీ, 2019-20లో కిష్టారం ఓసీపీ, రాంపూర్ షాప్ట్బ్లాక్, గుండాల భూగర్భ గని, వెంకటాపూర్ ఓసీపీ, పెద్దాపూర్ ఓసీపీ, కేకే 6,7 భూగర్భ గనులు, ఆర్కేపీ ఓసీ పీ ఫేజ్-2 ప్రాజెక్టులను ప్రారంభించేందుకు యూజ మాన్యం చర్యలు తీసుకుం టోంది. ఈ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో పనిచేసేందుకు తాజాగా నియామకం చేసుకుంటున్న 5,009 ఉద్యోగాలకు అదనంగా మరో 11,504 ఉద్యోగులను నియమించేందుకు సింగరేణి ప్రణాళికలు రూపొందించింది. దీంతో సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల నిరుద్యోగులకు నిబంధనల ప్రకారం 80 శాతం ఉద్యోగాలు లభించనున్నాయి. సింగరేణి కార్మికునికి రూ. కోటి ఉద్యోగ విరమణ ప్రయోజనం రుద్రంపూర్: ఉద్యోగ విరమణ చేసిన సింగరేణి కార్మికుడు కోటి రూపాయల ప్రయోజనం పొందారు. ఈ ఘనత ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాకే దక్కింది. కొత్తగూడెం వీకె -7 షాప్ట్గనిలో ఎస్ఈ (ఎస్‌ఎంఎంసీ)గా పనిచేసిన అబ్దుల్ సమ్మద్ ఏప్రిల్ 30 ఉ ద్యోగ విరమణ చేశారు. సింగరేణి యాజమాన్యం అదే రోజు కార్మికుడికి సంబంధించిన బెనిఫిట్స్ రూ. కోటి చెక్కును అందజేసింది. రూ. 78 లక్షల ప్రావిడెంట్ ఫండ్, గ్రా ట్యుటీ రూ. 10 లక్షలు, రూ. 12 లక్షలు లీవ్ బెని పిట్స్ మొత్తం రూ. కోటి చెక్‌ను సీజీఎం సీ హెచ్ వెంకటేశ్వరరావు అందజేశారు. గ్రాట్యుటీ సీలింగ్ లేకుంటే మరి న్ని డబ్బులు వచ్చేవని సమ్మద్ భావిస్తున్నారు. -
సవాళ్లు..సౌకర్యాలు
రెండూ సమపాలు..అదే ఆర్మీ విశిష్టత పైరవీలకు చోటు లేదు..ప్రతిభకే పట్టం ఉన్నత విద్యావంతులకూ అవకాశాలు దేశమాత సేవలో తరించే అదృష్టం ఏటా నాలుగుసార్లు నియామక ర్యాలీలు ‘సాక్షి’తో ఆర్మీ అధికారులు సంగ్రాం దాల్వి, ఏకే సింగ్ రాత్రింబవళ్లు పహారా కాస్తాం. శత్రు దేశాల నుంచి మన సరిహద్దులను కాపాడతాం. దేశమాత సేవకు ఇంతకన్నా మంచి అవకాశం.. అదృష్టం ఇంకేముంటుంది.ఆ అవకాశాన్ని.. అదృష్టాన్ని ఆర్మీ కల్పిస్తోంది. అదీ అభ్యర్థుల వద్దకే వచ్చి కల్పిస్తోందని చెన్నైకి చెందిన ఆర్మీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్(రిక్రూట్మెంట్) సంగ్రాం దాల్వి అన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఇక్కడి ప్రత్యేక అధికారి కల్నల్ ఎ.కె.సింగ్‌తో కలిసి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. శ్రీకాకుళం : నెలల తరబడి కుటుంబాలకు దూరంగా కొండకోనల్లో విధులు నిర్వర్తించే ఆర్మీ ఉద్యోగం అంటేనే ఓ సవాల్. అయినా ఇందులో దేశసేవలో తరిస్తున్నామన్న తృప్తి ఉంటుంది.తక్కువ వయసులోనే ఉద్యోగానికి ఎంపికై పిన్న వయసులోనే పదవీ విరమణ తీసుకుంటాం. అయినప్పటికీ సైనికుల కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు, రవాణా భత్యం, భోజనం ఇలా..అన్నీ కల్పించేందుకు దే శం ముందుకు వచ్చింది. ఉద్యోగ విరమణ తరువాత ఒక్క ఐడీ కార్డుతో మరెన్నో ఉద్యోగ అవకాశాలు. ఒక కుటుంబం జీవితాంతం హాయిగా ఉండే అవకాశం కల్పిస్తున్న ఉద్యోగం ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఆర్మీ ఉద్యోగం వేల రెట్ల సంతృప్తినిస్తుంది. అందుకే ఆర్మీకి రండి.. దేశ సేవ చేయండి. వ్యాయామమే పెట్టుబడి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మార్చిలోపు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 ర్యాలీల ద్వారా వెయ్యి మందికి తక్కువ కాకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటాం. ప్రతి జిల్లా అభ్యర్థులకూ ఏడాదికి రెండుసార్లు అవకాశం వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ లోపు కనీ సం 854 మందికి సోల్జర్ (జనరల్ డ్యూ టీ), టెక్నికల్ (నర్సింగ్), సోల్జర్ (ట్రేడ్స్‌మెన్).. ఇలా మూడు విభాగాల్లోఆర్మీ అవకాశం కల్పించింది. అంతకు మిం చిన అర్హతలున్న అభ్యర్థులున్నా తీసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా క్లరికల్ విభాగంలో వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో చాలామంది పరీక్ష రాశారు. రేపోమాపో ఫలితాలొస్తాయి. కానీ మా కోరిక ఒకటే. దయజేసి ఎవరెన్ని చెప్పినా, ఏం చేస్తామన్నా, ఉద్యోగాలిప్పిస్తామంటే మాత్రం పైసా కూడా ఇవ్వొ ద్దు. లంచం ఇచ్చి దేశానికి సేవ చేస్తారా? తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఏజెంట్ల చేతి లో పెట్టొద్దు. ఎవర్నీ నమ్మకండి. కష్టపడి రోజూ వ్యాయాయం చేస్తే ఉద్యోగం గ్యారెంటీ. మూడు నెలల్లోనే ఉద్యోగం రూపాయి ఖర్చు లేకుండా, కానీ లంచం లేకుండా, పైరవీలతో పని లేకుండా వచ్చే ఉద్యోగం ఆర్మీ ఉద్యోగమే. దేహ దారుఢ్యం, ఎత్తు, పరుగు, చదువుకు సం బంధించి అన్ని పత్రాలు ఉండి.. వైద్య పరీక్షలు, అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే మూడంటే మూడు నెలల్లో ని యామక పత్రం చేతిలోకొచ్చి వాలుతుంది. ఈ ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం మొదటి దశ ప్రక్రియ జరుగుతోంది. మార్చి 15నాటికి ఫలితాలొచ్చేస్తాయి. ఏప్రిల్ మొదటి వారంలో అన్ని పరీక్షలూ పూర్తయిపోతాయి. మొదటి నెల జీతమే కనీసం రూ.30వేలు (అన్నీ కలుపుకొని). అందుకే ఈ ఉద్యోగాల కోసం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా సహా కేంద్ర పాలిత ప్రాంతం అయిన యానాం నుంచీ అభ్యర్థులొచ్చారు. ఇంజినీరింగ్ అభ్యర్థులూ క్యూలో ఉన్నారు. ఏడెనిమిది వేల మంది అభ్యర్థులొస్తారని ఊహిస్తే 11వేలకు పైగా అభ్యర్థులు తమ భవిష్యత్తును వెతుక్కొంటూ వచ్చారు. మే మొదటి వారం లో వచ్చే ఏడాదికి సంబంధించి ఆదిలాబాద్‌లో మరో ర్యాలీకి సన్నహాలు చేస్తున్నాం. సమాచారం సేకరించండి ఈ ఉద్యోగం ఆశించేవారు ఇప్పటికే ఆర్మీలో పనిచేసి రిటైరైన వారి ద్వారా సమాచారం సేకరించవచ్చు. వాళ్లిచ్చే సలహాలతో రోజూ ప్రాక్టీస్ చేసుకుంటే ఉద్యోగం గ్యారెంటీ. మరిన్ని వివరాల కోసం ఏపీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే చాలామంది అభ్యర్థులు ఒకసారి ఫెయిలయ్యామని రెండోరోజో, మూడోరోజో వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అర్హతలేని అభ్యర్థులకు చేతి వేళ్లపై సిరా ఇంకు పెడుతున్నాం. కొంతమంది వాటిని సబ్బు, సర్ఫ్ ఇలా రకరకాలుగా చెరిపేసుకుని మళ్లీ వచ్చేస్తున్నారు. మేం వాళ్లను కోరేది ఒక్కటే.. ‘మరో చాన్స్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. వచ్చే ర్యాలీలో ముందుండండి. ఏడాదిలోనే హిందీ నేర్పిస్తాం దేశంలో అత్యధికులు మాట్లాడేది, ఆర్మీలో సంభాషించేంది హిందీ భాషే. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు భాష రాక ఇబ్బందులు పడటం సహ జమే. అయితే ఒకసారి ఆర్మీకి ఎంపికైతే వివిధ దశల్లో భాష నేర్పుతారు. ‘స్ట్రక్చరల్ క్లాసెస్’ ద్వారా ఏ డాది వ్యవధిలో అందరికీ భాష వచ్చేస్తుంది. డిపార్ట్మెంటల్ అర్హత ఉద్యోగాల ద్వారా పదోన్నతులు సాధించొచ్చు. - కల్నల్ ఎ.కె.సింగ్, ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియ పరిశీలన అధికారి సాంకేతికత కూ విలువే పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకే ఆర్మీ ఉద్యోగం అనుకుంటాం. కానీ బీటెక్ పూర్తయి, ఎంటెక్ చేస్తున్నవాళ్లూ వస్తున్నారు. బాధనిపిస్తుంది. కానీ వారికీ భవిష్యత్తు ఉంటుంది. వచ్చేదంతా సాంకేతిక కాలమే. సైన్యంలో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైంది. ఆయుధ సంపత్తి వినియోగానికి ఇంజినీరింగ్ విద్య అవసరమే. కొత్త పరికరాలు డిజైన్ చేయడం, వాటి ప్రోగ్రామింగ్‌కు ఇప్పుడు ఈ తరహా అభ్యర్థులు అవసరం. -సంగ్రాం దాల్వి, డీడీజీ(రిక్రూట్మెంట్), చెన్నై -
వికలాంగ అభ్యర్థులకు న్యాయం జరిగేనా..?
జిల్లాలోని వివిధ శాఖల్లో వికలాంగుల కోసం రిజర్వు చేసిన ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరుగుతోంది. వీటి భర్తీకి జనవరి 19న కలెక్టర్ కార్యాలయం (వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ) నుంచి ప్రకటనను విడుదల చేశారు. వికలాంగుల బ్యాక్ లాగ్ గ్రూపు 4, గ్రూపు 4 కాని ఉద్యోగాల పరిమిత నియామకాల కోసం ఫిబ్రవరి 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 52 పోస్టులు కాగా గ్రూపు 4 ఉద్యోగాలుగా టైపిస్ట్ పోస్ట్‌లు 8, జూనియర్ అసిస్టెంట్ 3, బిల్ కలెక్టర్ 1, కాంపౌండర్ (ఆయుర్వేదం)1, కాంపౌండర్ (హోమియో) 1, ఎంపీహెచ్ఏ (పురుష) 9, ల్యాబ్ టెక్నిషియన్ (గ్రేడ్)1 పోస్ట్‌ను కేటాయించారు. వీటి భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతగా ప్రకటించారు. అలాగే గ్రూప్ 4 కాని ఉద్యోగులుగా అటెండర్, ఆఫీస్ సబార్డునేట్ 8, పీహెచ్ వర్కర్ 2, కామాటి 5, కుక్ 5, వాచ్మెన్ 6, వాటర్ బాయ్ 1, ల్యాబ్ అటెండర్ 1 పోస్ట్‌ను ప్రకటించారు. వీటికి విద్యార్హత ఐదో తరగతి నుంచి ఐటీఐ వరకు ప్రకటించారు. వీటిని వివిధ వైకల్యాలతో ఉన్న వారి కోసం గ్రూపు 4 సర్వీసులతో ఆయా పోస్టులకు ఉద్దేశించి నిర్దిష్ట విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులను ఇంకా పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఉద్యోగాల కోసం సదరమ్ క్యాంపు లేదా మెడికల్ బోర్డు నుంచి 40 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత పత్రాలతో అర్హులైన అంధులు, బదిరులు, శారీరక వికలాంగులు వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జరిగి పది నెలలు గడుస్తున్నా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో వికలాంగుల సమాఖ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ పోస్టుల భర్తీకి మోక్షం కలిగేలా చూడాలని కోరుతున్నారు.