భద్రాచలం చుట్టుపక్కల ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలు
ముక్కోటి వేళ పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల రాక
కొద్ది సమయం కేటాయిస్తే పర్యాటక ప్రాంతాల సందర్శనకు అవకాశం
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం క్షేత్రం వైకుంఠ ముక్కోటి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. అయితే, భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకునే భక్తులు కొద్దిపాటి సమయం కేటాయిస్తే.. చుట్టుపక్కల ఎన్నో ఆలయాలు, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
నూతన సంవత్సరం సెలవులు, పర్యాటకానికి అనువైన శీతాకాల సీజన్ కావడంతో భద్రాచలం.. భక్తులు, పర్యాటకులకు సాదరంగా స్వాగతం పలుకుతోంది. భద్రాచలంలో బసచేసి నలువైపులా ఉన్న పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు. ఇక్కడి సందర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలపై కథనమిది.
పర్ణశాల..
భద్రాచలం వచ్చిన భక్తులు.. భద్రాచలం తర్వాత అధికంగా దర్శించుకునే ప్రాంతం ఇదే. ఈ ప్రాంతాన్ని శ్రీరామాయణంలో పంచవటిగా వ్యవహరించారు. రామాయణానికి ప్రాణప్రదాలైన ముఖ్య ఘట్టాలన్నీ ఇక్కడే జరిగాయని అభివర్ణి స్తారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో ఎక్కువ రోజులు (11 మాసాల 10 రోజులు) పర్ణశాలలో నివాసం ఉన్నారట.
శూర్పణఖ చెవి, ముక్కును లక్ష్మణస్వామి కోసింది ఇక్కడేనని, 14 వేల మంది రాక్షసుల వధ, సీతాపహరణం, మాయలేడిగా మారీచుడు రావడం, జటాయువు రావణుడిని ఎదుర్కొనడం వంటి ప్రధాన ఘట్టాలన్నీ ఇక్కడే జరిగినట్లు స్థల పురాణం చెబుతోంది. వీటికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తాయి.
ఇలా చేరుకోవచ్చు..
భద్రాచలం నుంచి పర్ణశాల 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్ణశాలకు భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం బస్సులు తిరుగుతాయి. ఉత్సవాల సమయంలో ప్రతీ పది నిమిషాలకు ఒక బస్సును అధికారులు సిద్ధం చేస్తారు. బస్సులే కాకుండా.. ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
కిన్నెరసాని..
భద్రాచలానికి దగ్గరగా ఉన్న మరో పర్యాటక ప్రాంతం కిన్నెరసాని. ఇక్కడ ఉన్న అభయారణ్యం పార్కులో అందమైన జింకలను చూడొచ్చు. ఇక్కడ కేటీపీఎస్ కర్మాగారం కోసం కిన్నెరసానిపై నిర్మించిన ప్రాజెక్టును వీక్షించవచ్చు. బోటింగ్ అనుభూతిని ఆస్వాదించవచ్చు.
ఇలా వెళ్లవచ్చు
కిన్నెరసానికి వెళ్లాలంటే పాల్వంచ పట్టణం నుంచి 9 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. భద్రాచలం నుంచి వెళ్లాలనుకునే వారు పాల్వంచ బస్టాండ్లో దిగి అక్కడ బస్సు మారాలి. సరాసరిగానైతే ప్రైవేట్ వాహనాలు, సొంత కార్లలో చేరుకోవచ్చు.
మోతుగూడెం..
మోతుగూడెంలో పొల్లూరు జలపాతం, పొల్లూరు పవర్ స్టేషన్, పవర్ కెనాల్, అటునుంచి కొద్దిదూరంలో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి ప్రాజెక్టు తదితర చూడదగ్గ ప్రదేశాలున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడ్డ పొల్లూరు జలపాతం ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శీతాకాల సీజన్లో కొండల మీదుగా నేలమీదకి వచ్చాయా? అన్నట్లు తెల్లటి మేఘాల అందాలు కట్టిపడేస్తాయి.
ఇలా చేరుకోవచ్చు..
భద్రాచలం నుంచి మోతుగూడెం సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు ఆర్టీసీ బస్సులున్నా సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటానికి మొగ్గు చూపుతారు. ప్రయాణాల నడుమ ఉన్న అటవీ అందాలు, ప్రకృతి అందాలను చూడాలనుకుంటే.. కచి్చతంగా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటం ఉత్తమం.
శ్రీరామగిరి క్షేత్రం..
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. గోదావరి – శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉందీ ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీ తీరాన ఎత్తయిన కొండపై నెలకొన్న క్షేత్రమిది. ఆ కొండ పేరే శ్రీరామగిరి. కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాడని స్థలపురాణం చెబుతోంది.
పర్ణశాలలో సీతాపహరణ తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం (వనక్షేత్రం) చేరి సేదదీరి, మళ్లీ సీతమ్మను వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె ఆతిథ్యమైన ఎంగిలి పండ్లను స్వీకరించి, ముక్తిని ప్రసాదించాడని భక్తుల నమ్మిక. ఈ ప్రాంతానికి సమీపంలో రేఖపల్లిలో (రెక్కపల్లి – జటాయువు రెండో రెక్క పడిపోయిన చోటు) రెక్క పడిన జటాయువును చూశారట.
రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారని చెబుతారు. గోదావరి తీరంలో ఓ పెద్ద శిలపై దానికి పిండ ప్రధానం చేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది.
ఇలా చేరుకోవచ్చు..
భద్రాచలం నుంచి శ్రీరామగిరి 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీరామగిరికి భద్రాచలం బస్టాండ్ నుంచి ప్రతీ గంటకు ఒక బస్సు ఉంది. బస్సులే కాకుండా ప్రైవేట్ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి.
పాపికొండలు..
భద్రాచలం వ చ్చిన ప్రతీఒక్కరు చూడదగ్గ పర్యాటక ప్రాంతం పాపికొండలు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలను లాంచీ ప్రయాణంలో ఆస్వాదించడం ఈ యాత్ర ప్రత్యేకత. లాంచీలోనే గోదావరి అందాలను వీక్షిస్తూ గిరిజనుల సంప్రదాయాలను వీక్షించవచ్చు. పాపికొండల యాత్రలో పేరంటాలపల్లి వద్ద మఠాన్ని కూడా దర్శించే అవకాశముంది.
ఇలా చేరుకోవచ్చు..
పాపికొండలకు వెళ్లాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోచవరానికి చేరుకోవాలి. భద్రాచలం నుంచి పోచవరానికి 85 కిలోమీటర్ల దూరం ఉండగా.. బస్టాండ్ నుంచి ఉదయం 5.30, 11.30 గంటలకు బస్సులు ఉన్నాయి.
అయితే, పాపికొండలు వెళ్లాలనుకునే వారు సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలైతే సమయానుకూలంగా మధ్యలో ప్రకృతి అడవి అందాలు, కూనవరం వద్ద శబరి, గోదావరి సంగమం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. పోచవరం నుంచి లాంచీ టికెట్ ధర పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా ఉంది.
మారేడుమిల్లి..
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ఉంటుంది. ఇటీవలి కాలంలో పర్యాటకుల ఆదరణ అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇది. ‘పుష్ప’, ‘ఆచార్య’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తదితర సినిమాల చిత్రీకరణ జరిగిన పర్యాటక ప్రాంతం ఇది.
ఘాట్ రోడ్డు అనుభూతులు, వాటర్ ఫాల్స్, పాము మెలికలు తిరిగినట్లుండే విహంగ వీక్షణం, పలు వ్యూ పాయింట్లను ఇక్కడ వీక్షించవచ్చు. ఇక్కడి నుంచి అత్యంత ఎత్తయిన ‘గుడిసె’అనే ప్రాంతానికి రాత్రి వేళలో బస చేసి.. సూర్యోదయాన్ని అతి దగ్గరగా చూసే అదృష్టం పర్యాటకులకు మాత్రమే సొంతం.
ఇలా చేరుకోవచ్చు..
భద్రాచలం నుంచి నేరుగా మారేడుమిల్లికి 118 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో సుమారు 40 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీదుగానే ప్రయాణం సాగుతుంది. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, వాటర్ ఫాల్స్, ఇతర వ్యూ పాయింట్లను చూడాలంటే తప్పనిసరిగా ప్రైవేట్ వాహనాల్లోనే వెళ్లాలి. భద్రాచలం నుంచి మోతుగూడెం, మారేడుమిల్లి ప్రాంతాలకు వెళ్లి అక్కడే బస చేసి.. రెండు, మూడు రోజులు వీక్షించే అవకాశమూ ఉంటుంది.
భద్రాచలం వచ్చేందుకు..
» భద్రాచలం వచ్చే రైల్వే ప్రయాణికులు విజయవాడ – సికింద్రాబాద్ మార్గంలో ఖమ్మం స్టేషన్లో దిగి బస్సుల్లో భద్రాచలం రావచ్చు. ఖమ్మం నుంచి భద్రాచలానికి రోడ్డు మార్గం 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
» నేరుగా భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) వరకు సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం ఉంది. ఆపై కొత్తగూడెం నుంచి భద్రాచలానికి 40 కిలోమీటర్లు బస్సుల్లో వెళ్లొచ్చు,
» ఇవి కాక హైదరాబాద్ నుంచి రోజూ ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్లీపర్, నాన్ స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
బొగత జలపాతం
ఇది ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ మండలం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. పచ్చని కొండల నడుమ సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. తెలంగాణ నయాగారాగా అభివర్ణించే దీని అందాలు వర్షాకాలంలో చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగుతుండగా, శీతాకాల సీజన్లో సైతం వీక్షించవచ్చు.
ఇలా చేరుకోవచ్చు..
భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని భద్రాచలం నుంచి వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రైవేట్, సొంత వాహనాల్లో వెళ్లాలి. ఇక హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే పర్యాటకులు దీనిని నేరుగా సందర్శించి.. అటునుంచి భద్రాచలం చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment