కొలువుల గని సింగరేణి
2019-20 నాటికి అదనంగా మరో 11,504 ఉద్యోగాలు
సాంకేతికపరమైన ఉద్యోగాలే ఎక్కువ..
19 కొత్త గనుల్లో భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు
గోదావరిఖని: తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమవుతోంది. సింగరేణిలో ఇరవై ఏళ్ల క్రితం ఉద్యోగ నియామకాలు జరగగా.. తాజాగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నాడు గనుల్లో బొగ్గును ఎత్తి టబ్బుల్లో పోసేందుకు అవసరమైన కోల్‌ఫిల్లర్, బదిలీఫిల్లర్ కార్మికులను తీసుకోగా... తాజా నియామకాల్లో ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, సివిల్, మెకానికల్ ఇంజనీర్లు, మైనింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,178 ఉద్యోగాలకు, మార్చిలో 779 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ నియామక ప్రక్రియను పూర్తి చేస్తోంది. మరో 272 పోస్టులకు మే 11న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టు నాటికి మరణించిన, తీవ్ర అనారోగ్యానికి గురైన కార్మికుల స్థానంలో వారి వారసులైన 2,744 మందికి ఉద్యోగావకాశం కల్పించాల్సి ఉండగా... ఇప్పటికే సగానికిపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది.
కొత్త గనుల్లో వేలాది ఉద్యోగావకాశాలు
సింగరేణిలో ఆధునిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో నైపుణ్యం ఉన్న కార్మికుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న ఏడాదిలోగా రామగుండం ఓసీపీ-3 ఎక్స్‌టెన్షన్ ఫేజ్-2, బెల్లంపల్లి ఓసీపీ-2 ఎక్స్‌టెన్షన్ బ్లాక్, కొండాపురం భూగర్భ గనిని యాజమాన్యం ప్రారంభించనుంది. 2016-17లో మణుగూరు ఓసీపీ, కేకే ఓసీపీ, కాసిపేట-2 భూగర్భ గని, 2017-18లో జేవీఆర్ ఓసీపీ-2, కేటీకే ఓసీపీ సెక్షన్-2, తాడిచెర్ల ఓసీపీ-1, ఇందారం ఖని ఓసీపీ, 2018-19లో తాడిచర్ల ఓసీపీ-2, శ్రావణ్‌పల్లి ఓసీపీ, 2019-20లో కిష్టారం ఓసీపీ, రాంపూర్ షాప్ట్‌బ్లాక్, గుండాల భూగర్భ గని, వెంకటాపూర్ ఓసీపీ, పెద్దాపూర్ ఓసీపీ, కేకే 6,7 భూగర్భ గనులు, ఆర్‌కేపీ ఓసీ పీ ఫేజ్-2 ప్రాజెక్టులను ప్రారంభించేందుకు యూజ మాన్యం చర్యలు తీసుకుం టోంది. ఈ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో పనిచేసేందుకు తాజాగా నియామకం చేసుకుంటున్న 5,009 ఉద్యోగాలకు అదనంగా మరో 11,504 ఉద్యోగులను నియమించేందుకు సింగరేణి ప్రణాళికలు రూపొందించింది. దీంతో సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల నిరుద్యోగులకు నిబంధనల ప్రకారం 80 శాతం ఉద్యోగాలు లభించనున్నాయి.
సింగరేణి కార్మికునికి రూ. కోటి ఉద్యోగ విరమణ ప్రయోజనం
రుద్రంపూర్: ఉద్యోగ విరమణ చేసిన సింగరేణి కార్మికుడు కోటి రూపాయల ప్రయోజనం పొందారు. ఈ ఘనత ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాకే దక్కింది. కొత్తగూడెం వీకె -7 షాప్ట్‌గనిలో ఎస్‌ఈ (ఎస్‌ఎంఎంసీ)గా పనిచేసిన అబ్దుల్ సమ్మద్ ఏప్రిల్ 30 ఉ ద్యోగ విరమణ చేశారు. సింగరేణి యాజమాన్యం అదే రోజు కార్మికుడికి సంబంధించిన బెనిఫిట్స్ రూ. కోటి చెక్కును అందజేసింది. రూ. 78 లక్షల ప్రావిడెంట్ ఫండ్, గ్రా ట్యుటీ రూ. 10 లక్షలు, రూ. 12 లక్షలు లీవ్ బెని పిట్స్ మొత్తం రూ. కోటి చెక్‌ను సీజీఎం సీ హెచ్ వెంకటేశ్వరరావు అందజేశారు. గ్రాట్యుటీ సీలింగ్ లేకుంటే మరి న్ని డబ్బులు వచ్చేవని సమ్మద్ భావిస్తున్నారు.