బడ్జెట్ కసరత్తు షురూ..!
- నేటి నుంచి మంత్రులతో ఆర్థికశాఖ భేటీలు
- అధికారులతో సమావేశమైన ఆర్థిక మంత్రి ఈటెల
- 2015-16 బడ్జెట్‌కు ప్రతిపాదనలపై సమీక్ష
- గత బడ్జెట్ అంచనాలు, ఆదాయ వ్యయాలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా ముసాయిదా బడ్జెట్ తయారీకి ఆర్థిక శాఖ సన్నద్ధమైంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నుం చి దాదాపు వారం రోజుల పాటు అన్ని శాఖల మంత్రులతో చర్చలు జరపనున్నారు. ఏయే పథకాలకు ప్రాధాన్యమివ్వాలి, ఏయే రంగాలకు ఎంత మేరకు నిధులు కేటాయించాలనే అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఆదాయం పెంచుకునే మార్గాలపై సమాలోచనలు జరపనున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2015-16 సంవత్సరపు బడ్జెట్ మొత్తం ఎంత ఉండాలి, ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. అన్ని విభాగాల నుంచి ఇప్పటికే అందిన ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. తొలి ఏడాది నిధులు ఖర్చు చేయని శాఖలకు ఈసారి కేటాయిం పులు తగ్గించాలని.. అప్రాధాన్య పద్దులకు కోత వేసి, అదే విభాగంలో ప్రాధాన్యత ఉన్న అంశాలకు నిధులు కేటాయించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నందున బడ్జెట్ కేటాయిం పుల్లో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
గతం కంటే ఎక్కువ..
నాలుగు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,00,637 కోట్ల తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అది కేవలం పది నెలల బడ్జెట్ కావటంతో... 2015-16 పూర్తిస్థాయి బడ్జెట్ అంతకంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ఈసారి భారీ బడ్జెట్ ప్రవేశపెడతామని ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు కూడా. అయితే గత బడ్జెట్ అంచనాలన్నీ తలకిందులవటం.. నెలనెలా వచ్చిన ఆదాయం ప్రణాళికేతర ఖర్చులకే సరిపోవటంతో నిధుల లేమితో సర్కారు కొట్టుమిట్టాడింది. దీంతో వచ్చే బడ్జెట్ తయారీలో గొప్పలకు పోవద్దని ఆర్థిక శాఖ నిపుణులు సూచించిన నేపథ్యంలో మంత్రులతో జరిగే సమావేశాలు కీలకంగా మారనున్నాయి.