సింగరేణి.. సినర్జీ | Today is Singareni Day | Sakshi
Sakshi News home page

సింగరేణి.. సినర్జీ

Published Mon, Dec 23 2024 3:41 AM | Last Updated on Mon, Dec 23 2024 3:41 AM

Today is Singareni Day

ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తికే సింగరేణి పరిమితం

థర్మల్‌ విద్యుత్‌ రంగంలో వేగంగా విస్తరణ 

సోలార్‌ పవర్‌తో నెట్‌ జీరో దిశగా అడుగులు 

బహుముఖంగా విస్తరిస్తూ సినర్జీగా రూపాంతరం  

నేడు సింగరేణి దినోత్సవం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ కీర్తి దశదిశలా వ్యాపిస్తోంది. వందేళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి.. ఇప్పుడు బహుముఖంగా విస్తరిస్తోంది. థర్మల్, సోలార్, రియల్టీ.. ఇలా బహుముఖంగా విస్తరిస్తూ సింగరేణి సినర్జీగా మారుతోంది. ఈ సంస్థ ఏటా డిసెంబర్‌ 23న సింగరేణి డే జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ అభివృద్ధిపై సాక్షి ప్రత్యేక కథనం.. 

థర్మల్‌తో మొదలు 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు దగ్గర 1870లో మొదలైన బొగ్గు తవ్వకం.. ఆ తర్వాత గోదావరి లోయ ప్రాంతాలకు విస్తరించింది. అయితే, 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌ పేరుతో లాంఛనంగా ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 ఓపెన్‌కాస్ట్, 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ సంస్థ పరిధిలో 39,600 మంది కారి్మకులు పని చేస్తున్నారు. సింగేణి బొగ్గులో 80 శాతం మేరకు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకే సరఫరా అవుతోంది. బయట సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు సొంతంగా విద్యుత్‌ తయారు చేయాలని 2010లో సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు 1,200 మెగావాట్ల సామర్థ్యంతోæ సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీపీ) మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 2016లో ప్రారంభమైంది. 

అనతి కాలంలోనే థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తితో అనేక రికార్డులు ఎస్‌టీపీపీ సొంతమయ్యాయి. దీంతో ఇక్కడే మరో 800 మెగావాట్ల కొత్త ప్లాంట్‌ నిర్మాణం మొదలుపెట్టింది. ఎస్‌టీపీపీ నుంచి వచ్చిన సానుకూల ఫలితాల కారణంగా కొత్తగా రామగుండంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఒడిశాలోని నైనీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత అక్కడ కూడా 1,200 మెగావాట్ల సామర్థ్యంతో పిట్‌ హెడ్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది.  

నెట్‌ జీరో దిశగా.. 
సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా 2018లో తొలిసారిగా రామగుండం 3 ఏరియాలో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను సింగరేణి ప్రారంభించింది. ఆ తర్వాత సంస్థ విస్తరించిన 11 ఏరియాల పరిధిలో విరివిగా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం సంస్థ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 272 మెగావాట్లకు చేరుకుంది. మరో 22 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 

ఇది కూడా అందుబాటులోకి వస్తే సింగరేణి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 810 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంటుంది. మరోవైపు 750 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సంస్థ ఉపయోగిస్తోంది. దీంతో అతి త్వరలో నెట్‌ జీరో సంస్థగా సింగరేణి మారనుంది. మరో 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 

ఫ్లోటింగ్‌ సోలార్‌ 
మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న వాటర్‌ రిజర్వాయర్‌పై 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను 2023 జనవరిలో సంస్థ ప్రారంభించింది. త్వరలోనే మానేరు జలాశయం (300 మెగావాట్లు), మల్లన్నసాగర్‌ (2 ్ఠ250 మెగావాట్లు) మొత్తంగా కొత్తగా మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపనకు సంస్థ సిద్ధమవుతోంది.  

మరిన్ని ప్రయోగాలు 
రామగుండం, ఇల్లెందులో సుమారు 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు నెలకొల్పేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. మందమర్రిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మణుగూరు ఏరియాలో జియో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తోంది. థార్‌ ఏడాది ప్రాంతంలో సోలార్, విండ్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపన విషయంలో రాజస్థాన్‌ ప్రభుత్వంతో సంపద్రింపులు జరుపుతోంది. 

ఇవే కాకుండా లిథియం మైనింగ్‌పై కూడా సింగరేణి దృష్టి సారించింది. రియల్టీ రంగంలో అడుగు పెడుతూ గోదావరిఖనిలో రూ.12 కోట్లు, కొత్తగూడెంలో రూ.4.5 కోట్ల వ్యయంతో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. గ్రీన్‌హైడ్రోజన్, అమ్మోనియం నైట్రేట్‌ తయారీ, కార్బన్‌ డై యాక్సైడ్‌ నుంచి మిథనాల్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెంలో వెంకటేశ్‌ గని, ఇల్లందులో జవహర్‌ గని తవ్వకానికి అనుమతులు సాధించింది.  

పెరుగుతున్న కాంట్రాక్టీకరణ.. 
సింగరేణిలో ఏటా పరి్మనెంట్‌ కారి్మకుల సంఖ్య తగ్గుతోంది. 1990కి ముందు రెగ్యులర్‌ కార్మికుల సంఖ్య సుమారు 1.20 లక్షలకు పైగా ఉంటే.. ఈ ఏడాది 39,600కు పడిపోయింది. ఇదే సమయంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కారి్మకుల సంఖ్య 30 వేలకు పెరిగింది. ఈ ఏడాది సంస్థ 2,165 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇందులో 798 ఎక్స్‌టర్నల్, 1,367 కారుణ్య నియామకాలు ఉన్నాయి. 

కార్మికుల డిపెండెంట్ల వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచటంతో దాదాపు 200 మందికి తక్షణమే లబ్ధి చేకూరింది. సివిల్, ఓవర్‌ బర్డెన్, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో 80 శాతానికి పైగా స్థానికులకు అవకాశం కల్పించారు. పంచ్‌ ఎంట్రీ పద్ధతి ద్వారా అడ్రియాల గని జీవితకాలాన్ని మరో 30 ఏళ్లకు పెంచారు.  

రూ.కోటి ప్రమాద బీమా 
కారి్మకులకు సింగరేణి సంస్థ రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు గత ఫిబ్రవరి 27న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకుంది. కాంట్రాక్టు కారి్మకుడికి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం అందించేలా ఒప్పందం చేసుకుంది. రామగుండం, మందమర్రిలో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ సెంటర్లు ఏర్పాటు చేసింది. 

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.40 కోట్లు కేటాయించి శిక్షణ ఇవ్వాలని నిర్ణయిచింది. కారి్మకుల పిల్లలకు సీబీఎస్‌ఈ విధానంలో విద్యాబోధన చేసేందుకు ఆర్జీ–2, శ్రీరాంపూర్‌ ఏరియాల్లోని సింగరేణి పాఠశాలలను ఎంపికచేశారు. 

కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు కొత్తగూడెం, గోదావరిఖని ఏరియా ఆస్పత్రులను ఆధునీకరిస్తోంది. గుండె వ్యాధిగ్రస్తుల కోసం క్యాథ్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సొంతంగా 10 పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేస్తోంది. 

రూ.796 కోట్ల లాభాల వాటా  
సింగరేణి ఈ ఏడాది సాధించిన లాభాల్లో రూ.796 కోట్లను ఉద్యోగులకు వాటాగా అందించింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి కాంట్రాక్టు కారి్మకులకూ రూ.5 వేల చొప్పున అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement