వేసవికి ప్లాన్‌ ఏంటి..? | There are lots of places in the country abroad | Sakshi
Sakshi News home page

వేసవికి ప్లాన్‌ ఏంటి..?

Published Mon, Apr 1 2019 12:33 AM | Last Updated on Mon, Apr 1 2019 4:06 AM

There are lots of places in the country abroad - Sakshi

వేసవి సెలవుల్లో రీఫ్రెష్‌ అవ్వడం కోసం చక్కని పర్యాటక ప్రదేశాలను చుట్టి రావాలన్న ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అయితే, ఎంపిక దగ్గరే సమస్యంతా. దూర ప్రాంతాలకు వెళ్లి రావడం అనేది కొంచెం కష్టమైన టాస్కే. ఎంపికను బట్టే ప్లానింగ్‌ ఆధారపడి ఉంటుంది. ముందుగా ఎక్కడికి వెళ్లాలన్న దానిపై  కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం అవసరం. ఆ తర్వాతే ప్రణాళిక ఆరంభమవుతుంది. కొంచెం ముందుగా సన్నద్ధం అయితే టికెట్ల బుకింగ్‌ దగ్గర నుంచి హోటళ్ల బుకింగ్‌ వరకు సాఫీగా సాగిపోతుంది. ఆలస్యం చేస్తే ఆదరాబాదరతోపాటే బడ్జెట్‌ కూడా పెరిగిపోవచ్చు. ఇప్పటికీ వేసవి పర్యటనకు ప్రణాళిక రూపొందించుకోకుండా, ఎక్కడో ఒక చోటకు వెళ్లొద్దామనుకునేవారు.. వెంటనే తాము చూడాలనుకుంటున్న వాటిపై స్పష్టతకు రావాలి. ఇందుకు నిపుణులు తెలియజేస్తున్న ప్లానింగ్‌  మీకోసం...

ఎన్నో ఎంపికలు 
రవాణా సదుపాయాలు విస్తృతమైన తర్వాత పర్యాటక ప్రియులకు ఎన్నెన్నో గమ్యస్థానాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఏది ఎంచుకోవాలన్న మీమాంస కూడా ఎదురవుతుంది. వేసవి ట్రిప్‌ ద్వారా తాము ఏం ఆశిస్తున్నామనే ఆకాంక్ష, బడ్జెట్‌ తదితర అంశాల ఆధారంగా ఎంపిక మారిపోవచ్చు. ‘‘భారత పర్యాటకులకు దక్షిణాఫ్రికా సఫారీ అనుభవం ప్రముఖ ఎంపిక. ఇక ఫ్రాన్స్‌ అయితే వంటకాలు, వైన్‌కు ప్రసిద్ధి. చరిత్ర, సంస్కృతి, నిర్మాణ కళ పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులు హంగేరి, చెక్‌ రిపబ్లిక్, ఆస్ట్రియాలను ఎంచుకుంటుంటారు. స్పా, వెల్‌నెస్, రెజువెనేషన్‌ అనుభవాలు కోరుకునే వారికి దక్షిణ కొరియా ఎంపిక అవుతుంది. స్విట్జర్లాండ్, క్రోయేషియా ఫొటోగ్రఫీ ప్రియులకు అనుకూలం’’ అని థామస్‌ కుక్‌ ఇండియా లీజర్‌ ట్రావెల్‌ విభాగం అధిపతి రాజీవ్‌ కాలే వివరించారు.  
సంపాదనా శక్తి పెరుగుతుండడంతో భారతీయ పర్యాటకులు ప్రముఖ పండుగల సమయాల్లో (విదేశీ పండుగలు)నూ ఆయా దేశాలకు వెళ్లి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థాయిలాండ్‌లో ఏప్రిల్‌ 13–15 మధ్య జరిగే సాంగ్‌క్రాన్‌ (వాటర్‌ ఫెస్టివల్‌), హాంకాంగ్‌లో జూన్‌ 7న జరిగే డ్రాగన్‌ బోట్‌ ఫెస్టివల్, స్పెయిన్‌లో ఆగస్ట్‌ 28న జరిగే లా టమాటినా(టమాటా ఫెస్టివల్‌), దక్షిణ కొరియాలో జూలై 19–28 మధ్య జరిగే బోర్యాంగ్‌ మడ్‌ ఫెస్టివల్‌  ను చూసేందుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని రాజీవ్‌ కాలే తెలిపారు. యూకేలో మే నుంచి ఆరంభమయ్యే ఐసీసీ ప్రపంచ క్రికెట్‌ కప్‌కూ ఇప్పుడే ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇక ఆఫ్‌బీట్‌ డెస్టినేషన్స్‌ అయిన జపాన్, దక్షిణ అమెరికా, క్రోయేషియా, ఐస్‌ల్యాండ్‌ కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు ఉంటే థీమ్‌ పార్క్స్‌ అనుకూలం. ‘‘సింగపూర్, మలేషియాలోని లెగోల్యాండ్‌లో యూనివర్సల్‌ స్టూడియోలు ఉన్నాయి. టోక్యో, హాంకాంగ్, ప్యారిస్, ఓర్లాండోలలో డిస్నీల్యాండ్స్‌ ఉన్నాయి’’ అని బ్రాండ్‌ ఎక్స్‌పీడియా మార్కెటింగ్‌ హెడ్‌ మన్‌మీత్‌ అహ్లువాలియా తెలిపారు. ఇక ఆఫీసు బాధ్యతల నుంచి స్వల్ప విరామం తీసుకునేవారికి వీసా అవసరం లేని, సులభ వీసాలకు అవకాశం ఉండే సింగపూర్, బాలి, థాయిలాండ్, శ్రీలంకను ఎంచుకోవచ్చు. 

బడ్జెట్‌ ఎంత? 
పర్యటనకు వెళ్లొద్దామనే ఆలోచన వచ్చిన తర్వాత ముందుగా తేల్చుకోవాల్సినది ఎంత ఖర్చు పెడతారని. బడ్జెట్‌ను బట్టే ఎక్కడికి వెళ్లి రావచ్చన్నది నిర్ణయించుకోవడానికి వీలు పడుతుంది. ఆర్థిక సలహాదారులు అయితే వార్షికంగా మీరు చేసే ఖర్చుల్లో విచక్షణారహిత వినియోగం 15 శాతాన్ని మించకుండా చూసుకోవాలని చెబుతుంటారు. ‘‘సెలవు కాలంలో చేసే ఖర్చులు విచక్షణారహితం కిందకే వస్తాయి. మీ వార్షిక ఖర్చులో ఇది 10 శాతం మించకుండా ఉండడం అనుకూలం. వేసవితోపాటు, శీతాకాలంలోనూ పర్యాటక ప్రదేశాలను చూడాలనుకునే వారు ఈ పరిధికి లోబడే బడ్జెట్‌ను రెండు భాగాలు చేసుకోవాలి. అంతేకానీ మొత్తం బడ్జెట్‌ను వేసవి కోసం ఖర్చు పెట్టేయరాదు’’ అని ప్లాన్‌ అహెడ్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ సీఎఫ్‌పీ విషాల్‌ ధావన్‌ సూచించారు. మీరు ఎంత ఖర్చును భరించగలరన్న దాని ఆధారంగా పర్యాటక ప్రదేశాల జాబితాను షార్ట్‌లిస్ట్‌ చేసుకోవడానికి వీలవుతుంది. ‘‘తక్కువ బడ్జెట్‌ ఉన్నవారు భారత్‌లోపల లేదా దక్షిణాసియాలో ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. కొంచెం ఎక్కువ బడ్జెట్‌ పెట్టుకోగలిగితే తూర్పు యూరప్‌లోని ప్రాంతాలను సందర్శించొచ్చు. ఇంకా ఎక్కువ ఖర్చు చేయగలిగే వారు పశ్చిమ యూరప్‌కు వెళ్లొచ్చు’’ అని అహ్లువాలియా సూచించారు.  

కరెన్సీ ప్రభావం 
గత కొన్ని వారాల్లో డాలర్‌తో రూపాయి కాస్త బలపడడం కూడా బడ్జెట్‌ను తగ్గించేదే. గత 6 నెలల్లో ప్రధాన కరెన్సీలతో రూపాయి విలువ 2.9–8.8%  బలపడింది. దీనివల్ల భారతీయుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో సహజంగానే అన్ని చార్జీలు పెరిగిపోతుంటాయి. కనుక ఈ లోపే అన్నీ బుక్‌ చేసుకోవడం మంచిదని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ కరణ్‌ ఆనంద్‌ తెలిపారు. 

వీసా కోసం.. 
వీసాను ముందే తీసుకోవడం వల్ల సమయం కలిసొస్తుంది. చాలా మందికి వీసాకు పట్టే సమయంపై తగిన అవగాహన ఉండదు. బ్రిటన్, షెంజెన్‌కు వీసా కావాలంటే కనీసం 10–15 రోజులు పడుతుందనేది  నిపుణుల మాట. అదే ఆస్ట్రేలియాకు అయితే ఇది 20 రోజుల వరకు సమయం తీసుకుంటుందని చెబుతున్నారు.

ముందుగా బుక్‌ చేసుకుంటే..
విమాన టికెట్లను ముందుగా బుక్‌ చేసుకోవడం వల్ల చార్జీల భారం తగ్గే వెసులుబాటు ఉంటుంది. చివరి నిమిషంలో టికెట్ల చార్జీలు పెరిగే వరకు వేచి చూడకుండా ముందే బుక్‌ చేసుకోవాలని ఎస్‌వోటీసీ ట్రావెల్‌ హెడ్‌ డానియల్‌ డిసౌజౌ సూచించారు. రెండు నెలల ముందే టికెట్లను బుక్‌ చేసుకోవడం ద్వారా కనీసం 20–22 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కరణ్‌ ఆనంద్‌ తెలిపారు. ‘‘డైరెక్ట్‌గా వెళ్లే విమానాల్లో టికెట్‌ చార్జీలు ఎక్కువ. కనెక్టింగ్‌ విమానాలు చౌక.  తగిన వ్యవధి ఉన్న వారు కనెక్టింగ్‌ విమానాల ద్వారా వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చని అహ్లువాలియా తెలిపారు.  
ఇక ఏ సమయంలో మీరు చేరుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి విమానం సాయంత్రానికి చేరుకుంటే, ఆ రోజు స్థానిక సందర్శనకు వీలు పడదని అహ్లువాలియా గుర్తు చేశారు. అదే సమయంలో ఆ రాత్రికి విడిది కోసం గాను హోటల్, భోజన ఖర్చులను పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. కనుక ఉదయం సమయానికి తీసుకెళ్లే ఫ్లయిట్‌ను ఎంచుకోవడం కూడా ఖర్చు ఆదాకు ముఖ్యమని తెలియజేశారు. ఇక హోటల్స్‌ విషయంలోనూ ముందుగానే త్వరపడడం మంచిది. చాలా హోటళ్లు డిమాండ్‌ను సృష్టించేందుకు, సీజన్‌ ఆరంభానికి ముందే బుకింగ్‌లను పూర్తి చేసుకునేందుకు ఎర్లీబర్డ్‌ స్కీమ్‌లను అమలు చేస్తున్నాయని రాజీవ్‌ కాలే తెలిపారు. ఇక హోటల్‌ స్టార్‌ రేటింగ్‌ను బట్టి కూడా చార్జీల్లో మార్పులు ఉంటాయి. నగరం లోపల ఉన్న హోటళ్లు దూరంగా ఉన్న హోటళ్లతో పోలిస్తే ఎక్కువ చార్జీలు తీసుకుంటుంటాయి. అన్ని రకాల బుకింగ్‌లను ఇప్పుడు సులభంగా ఆన్‌లైన్‌లో చేసుకునే సదుపాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ముందుగా లోడ్‌ చేసిన ఫారెక్స్‌ కార్డులను వినియోగించుకోవడం వల్ల కొంత పొదుపు చేసుకోవచ్చు.

పర్యాటకులు మెచ్చే ప్రాంతాలు
ప్రముఖ ట్రావెల్‌ సైట్‌ ‘ట్రిప్‌ అడ్వైజర్‌’ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతాలకు ట్రావెలర్స్‌ చాయిస్‌ అవార్డులను (2019 సంవత్సరానికి) ప్రకటించింది. ట్రిప్‌ అడ్వైజర్‌ కస్టమర్ల  అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది.

భారత్‌లో పర్యాటకులకు నచ్చినవి... 
1. జైపూర్‌ (రాజస్తాన్‌) 
2. గోవా (గోవా) 
3. న్యూఢిల్లీ 
4. మనాలి (హిమాచల్‌ప్రదేశ్‌) 
5. కోచి (కేరళ) 
6. బెంగళూరు (కర్ణాటక) 
7. జైసల్మేర్‌ (రాజస్తాన్‌) 
8. ముంబై (మహారాష్ట్ర) 
9. ఉదయ్‌పూర్‌ (రాజస్తాన్‌) 
10. ఆగ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌)

ఆసియాలో టాప్‌10 డెస్టినేషన్స్‌...
1. బాలి (ఇండోనేషియా) 
2. ఫుకెట్‌ (థాయిలాండ్‌) 
3. సీమ్‌రీప్‌ (కంబోడియా) 
4. హనోయ్‌ (వియత్నాం) 
5. టోక్యో (జపాన్‌) 
6. ఖాట్మండు (నేపాల్‌) 
7. జైపూర్‌ (భారత్‌) 
8. హాంగ్‌కాంగ్‌ (చైనా) 
9. సియోల్‌ (దక్షిణ కొరియా) 
10. గోవా (భారత్‌) 

అంతర్జాతీయంగా టాప్‌ ఇవీ...
1. లండన్‌ (ఇంగ్లండ్‌) 
2. పారిస్‌ (ఫ్రాన్స్‌) 
3. రోమ్‌ (ఇటలీ) 
4. క్రెటే (గ్రీస్‌) 
5. బాలి (ఇండోనేషియా) 
6. ఫుకెట్‌ (థాయిలాండ్‌) 
7. బార్సెలోనా (స్పెయిన్‌) 
8. ఇస్తాంబుల్‌ (టర్కీ) 
9. మర్రాకెచ్‌ (మొరాకో) 
10. దుబాయి (యూఏఈ)

రూ.2–3 లక్షల బడ్జెట్‌ అయితే 
ప్రాంతం    బడ్జెట్‌(రూ.లక్షల్లో) 
సీషెల్స్‌    2 
ప్రాగ్‌    2 
ఇటలీ    3 
హాంకాంగ్‌    2.75 
గ్రీస్‌    3 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement