మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలుగా నిర్మాణం
ఎంజీఎం స్థానంలో నీలోఫర్ మాదిరిగా మాతాశిశు ఆస్పత్రి
ఏరియా ఆస్పత్రులుగా హన్మకొండ ప్రసూతి, సీకేఎంలు
హన్మకొండ : వైద్య సేవలకు హైదరాబాద్‌పై ఆధారపడకుండా వరంగల్ నగరాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉత్తర తెలంగాణకు ప్రభుత్వ వైద్య సేవలపరంగా పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని తాజాగా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఎంజీఎం ఆస్పత్రి సూపర్‌గా మారుతుండగా హన్మకొండ ప్రసూతి , వరంగల్ సీకేఎం ఆస్పత్రులు ఏరియా ఆస్పత్రులుగా మార్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
సెంట్రల్ జైలు స్థానంలో సూపర్ స్పెషాలిటీ
ఎంజీఎం సూపర్ స్పెషాలిటీగా మారడంతో పాటు ప్రభుత్వ వైద్యపరంగా నగరంలో పలు మార్పులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించారు. జనవరిలో హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. ఈ మేర కు జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటి ప్రకారం ఎంజీఎం ఆస్పత్రిని ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి పూర్తిగా తరలించాలని నిర్ణయిం చారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని వేరేచోటుకు తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఎంజీఎంను అప్‌గ్రేడ్ చేయనున్నారు. కేంద్ర కారాగారాన్ని తరలించిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ ప్రాంగణం విస్తీర్ణం పెరగనుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా నిబంధనల కాలేజీ క్యాంపస్‌లోనే 1200 పడకల సామర్థ్యంతో భవనాలు నిర్మిస్తారు. ఇందులో ప్రధానమంత్రి స్వస్థా సురక్షా యోజనా పథకం ఫేజ్-3 కింద 300 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారు. దీంతో ఎంజీ ఎం పడకల సామర్థ్యం 1500కు చేరుకుంటుంది.
మల్టీ, సూపర్ విభాగాలు
1500 పడకలు కలిగిన ఎంజీఎంలో మల్టీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు కొనసాగుతాయి. మల్టీ స్పెషాలిటీ విభాగంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పాథాలజీ, ఈఎన్‌టీ, మైక్రో బయాలజీ, పాథాలజీ, బయోమెడికల్, శస్త్ర చికిత్స విభాగాలు కొనసాగుతా యి. సూపర్ స్పెషాలిటీ విభాగంలో కార్డియాలజీ, అంకాలజీ(క్యాన్సర్), గ్యాస్ట్రో, ఎండ్రోకైనాలజీ, న్యూ రో, ప్లాస్టిక్ సర్జన్‌లతో పాటు ఇంటెన్సివ్ కార్డియోథోరియాసిక్, కార్డియో థోరియాసిక్ సర్జన్ విభాగాలు కొనసాగుతాయి. ప్రస్తుతం ఎంజీఎంలో కొన్ని సూప ర్ స్పెషాలిటీ విభాగాలే కొనసాగుతున్నారుు.
మాతా శిశు ఆస్పత్రి
ఎంజీఎం ఆస్పత్రిని కాకతీయ మెడికల్ కాలేజీలో నిర్మించబోయే నూతన భవనంలోకి తరలించిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో మాతా శిశు ఆస్పత్రి(ఎంసీహెచ్ , మెటర్నల్ చైల్డ్ హెల్త్)గా మారుస్తారు. ఇందులో గైనకాలజీ (స్త్రీల సంబంధిత ఆరోగ్య సమస్యల విభాగం) పీడియాట్రిక్ (పిల్లలు) విభాగాలు కొనసాగుతాయి. పీడియాట్రిక్ విభాగంలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్(నవజాత శిశువు) యూనిట్లు ఉంటాయి. అంతేకాకుండా వేర్వేరుగా వంద పడకల సామర్థ్యం కలిగిన హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ సీకేఎం(చందా కాంతాయ్య మెమోరియల్) ఆస్పత్రులను ఎంజీఎం భవనాల్లోకి మారుస్తారు. 500కు పైచిలుకు పడకల సామర్థ్యంతో ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాంతీయ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిగా పని చేస్తుంది. దాదాపుగా హైదరాబాద్‌లో ఉన్న నీలోఫర్ ఆస్పత్రి స్థాయిలో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
జనరల్ ఆస్పత్రులు
హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి, సీకేఎం ఆస్పత్రులను ఎంజీఎంలోకి మార్చిన తర్వాత ఈ భవనాల్లో సాధారణ ఆస్పత్రులను కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇక్కడున్న వంద పడకల సామర్థ్యాన్ని రెండు వందల పడకలకు పెంచుతారు. ఇవి వరంగల్ తూర్పు, పశ్చిమ ఏరియా ఆస్పత్రులుగా సేవలు అందిస్తాయి. ఇక్కడ సాధారణ వైద్యసేవల ద్వారా సానుకూల ఫలితం కనిపించని రోగులను ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. హన్మకొండ, సీకేఎం ఆస్పత్రులు జనరల్ ఆస్పత్రులుగా మారడం వల్ల ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై పని భారం తగ్గుతుంది.
‘ఆరోగ్య వరం’గల్
Published Thu, Mar 17 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement