tourist places
-
భద్రగిరి.. ప్రకృతి సోయగాల సిరి
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం క్షేత్రం వైకుంఠ ముక్కోటి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. అయితే, భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకునే భక్తులు కొద్దిపాటి సమయం కేటాయిస్తే.. చుట్టుపక్కల ఎన్నో ఆలయాలు, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. నూతన సంవత్సరం సెలవులు, పర్యాటకానికి అనువైన శీతాకాల సీజన్ కావడంతో భద్రాచలం.. భక్తులు, పర్యాటకులకు సాదరంగా స్వాగతం పలుకుతోంది. భద్రాచలంలో బసచేసి నలువైపులా ఉన్న పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు. ఇక్కడి సందర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలపై కథనమిది.పర్ణశాల.. భద్రాచలం వచ్చిన భక్తులు.. భద్రాచలం తర్వాత అధికంగా దర్శించుకునే ప్రాంతం ఇదే. ఈ ప్రాంతాన్ని శ్రీరామాయణంలో పంచవటిగా వ్యవహరించారు. రామాయణానికి ప్రాణప్రదాలైన ముఖ్య ఘట్టాలన్నీ ఇక్కడే జరిగాయని అభివర్ణి స్తారు. శ్రీ సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో ఎక్కువ రోజులు (11 మాసాల 10 రోజులు) పర్ణశాలలో నివాసం ఉన్నారట. శూర్పణఖ చెవి, ముక్కును లక్ష్మణస్వామి కోసింది ఇక్కడేనని, 14 వేల మంది రాక్షసుల వధ, సీతాపహరణం, మాయలేడిగా మారీచుడు రావడం, జటాయువు రావణుడిని ఎదుర్కొనడం వంటి ప్రధాన ఘట్టాలన్నీ ఇక్కడే జరిగినట్లు స్థల పురాణం చెబుతోంది. వీటికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తాయి. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి పర్ణశాల 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పర్ణశాలకు భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం బస్సులు తిరుగుతాయి. ఉత్సవాల సమయంలో ప్రతీ పది నిమిషాలకు ఒక బస్సును అధికారులు సిద్ధం చేస్తారు. బస్సులే కాకుండా.. ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. కిన్నెరసాని.. భద్రాచలానికి దగ్గరగా ఉన్న మరో పర్యాటక ప్రాంతం కిన్నెరసాని. ఇక్కడ ఉన్న అభయారణ్యం పార్కులో అందమైన జింకలను చూడొచ్చు. ఇక్కడ కేటీపీఎస్ కర్మాగారం కోసం కిన్నెరసానిపై నిర్మించిన ప్రాజెక్టును వీక్షించవచ్చు. బోటింగ్ అనుభూతిని ఆస్వాదించవచ్చు. ఇలా వెళ్లవచ్చు కిన్నెరసానికి వెళ్లాలంటే పాల్వంచ పట్టణం నుంచి 9 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. భద్రాచలం నుంచి వెళ్లాలనుకునే వారు పాల్వంచ బస్టాండ్‌లో దిగి అక్కడ బస్సు మారాలి. సరాసరిగానైతే ప్రైవేట్ వాహనాలు, సొంత కార్లలో చేరుకోవచ్చు. మోతుగూడెం.. మోతుగూడెంలో పొల్లూరు జలపాతం, పొల్లూరు పవర్ స్టేషన్, పవర్ కెనాల్, అటునుంచి కొద్దిదూరంలో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి ప్రాజెక్టు తదితర చూడదగ్గ ప్రదేశాలున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడ్డ పొల్లూరు జలపాతం ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శీతాకాల సీజన్లో కొండల మీదుగా నేలమీదకి వచ్చాయా? అన్నట్లు తెల్లటి మేఘాల అందాలు కట్టిపడేస్తాయి. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి మోతుగూడెం సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు ఆర్టీసీ బస్సులున్నా సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటానికి మొగ్గు చూపుతారు. ప్రయాణాల నడుమ ఉన్న అటవీ అందాలు, ప్రకృతి అందాలను చూడాలనుకుంటే.. కచి్చతంగా ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటం ఉత్తమం. శ్రీరామగిరి క్షేత్రం..ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. గోదావరి – శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉందీ ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీ తీరాన ఎత్తయిన కొండపై నెలకొన్న క్షేత్రమిది. ఆ కొండ పేరే శ్రీరామగిరి. కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాడని స్థలపురాణం చెబుతోంది. పర్ణశాలలో సీతాపహరణ తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం (వనక్షేత్రం) చేరి సేదదీరి, మళ్లీ సీతమ్మను వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలిసి ఆమె ఆతిథ్యమైన ఎంగిలి పండ్లను స్వీకరించి, ముక్తిని ప్రసాదించాడని భక్తుల నమ్మిక. ఈ ప్రాంతానికి సమీపంలో రేఖపల్లిలో (రెక్కపల్లి – జటాయువు రెండో రెక్క పడిపోయిన చోటు) రెక్క పడిన జటాయువును చూశారట. రామలక్ష్మణుల ప్రాణవిశిష్టగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారని చెబుతారు. గోదావరి తీరంలో ఓ పెద్ద శిలపై దానికి పిండ ప్రధానం చేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి శ్రీరామగిరి 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీరామగిరికి భద్రాచలం బస్టాండ్ నుంచి ప్రతీ గంటకు ఒక బస్సు ఉంది. బస్సులే కాకుండా ప్రైవేట్ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి.పాపికొండలు.. భద్రాచలం వ చ్చిన ప్రతీఒక్కరు చూడదగ్గ పర్యాటక ప్రాంతం పాపికొండలు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలను లాంచీ ప్రయాణంలో ఆస్వాదించడం ఈ యాత్ర ప్రత్యేకత. లాంచీలోనే గోదావరి అందాలను వీక్షిస్తూ గిరిజనుల సంప్రదాయాలను వీక్షించవచ్చు. పాపికొండల యాత్రలో పేరంటాలపల్లి వద్ద మఠాన్ని కూడా దర్శించే అవకాశముంది. ఇలా చేరుకోవచ్చు.. పాపికొండలకు వెళ్లాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పోచవరానికి చేరుకోవాలి. భద్రాచలం నుంచి పోచవరానికి 85 కిలోమీటర్ల దూరం ఉండగా.. బస్టాండ్ నుంచి ఉదయం 5.30, 11.30 గంటలకు బస్సులు ఉన్నాయి. అయితే, పాపికొండలు వెళ్లాలనుకునే వారు సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలైతే సమయానుకూలంగా మధ్యలో ప్రకృతి అడవి అందాలు, కూనవరం వద్ద శబరి, గోదావరి సంగమం చూడడానికి అనుకూలంగా ఉంటుంది. పోచవరం నుంచి లాంచీ టికెట్ ధర పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750గా ఉంది. మారేడుమిల్లి.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ఉంటుంది. ఇటీవలి కాలంలో పర్యాటకుల ఆదరణ అత్యధికంగా ఉన్న ప్రాంతం ఇది. ‘పుష్ప’, ‘ఆచార్య’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తదితర సినిమాల చిత్రీకరణ జరిగిన పర్యాటక ప్రాంతం ఇది. ఘాట్ రోడ్డు అనుభూతులు, వాటర్ ఫాల్స్, పాము మెలికలు తిరిగినట్లుండే విహంగ వీక్షణం, పలు వ్యూ పాయింట్లను ఇక్కడ వీక్షించవచ్చు. ఇక్కడి నుంచి అత్యంత ఎత్తయిన ‘గుడిసె’అనే ప్రాంతానికి రాత్రి వేళలో బస చేసి.. సూర్యోదయాన్ని అతి దగ్గరగా చూసే అదృష్టం పర్యాటకులకు మాత్రమే సొంతం. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి నేరుగా మారేడుమిల్లికి 118 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో సుమారు 40 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు మీదుగానే ప్రయాణం సాగుతుంది. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, వాటర్ ఫాల్స్, ఇతర వ్యూ పాయింట్లను చూడాలంటే తప్పనిసరిగా ప్రైవేట్ వాహనాల్లోనే వెళ్లాలి. భద్రాచలం నుంచి మోతుగూడెం, మారేడుమిల్లి ప్రాంతాలకు వెళ్లి అక్కడే బస చేసి.. రెండు, మూడు రోజులు వీక్షించే అవకాశమూ ఉంటుంది. భద్రాచలం వచ్చేందుకు.. » భద్రాచలం వచ్చే రైల్వే ప్రయాణికులు విజయవాడ – సికింద్రాబాద్ మార్గంలో ఖమ్మం స్టేషన్లో దిగి బస్సుల్లో భద్రాచలం రావచ్చు. ఖమ్మం నుంచి భద్రాచలానికి రోడ్డు మార్గం 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది. » నేరుగా భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) వరకు సికింద్రాబాద్ నుంచి రైలు సౌకర్యం ఉంది. ఆపై కొత్తగూడెం నుంచి భద్రాచలానికి 40 కిలోమీటర్లు బస్సుల్లో వెళ్లొచ్చు, » ఇవి కాక హైదరాబాద్ నుంచి రోజూ ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్లీపర్, నాన్ స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.బొగత జలపాతంఇది ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ మండలం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. పచ్చని కొండల నడుమ సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. తెలంగాణ నయాగారాగా అభివర్ణించే దీని అందాలు వర్షాకాలంలో చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ కొనసాగుతుండగా, శీతాకాల సీజన్లో సైతం వీక్షించవచ్చు. ఇలా చేరుకోవచ్చు.. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని భద్రాచలం నుంచి వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రైవేట్, సొంత వాహనాల్లో వెళ్లాలి. ఇక హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే పర్యాటకులు దీనిని నేరుగా సందర్శించి.. అటునుంచి భద్రాచలం చేరుకునే అవకాశం ఉంది. -
ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని... స్వాగతం
గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా? అయితే, మీరు పాపికొండలు యాత్రకు వెళ్లాల్సిందే. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తుండగా.. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు రానున్న నేపథ్యాన పర్యాటకుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యాన పాపికొండల అందాలు, యాత్ర మిగిల్చే తీయని అనుభవాలపై ప్రత్యేక కథనమిది.రెండు మార్గాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాపికొండల యాత్రను సందర్శించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటోది.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోట్లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండోది.. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. దీంతో పర్యాటకులు ఒకరోజు ముందుగానే చేరుకుని రామయ్యను దర్శించుకుని.. ఆపై పాపికొండలు యాత్రకు బయలుదేరుతారు.భద్రాచలం నుంచి ఇలా.. హైదరాబాద్ నుంచి పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రావాలి. ఇక్కడ వీలు చూసుకుని సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్ పాయింట్ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరవచ్చు. 70 కిలోమీటర్ల జలవిహారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అవకాశం ఈ యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది. పేరంటాలపల్లి సందర్శన పాపికొండల యాత్రలో పేరంటాల పల్లి వద్ద నున్న ప్రాచీన శివాలయం వద్ద బోటు ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడిని గిరిజనులే నిర్వహిస్తున్నారు. గుట్ట పైనుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు. యాత్ర ప్రారంభానికి ముందు లేదా తర్వాతైనా పోచవరానికి సమీపాన వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రాముడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. షెడ్యూల్, ధరలు ఇలా.. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు. ఇసుక తిన్నెల్లో విడిది.. రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్‌ల్లో రాత్రి వేళ బస చేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం హట్స్ ఉన్నాయి. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. ఈ టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పటిష్టమైన రక్షణ ఏపీలోని కచ్చలూరు లాంచీ ప్రమాదం అనంతరం పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని బోట్లకు అనుసంధానం చేసిన శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు, వాటిని నియంత్రించే బోటింగ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీసు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు.. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను సరిపోలి్చన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.ఆహారం ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్ పాయింట్ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్’ అమ్ముతారు. ఆకట్టుకునే వెదురు బొమ్మలు పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.👉పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు) -
రాజమండ్రి : పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)
-
భారత్‌లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. షిల్లాంగ్ తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)
-
హంపి : నాటి వైభవానికి నిలువుటద్దం, ఇవి అస్సలు మిస్ కావద్దు!
రాజులు రాజ్యస్థాపనలో రాజధాని నిర్మాణం ప్రధానమైంది. అయితే రాజులందరూ రాజధాని కోసం కొండలు, గుట్టల బాట పడుతారెందుకో. హంపిని చూసినప్పుడు ఇదే అనిపిస్తుంది. బీడు భూమి సారవంతమైన పంట నేలగా మారాలంటే ఏళ్లు పడుతుంది. అందుకే పంట పొలాలను రాజధానిగా మార్చే ప్రయత్నం చేసేవారు కాదు. గట్టి నేల మీద నిర్మాణాలు చేపట్టి శత్రుదుర్భేద్యంగా మలుచుకుంటారు. హంపి కూడా అలాంటిదే.హంపిలోని నిర్మాణాలు 14వ శతాబ్దం నాటివి. ప్రతి కట్టడమూ విధ్వంసానికి గురై ఉండడంతో హంపిని లాస్ట్ సిటీ అంటారు కానీ పర్యాటకుల సంఖ్యను చూస్తే దాని కల్చరల్ గ్లోరీని ఏ మాత్రం లాస్ కాలేదనిపిస్తుంది. పర్వత శ్రేణుల్లో 500కు పైగా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఏడాదికి ఏడు లక్షల మంది వస్తారు. ఇంతటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది కాబట్టే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేరిపోయింది.కన్నడ గ్రామంలో బస హంపి టూర్లో మిస్ కాకూడనివి... తుంగభద్రానదిలో పడవ ప్రయాణం, పంట పొలాల్లో రాత్రి బస, మోటార్‌బైక్ మీద అచ్చమైన కన్నడ గ్రామాల్లో విహారం, క్లిఫ్ జంపింగ్, విరూపాక్ష ఆలయం, లోటస్ మహల్, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం. రామాయణకాలంలో కిష్కింద అంటే ఈ ప్రదేశమేనని అశోకుని శిలాశాసనంలో ఉంది. పంపాదేవి తీర్థక్షేత్రంగా దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రదేశం బెంగళూరు వాళ్లకు ఎంత దూరం (348 కి.మీ.లు)లో ఉందో హైదరాబాద్ వాళ్లకీ దాదాపు అంతే దూరం(385 కిమీలు)లో ఉంది. హంపి పర్యాటకులకు హోటళ్లు హోస్పేటలో ఉంటాయి. కన్నడ సంప్రదాయ భోజనం, నివాసాలను ఆస్వాదించాలంటే హంపికి ఉత్తరాన కదిరామ్పురా గ్రామంలో హోమ్స్టేలుంటాయి. హంపిని ఇప్పటికే చూసి ఉంటే... విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకుని పండగ శోభను కొనసాగిస్తూ ఉండే హంపిని మరోసారి చూసిరావచ్చు. ఎంజాయ్మెంట్కి మినిమమ్ గ్యారంటీ. -
ఇది కదా అద్భుతమంటే.. ‘సండూరు’ అందాలు వర్ణించగలమా.. (ఫొటోలు)
-
మనదేశంలో చూడదగ్గ 'బెస్ట్ ఆఫ్‌బీట్' పర్యాటక ప్రదేశాలు!
కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం చాలామందికి. అందుకని విదేశాలకు చెక్కేస్తుంటారు. కానీ మన గడ్డపైనే ఎంతో విలక్షణమైన ప్రదేశాలు, కట్టిపడేసే సహజమైన ప్రకృతి దృశ్యాలు, మిస్టరీ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వెరైటీ వంటకాలకు నెలవైన ప్రదేశాలతో సహా వైవిధ్యభరితంగా, ఆహ్లాదంగా ఉండే సుందర ఉద్యానవనాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వదేశానికి మించిన గొప్ప పర్యాటక ప్రదేశం మరొకటి లేదు అనేలా బెస్ట్ ఆఫ్‌బీట్ ప్రదేశాలు ఎన్నో మన నేలలోనే ఉన్నాయి. అంతేగాదు ఈ ఏడాది 'బెస్ట్ ఆఫ్‌బీట్' ప్రదేశంగా ఓ ప్రసిద్ధ లోయ గోల్డ్‌ని దక్కించుకుంది కూడా. ఇంతకీ మన సొంత గడ్డలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఏంటంటే.. ప్రకృతి అందానికి ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్.. ప్రతిష్టాత్మకమైన ఔట్లుక్ ట్రావెలర్ అవార్డ్ 2023లో బెస్ట్ ఆఫ్‌బీట్ ప్రదేశంగా ఉత్తర కాశీలో కుప్వారా జిల్లాలోని లోలాబ్ వ్యాలీ బంగారు పతకాన్ని దక్కించుకుంది గెలుచుకుంది. వాడి ఈలో లాబ్ లేదా లోలోవ్ అని పిలిచే ఈ లోలాబ్ వ్యాలీ అద్భుతమైన ప్రకృతి అందానికి, ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. పైగా దీన్ని భారత్‌లో దాగున్న అద్భతమైన రత్నంగా ఈ ప్రదేశాన్ని అభివర్ణిస్తారు. యాపిల్ తోటలు, మెలికలు తిరిగిన నదులతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కుప్వారాకు ఉత్తరంగా 9 కిలోమీటలర్ల దూరంలో ఈ ఐకానిక్ ప్రదేశం ఉంది. ఈ లోలాబ్ వ్యాలీ ఎంట్రీ గేట్ నుంచే అద్భతమైన ప్రకృతి దృశ్యాలు ప్రారంభమవుతాయి. విశాలమైన పర్వత శ్రేణులతో ఓవల్ ఆకారపు లోయ నుంచి జర్నీ మొదలవుతుంది. పర్యాటకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కలరూస్ గుహలకు ఆకర్షితలవుతారు. ఇక్క నుంచి నేరుగా రష్యాకు చేరుకునేలా మార్గం ఉందని, పైగా ఈ గుహ లోపల భారీ నీటి వనరులను దాచి పెట్టారని స్థానిక ప్రజలు కథకథలుగా చెప్పుకుంటుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ లోయని మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. విద్యుత్ సౌకర్యం లేని గ్రామానికి నెలవు.. ఈ ఆదునిక కాలంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు లేనేలేవు కదా! కానీ ఇదే కాశ్మీర్లో శ్రీనగర్‌కి 80 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ సౌకర్యం లేని చత్పాల్ అనే విచిత్రమైన గ్రామం ఉంది. పర్యాటకులు తప్పనసరిగా చూడాల్సిన గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ మంత్ర ముగ్దుల్ని చేసే పైన్ అడవులు సూర్యరశ్మిని ముద్దాడే హిమాలయాల అద్భుతాలను తిలకించాల్సిందే. ఈ గ్రామంలో ప్రత్యేకంగా చూసేందుకు ఏమీ ఉండదు కానీ అక్కడ ప్రకృతి రమ్యత పర్యాటకులను పులకించిపోయేలా చేస్తుంది. కొద్ది దూరంలో ఉన్న తిమ్రాన్ గ్రామంలోని పాఠశాల, ఆపిల్, వాల్నట్ తోటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అక్కడ స్థానికులు పర్యాటకులతో స్నేహపూర్వకంగా ఉండటమే గాక అక్కడ వారందించే సుగంధభరితమైన టీ చాలా రుచిగా ఉంటుంది. తొలి సముద్ర జాతీయ ఉద్యానవనం.. చూడదగ్గ మరో పర్యాక ప్రదేశం గుజరాత్‌లోని నరరా మెరైన్ నేషనల్ పార్క్. ఇది భారత్‌లోని తొలి సముద్ర జాతీయ ఉద్యానవనంగా చెబుతారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు కొద్ది దూరంలో ఉంది. ఇది మూడు పార్క్‌లుగా విభజించబడి, 42 చిన్న ద్వీపాల మాదిరి విస్తరించి ఉంది. ఇక్క పగడాలు, ఆక్టోపస్, ఎనిమోన్స్, పఫర్ ఫిష్, సముద్ర గుర్రాలు, పీతలు వంటికి నెలవు. కళాకారులకు నిలయం.. హిమచల్ ప్రదేశ్‌లోని ఆండ్రెట్టా పర్యాటకులను ఎంతగానే ఆకర్షించే ప్రదేశం. ఇది పారాగ్లైడింగ్‌కి ప్రసిద్ధి. అంతేగాదు ఈ ఆండ్రెట్టాని కళాకారుల కాలనీ అని కూడా అంటారు. దీన్ని 1920లలో ఐరిష్ థియేటర్ ఆర్టిస్ట్ నోరా రిచర్డ్స్ స్థాపించారు. ఇక్కడ కుమ్మరి దగ్గర నుంచి హస్తకళకారుల వరకు ఎందరో కళకారులు ఉంటారు. వారందరి నైపుణ్యాలను తిలకించొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. ఇక్కడ శోభా సింగ్ ఆర్ట్‌గ్యాలరీ మరింత ప్రసిద్ధి. దేవాలయల భూమి.. తమిళనాడులో ఉన్న తరంగంబాడి మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ పేరుని అనువదిస్తే 'గాన తరంగాల భూమి' అని అర్థం. గతంలో ట్రాన్క్విబార్ అనిపిలిచేవారు. ఇది అనేక బీచ్ టౌన్లు కలిగిన ప్రదేశం. ఇది చరిత్రలో నిలిచిన పట్టణం. గత కాలం గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారికి ఇది మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఉన్న డానిష్ కోట మరింత ఆకర్షిస్తుంది. దీన్ని 1620లలో నిర్మించారు. ఈ కోటని డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు స్థావరంగా ఉపయోగింకున్నట్లు చెబుతారు చరిత్రకారులు. ఇక్కడ తప్పక సందర్శించాల్సింది న్యూ జెరూసలేం చర్చి. దీన్ని భారతీయ యూరోపియన్ నిర్మాణాల కలయికతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఆనంద నగరం సందక్ఫు.. ఇది పశ్చిమబెంగాల్లో ఉంది. ఎత్తైన శిఖరాలనకు నిలయం ఈ ప్రాంతం.ఇది భారత్ నేపాల్ సరిహద్దులో ఎంది. ఎవరెస్ట్, కాంచనజంగా, లోట్సే మకాలులను కప్పి ఉంచే అద్భుతమైన పర్వత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ దృశ్యం బుద్ధుడి ఆకృతిని తలపించేలా ఉందని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. హన్లే డార్క్ స్కై రిజర్వ్.. లద్దాఖ్‌లో ఉంది హన్లే డార్క్ స్కై రిజర్వ్. విలక్షణమైన ప్రకృతి దృశ్యాలు చూడాలనుకునేవారికి ది బెస్ట్ ప్లేస్ ఇది. ఈ రిజర్వ్‌లో కాంతి పొల్యూషన్‌ని చూడొచ్చు. ఇక్కడ ఆకాశం పూర్తి చీకటితో నిర్మలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నిశితంగా చూడొచ్చు. ఇక్కడ దాదాపు వెయ్చి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణలో భారతీయ ఖగోళ అబ్జర్వేటరీ ఉంది. అలాగే హన్లేలో సరస్వతి పర్వతంపై సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో టెలిస్కోప్ ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన అబ్జర్వేటరీలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: చలో టూర్) -
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్ అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
మెట్రోలు, హిల్ స్టేషన్లకే మొగ్గు
ముంబై: దేశీయంగా మెట్రో నగరాలు, హిల్స్టేషన్లతో కూడిన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలలపై ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ‘బుకింగ్ డాట్ కామ్’ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, మనాలీ, రిషికేశ్, వారసత్వ సంపదకు నిలయమైన జైపూర్ తదితర ప్రాంతాలను ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా చూస్తే, దుబాయి, బ్యాంకాక్, లండన్, సింగపూర్, కౌలాలంపూర్, హోచిమిన్హ్, ప్యారిస్, హనోయ్ ప్రాంతాలను సందర్శించేందుకు భారత పర్యాటకులు ఎక్కువ మంది బుకింగ్ చేసుకున్నారు. హోటళ్లకు అదనంగా, రిసార్ట్లు, గెస్ట్ హౌస్‌లు, ఆతిథ్య గృహాలు పర్యాటకుల ప్రాధాన్యంగా ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎక్కువగా.. మొదటి ఆరు నెలల్లో యూఎస్, బంగ్లాదేశ్, రష్యా, యూఏఈని నుంచి ఎక్కువ మంది భారత్‌ను సందర్శించారు. అలాగే, విదేశీ పర్యాటకులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు మెట్రోలను ఎక్కువగా చూశారు. 86 శాతం భారత పర్యాటకులు వచ్చే 12 నెలల్లో తమ పర్యటనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘‘స్థూల ఆర్థిక సమస్యలను పర్యాటక రంగం ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. హోటళ్లే కాకుండా పర్యాటకులు ప్రత్యామ్నాయ ఆతిథ్యాలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు’’అని బుకింగ్ డాట్ కామ్ కంట్రీ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. -
20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు
-
ఆ ఊరంతా అద్దెకు.. ఒక్క రోజుకు ఎంతంటే?
ఏదైనా ఊరికి బదిలీ అయితే, ఆ ఊళ్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం మామూలు. కొద్దిరోజుల పనికోసమే అయితే, హోటల్ గది అద్దెకు తీసుకోవడమూ మామూలే. ఇటలీలోని ఒక చిత్రమైన ఊరుంది. ఎవరైనా నిర్ణీత మొత్తం చెల్లిస్తే, ఏకంగా ఆ ఊరంతటినీ అద్దెకు తీసుకోవచ్చు. ఇటలీ నడిబొడ్డున ఉండే లె మార్షె ప్రాంతంలో ఉన్న ఈ మధ్యయుగాల నాటి ఊరి పేరు పెట్రిటోలి. రోమన్ నాగరికత కాలం నాటి పురాతన కట్టడాలు, వాటిలోని నేలమాళిగలు, బోటిక్ లాడ్జింగులు, వాటితో పాటే ముప్పయ్యేడు పడకగదుల భారీ రాచప్రాసాదం, ఒక రంగస్థల వేదిక ఈ ఊరి ప్రత్యేకతలు. వీటన్నిటితో కూడిన ఈ ఊరును అద్దెకు తీసుకోదలచుకున్న వారు రోజు 1303 పౌండ్లు (రూ.1,28,577) చెల్లించాల్సి ఉంటుంది. యూరోప్‌లోని సంపన్నుల్లో చాలామంది కుటుంబ సమావేశాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు వంటి కార్యక్రమాల కోసం దీనిని అద్దెకు తీసుకుంటున్నారు. సముద్రమట్టానికి మూడువందల మీటర్ల ఎత్తున ఉండే ఈ ఊరి వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. చదవండి: Winter Festivals: శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని రాయడంతో! శీతాకాల సంబరాల విశేషాలు.. -
భారత్‌లో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి..
వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు. ఐఎల్పీ పర్మిషన్ అంటే? ఇన్నర్ లోన్ పర్మిట్ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఆరు ప్రదేశాలు ఇవే.. అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్‌కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది. నాగలాండ్.. సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్.. భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్‌తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. మిజోరం.. ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిల్చార్, కోల్‌కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి. సిక్కిం.. భారత్‌లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్‌డాంగ్, యమ్తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. లద్దాక్.. ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. -
చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు
కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్ వద్ద రీసార్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్టర్న్ వెహికల్ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి. పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా.. తొటపల్లి రిజర్వాయర్ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్ థియేటర్, ట్రైబుల్ మ్యూజియం, ట్రైబుల్ ఆర్ట్‌గ్యాలరీ అండ్ బజార్, హెలీప్యాడ్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్ హార్టీకల్చర్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మూడు రోప్‌వేలు... సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్ రీసార్ట్ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..) పర్యాటకాభివృద్ధికి కృషి జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. – నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం
కరోనా దెబ్బకు కుదేలైన పర్యాటక రంగం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో పుంజుకుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, డముకు వ్యూ పాయింట్, కటికి, తాటిగుడ జలపాతాలు, అరకులోయలో పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్, డుంబ్రిగుడలోని చాపరాయి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అనంతగిరి/అరకులోయ: కరోనా కారణంగా మన్యంలో మూతపడిన పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభమైన తరువాత మండలంలోని బొర్రా గుహలతో పాటు మిగతా వాటికి సందర్శకులు తాకిడి పెరిగింది. గత రెండేళ్ల కన్నా ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య భారీగా పెరిగింది. పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. 2020 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 1,80,260 మంది సందర్శించగా రూ.131.35 లక్షల ఆదాయం లభించింది. 2021 సంవత్సరంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు 2,61,000 మంది సందర్శించగా రూ.187 లక్షల ఆదాయం సమకూరింది. 2021 సంవత్సరం కంటే ఈ ఏడాది గుహలను సందర్శించిన వారి సంఖ్య సుమారు 80 వేలు అధికంగా ఉంది. గత ఏడాది జనవరి నుంచి జూలై వరకు 2,22,653 మంది సందర్శించగా రూ.161.21 లక్షల ఆదాయం లభించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు సుమారు మూడు లక్షల మంది సందర్శించగా సుమారు రూ.200 లక్షలు ఆదాయం లభించింది. అరకులోయలో... గత ఏడాది అక్టోబర్ నెల నుంచి అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియంతో పాటు చాపరాయి జలపాతం ప్రాంతాలకు పర్యాటకులు అధికంగా తరలివస్తున్నారు. గత 12నెలల్లో అరకులోయ గిరిజన మ్యూజియాన్ని 3 లక్షల మంది, పద్మాపురం గార్డెన్‌ను సుమారు 2.50 లక్షల మంది సందర్శించారు. సుమారు రూ.2 కోట్ల ఆదాయం లభించింది. చాపరాయి జలపాతం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్‌ను పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల సంఖ్య పెరగడంతో టూరిజంశాఖకు చెందిన రిసార్టులు, రెస్టారెంట్ల ఆదాయం భారీగా సమకూరుతోంది. (క్లిక్: వజ్రాల వేట.. అత్యంత ఖరీదైన కోహినూర్ వజ్రం కూడా అక్కడే..) పెరిగిన పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. బొర్రాలోని సదుపాయలు కల్పనకు చర్యలు చేపడుతున్నాం. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – బాబుజీ డీవీఎం పర్యాటకశాఖ -
పర్యాటకుల స్వర్గధామం.. ‘కాస్ పీఠభూమి’
పింప్రి: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మహారాష్ట్రలోనూ వర్షాకాలంలో అందమైన ప్రకృతి రమణీయమైన జలపాతాలు, పచ్చని కొండలు, లోయలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటిలో సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం.. జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు తండోపతండాలుగా దేశ, విదేశాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇత ర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పర చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రయాణం.. అత్యంత అద్భుతం.. సతారా నుంచి కాస్‌కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్‌కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చూడాల్సిన ప్రదేశాలు.. కాస్లేక్.. కాస్ పీఠభూమి సముద్ర మట్టానికి 3,725 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమి సహ్యాద్రి కొండల మధ్య గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. కొయనా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాస్ లేక్ ఏర్పడింది. సతారా పట్టణానికి తాగునీటిని ఈ లేక్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వచ్ఛతలో ఈ లేక్ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఓ అద్భుత, చిరస్మరణీయ అనుభూతిని కల్గిస్తుంది. ఈ ప్రాంతం మొక్కలకు, వన్యజీవులకు అనుకూలంగా నిలుస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందే. చల్కేవాడి.. వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్‌లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు. నైసర్గ్ ఆర్గానిక్ ఫార్మ్.. సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్‌ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్ఘడ్ కోటను కూడా చూడవచ్చు. (క్లిక్: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు) తోసేఘర్ వాటర్ ఫాల్స్... సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్‌కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్‌ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందా లు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. (క్లిక్: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్) -
Photo Feature: మన్యం అందం.. ద్విగుణీకృతం
కవుల వర్ణనలో కనిపించే అందాలెన్నో మన్యంలో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలకు తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రకృతి పచ్చని తివాచీ పరిచిందా అన్నట్లు అబ్బురపరిచే పొలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీలేరు జలాశయం వ్యూ పాయింట్, గుంటవాడ డ్యాం, సీలేరు సమీపంలోని తురాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, గుర్రాయి, ఎగ కంఠవరంలోని అక్కాచెల్లెల జలపాతాలు, కుంబిడిసింగి మార్గంలో జలపాతం అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. అరమ, సొవ్వ, సాగర, కొర్రా తదితర ప్రాంతాలు పచ్చదనంతో ముచ్చటగొల్పుతున్నాయి. కొండ ప్రాంత అందాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. – సీలేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
Pakistan: ‘మహిళలు పర్యాటక ప్రదేశాల్లోకి రావొద్దు’
ఇస్లామాబాద్: పర్యాటక, వినోదాత్మక ప్రాంతాల్లోకి మహిళలు కనిపించరాదంటూ పాకిస్తాన్‌లోని ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని గిరిజన మండలి తీర్మానం చేసింది. ఆ ప్రాంతాల్లోకి మహిళల ప్రవేశం అనైతికం, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమని పేర్కొంది. బజౌర్ గిరిజన జిల్లా సలార్జాయ్ తహసీల్‌కు చెందిన జిర్గా (గిరిజన మండలి) ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రభుత్వం వెంటనే అమలు చేయకుంటే తామే ఆ పని చేస్తామంది. ఈ సమాశానికి జమియాత్ ఉలేమా–ఇ–ఫజుల్(జేయూఐ–ఎఫ్) జిల్లా చీఫ్ మౌలానా అబ్దుర్ రషీద్ నేతృత్వం వహించారు. పాక్ అధికార సంకీర్ణంలో జేయూఐ–ఎఫ్ ప్రధాన భాగస్వామి. -
Hyderabad: చారిత్రక భాగ్యనగరికి విదేశీ పర్యాటక కళ
సాక్షి, హైదరాబాద్: ‘అతిథి దేవోభవ’ అంటూ భాగ్యనగరం పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్ వంటి శతాబ్దాల నాటి చారిత్రక కట్టడాలు యథావిధిగా విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వివిధ దేశాల నుంచి ప్రతిరోజు 5000 మంది, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 10 వేల మందికి పైగా పర్యాటకులు హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య సాధారణ రోజుల్లో 3000 వరకు, శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో 7500 వరకు ఉంటుంది. మరో 2000 నుంచి 2500 మంది విదేశీ పర్యాటకులు నగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. కోవిడ్ కారణంగా ఈ రాకపోకల్లో స్తబ్దత నెలకొంది. కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో కొంతకాలంగా పర్యాటకుల తాకిడి మొదలైంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, పర్యాటకులు నగరాన్ని సందర్శిస్తున్నారు. అలాగే విదేశీ రాకపోకలు కూడా పెరిగాయి. యూరోప్ దేశాల నుంచి నగరానికి ఎక్కువ మంది వస్తున్నట్లు జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్ ఆంక్షలను తొలగించినప్పటికీ చాలా మంది వేచి చూసే ధోరణి వల్ల ప్రయాణం వాయిదా వేసుకున్నారని, రెండు నెలలుగా రాకపోకలు తిరిగి ఊపందుకున్నాయని పేర్కొన్నారు. ఇది ‘రివెంజ్ టూరిజం’... ఏడాదికోసారి ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి సేదతీరడం సాధారణమైన అంశం. అలాగే పర్యాటక ప్రియులు సైతం దేశవిదేశాలను సందర్శించి తమ అభిరుచిని చాటుకుంటారు. కానీ కోవిడ్ కారణంగా ఈ పర్యటనలు నిలిచిపోవడంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆంక్షలు తొలగడంతో గట్టు తెగిన ప్రవాహంలా జనం రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అనూహ్యంగా పెరిగిన పర్యాటకుల తాకిడిని ట్రావెల్స్ సంస్థలు ‘రివెంజ్ టూరిజం’గా అభివర్ణిస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ పర్యాటకులు సైతం పెద్ద సంఖ్యలోనే భారతదేశ సందర్శన కోసం తరలి వస్తున్నారు. ఢిల్లీ, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించిన వాళ్లు దక్షిణాదిలో హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, తదితర ప్రాంతాలతో పాటు రామప్ప ఆలయాన్ని సైతం ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీ.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. కోవిడ్‌కు ముందు ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే గత మే నెలలో 93 శాతం మంది జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 86 శాతం వరకు ఉండడం గనార్హం. జూన్ 10వ తేదీన ఒక్క రోజే 10 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కోవిడ్ తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాల సంఖ్య పెరగడంతో అందుకనుగుణంగా ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతుంది. మే నెలలో 15 లక్షలకు పైగా దేశీయ ప్రయాణికులు, సుమారు 2.7 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు బయలుదేరారు. నగరం నుంచి ఇప్పుడు లండన్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, దుబాయ్, ఖతార్, షార్జా, దోహా, కువైట్లకు సర్వీసులు నడుస్తున్నాయి. హాంకాంగ్ మినహా, అంతకుముందున్న అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇప్పుడు విమాన సర్వీసులు ఉన్నాయి.కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకూ విమాన సర్వీసులను జోడించారు. (క్లిక్: నీ బుల్లెట్టు బండెక్కి చెక్కెత్తపా డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని..) -
ఏపీలో కొత్త పర్యాటక జిల్లా
-
కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. సరిహద్దుల్లో సందర్శనీయం
చింతలమానెపల్లి(సిర్పూర్): కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం తగ్గింది. ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడం.. నిబంధనలు సడలించడం కారణంగా ఈ వేసవిలో పర్యాటక ప్రాంతాలను చుట్టి రావాలనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోనూ సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. కుమురంభీం జిల్లా అటవీ అందాలు.. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. వచ్చే నెల 13నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతాలన్ని ప్రాణహిత నది చుట్టుపక్కల ఉన్నాయి. అటు పుష్కరస్నానం.. ఇటు పర్యాటక ప్రాంత సందర్శన రెండూ సాధ్యమవుతాయి. జిల్లా సరిహద్దులోని సందర్శనీయ స్థలాలపై ప్రత్యేక కథనం. బామ్రాఘడ్.. వన్యప్రాణుల నిలయం కుమురంభీం జిల్లాను ఆనుకుని ఉన్న గడ్చిరోలి జిల్లాలోని బామ్రాఘడ్ ప్రాంతం ప్రకృతి రమణీయతను చాటుతోంది. తహసీల్‌గా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఈ ప్రాంతం జిల్లాలోని సరిహద్దు మండలం చింతలమానెపల్లి నుంచి 80కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బామ్రాఘడ్లోని హెమల్కాస వద్ద సామాజిక సేవా కార్యకర్త బాబా ఆమ్టె ఆధ్వర్యంలో లోక్బిర్దారి ప్రకల్ప్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. గిరిజనులకు ఉచితంగా వైద్యం చేస్తారు. ఆస్పత్రి ఆవరణలో వన్యప్రాణుల సందర్శనశాల(జూ పార్కు) ఉంది. చిరుత పులులు, ముళ్ల పందులు, ఎలుగుబంట్లు ఇలా ఎన్నో రకాల అరుదైన జంతువులు ఉన్నాయి. బామ్రాఘడ్ సమీపంలో ఇంద్రావతి నది త్రివేణి సంగమం అరుదైనదిగా చెబుతుంటారు. ఇంద్రావతి, వాముల గౌతమి, వర్లకోట నదుల కలయికతో సంగమ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. గిరిజనుల సంస్కృతి, ఆచారాలు, ప్రయాణంలో కనిపించే దృశ్యాలు, అటవీ అందాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటాయి. బామ్రాఘడ్ వెళ్లే మార్గంలో వచ్చే గ్లోరీ ఆఫ్ ఆల్లపల్లి చూడాల్సిన ప్రదేశం.. కమలాపూర్.. గజరాజుల అడ్డా చింతలమానెపల్లి మండల కేంద్రం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. 10 వరకు పెద్ద ఏనుగులు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. స్థానిక అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఏనుగుల సంరక్షకుల సమక్షంలో సందర్శకులు నేరుగా పండ్లు, ఆహారం అందించవచ్చు. ఈ కేంద్రాన్ని స్థానికంగా హాథీ క్యాంప్ అని పిలుస్తారు. ఇక్కడి రిజర్వాయర్, అటవీ అందాలు, చల్లెవాడ రాబందుల సంరక్షణ కేంద్రం, ఏనుగు రూపంలో ఉన్న కొండ సందర్శకులను ఆకట్టుకున్నాయి. చెప్రాడ ప్రశాంత ధాం చెప్రాడ ప్రశాంత ధాం ఆలయం కుమురంభీం, మంచిర్యాల జిల్లా వాసులకు సుపరిచిత ప్రదేశం. పెన్‌గంగా, వార్ధా నదుల సంగమ స్థలం ప్రాణహిత జన్మస్థలంలో ఈ దేవస్థానం ఉంది. చెప్రాడలో కార్తీక మçహారాజ్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించిన ప్రశాంత ధాం హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది. స్థానిక ప్రజలు మహారాజ్‌గా పిలుచుకునే కార్తీక్ స్వామి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎన్నో పనులు చేపట్టారు. శ్రీకృష్ణ, రామ, శివ, దుర్గా, సాయిబాబా, గజానన్ మహరాజ్ ఆలయాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించారు. మూడేళ్ల క్రితం కార్తీక మహారాజ్ పరమపదించగా, ఆయన భక్తులు మహా సమాధిని నిర్మించారు. యేటా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. జనవరి ఒకటిన నూతన సంవత్సరం సందర్భంగా మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహిస్తుంటారు. తోగ వెంకటాపూర్.. చెట్టుకాండంలో వేంకటేశ్వరుడు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా చామూర్శి తాలూకాలో మార్కండ ఆలయం ఉంది. గడ్చిరోలి జిల్లాలో ప్రజలు కొలిచే దేవస్థానాల్లో తోగ వెంకటాపూర్ ఒకటి. కుమురంభీం, మంచిర్యాల, గడ్చిరోలి జిల్లాల సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంది. కాగజ్‌నగర్ నుంచి కౌటాల, చింతలమానెపల్లి, మహారాష్ట్రలోని అహెరి మీదుగా 80 కిలోమీటర్ల రోడ్డు మార్గం ప్రయాణిస్తే తోగ వెంకటాపూర్ చేరుకోవచ్చు. ఇక్కడ వేరుమద్ది చెట్టు కాండంలో వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్నారు. 800 ఏళ్ల చరిత ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అహెరి రాజ వంశీయులు తమ కుల దైవంగా భావిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవస్థానం ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. వేల సంవత్సరాల నాటి అరుదైన వృక్షాలు అబ్బుర పరుస్తాయి. చప్పట్లు కొడితే పైకి ఉబికే నీటి ఊటలు మనుషుల అలజడికే ఎగిసిపడే నీటి అలలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పులుల అభయారణ్యం.. తాడోబా జిల్లాకు సమీపంలో ఉండి పర్యాటక ప్రేమికులకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం తాడోబా. కాగజ్‌నగర్ పట్టణం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో చంద్రాపూర్ జిల్లా కేంద్రం ఉంది. చంద్రాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఏ సమయంలోనైనా చేరుకోవచ్చు. తాడోబా అటవీ ప్రాంతం చిరుతలు, పెద్ద పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర ఎన్నో రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడోబా సఫారి టూర్ వేసవిలో ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ అటవీ ప్రాంతంలో పర్యటనకు పలు మార్గాలు ఉండగా, మొహార్లి గేట్ మార్గం గుండా వెళ్తే పూర్తిస్థాయిలో అందాలను ఆస్వాదించవచ్చు. పర్యటనకు సఫారి టూర్ ఆన్లైన్లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. వాహనానికి నిర్ణీత రుసుం చెల్లించి అటవీ ప్రాంతంలో పర్యటించాల్సి ఉంటుంది. పులులు, జింకలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులను వాటి సహజ స్థితిలో సమీపం నుంచి చూసే అవకాశం పర్యాటకులకు ఉంటుంది. వసతిపరంగా తాడోబాలో మహారాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రిసార్ట్లు, చంద్రాపూర్‌లో పర్యాటకులకు అనువైన ధరల్లో హోటళ్లు, రిసార్చ్టులు ఉన్నాయి. చంద్రాపూర్‌లో మహంకాళి ఆలయం, చంద్రాపూర్ కోట, అందమైన పార్కులు సందర్శనీయ స్థలాలు. దాబా కొండయ్య మహారాజ్ ఆలయం కాగజ్‌నగర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుదైన ఆధ్యాత్మిక స్థలం స్థలం దాబా. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గోండ్పిప్పిరి తాలూకాలోని దాబా విశిష్టత కలిగిన దేవస్థానం. ఇక్కడ సజీవ సమాధి పొందిన కొండయ్య మహారాజ్ ఆలయం ఉంది. వీరశైవుడు అయిన కొండయ్య మçహారాజ్ ఎన్నో మహిమలు కలిగిన వ్యక్తిగా స్థానికులు చెబుతారు. నిజాం ప్రభువు ఎదుట మహిమలు చూపించడంతో నిజాం ప్రభువు సైతం ఆశ్చర్యపోయి బహుమతులు అందించారని కథనం. వరంగల్‌లో శిలానందికి గడ్డి తినిపించడం, ఎన్నో రకాల రోగాలను ప్రత్యక్షంగా నయం చేయడం, ఇతర ఎన్నో మహిమలను చూపించిన వ్యక్తిగా స్థానికులు ఆయనను కొలుస్తారు. ఆధ్యాత్మిక భావనలు పెంచడంలో భాగంగా జిల్లాలోని బెజ్జూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) మండలాల్లో పర్యటించిన ఆయన ఎన్నోరకాల మహిమలు చూపించడాన్ని ఇప్పటికి పెద్దలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. సిర్పూర్(టి) మండలం లోనవెల్లికి చెందిన అంబేద కొండయ్య మçహారాజ్ దాబాలో స్థిరపడ్డారు. ఇప్పటికి ఆయన వంశీకులు లోనవెల్లిలో నివసిస్తున్నారు. 1834లో జన్మించిన ఆయన కార్తీక శుద్ధ తృతీయ 1939 నవంబర్ 14న అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం అనుమతితో యోగ సమాధి అయ్యారు. ప్రతిఏటా మాఘశుద్ధ తృతీయ నాడు ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఇక్కడ ఇప్పటికీ ఆయన వంశీయులు పూజలు చేస్తున్నారు. -
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది. స్వాగత తోరణం.. యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. ఆలయ విశిష్ఠత గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి. ఆలయమంతా స్వర్ణమయం గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. శివాలయం... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. విష్ణు పుష్కరిణి... కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు. గిరి ప్రదక్షిణ... శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. కల్యాణ కట్ట ప్రారంభం.. ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు. స్వామి పుష్కరిణి ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది. వైకుంఠద్వారం... యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు. అన్నప్రసాదం... గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్ లెవల్ పనులు పూర్తయ్యాయి. కల్యాణ కట్ట... శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షాపరుల మండపం శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. గండి చెరువు... శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’ ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు. యాగ స్థలం... యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి... కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వ్రత మండపం... అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది. లడ్డూ ప్రసాదం.. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు. పూర్వ జన్మ సుకృతం ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ ద్వారా ఆలయ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’. – స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆలయ ప్రధానార్చకులు కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి -
Lambasingi: లంబసింగికి చలో చలో
చింతపల్లి: మంచు ముసుగేసుకున్న ప్రకృతిని.. శీతల గాలుల మధ్య వీక్షించేందుకు పర్యాటకులు లంబసింగికి పరుగులు తీస్తారు. అత్యంత ఎత్తులో ఉన్న ఆ ప్రదేశంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ రాత్రి బస చేస్తే ఆ అనుభూతే వేరు. అలాంటి ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకునేందుకు టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. శనివారం పర్యాటకులు ప్రత్యేక బస్సులో విశాఖ నుంచి లంబసింగి చేరుకున్నారు. స్థానిక టూరిజం మేనేజర్ సూరెడ్డి అప్పలనాయుడు అక్కడి నుంచి లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు.. ఈ యాత్ర విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏపీ టూరిజం వారి హరిత హోటల్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుందని టూరిజం మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. అక్కడ భోజనాలు చేసిన తర్వాత బయలుదేరి నర్సీపట్నం మీదుగా లంబసింగి చేరుకుని ఇక్కడ రాత్రి బస చేస్తారు. ఇక్కడి అందాలను వేకువజామున వీక్షించిన తర్వాత అల్పాహారం ముగించి జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలకు బయలుదేరుతారు. అక్కడ నుంచి పాడేరు మోదకొండమ్మ ఆలయం, హుకుంపేట మండలంలోని మత్స్యగుండం పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి పాడేరు మీదుగా విశాఖపట్నం తిరుగు పయనమవుతారు. పర్యాటకులు బయలుదేరిన దగ్గర నుంచి లంబసింగిలో బస, రెండు రోజుల భోజనం, అల్పాహారం, బస్సు చార్జీతో కలిపి పెద్దలకు రూ.1970, పిల్లలకు రూ.1650లు టికెట్ ధరగా నిర్ణయించారు. వావ్.. బొర్రా కేవ్స్ అనంతగిరి (అరకు): ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకులు శనివారం పోటెత్తారు. ప్రస్తుతం పిక్నిక్ సీజన్ కావడంతో మన్యంలోఅందాలు తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. వలిసెపూల తోటలు పర్యాటకులను ఆహ్వానం పలుకుతున్నాయి. అరకు–డుంబ్రిగుడ, అనంతగిరి విశాఖ ప్రధాన రహదారి ఆనుకుని వలిసెపూల మధ్య సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు. శనివారం బొర్రాగుహలను 5400 మంది తిలకించగా, సుమారు రూ.3.74 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. కొత్తపల్లి.. అందాల లోగిలి జి.మాడుగుల: పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో కొత్తపల్లి జలపాతాల వద్ద సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో భారీగా పర్యాటకులు తరలివచ్చారు. జలపాతాల్లో గంటలు తరబడి సందర్శకులు జలకాలాడారు. జలపాతాల వ్యూపాయింట్ వద్ద సెలీ్ఫలతో సందడి చేశారు. సీతమ్మ పర్వతం.. అద్భుతం హుకుంపేట : మన్యంలో అతిపెద్ద కొండ సీతమ్మ పర్వతాన్ని (జెండాకొండా) సబ్ కలెక్టర్ వి.అభిõÙక్ సందర్శించారు. శనివారం వేకువ జామునే పాడేరు నుంచి తీగలవలస పంచాయతీ ఓలుబెడ్డా గ్రామానికి చేరుకుని అక్కడనుంచి గిరిజనులతో కలిసి వేకువ జామునే సుమారు నాలుగు కిలోమీటర్లు మేర కాలినడకన ప్రయాణించారు. కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కొండపైకి చేరుకుని మంచు అందాలను ఆస్వాదించారు. కొండాలో ఉన్న చరిత్ర కలిగిన తేనేపట్టు గుహలు, దింసారాళ్లు, తిరిగలి రాళ్లు, బ్రిటిషు వాళ్లు నిర్మించిన జెండా కోటను చూసి ఆకర్షితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో జెండాకొండ పర్యాటక కేంద్రంగా భాసిల్లడం ఖాయమన్నారు. సబ్ కలెక్టర్‌కు సన్మానం జెండా కొండకు మొదటిసారి సబ్ కలెక్టర్ అభిషేక్ రావడంతో గిరిజనులు, వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా వ్యవసాయ సలహామండలి సభ్యుడు ముత్యంగి విశ్వేశ్వరరావు, తీగలవలస సర్పంచ్ పంగి బేసు, ఎంపీటీసీ కొర్ర నాగరాజు, నాయకులు భవాణి శంకర్ తదితరులు సత్కరించారు. మంచుకురిసే వేళలో.. పాడేరు : పొగమంచుతో పాటు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన వంజంగి హిల్స్‌కు శనివారం వేకువజామున పర్యాటకులు పోటెత్తారు. రెండవ శనివారం కావడంతో వీకెండ్ డేస్‌ను దృష్టిలో పెట్టుకుని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులంతా వంజంగి హిల్స్‌కు చేరుకుని ఇక్కడ ప్రకృతి అందాలను వీక్షించారు. పర్యాటకుల రద్దీతో వంజంగి హిల్స్‌లోని అన్ని ప్రాంతాలు సందడిగా మారాయి. ఇక్కడ ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించి పరవశించారు. ఉదయం 10గంటల వరకు వంజంగి హిల్స్‌లో పర్యాటకుల తాకిడి నెలకొంది. అలాగే పాడేరు ఘాట్‌తో పాటు మోదకొండమ్మ తల్లి ఆలయానికి కూడా పర్యాటకులు భారీగా తరలివచ్చారు. -
తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం
భైంసా టౌన్: 200 ఏళ్లకుపైగా పురాతన శివాలయం, ప్రకృతి ఒడిలో, పచ్చని చెట్ల మధ్య వెలిసింది. పక్కనే జలపాతం అందాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు, ఎతైన గుట్టలు, పక్కనే జాలువారే జలపాతం.. వీటి మధ్యన వెలిసిన పురాతన శివాలయం.. వెరసి కుభీర్ మండలంలోని బ్రహ్మేశ్వరాలయం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో పూజలు చేసేందుకు శని, సోమవారాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం తరలివచ్చి పూజలు చేస్తారు. గ్రామం: బ్రహ్మేశ్వర్, మండలం: కుభీర్ భైంసా నుంచి దూరం: 20 కి.మీ(దాదాపు) ఆలయ చరిత్ర... బ్రహ్మేశ్వర ఆలయానికి దాదాపు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వనవాసం సమయంలో రామలక్ష్మణులు, సీత ఇక్కడ సంచరించారని, శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేశారని నమ్ముతారు. తమ తాతల కాలం నుంచి ఆలయం ఉందని, శివరాత్రితోపాటు ఏటా శ్రావణమాసంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారని చెబుతున్నారు. ఆకట్టుకునే వాతావరణం.. భైంసా నుంచి దాదాపు 20కి.మీ దూరంలో ఉండే బ్రహ్మేశ్వర్ గ్రామంలోని బ్రహ్మేశ్వరాలయం పరిసరాలు, అక్కడి వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయ సమీపంలోని జలపాతంలో స్నానాలు చేస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు దూరప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు. పురాతన ఆలయంగా ప్రసిద్ధి.. కొత్త పంచాయతీలతో బ్రహ్మేశ్వర్ జీపీగా ఏర్పడింది. ఇక్కడి శివాలయానికి దాదాపు 200ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. - దత్తురాం, బ్రహ్మేశ్వర్ గ్రామస్తుడు -
సెల్ఫీలు దిగితే క్రిమినల్ కేసు.. నోటిఫికేషన్ విడుదల
సెల్ఫీల మోజులో ఆపదలను కొని తెచ్చుకోవడం సర్వసాధారణంగా మారింది. ప్రపంచంలో ప్రతీ ఏటా నమోదు అవుతున్న సెల్ఫీ మరణాల్లో.. మన దేశం వాటా ఎక్కువగానే ఉంటోంది. పైగా వర్షాకాలం సీజన్లో టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతుండడం వల్ల ఇవి మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ జిల్లాలో సెల్ఫీలపై పూర్తి నిషేధం విధించారు. సూరత్: గుజరాత్‌లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్‌తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పుర లాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్లో అధికారులు హెచ్చరించారు. ఈమేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్ఫీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. ఇక ఈ స్ఫూర్తితో తమ దగ్గర ఇలాంటి ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్ ప్రాంతాల ఊర్లు కొన్ని డిమాండ్ చేస్తుండడం విశేషం. చదవండి: ఫోన్ చోరీ.. సెల్ఫీలు చూసి వ్యక్తి షాక్! -
Meenmutty Waterfalls: మీన్ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం
మీన్ముట్టి... జలపాతం... వయనాడు తలమీద జల కిరీటం. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి దూకే ప్రవాహవేగం తెల్లగా ... పాలధారను తలపిస్తుంది. నీటిచుక్కల సవ్వడి... ఝంఝామారుతాన్ని గుర్తు చేస్తుంది. కేరళ రాష్ట్రం అనగానే మనకు ఇండియా మ్యాప్‌లో దక్షిణాన అరేబియా సముద్రతీరానికి ఆనుకుని ఉన్న సన్నటి స్ట్రిప్ గుర్తుకు వస్తుంది. కేరళలో నివాస ప్రాంతాలన్నీ అరేబియా తీరానే ఉన్నాయేమో అని కూడా అనుకుంటాం. కానీ సాగరతీరాన్ని తాకకుండా కొన్ని జిల్లాలున్నాయి. వాటిలో ఒకటి వయనాడు. ఇది ఓ దశాబ్దం కిందట పర్యాటక ప్రదేశంగా బయటి ప్రపంచానికి పరిచయమైంది. రాహుల్‌గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో వయనాడు దేశమంతటికీ సుపరిచయమైంది. పశ్చిమ సుగంధం వయనాడు సుగంధ ద్రవ్యాలు పుట్టిన నేల. పశ్చిమ కనుమల మీద విస్తరించిన హిల్‌స్టేషన్, ఏడు వేల అడుగుల ఎత్తు ఉంటుంది. టూరిజం ఆధారంగా అభివృద్ధి చెందిన హోటళ్లు పెద్ద పెద్ద హోర్డింగులతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంటాయి. కొండ పైకి వెళ్లే కొద్దీ లోయలో పెరిగిన కొబ్బరి చెట్ల తలలు రోడ్డుకు సమాంతరంగా కనిపిస్తుంటాయి. కొబ్బరి, పోక, కాఫీ, టీ, ఏలకులు, మిరియాలు, లవంగాల చెట్లు, అక్కడక్కడా మామిడి, పేర్లు తెలియని లెక్కలేనన్ని జాతులు... అన్ని ఆకులూ పచ్చగానే ఉన్నా, దేని పచ్చదనం దానిదే. ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ అందంగా ఉంటాయి. వయనాడుకు వెళ్లే దారిలో కొండల్లో ప్రమాదకరమైన మలుపులున్నాయి. వాటిని హెయిర్‌పిన్ బెండ్లు అంటారు. మీన్ముట్టికి వెళ్లే దారిలో... వయనాడు కొండ మీదకు చేరేలోపు ఒక చోట పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టుకు రెండు పెద్ద ఇనుప గొలుసులు ఉంటాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఒక విదేశీయుడు గిరిజనులు నివాసం ఉండే ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి బయలుదేరాడు. దట్టమైన కొండల్లో దారి తప్పి పోకుండా ఉండడానికి స్థానిక గిరిజనుడిని సహాయంగా తీసుకెళ్లాడని, ఆ గిరిజనుడి మార్గదర్శనంతో దారి తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి తను మాత్రమే తెలియాలనే దురుద్దేశంతో ఆ విదేశీయుడు, తనకు సహాయం చేసిన గిరిజనుడిని ఈ చెట్టుకు గొలుసులతో కట్టేశాడని చెబుతారు. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణం తర్వాత పూకాట్ లేక్‌కు చేరుకుంటాం. కొండల మీద ఉన్న పెద్ద మంచి నీటి సరస్సు ఇది. ఇందులో బోట్ షికారు చేయవచ్చు. మీన్ముట్టి జలపాతానికి చేరాలంటే ట్రెక్కింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూకాట్ సరస్సులో బోటింగ్‌కి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడమే మంచిది. పూకాట్ నుంచి ముందుకు సాగే కొద్దీ జనం ఆనవాళ్లు తగ్గుతుంటాయి. జలపాతం రెండు కిలోమీటర్లు ఉందనగా రోడ్డు ఆగిపోతుంది. అక్కడి నుంచి కొంత దూరం రాళ్ల బాటలో నడక. తర్వాత కొండవాలులో నడక. ఫారెస్ట్ సెక్యూరిటీ పాయింట్ దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. వాళ్ల రిజిస్టర్లో మన పేరు, ఊరు, ఫోన్ నంబరు రాయాలి. బృందంలో ఎంతమంది ఉంటే అన్ని కర్రలతో ఒక గార్డును సహాయంగా వస్తాడు. ఆ చెక్ పాయింట్ నుంచి ముందుకు వెళ్లిన వాళ్లు తిరిగి ఆ పాయింట్‌కు చేరే వరకు బాధ్యత వాళ్లదే. అదో జానపద చిత్రమ్ కొండవాలులో దట్టమైన అడవిలో ట్రెకింగ్. చెట్లకు పెద్ద పెద్ద తాళ్లు కట్టి ఉంటాయి. గార్డు పర్యాటకుల చేతికి కర్రలిచ్చి, ముందుగా తాను నడుస్తూ, ఎక్కడ రోప్‌ను పట్టుకోవాలో హెచ్చరిస్తూ తీసుకెళ్తాడు. ఎక్కువ లగేజ్ లేకపోతే ట్రెకింగ్ సులువుగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎదురుగా కనిపించే కొండ తమిళనాడుది, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు కూడా కనిపిస్తాయి. నడుస్తూ ఉంటే చెట్ల సందుల్లో జలపాతం కనిపిస్తూనే ఉంటుంది. సవ్వడి వినిపిస్తూ ఉంటుంది. పొరపాటున కాలు జారితే... లోయలో ఎక్కడకు చేరుతామో కూడా ఊహించలేం. ‘ఇంతదూరం వచ్చిన తర్వాత భయపడి వెనక్కి పోవడమేంటి’ అని మనసులో సాహసాన్ని ఒడిసిపట్టుకుని ముందుకు నడిస్తే అద్భుతానికే అద్భుతం ఆవిష్కారమవుతుంది. అదే మీన్ముట్టి జలపాతం. పచ్చటి చెట్ల మధ్య తెల్లటి నీటిధారలు. ఆ జల్లులో తడిస్తే తప్ప టూర్ పరిపూర్ణం అనిపించుకోదు. మీన్ ముట్టి అంటే... చేపలకు అడ్డుకట్ట అని అర్థం. – వాకా మంజులారెడ్డి