సకుటుంబ సమేతంగా సందర్శిద్దాం..చూసొద్ధాం
ఏడుకొండల మధ్య ఆనంద నిలయంలో నిత్యం భక్తుల్ని కటాక్షించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత చూడాల్సిన రమణీయ ప్రదేశాలెన్నో.. ఆ దేవదేవుని దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచే కాక దేశవిదేశాల నుంచి సగటున రోజుకి 50వేల మందికి పైగా భక్తులు తిరుపతికి వస్తారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతిలోనే యాత్రికులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే పర్యాటక స్థలాలు, వాటి ప్రత్యేకత మీకోసం...
- తిరుపతి తుడా
ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం
పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహనను, ఆసక్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిందే తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్. ఫిజిక్స్‌కు, జియోగ్రఫీలకు సంబంధించి అరుదైన పరికరాలు, కళారూపాలు, పిల్లల ఆటస్థలం ఇక్కడ ఉన్నాయి. పార్కులు అలిపిరి టోల్‌గేట్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే సైన్స్ సెంటర్ ఉంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటలకు వరకు ప్రవేశం ఉంటుంది. ప్రవేశ రుసుం పిల్లలకు రూ.5 పెద్దలకు రూ.10.
హస్తకళారామం
ఆకర్షణీయమైన పార్కులు, ఔరా అనిపించే మైనపు బొమ్మలు, గ్రామీణ వాతావరణాన్ని తలపించే అందమైన పూరి గుడిసెలు, హస్తకళా ఖండాలు, ఫంక్షన్‌హాళ్లు ఇంకా బోటింగ్ లాంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. తిరుపతి-తిరుచానూరు మార్గంలో ఈ హస్తకళారామం ఉంది. ప్రవేశ రుసుం పిల్లలకు రూ.10 పెద్దలకు రూ.20.
రామచంద్ర పుష్కరిణి
తిరుపతి టౌన్‌క్లబ్ సెంటర్ నుంచి అలిపిరి మార్గంలో ఉన్న రామచంద్ర పుష్కరిణి ప్రకృతి ప్రేమికులకు చక్కటి సందర్శక ప్రాంతం. రంగురంగుల పూల తోటలు, సాయంత్రం వేళ్లలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇక్కడి ప్రత్యేకత.
మున్సిపల్ పార్క్
తిరుమల బైపాస్‌రోడ్డులో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ పార్క్‌లో ప్రకృతితో పాటు ఆటలకు కూడా నిలయంగా మారింది. వాటర్ ఫౌంటెయిన్, పిల్లల ఆడుకునేందకు ప్రత్యేక స్థలం, ద్యానంలో ఉండే శివుడి విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటాయి. అంతేకాక స్కేటింగ్ నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షకులు ఇక్కడ ఉన్నారు. ప్రవేశ రుసుం రూ.5.
జంతు ప్రదర్శనశాల
అలిపిరి నుంచి కేవలం 6కి.మీల దూరంలో ఉన్న శ్రీవేంక టేశ్వర జంతు ప్రదర్శనశాల పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు 2000 ఎకరాలకు పైగా విస్తీర్ణం, 1200 పైగా జంతుజాలం, అణువణువునా హరితవర్ణ శోభాయమానంగా కనిపించే ప్రకృతి, సేద తీర్చే పెద్ద చెట్లు ఈ జూ ప్రత్యేకత. కుటుంబ సమేతంగా వె ళ్లేందుకు ఇదొక చక్కటి పర్యాటక స్థలం. ప్రవేశ రుసం పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.10.
అలివేలు మంగమ్మ ఆలయం
శ్రీనివాసుని పట్టపురాణి తిరుచానూరులో కొలువై ఉన్నారు. శ్రీవారిని దర్శించుకునే ముందు అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయం. అమ్మవారి ఆలయం చారిత్రకంగా ప్రసిద్ధికెక్కింది.
సుందర కపిలతీర్థం
శ్రీవారి పాదాల చెంత, సప్తగిరుల శిలాతోరణం వద్ద ఏకైక శైవాలయంగా కపిలతీర్థం విరాజిల్లుతోంది. కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తారు. తీర్థంలో నిత్యం భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. వర్షం కురిసినపుడు ఇక్కడి జలపాతం ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. పక్కనే ఉన్న జంగిల్ బుక్ కూడా అడవి అందాలతో ఆకట్టుకుంటోంది.
శ్రీగోవిందరాజస్వామి ఆలయం
శ్రీనివాసుని అన్నగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి నడుబొడ్డున విశాల ప్రదేశంలో నిర్మితమయింది. ఈ ఆలయం రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ఉంటుంది. స్వామి గోపురం తిరుపతి నగరానికే తలమానికంగా ఉంటుంది. ఇక్కడ ఆలయం ముందున్న అంగళ్లు షాపింగ్‌కు బాగా ఫేమస్.
చంద్రగిరి కోట
దక్షిణ భారతదేశ రాజులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు. తిరుపతికి 12 కిమీల దూరంలో ఉన్న చంద్రగిరిలో ఆయన ఏలిన కోట ఉంది. రాజుల కాలం నాటి వస్తువులు, చారిత్రక కట్టడం, రాణి బంగ్లా, కొలను, చైనావాల్‌ను తలపించేలా కోట గోడ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అరుదైన దేవతా మూర్తుల విగ్రహాలు, వస్తువులు, నమూనాలు ఉన్నాయి. సాయంత్రం నిర్వహించే మ్యూజికల్ లైటింగ్ షో కోటలో ప్రత్యేకం. ఇందుకు ప్రవేశ రుసుం పిల్లలకు 25, పెద్దలకు రూ.35.
ఎస్వీ మ్యూజియం
శ్రీగోవిందరాజ స్వామి ఉత్తర మాడ వీధిలో ఎస్వీ మ్యూజియం టీటీడీ పర్యవేక్షణలో నడుస్తోంది. చారిత్రక వస్తువులు, రాజులు వినియోగించిన ఖడ్గాలు, కళా ఖండాలు, పలు నమూనాలు, విగ్రహాలు చూడవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశం ఉంటుంది.
శ్రీకోదండ రామాలయం
శ్రీకోదండరామస్వామి సతీ సోదర సమేతంగా నిలువెత్తు దర్శమిస్తుంటారు. విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. తిరుమలకు నడక దారిన వెళ్లేవారు కోదండరాముణ్ణి దర్శంచుకోవడం పరిపాటి.
శ్రీనివాస మంగాపురం
ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి- పీలేరు మార్గంలో ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకల్యాణ వెంకన్నకు నిత్యం ఉత్సవాలు జరుగుతుంటాయి. పురాతనమైన ఆలయాల్లో ఇదీ ఒకటి. ఈ పుణ్యక్షేత్రం తిరుపతికి 14 కిమీల దూరంలో ఉంది.