రానున్నది కొలువుల జాతర...
మైహైరింగ్‌క్లబ్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చేది పండుగ సీజనే కాదండీ.. నిరుద్యోగులకు ఆనందాన్ని పంచే కాలం కూడా. ఎందుకంటే వచ్చే మూడు నెలల కాలంలో ఉద్యోగ నియామకాలు జోరు మీద ఉండనున్నాయి. ప్రముఖ నియామకాల ప్లాట్‌ఫామ్ మైహైరింగ్‌క్లబ్.కామ్ నిర్వహించిన ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే ప్రకారం.. గత త్రైమాసికంతో పోల్చినా, ఏడాది క్రితంతో పోల్చినా రానున్న త్రైమాసికంలో అధిక ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. ఈ ట్రెండ్ అన్ని ప్రాంతాల్లో, అన్ని రంగాల్లో కనిపించనుంది. సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది రానున్న కాలంలో ఉద్యోగ నియామకాల జోరు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.
అలాగే 10 శాతం మంది ఉద్యోగ నియామకాల్లో తగ్గుదల ఉంటుందని, 8 శాతం మంది ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. వచ్చే త్రైమాసికంలో కంపెనీలు అధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టనున్నాయని మైహైరింగ్‌క్లబ్.కామ్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు. దీనివల్ల నిరుద్యోగులకు అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్-ఫైనాన్షియల్, తయారీ-ఇంజనీరింగ్ రంగాల్లో ఈ అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు.
ఆగస్ట్‌లో ఆన్‌లైన్ నియామకాల జోరు: మాన్‌స్టర్
దేశంలో ఆన్‌లైన్ నియామకాల వృద్ధి ఆగస్ట్ నెలలో 36%గా నమోదైంది. ఈ ఏడాది మొత్తంలో ఇదే అధిక వృద్ధి. దీంతో రానున్న కాలంలో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా ఉండనుందని మాన్‌స్టర్.కామ్ సర్వేలో పేర్కొంది. మాన్ స్టర్.కామ్ ఉద్యోగ సూచీ ఆగ స్ట్ నెలలో 55 పాయింట్ల వృద్ధితో 208కి పెరిగింది. ఈ సూచీ గతేడాది ఇదే సమయంలో 153గా, జూలై నెలలో 204గా ఉంది. తయారీ/ఉత్పత్తి, బ్యాంకింగ్, బీమా రంగాల్లో అధిక నియామకాలు జరగనున్నాయి.