science
-
సైన్స్ వర్క్ ఫోర్స్ పెరిగేదెలా?
సాక్షి, అమరావతి : భారతదేశంలో సైన్స్ వర్క్ ఫోర్స్ తక్కువగా ఉన్నట్టు తేలింది. లింగ వివక్ష, భౌగోళిక పరిమితులు, చేసిన కోర్సుకు సరిపోయే పని లేకపోవడం వంటి కారణాలతో దేశ సైంటిఫిక్ టాలెంట్ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లేదు. దాంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి కొరత ఉండటంతో ఆయా ఖాళీలు అలాగే ఉన్నాయని గుర్తించారు. ఇటీవల ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నైపుణ్యం గలవారి సరఫరా, ఉద్యోగ డిమాండ్ల మధ్య అసమతుల్యత, లింగ బేధం మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో మహిళలు చాలా మంది తాము ఇష్టపడి ఎంచుకున్న రంగాల్లోనూ పూర్తి కాలం పని చేయకుండానే వెనుదిరుగుతున్నట్టు తేలింది.కెరీర్ వదిలేసిన తర్వాత రీ–ఎంట్రీపై సరైన అవగాహన లేకపోవడంతో గ్యాప్ ఉత్పన్నమవుతోందని నివేదిక పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు చేసి, శిక్షణ పొందిన చాలా మంది తమ నైపుణ్యానికి సరిపడే ఉద్యోగాలు చేయడం లేదని ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో 52 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో సగం మందికి పైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారని, అయితే పనిచేసే చోట వయసు ఆధారిత పక్షపాతం చూపడంతో 40 సంవత్సరాలకే 80 శాతం మంది కెరీర్‌ను వదులుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. దేశంలో పరిశోధన– అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగంలో సరఫరా డిమాండ్ మధ్య కూడా ఇదే వ్యత్యాసం కనిపిస్తోందని, నిపుణులు పెరుగుతున్నప్పటికీ అవకాశాలు తక్కువగా ఉన్నట్టు ఐఐటీ రోపాపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేహా సర్దానా పేర్కొన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమ అవసరాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు. స్కిల్ ఉన్నా రీ ఎంట్రీపై అవగాహన లేమి సైన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా లేవని, భౌగోళికంగా అసమానతలు ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. ఇది చాలా మంది నిపుణుల ఎంపికలను పరిమితం చేస్తోందని, ఆర్థిక లేదా కుటుంబ కారణాలతో మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారని గుర్తించారు. దీంతో నైపుణ్యం గల సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుల సేవలను పెద్ద మొత్తంలో ఉపయోగించుకోలేకపోతున్నారు. కెరీర్లో విరామం తీసుకున్న నిపుణులకు అందుబాటులో ఉన్న రీ–ఎంట్రీ స్కీమ్‌లు, సపోర్ట్ ప్రోగ్రామ్‌లపై కూడా అవగాహన లేదని తేల్చారు.ఐఐటీ–బొంబాయిలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాజీ సీఈవో పోయిని భట్ మాట్లాడుతూ.. వర్క్‌ఫోర్స్‌లోకి తిరిగి ప్రవేశించే మహిళలకు కొన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పని చేయించుకుంటున్న సంస్థలు లేదా కంపెనీలు మహిళలకు చైల్డ్ కేర్ సపోర్ట్ ఇవ్వాలని, పనిలో ఫ్లెక్సిబుల్ అవర్స్‌ని కల్పించాలన్నారు. ఇది నైపుణ్యం గల మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ కెరీర్‌ను కొనసాగించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మహిళా శాస్త్రవేత్తల రీ ఎంట్రీకి ‘వైజ్ కిరణ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా, దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదని సర్వే వెల్లడించింది. ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ ⇒ భారతదేశంలో పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగంలో పనిచేసే వర్క్‌ఫోర్స్ ప్రపంచ సగటు కంటే చాల తక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది. ఈ రంగంలో ప్రపంచ సగటు ప్రతి పది లక్షల మందిలో 1,198 మంది పని చేస్తుండగా, భారత్‌లో మాత్రం 255 మందే ఉన్నట్టు ప్రకటించింది. ⇒ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం 2024 నివేదిక ప్రకారం భారత్‌లో జెండర్ గ్యాప్ గతేడాది కంటే పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో 146 దేశాల్లో చేసిన సర్వే ప్రకారం 2023లో ప్రపంచంలో భారత్ 127 స్థానంలో ఉండగా, గతేడాది ఈ ర్యాంకు 129కి చేరింది. ⇒ ర్యాంకింగ్‌లో మాల్దీవులు, పాకిస్థాన్ కంటే భారత్ కాస్త ముందుంది. ఈ గ్యాప్ తగ్గించాలంటే సౌకర్యవంతమైన పని ప్రదేశం, పార్ట్–టైమ్ అవకాశాలు, రిమోట్ విధానంలో పని చేసే అవకాశం కల్పించాలని శివ్ నాడార్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ రూపమంజరి ఘోష్ తెలిపారు. ఈ విధానం ద్వారా మరింత మంది మహిళలు సైన్స్ వర్క్ ఫోర్స్‌లోకి వచ్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. వర్క్‌ఫోర్స్ నుంచి విరామం తీసుకుని, తిరిగి పనిలోకి వచ్చే మహిళలపై చిన్నచూపు ఉందని, ఇది తొలగి పోవాలన్నారు. ⇒ విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం.. నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ పెంచవచ్చని ఘోష్ చెప్పారు. అలాగే, ఉద్యోగాల పదోన్నతుల్లో ‘బయోలాజికల్ ఏజ్’ కంటే ‘విద్యా వయస్సు’ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా నైపుణ్యం గల సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. -
సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోని పరిణామ సత్యం
ఒక అక్షరం, ఒక ఆలోచన, ఒక పుస్తకం సమాజాన్ని ప్రభావితం చేస్తాయా? ఆలోచనలు అనంతం. అక్షర శక్తి అనల్పం. ఇవి రెండూ ఏకమై పుస్తక రూపం తీసుకుంటే అది చూపే ప్రభావానికి ఎల్లలు ఉండవు. ఛార్లెస్ డార్విన్ 1859 నవంబర్ 24న వెలువరించిన ‘జాతుల పుట్టుక’ (ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్) అనే గ్రంథం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. వచ్చిన తొలిరోజే 1,250 కాపీలు అమ్ముడు పోయాయంటే ఆ గ్రంథం సృష్టించిన సంచలనం ఎంతటిదో అర్థం చేసు కోవచ్చు. అంతగా సంచలనాత్మకం కావటానికి అందులో ఉన్నదేమిటి? డార్విన్ ఆ పుస్తకంలో ప్రతిపాదించిన ‘జీవ పరిణామ సిద్ధాంతం’! అది నూతన భావ విస్ఫోటనానికి నాంది పలికింది. నాటి వరకూ సమాజంలో పాతుకుపోయిన సృష్టివాద నమ్మకాలకు భిన్నంగా కొత్త అవగా హనకూ, ఆలోచనలకూ పట్టం కట్టడం. అందుకే పరిణామ సిద్ధాంతాన్ని ఎర్న్స్ట్ మయర్ అనే శాస్త్రవేత్త నూతన పథ నిర్దేశినిగా పేర్కొన్నాడు.ఇంతకూ ఆ సిద్ధాంతం ఏం చెప్పింది? జీవులు... దగ్గర లక్షణాలున్న వాటి పూర్వీకులైన జీవుల నుండి పరిణామం చెందాయని. ఏ జీవీ ఉన్నది ఉన్నట్లుగా సృష్టి కాలేదనీ, ప్రకృతి పరిస్థితుల నెదుర్కొని దీర్ఘకాలంలో నేడు మనం చూస్తున్న జీవులు, జీవ వైవిధ్యం రూపుదిద్దుకున్నాయనీ. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ భూమిపై నివసించే ప్రతి జీవీ ప్రకృతి చెక్కిన శిల్పమే! ఇది ఒక భౌతిక ప్రక్రియ. ఇందులో ఏ అతీత శక్తుల ప్రమేయం లేదని ఆధారాలతో మరీ వివరించాడు డార్విన్. ఇదే సృష్టివాదులకు కంటగింపుగా మారింది. మనిషితో సహా అన్ని రకాల జంతు, వృక్ష జాతులనూ ఇప్పుడు ఉన్నట్లుగానే దేవుడు సృష్టి చేశాడనీ, అవి మార్పు చెందటం కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని దాదాపు అన్ని మతాల నమ్మకం. ఆ నమ్మకానికి చేటు తెస్తుందనుకున్న ఏ సిద్ధాంతాన్నైనా, ఎన్ని నిరూపణలు చూపినా అంగీకరించేందుకు సృష్టివాదులు ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఆదిలోనే మతం నుండి వ్యతిరేకతను, దాడిని ఎదుర్కోవలసి వచ్చింది.అయినా ఈ సిద్ధాంతం 1930 నాటికి శాస్త్ర ప్రపంచ ఆమోదం పొందటం గమనార్హం. డార్విన్ చూపిన నిదర్శనాలు, ఇబ్బడిముబ్బడిగా సేకరించిన నమూనాలు, జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదకుల్లో ఒకరైన ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలస్ మలయా దీవుల్లో కనిపెట్టిన అనేక జంతుజాతుల విశేషాలు సృష్టివాదుల నోరు కట్టేశాయి. డార్విన్ కాలం నాటి కంటే తరువాతి కాలంలోనే పరిణామాన్ని బలపరిచే ఎన్నో రుజువులు బయటపడినాయి. జీవించి ఉన్న జాతులను, గతించిన జాతులతో అనుసంధానించే అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకటం డార్విన్ సిద్ధాంతాన్ని మరింత బలపరిచాయి. చదవండి: ఆదివాసులకు చేయూతనిద్దాం!శిలాజాలే కావు నేటి ఆధునిక పరిశోధనలు, జీనోమ్ సమాచారం సైతం డార్విన్ పరిణామ సిద్ధాంత విశిష్టతను, సత్యాన్ని చాటడం విశేషం. ఇంతటి ప్రభావశీలమైన జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెల్లడించిన గ్రంథం వెలువడిన నవంబర్ 24వ తేదీని ‘అంతర్జాతీయ జీవ పరిణామ దినం’గా ప్రపంచం జరుపుకొంటోంది. పరిణామ విశ్వజనీనతనూ, సత్యాన్నీ ప్రజల ముందుంచే పనిని సైన్సు ప్రచార సంస్థలు భుజానికెత్తుకుని పరిణామ దినోత్సవాన్ని జరుపుతున్నాయి.– ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్, జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు(నవంబర్ 24న అంతర్జాతీయ జీవ పరిణామ దినోత్సవం) -
పరిశోధనల సులభతరం ఇలాగా!
ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు ఇటీవల ఓ నోటీసు వచ్చింది. గడచిన ఐదేళ్ల కాలంలో పరిశోధనల కోసం అందుకున్న నిధులపై జీఎస్టీ ఎందుకు చెల్లించలేదని అందులో ప్రశ్నించారు. జీఎస్టీ సకాలంలో చెల్లించనందుకు జరిమానా, వడ్డీ కలిపి రూ.120 కోట్లు కట్టమని కూడా ఆదేశించారు. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. ప్రతిష్ఠాత్మక సైన్సు అవార్డులను కూడా నగదు బహుమతి లేకుండానే అందిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాలి. ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు వచ్చిన జీఎస్టీ చెల్లింపుల నోటీసుపై శాస్త్రవేత్తలు స్పందించలేదు కానీ, ‘ఇన్ఫోసిస్’ మాజీ సీఎఫ్‌వో, ఇన్వెస్టర్ టీవీ మోహన్ దాస్ పై మాత్రం దీన్ని ‘అతి నీచమైన పన్ను తీవ్రవాదం’ అని వ్యాఖ్యానించారు.నెల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిశోధనల కోసం ఉపయోగించే రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 150 శాతానికి పెంచడం... అకస్మాత్తుగా పెరిగిన ప్రాజెక్టు ఖర్చులతో శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలు బెంబేలెత్తడం తెలిసిన విష యమే. పరిశోధనలకు అవసరమైన ఎంజైములు, రీజెంట్లు చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. కస్టమ్స్ డ్యూటీ పెంచ డమంటే వాటిని దాదాపుగా అడ్డుకోవడమే. శాస్త్రవేత్తల నిరసనల నేప థ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. సృజనాత్మక ఆలోచనలు వృద్ధిచెందాలంటే, ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’(ఆర్ అండ్ డీ)కి మరిన్ని నిధులు ఇవ్వాల్సి ఉండగా... కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.జీఎస్టీ నోటీసులు, కస్టమ్స్ డ్యూటీ పెంపులు ఏవో చెదురు ముదురు సంఘటనలు కావచ్చునని అనుకునేందుకూ అవకాశం లేదు. ఉన్నత విద్యా రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచడం, తాజాగా నిధు లపై జీఎస్టీ నోటీసులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ రెండు నిర్ణయాల వల్ల పరికరాలను సమకూర్చుకోవడం, పరిశోధనల నిర్వహణ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఈ విషయంపై ఆందో ళనతోనే కేంద్ర ప్రభుత్వానికి శాస్త్ర అంశాల్లో సలహా ఇచ్చే విభాగంకేంద్రానికి ఒక నోట్‌ను పంపింది. జీఎస్టీ వసూళ్లు, పన్నుల పెంపుల ప్రభావం నుంచి ప్రైవేట్ సంస్థలు సర్దుకోవచ్చుననీ, ప్రభుత్వ సంస్థల్లో ఇందుకు అవకాశాలు తక్కువనీ ఈ నోట్లో స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నోట్‌పై స్పందిస్తూ, సంస్థలకు కేటాయించే నిధు లను ఎక్కువ చేస్తున్నాము కాబట్టి జీఎస్టీతో నష్టమేమీ ఉండదని నమ్మబలికే ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితిని సరిచేసేందుకుచేసింది మాత్రం శూన్యం. పరిశోధనలకు ఊతం ఇలా కాదు...ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా పరిశోధనలు చేసుకునే వాతావరణం ఉన్నప్పుడు కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. తగినన్ని నిధులు సమకూర్చడం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.... పన్నులు, నిబంధనల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఈ అన్ని అంశాలు భారత్‌లో ఇప్పుడు కొరవడ్డాయనే చెప్పాలి. నిధుల విషయాన్ని చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కంటే తక్కువ. అన్ని రకాల ప్రాజెక్టులకు ఒకే ఛత్రం కింద నిధులిస్తామని ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ (ఏఎన్ ఆర్ఎఫ్) ఒకటి ఏర్పాటు చేసేందుకు ఐదేళ్లుగా ప్రయత్నాలు సా...గుతూనే ఉన్నాయి. మరోవైపు పరిశోధనలకు తాము నిధులు ఎక్కువ చేశామని ప్రభుత్వం బాకా ఊదుతూనే ఉంది. ఐదేళ్ల కాలంలో కొత్త సంస్థ ద్వారా 50 వేల కోట్ల రూపాయలు ఇస్తామని పదే పదే సంకల్పం చెప్పుకుంటోంది. ఈ మొత్తం కూడా వట్టి మాటే. తామిచ్చేది 30 శాతమనీ, మిగిలిన 70 శాతాన్ని ఆయా సంస్థలు ప్రైవేట్ రంగంలో సేకరించుకోవాలనీ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఏడాదికి రూ.30,000 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ప్రస్తుత కేటాయింపుల కంటే చాలా తక్కువ. 2024–25లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.16,628 కోట్లు కేటాయించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏఎన్ ఆర్ఎఫ్ ఏర్పాటు ఆలోచన వెనుక ‘ఆర్ అండ్ డీ’ బరువును తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్పష్టం అవుతోంది. అదెలా చేయాలో మాత్ర స్పష్టత కనిపించడం లేదు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. నిధులు పొందేందుకు, పంపిణీ, స్కాలర్షిప్, ఫెలోషిప్‌ల నిర్ధారణ వంటి అనేక అంశాల్లో అధికారుల జోక్యం ఉంటోంది. మేకిన్ ఇండియా వంటి వాటికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన ఇంకో సమస్య. వీటన్నింటి మధ్య తాము పరిశోధనలపై దృష్టి ఎలాకేంద్రీకరించగలమని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త ఒకరు ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశోధనలకు అడ్డంపడే ఇలాంటి విషయాలు ఇంకా అనేకమున్నాయి. అంతర్జా తీయ ప్రయాణాలకు అందించే నిధులపై నియంత్రణ వాటిల్లో ఒకటి. కీలకమైన శాస్త్ర అంశాల్లో పలు దేశాలు కలిసి పని చేయడం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో కాన్ఫరెన్సులకు వెళ్లేందుకు ఇలాంటి వంకలు పెట్టడం గమనార్హం.సైన్ ్స వ్యవహారాల్లో సౌలభ్యమెంత?గత ఏడాది ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సింగ్ సైన్ ్స అండ్ టెక్నాలజీ (ఫాస్ట్) ఒక సర్వే చేసింది. టాప్–10 పరిశోధన సంస్థల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రశ్నించి దేశంలో పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం ఎలా ఉందో అంచనా కట్టింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాదిరిగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్ ్స’ అన్నమాట. 2015లో ప్రధాని నరేంద్ర మోదీనే ఈ పదాన్ని పరిచయం చేశారు. ‘ఫాస్ట్’ చేసిన సర్వేలో స్థూలంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్ బాగుందని ఆరు శాతం మంది కితాబిచ్చారు. నిధులు పొందే విషయంలో మాత్రం యావరేజ్ కంటే తక్కువని తేల్చారు. నిధులిచ్చే సంస్థలు గ్రాంట్లు ఇచ్చేందుకు తీసుకునే సమయం, నిధుల మొత్తం, ప్రాజెక్టు ఉద్దేశం వంటి అంశాల ఆధారంగా పనిచేస్తున్నాయని వీరు చెప్పారు. ఇకఅందించిన నిధులను స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఉందా? విదే శాల్లో జరిగే సదస్సులకు వెళ్లగలుగుతున్నారా? పరిశోధనలకు అవస రమైన వనరులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అన్న ప్రశ్న లకు శాస్త్రవేత్తల సమాధానం ‘అధ్వాన్నం’ అని!ప్రతిభను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రోత్సహించడం, ‘ఆర్ అండ్ డీ’ వాతావరణం బాగుందని అనేందుకు ఇంకో గుర్తు. కానీ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ఇస్తున్న ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా ‘విజ్ఞాన్ పురస్కార్’ పేరిట నగదు బహుమతి లేకుండానే అందిస్తు న్నారు. 2022లో సైన్ ్స అవార్డులను నిలిపివేసిన ప్రభుత్వం నోబెల్ స్థాయిలో ‘విజ్ఞాన రత్న’ అవార్డు ఒకదాన్ని అందిస్తామని చెప్పింది. గత నెలలో ఈ అవార్డును ప్రకటించారు కూడా. ఇందులోనూ నగదు ప్రస్తావన లేదు. ఆసక్తికరంగా ఉత్తర ప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు అందించే రాష్ట్ర స్థాయి అవార్డులైన ‘విజ్ఞాన్ గౌరవ్’, ‘విజ్ఞాన్ రత్న’ (జాతీయ అవార్డుకు ముందే అమల్లో ఉన్న రాష్ట్ర స్థాయి అవార్డు)లకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు!ఒకవైపు భారత్‌లో సైన్సును సులభతరం చేయడం తగ్గిపోతూండగా, చైనా మున్ముందుకు దూసుకెళుతోంది. భారత్ తన జీడీపీలో 0.66 శాతం పరిశోధనలకు వెచ్చిస్తూండగా, చైనా 2.4 శాతం ఖర్చు పెడుతోంది. చైనాలోని పెకింగ్, ట్సింగ్హువా యూనివర్సిటీల పరి శోధన బడ్జెట్ మనం విద్యకు పెడుతున్న దాని కంటే ఎక్కువ ఉండటం చెప్పుకోవాల్సిన అంశం. ఈ విషయాన్ని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్ రావు ఇటీవలే ఒక సమావేశంలో తెలిపారు. పరిశోధనల నిధుల విషయంలో యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలను పస్తు పెట్టడం అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చాలన్న ఆకాంక్షను నెరవేర్చేది ఎంతమాత్రం కాదన్నది గుర్తించాలి.- రచయిత సైన్ ్స అంశాల వ్యాఖ్యాత- (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) దినేశ్ సి. శర్మ -
పొంచివున్న ‘కారింగ్టన్ ఈవెంట్’.. మానవాళికి పెను ముప్పు?
ఈ అనంత విశ్వంలో ఊహకందని ఘటనలు అనేకం జరుగుతుంటాయి. ఇవి మనల్ని ఆలోచింపజేయడమే కాకుండా ఆందోళనకు కూడా గురిచేస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా విమానాలన్నీ రద్దయితే? శాటిలైట్లు పనిచేయడం మాసేసి, ఇంటర్నెట్ ఆగిపోతే? అటు ఫోన్లు మూగబోయి.. ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. వినడానికే ఆందోళన కలిగించే ఇటువంటి ఘటన 150 ఏళ్ల క్రితం సంభవించింది. దీనిని కారింగ్టన్ ఈవెంట్ అని పిలుస్తారు. కారింగ్టన్ ఈవెంట్ అంటే..1859, సెప్టెంబరు 2న కారింగ్టన్ ఈవెంట్‌ను నాటి శాస్త్రవేత్తలు గుర్తించారు. లండన్‌లోని రెడ్ హిల్‌లో ఉంటున్న శాస్త్రవేత్తలు రిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్, అతని సహోద్యోగి రిచర్డ్ హోడ్గ్సన్లు సూర్యునిపై ఉన్న చీకటి మచ్చల సమూహం(సన్ స్పాట్)పై అధ్యయనం చేస్తుండగా వారు సూర్యునిపై సంభవించిన భారీ పేలుడును గమనించారు. దీనినే కారింగ్టన్ ఈవెంట్‌గా పేర్కొన్నారు. ఈ పేలుడు ప్రభావం భూమికున్న ధ్రువ ప్రాంతాలలో కనిపించింది. ఇదే తొలి సౌర తుఫానుగా నమోదయ్యింది.భారీ పేలుళ్ల గుర్తింపురిచర్డ్ క్రిస్టోఫర్ కారింగ్టన్ సూర్యునిపై ఐదు నిమిషాల పాటు సంవించిన భారీ పేలుళ్లను గమనించారు. ఈ భారీ సౌర తుఫానును గమనించిన ఏడు రోజుల తర్వాత లండన్‌లోని క్యూ అబ్జర్వేటరీలోని అయస్కాంత సెన్సార్లు భూ అయస్కాంత క్షేత్రంలో గణనీయమైన మార్పును గుర్తించాయి. ఈ పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత భూమికి చెందిన మాగ్నెటోస్పియర్ చుట్టూ కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) విక్షేపం చెందడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.కుప్పకూలనున్న కమ్యూనికేషన్ వ్యవస్థ?1859లో సంభవించిన కారింగ్టన్ ఈవెంట్ సమయంలో ప్రపంచంలో భారీ విద్యుత్తు వ్యవస్థ, ఉపగ్రహాలు మొదలైనవి లేవు. అందుకే నాడు భారీ విధ్వంసం కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ స్థాయి సౌర తుఫాను సంభవిస్తే, ప్రపంచంలో భారీ విపత్తులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో విద్యుత్తు అంతరాయాలు ఏర్పడవచ్చు. భూమి చుట్టూ తిరుగుతున్న వేలాది ఉపగ్రహాలు స్థంభించిపోవచ్చు. కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ చాలా కాలం పాటు నిలిచిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో..కాగా 2003 అక్టోబరులో సంభవించిన సౌర తుఫాను దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ వ్యవస్థలను, విద్యుత్ సౌకర్యాలను అస్తవ్యస్తం చేసింది. దీనికి ‘హాలోవీన్ సౌర తుఫాను’అని నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫానులు భూమిని ఢీకొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌర తుఫానుల కారణంగా భూ అయస్కాంత క్షేత్రాలలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అది బ్లాక్అవుట్లకు దారితీసి, విద్యుత్ వ్యవస్థలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే స్పేస్‌క్రాఫ్టులు అధిక రేడియేషన్ ముప్పును ఎదుర్కొంటాయి.భూమికి పొంచివున్న ప్రమాదం?రెండు దశాబ్దాల తర్వాత 2024 మే 10న అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకింది. ఈ సౌర తుఫానును తొలుత తీవ్రమైంది కాదని భావించారు. కానీ, తర్వాత అత్యంత శక్తివంతమైందిగా అంచనా వేశారు. సూర్యుడి సన్‌స్పాట్ ఏఆర్ 3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు చేశారు. -
పరిశోధనల్లో చైనాతో పోటీ పడగలమా?
అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక జర్నల్స్ అయిన ‘నేచర్’, ‘ఎకనమిస్ట్’లు శాస్త్రరంగంలో చైనా అత్యంత శక్తిమంతంగా ఎదుగుతోందని ప్రకటించాయి. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ కొనసాగిన విషయం తెలిసిందే. అణు, అంతరిక్ష, వ్యాక్సిన్ అభివృద్ధి రంగాల్లో భారత్ రాణించిందన్నదీ వాస్తవమే. కానీ చైనా పలు కీలక రంగాల్లో భారత్‌తోపాటు అమెరికా, యూరప్‌లను సైతం అధిగమించింది. అంతరిక్ష రంగంలో చైనా మన కన్నా కనీసం పదేళ్లు ముందుంది. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ టాప్–10 జాబితాలో భారతీయ పరిశోధన సంస్థలు లేవన్నది గమనార్హం. నిద్రాణంగా ఉన్న భారత్‌కు చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి.ఉన్నత విద్యా రంగంలో భారత్ గతంలో ఎన్నడూ లేని స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైద్యం, పరిశోధన రంగాల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న పరీక్షల పద్ధతి, ప్రామాణికత రెండూ లీకేజీల పుణ్యమా అని ప్రశ్నార్థకంగా మారాయి. నీట్‌తోపాటు భారతీయ విశ్వవిద్యాలయాల్లో, జాతీయ పరిశోధన సంస్థల్లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యింది. పరిశోధన రంగంలో ప్రాథమిక స్థాయిలో చేరే విద్యార్థుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటీల వంటి సంస్థలు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై ఆధారపడుతూంటాయి. పీహెచ్‌డీల్లో ప్రవేశానికి ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. బోధన వృత్తుల్లో స్థిరపడే వారికి కూడా. ఈ పరీక్షలను విశ్వసనీయతతో, సకాలంలో నిర్వహించడం భారతదేశ ఉన్నత విద్య, పరిశోధన రంగాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకపక్క ఈ అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇంకోపక్క అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల్లో చైనా కంటే భారత్ బాగా వెనుకబడిపోతూండటం గమనార్హం. పరిశోధన పత్రాల్లో టాప్ప్రపంచంలో ఒక దేశపు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సత్తాను నిర్ధారించేది ఉన్నత విద్య, పరిశోధన రంగాల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల విస్తృతి ఎంత? అన్నది. ఎంత ఉత్పత్తి అవుతోంది? నాణ్యత ఏమిటి? అన్నది నిర్ధారించేందుకు చాలా మార్గాలున్నాయి. పరిశోధన వ్యాసాల ప్రచురణ, సాధించిన పేటెంట్లు, నోబెల్ వంటి అంతర్జాతీయ అవార్డులు, పారిశ్రామిక రంగానికి బదిలీ అయిన టెక్నాలజీలు, పరిశోధనల ద్వారా సమాజానికి ఒనగూరిన లబ్ధి... ఇలా చాలా మార్గాలున్నాయి. పరిశోధన పత్రాల ప్రచురణే ప్రధాన అంశంగా ఏటా రీసెర్చ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న వారి జాబితాను ‘నేచర్’ జర్నల్ ప్రచురిస్తుంటుంది. ఈ జాబితాలో అత్యున్నత స్థాయి పరిశోధన ఫలితాల ఆధారంగా 500 సంస్థలు ఉంటాయి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 145 అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధన పత్రాలను పరిశీలించి, ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం ఈ జాబితాను సిద్ధం చేస్తుంది. నేచర్ ప్రచురించిన తాజా జాబితాలో దేశాల పరిశోధన సామర్థ్యాల ఆధారంగా అమెరికా, జర్మనీ, యూకే, జపాన్ , ఫ్రాన్స్, కెనడా, దక్షిణ కొరియాలను కూడా అధిగమించి చైనా అగ్రస్థానంలోకి చేరింది. భారత్ తొమ్మిదో స్థానంలో ఉంటూ... టాప్ 10 దేశాల్లో ఒకటిగా ఉన్నామన్న సంతృప్తి మాత్రమే మనకు మిగిల్చింది. భారత్ వంతు గత ఏడాది చైనా వంతు కంటే ఎక్కువ కావడం కూడా గమనార్హం. అయితే సంస్థల స్థాయిలో పరిశోధన పత్రాలను పరిశీలిస్తే నిరాశే మిగులుతుంది. అంతర్జాతీయంగా టాప్ పది పరిశోధన సంస్థల్లో ఏడు చైనావి కావడం... హార్వర్డ్ (రెండో స్థానం), మ్యాక్స్ ప్లాంక్ సొసైటీ (మూడో స్థానం), ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (ఏడో స్థానం) మాత్రమే టాప్ 10లోని ఇతర సంస్థలు కావడం గమనార్హం. మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలు సైతం 14, 15 స్థానాల్లో నిలిచాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అగ్రస్థానంలో ఉంది. టాప్–10లో లేము!టాప్ సంస్థల్లో భారతీయ పరిశోధన సంస్థలు చాలా దిగువన ఉన్నాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 174వ స్థానంలో ఉంటే, ఐఐటీ–బాంబే 247లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 275లో, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 283వ స్థానంలోనూ ఉన్నాయి. హోమీ భాభా నేషనల్ ఇన్ స్టిట్యూట్(296), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా (321), ఐఐటీ–గౌహతి (355), ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్(363), ఐసర్–భోపాల్(379), ఐఐటీ–కాన్పూర్(405), ఐఐటీ–మద్రాస్(407), ఐఐటీ–ఢిల్లీ (428), ఐసర్–పుణె (439), జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్(450), అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నొవేటివ్ రీసెర్చ్(487) ర్యాంకింగ్ కూడా దిగువలోనే ఉండటం గమనార్హం. ర్యాంకింగ్‌ల మాట ఇలా ఉంటే, పరిశోధనలు చేస్తున్న రంగాల విషయం చూద్దాం. భౌతిక, రసాయన, భూ, పర్యావరణ రంగాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా... అమెరికా, యూరప్ రెండూ జీవ, వైద్య శాస్త్రల్లో ముందంజలో ఉన్నాయి. అప్లైడ్ సైన్సెస్ రంగంలోనూ చైనా నుంచే అత్యధిక పరిశోధన పత్రాలు ప్రచురితమవుతుండటం విశేషం.చైనా కొన్ని భారీ సైన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్–అపెర్చర్ రేడియో టెలిస్కోపు అలాంటిదే. కృష్ణ పదార్థం ఉనికిని గుర్తించేందుకు చేపట్టిన భారీ భూగర్భ పరిశోధన ఇంకోటి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలోనూ పలు చైనా సంస్థల్లో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. అంతరిక్ష రంగం విషయానికి వస్తే... చైనా మన దేశం కంటే కనీసం పదేళ్లు ముందుందని చెప్పాలి. 2003లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర జరపడమే కాదు, సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే జాబిల్లి నుంచి రాతి నమూనాలను విజయవంతంగా వెనక్కు తెచ్చిన రోబోటిక్ మిషన్ చేపట్టింది.మన స్పందన ఎలా ఉండాలి?శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చైనా పురోగతికి మనం ఎలా స్పందించాలి? పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్నట్లే వీటిని తిరస్కరించడం సులువైన పని అవుతుంది. జాబితా తయారీలో పలు లోటుపాట్లు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని మార్చదు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఈ జాబితాను ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది కాబట్టి, దాని ఆధారంగా మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. చైనా ఈ ఘనతలన్నీ సాధించేందుకు ఏం చేసింది? ఎక్కడ తప్పటడుగులు వేసిందన్నది నిజాయితీగా పరిశీలించి గుణపాఠాలు నేర్చుకోవాలి. ‘నైన్ లీగ్’ లేదా ‘ప్రాజెక్ట్ 211’లో భాగంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, ప్రపంచస్థాయి పరిశోధన శాలలను అభివృద్ధి చేసేందుకు చైనా భారీగా నిధులు ఖర్చు పెడుతోంది. ఐసర్ వంటి సంస్థల అభివృద్ధికి భారత్ చేసిన ప్రయత్నంతో ఎన్నో లాభాలు వచ్చినా ఈ విషయంలో చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. పరిశోధన పత్రాల ప్రచురణకు చైనా నగదు బహుమతులను ప్రకటించి తప్పు చేసిందని చెప్పాలి. దీనివల్ల అనైతిక పద్ధతులు పెరిగిపోయాయి. భారత్ ఇలాంటి పని చేయకుండా ఉండటం అవసరం. భారత్‌లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో పురోగతిని అడ్డుకుంటున్న కొన్ని సాధారణ విషయాల్లో జీడీపీలో కొంత శాతాన్ని ఈ రంగాలకు కేటాయించకపోవడం కూడా ఉంది. నిధుల పంపిణీ పద్ధతులు, కొత్త పరిశోధన సంస్థల ఏర్పాటు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం వంటివి స్తంభించిపోయి ఉన్నాయి. నేషనల్ సైన్స్ అకాడమీలు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, టెక్నాలజీ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీ వంటివి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెల్ఫీ పాయింట్ల వద్ద విజయోత్సవాలను నిర్వహించడంలో బిజీగా ఉండిపోయాయి. నిద్రాణంగా ఉన్న ఇలాంటి వారందరికీ చైనా పురోగతి ఓ మేలుకొలుపు కావాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు... » ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది. » రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు. » మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు. » ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి. »తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. -
బీట్రూట్ వయాగ్రాలా పనిచేస్తుందా? మార్కెట్లో దొరకడం లేదట!?
బీట్రూట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో సందేహంలేదు. ఈ దుంపకూరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. దీన్ని ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బీట్రూట్ తింటే మూత్రం ఎరుపు లేదా ఊదా రంగులో (బీటూరియా) వస్తుంది. కానీ ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు. బీట్రూట్ వల్లన పెద్దగా దుష్ప్రభావాలు పెద్దగా ఏమీలేవు. అయితే ఇటీవల ఒక న్యూస్ వైరల్‌గా మారింది. స్త్రీ పురుషుల లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంపొందిస్తుందనే వార్త వైరల్ అయింది. వయాగ్రాలా పనిచేస్తుందని వార్తలొచ్చాయి. దీంతో డిమాండ్ బాగా పెరిగింది. ఆస్ట్రేలియన్ సూపర్ మార్కెట్ బీట్రూట్ కొరత ఏర్పడింది. ఒక సమయంలో, ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఈబేలో ఎక్కువ ధరకు అమ్ముడైందిట. అయితే దీనిపై యూకే టీవీ డాక్టర్ మైఖేల్ స్పందించారు.ఇది వయాగ్రాలా పనిచేస్తుందనడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. కాని ఇది సహజ సిద్ధంగా లభించే సూపర్ ఫుడ్ అని ముఖ్యంగా విటమిన్ బీ, సీ, మినరల్స్, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుందన్నారు. అయితే రోమన్లు బీట్రూట్ , దాని రసాన్ని కామోద్దీపనగా ఉపయోగించారని చెబుతారు.బీట్రూట్ తిన్నప్పుడు, బ్యాక్టరియా ఎంజైమ్లతో కూడిన రసాయన ప్రతిచర్యలు బీట్రూట్లోని నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. పలు అధయనాల ప్రకారం ఫుడ్ ఆధారిత నైట్రిక్ ఆక్సైడ్ పురుషులలో లైంగిక జీవితానికి అవసరమైన టెస్టోస్టెరాన్ హార్మోన్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా బీట్రూట్లోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే సామర్థ్యం గుండె, రక్తనాళాల ప్రసరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది దీన్ని జ్యూస్ చేసుకుని తాగినా, కూర చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారికి బీట్ రూట్ ఒక వరం లాంటిది. శరీరానికి అవసరమయిన నీటి శాతాన్ని బీట్రూట్ అందిస్తుంది. -
‘నేను సైన్స్ టాపర్‌ని.. కోవిడ్ వైరస్‌కే వణుకు పుట్టించాను’
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారిన బిహార్‌కు చెందిన పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కోవిడ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘న్యూస్ 24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహమ్మారికి అందరూ భయపడుతుంటే తాను మాత్రం ఆ వైరస్‌నే భయపెట్టానని పేర్కొన్నారు. ‘కోవిడ్ సమయంలో మాస్క్, చేతికి గ్లోవ్స్ ధరించని ఏకైక వ్యక్తని నేనే. నేను సైన్స్ టాపర్‌ని’ అన్నారాయన. బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పప్పు యాదవ్ ప్రపంచ రాజకీయాలు, తత్వాలు, ఆర్థిక వ్యవస్థతో సహా తనకు అన్ని విషయాలు తెలుసునని పేర్కొన్నారు. పప్పు యాదవ్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. ఆయన ఇటీవలే తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అధికారికంగా ఆ పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. -
Sia Godika: 'సామాజిక సేవ నుంచి సైన్స్ వరకు'..
'బెంగళూరుకు చెందిన సియా గోడికా పేరు వినిపించగానే ‘సోల్ వారియర్స్’ గుర్తుకు వస్తుంది. ‘సోల్ వారియర్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు పాదరక్షలను అందిస్తుంది సియా. ‘చేంజ్‌మేకర్’గా గుర్తింపు పొందిన సియా గోడికా చదువులోనూ ప్రతిభ చూపుతోంది. ‘ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్’ గురించి ఆమె చేసిన సైన్స్ వీడియో ‘బ్రేక్‌త్రూ జూనియర్ చాలెంజ్’లో బహుమతి గెలుచుకుంది'. సైన్స్, మ్యాథమెటిక్స్‌కు సంబంధించి క్రియేటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఇచ్చే ప్రైజ్ ఇది. సేవామార్గంలో ప్రయాణించడంతో పాటు క్రియేటివ్ థింకింగ్ కోసం పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటుంది సియా. సైన్స్‌కు సంబంధించిన సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది. ‘ఇంట్లో పిల్లలకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటే గొప్ప విజయాలు సాధించవచ్చు’ అని చెప్పడానికి సియా ఒక ఉదాహరణ. సేవాకార్యక్రమాలకు తమ వంతుగా సహాయపడడం నుంచి సైన్స్ సంగతులు చెప్పడం వరకు సియా గోడికాకు ఎన్నో రకాలుగా ఆమె తల్లిదండ్రులు సహకారం అందించారు. ఇవి చదవండి: Rest Mom Face: పేరెంటింగ్ ప్రపంచంలో కొత్త మంత్రం -
భూమి అంతానికి నాలుగు కారణాలు!
పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదని అంటారు. ఈ సృష్టిలో ఉద్భవించిన భూమి కూడా ఏదో ఒకరోజు అంతమవుతుందని చెబుతుంటారు. మరి భూమి ఎప్పుడు అంతమవుతుంది? ప్రస్తుతం భూమిపై నెలకొన్ని విపత్కర వాతావరణ పరిస్థితులు భూమి అంతానికి దారి తీస్తున్నాయా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ‘సూపర్ ఖండం’తో పెనుముప్పు గడచిన 500 మిలియన్ సంవత్సరాలలో మన గ్రహం లెక్కలేనన్నిసార్లు భారీ ప్రళయాలను చవిచూసింది. ఆయా ప్రళయకాలాల్లో భూమిపై ఉన్న జాతులలో 90 శాతం జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ ప్రళయాలు ‘సూపర్ కాంటినెంట్’ ఏర్పడేందుకు దారితీస్తున్నాయి. రాబోయే 250 మిలియన్ సంవత్సరాలలో భూ ఖండాలు మళ్లీ కలిసి ‘పంగియా అల్టిమా’ అని పేరుతో ‘సూపర్ ఖండం’గా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది భూమధ్యరేఖకు సమీపంలో ఉంటుంది. అలాగే ఇది అత్యంత వేడి ఖండంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీడ్స్ యూనివర్శిటీ, యూఎస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం ‘పాంగియా అల్టిమా’ పరిస్థితులు క్షీరదాల మనుగడకు ప్రతికూలంగా మారనున్నాయి. మనుగడ కోసం పోరాటంలో.. అమరత్వం అనేది కథల వరకే పరిమితం. అంతరించిపోవడం అనేది కాదనలేని సత్యం. జీవ పరిణామక్రమంలో వివిధ జాతుల మనుగడ కోసం ఒత్తిళ్లు పెరుగుతాయి. జన్యు ఉత్పరివర్తనలు సంభవించినప్పుడు పలు సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ఉత్పరివర్తనలు ఒక నిర్దిష్ట సమయంలో జీవిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, మనుగడ సాగించడానికి ప్రయోజనకరంగానే ఉంటాయి. ఆ జన్యువులు తరువాతి తరానికి తరలే అవకాశం ఉంది. వైవిధ్యం, అనుకూలత అనేవి జీవులు జీవించడానికి కావాల్సిన లక్షణాలు. తక్కువ వైవిధ్యం, అననకూల పరిస్థితులు ఉన్పప్పుడు మానవ జనాభా అంతరించిపోయే అవకాశం ఉంది. పరిమిత వనరుల మధ్య.. భూమిపై వనరులు పరిమితం అవుతుండటానికి తోడు అణు, రసాయన, జీవ ఆయుధాలు, అంతుచిక్కని వ్యాధులు మొదలైనవి మానవ మనుగడకు ముప్పుగా మారనున్నాయి. ఇదేవిధంగా భారీ గ్రహశకలాల దాడి కూడా భూమి అంతరించిపోయేందుకు కారణం కావచ్చు. అలాంటి సంఘటన సంభవించినా, సంభవించకున్నా ఏదో రూపంలో మానవాళికి ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, ఖగోళ పరిశోధన ఫలితాల ప్రకారం చూస్తే, ఈ విపత్తు సమీపంలోనే ఉందనే అంచనాలున్నాయి. వేడెక్కుతున్న మహాసముద్రాలు వేడెక్కుతున్న వాతావరణం కారణంగా మహాసముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవి భూమి మనుగడకు మప్పుగా పరిణమిస్తున్నాయి. అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో 580 అమెరికన్, 216 సెంట్రల్ యూరోపియన్ నదుల డేటాతో వర్షపాతం, నేల రకం, సూర్యకాంతి తదితర అంశాలను పరిశీలించారు. భవిష్యత్తులో నదులలో ఆక్సిజన్ తగ్గే ఆక్సిజన్ రేటు జీవ వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించనుంది. అధ్యయనంలోని శాంపిల్స్ రాబోయే 70 సంవత్సరాలను అంచనా వేశాయి. తక్కువ ఆక్సిజన్ కారణంగా కొన్ని జాతుల చేపలు పూర్తిగా అదృశ్యమవుతాయి. దీని వల్ల జల వైవిధ్యానికి భారీ నష్టం వాటిల్లుతుంది. మానవులతో సహా అనేక జాతుల మనుగడకు ఇది పెను ముప్పుగా పరిణమించనుంది. -
‘పాపులరైజింగ్ సైన్స్’.. గ్రామీణ విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ కానుక
చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్థానిక భాషల్లోనే సైన్స్ అంశాలతో పాటు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచేందుకు ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ మద్రాస్ ‘సైన్స్ పాపులరజైషన్’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద ఏడు రాష్ట్రాల్లో 9193 గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో 3లక్షల20వేల702 పుస్తకాలను పంపిణీ చేసింది. 2026 వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, వెస్ట్‌బెంగాల్‌లోని మొత్తం 50 వేల స్కూళ్లలో ఈ ప్రోగ్రామ్ కింద విద్యార్థులకు అవగాహన కల్పించడాన్ని ఐఐటీ మద్రాస్ లక్ష్యంగా పెట్టుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎమ్)లలో కెరీర్‌ను ఎంచుకోవడం పట్ల విద్యార్థులను సన్నద్ధులను చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ఉన్న స్కూళ్లు, విద్యార్థులు బయోటెక్.ఐఐటీఎమ్.ఏసీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ప్రోగ్రామ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐఐటీ మద్రాస్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీనివాస్ చక్రవర్తి కోరారు. ఈయన ఇప్పటివరకు 70 సైన్స్ పుస్తకాలను ప్రభుత్వ హై స్కూళ్లలో చదివే విద్యార్థులకు అర్ధమయ్యేలా తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ‘సైన్స్ పాపులరైజేషన్’ ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు క్లిష్టతరమైన సైన్స్ పరిశోధనలకు సంబంధించిన విషయాలను వారికి అర్ధమయ్యే భాషలో చేరవేస్తున్నామని చక్రవర్తి తెలిపారు. ప్రోగ్రామ్‌కు అవసరమయ్యే వనరులను సమకూర్చడంలో ఐఐటీ పూర్వ విద్యార్థులు, అకడమిక్‌గా సైన్స్ నేపథ్యం ఉన్న ఇతర వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
భారతదేశం రెండు ముక్కలు కానుందా?
హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత, యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది ‘డీలామినేట్’ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్‌ను బౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగం పై భాగానికి దూరంగా ఉంటుంది. వీటిమధ్య నిలువుగా ఏర్పడిన పగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా, ఖండాంతర పలకలు మందంగా, తేలికగా ఉంటాయి, అవి భూమిలోని మాంటిల్లోకి సులభంగా ఇమిడిపోవు. భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భాభూగం కింది భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపధ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృదం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకు రావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నూతన పరిశోధనా ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి. భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఇటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు. అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు. ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు. -
వైద్యంలో ఏఐ తప్పులకు బాధ్యులెవరు?
అన్ని రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) వాడటం మొదలైంది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, చికిత్స, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం, మందుల అభివృద్ధి వంటి పనులకు తగు జాగ్రత్తలతో ‘ఎల్ఎంఎం’లను వాడొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆ మేరకు ఆరోగ్య సిబ్బందిపై భారం తగ్గుతుంది. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. అలాంటప్పుడు వీటి ద్వారా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది? ఆరోగ్య సేవలు, ఉత్పత్తులకు అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణాలను ఏఐ టెక్నాలజీలు, టూల్స్‌కు కూడా విస్తరించాలి. భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారీ వీటిని కచ్చితంగా ఆడిట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఛాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ టెక్నా లజీలను వాడటం మొదలుపెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ఓ) ఈ విషయమై ఒక హెచ్చరిక జారీ చేసింది. ఛాట్‌జీపీటీ, బార్డ్ వంటి ఎల్ఎంఎం (లార్జ్ మల్టీ–మోడల్ మోడల్స్)లు అందించిన సమాచారం, వీడియోలకు మాత్రమే పరిమితం కాకుండా... అంతకంటే ఎక్కువ విషయాలపై వ్యాఖ్యానించగలవు. మనిషి మాదిరిగానే స్పందించాలన్నది ఎల్ఎంఎంల తయారీ ఉద్దేశమన్నది తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చు కోవడం ఇవి చేసే పని. ఆరోగ్య రంగంలో వీటిని ఉపయోగించడం వల్ల తప్పుడు సమాచారం, ఏకపక్ష లేదా అసంపూర్తి సమాచారం అందే ప్రమాదాలు ఉంటాయనీ, ఇది మన ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చుననీ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. శిక్షణ ఇచ్చేందుకే తప్పుడు సమాచారాన్ని ఉపయోగిస్తే పరిస్థితి మరింత అధ్వాన్న మవుతుందన్నది ఈ హెచ్చరిక సారాంశం. ముఖ్యంగా జాతి, కులం, మతం వంటి విషయాల్లో ఏఐ టెక్నాలజీలు వివక్షతో కూడిన సమాచా రాన్ని తయారు చేసే ప్రమాదముంది. ఏఐ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ 2021లో సాధారణ మార్గదర్శకాలు కొన్నింటిని జారీ చేసింది. అదే సమయంలోనే ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంతో రాగల ప్రయోజనాలనూ గుర్తించింది. నైతికత విషయంలో కొన్ని స్థూల మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటి ప్రకారం... ఏఐ టెక్నాలజీలు స్వయం ప్రతిపత్తిని కాపా డేలా ఉండాలి. మానవ సంక్షేమం, భద్రత, ప్రజాప్రయోజనాలు, పారదర్శకతలకు పెద్దపీట వేయాలి. తెలివిగా ప్రవర్తించడంతోపాటు వివరించేలా ఉండాలి. బాధ్యత స్వీకరించాలి. అందరినీ కలుపుకొని పోవాలి. వివక్ష లేకుండా చూసుకోవాలి. వివరించేలా ఉండటం అంటే... ఏఐ తాలూకూ డిజైన్ , వినియోగం విషయాల్లో దాపరికం లేకుండా తగినంత సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం! పారదర్శకత ఆశించగలమా? ఆరోగ్య రంగంలో ఏఐ వాడకంపై డబ్ల్యూహెచ్ఓ ఇటీవల మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఎల్ఎంఎంల ఆవిష్కరణతో ఇవి అనివార్యమయ్యాయి. ఎల్ఎంఎంల వాడకం గురించి అర్థం చేసు కోవాలంటే ఏఐ టెక్నాలజీని సమగ్రంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎల్ఎంఎం టూల్‌ను అభివృద్ధి చేయడంతో మొదలవుతుంది. అభివృద్ధి చేసేది కార్పొరేట్ కంపెనీ, యూనివర్సిటీ, స్టార్టప్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఆధారపడేది సమాచార లభ్యత, నైపుణ్యాల పైనే. తరువాతి దశలో అభివృద్ధి చేసిన ఎల్ఎంఎంకు ఓ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అందిస్తారు. లోటుపాట్లను సరిచేయడం, విస్తృత సమాచా రంతో శిక్షణ ఇవ్వడం అన్నమాట. ఎల్ఎంఎంను భారీ సాఫ్ట్వేర్ వ్యవస్థలో భాగం చేయడం కూడా ఈ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ను సిద్ధం చేసే థర్డ్ పార్టీ బాధ్యతే. ఈ పని చేసిన తరువాత ఈ కృత్రిమ మేధ ద్వారా సేవలు అందుతాయి. లేదా ఒక అప్లికేషన్ రెడీ అవుతుంది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి దశల్లో మూడోది వినియోగదారుడికి దీన్ని అందించే డిప్లాయర్. ఆరోగ్య రంగంలో ఈ డిప్లాయర్ ఎక్కువ సందర్భాల్లో ఆసుపత్రి, ప్రభుత్వ ఆరోగ్య సంస్థ లేదా ఫార్మా కంపెనీ అయివుంటుంది. ఈ మూడు దశల్లో నైతికత, నియంత్రణకు సంబంధించిన చాలా ప్రశ్నలు, అంశాలు ఎదురవుతాయి. చాలాసార్లు డెవలపర్ పెద్ద టెక్ కంపెనీ అయి ఉంటుంది. ఎల్ఎంఎంల తయారీకి కావాల్సినన్ని నిధులు, టెక్నాలజీ నైపుణ్యాలు వీరి వద్దే ఉంటాయి. వీటి అభివృద్ధిలో వాడే అల్గారిథమ్స్, వాటి వల్ల రాగల ప్రమాదాల గురించి సామాన్యు లకు తెలిసే అవకాశాలు తక్కువే. కార్పొరేట్ కంపెనీ కాబట్టి పార దర్శకత, నిబద్ధతలను కూడా ఆశించలేము. నియంత్రణ ఎలా? ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్త ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు ఒక బెంగ పట్టుకుంది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఏఐ టూల్స్ ప్రస్తుత న్యాయ, చట్ట వ్యవస్థల్లోకి ఇముడుతాయా? మానవ హక్కు లకు సంబంధించిన అంశాలతోపాటు దేశాల డేటా పరిరక్షణ చట్టాల విషయంలోనూ ఈ సందేహముంది. ఎల్ఎంఎంల ప్రవేశం ఒక రకంగా ప్రభుత్వ, నియంత్రణ సంస్థలు ఏమరుపాటుగా ఉన్న సమయంలో జరిగిందని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ విష యాన్నే తీసుకుందాం. ఎల్ఎంఎంలను చేర్చేందుకే వీరు ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్ చట్టాన్ని చివరి దశలో మార్చాల్సి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం అల్గారిథమ్స్ ప్రస్తుత చట్ట, న్యాయ వ్యవస్థల పరిధిలోకి చేరే అవకాశం లేదు. మరోవైపు ఎల్ఎంఎంలు కూడా మనుషుల్లా చిత్తభ్రమలకు గురై తప్పుడు సమాచారాన్ని ఇవ్వవచ్చునని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇంకో ఆందోళన ఏమిటంటే... ఈ ఎల్ఎంఎంల ద్వారా తప్పులు జరిగితే వాటికి బాధ్యత ఎవరిది? ఇలాంటి తప్పుల కారణంగా జరిగే నష్టం, కలిగే హాని, దుర్వినియోగాలకు ఎవరు బాధ్యులన్న విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా ఈ ఎల్ఎంఎంలు సైబర్ సెక్యూరిటీ ముప్పులకు అతీతమేమీ కాదు. ఆరోగ్య రంగంలో వీటిని వాడితే రోగుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్య రంగంలో ఏఏ అంశాలకు ఎల్ఎంఎంలను వాడవచ్చు నన్న విషయంపై డబ్ల్యూహెచ్ఓ ఒక స్థూల అంచనాకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ, క్లినికల్ కేర్, లక్షణాలను పరిశీలించడం, చికిత్స, పరిపాలన, రోగుల వైద్య చరిత్రను అక్షరబద్ధం చేయడం వంటి పనులు... వైద్య, నర్సింగ్ శిక్షణ, శాస్త్రీయ పరిశోధన, మందుల అభివృద్ధి అన్న అంశాలకు మాత్రమే తగు జాగ్రత్తలతో ఎల్ఎంఎంలను వాడవచ్చునని సూచిస్తోంది. ఈ పనులన్నింటినీ ఎల్ఎంఎంలు చేస్తే ఆరోగ్య సిబ్బందిపై భారం అంతమేరకు తగ్గుతుంది. మరోవైపు ఓ కంపెనీ మెడికల్ ఎల్ఎంఎంను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, వైద్యపరమైన సమాచారాన్ని సంక్షి ప్తీకరించడం, అన్నింటినీ కలిపి వైద్యులకు స్థూల నివేదిక ఇవ్వడం వంటి పనులు చేస్తుంది. ఇలాంటివి ఎక్కువైన కొద్దీ వైద్యుడికి, రోగికి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మరి ఏం చేయాలి? ఎల్ఎంఎంల వాడకాన్ని పూర్తిగా అడ్డుకోవ డమైతే కాదు. వీటిని అభివృద్ధి చేసే సమయంలో వీలైనంత ఎక్కువ పారదర్శకత తీసుకురావడం ఒకటైతే... వాడకం కూడా బాధ్యతాయు తంగా ఉండేలా చూసుకోవడం మరొకటి. ఈ దిశగా ముందు ప్రభు త్వాలు ఆరోగ్య రంగంలో వినియోగానికి తలపెట్టిన ఎల్ఎంఎంల మదింపు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏఐ వ్యవస్థల అభివృద్ధికి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలు, డేటా సెట్స్ అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ వ్యక్తులూ వాడుకోగలిగితే తప్పు ఒప్పుల గురించి ఒక స్పష్టమైన అంచనా ఏర్పడుతుంది. ఆరోగ్య సేవలు, ఉత్ప త్తులకు ప్రస్తుతం అన్వయిస్తున్న నైతిక, మానవ హక్కుల ప్రమాణా లను ఏఐ టెక్నాలజీలు, టూల్స్‌కు కూడా విస్తరించాలి. ఆరోగ్య, వైద్య అంశాలకు సంబంధించి భారీ స్థాయిలో ఎల్ఎంఎంలు విడుదలైన ప్రతిసారి ఏఐ టూల్స్, టెక్నాలజీలను కచ్చితంగా ఆడిట్ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏఐతో వచ్చే లాభాలపై అతిగా అంచనాలూ పెట్టుకోవద్దు; రాగల ముప్పులను తక్కువ చేసి చూడనూ వద్దు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భళా.. బాల మేధావులు
సాక్షి, అమరావతి: విజయవాడలో నిర్వహిస్తున్న ‘సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్’ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అత్యుత్తమ ప్రదర్శనలను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలకు ఇక్కడ అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 30 నమూనాలు సైతం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. తమ వయసు విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను తిలకించి, ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకే.. సైన్స్ రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, భూమి/అంతరిక పరిజ్ఞానం, పర్యావరణం, ఇంజినీరింగ్, అగ్రి, బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అంశాలకు చోటు కల్పించామన్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని వివరించారు. తక్కువ ఖర్చు.. ఆదాయం హెచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న కె.హేమమాధురి, పి.పావని చిత్తూరు జిల్లా పెదపంజానిలోని మహత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ రైతుకు మేలు చేసే సమగ్ర వ్యవసాయ (ఇంటిగ్రేటెడ్ పారి్మంగ్) విధానాన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూనే.. ఎరువుల ఖర్చు లేకుండా అదనపు ఆదాయంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అనర్గళంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఇంగ్లిష్ ప్రావీణ్యం ప్రదర్శిస్తూ.. సదరన్ సైన్స్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆపదలో ఆదుకునే తుపాకీ సైనికులు, ఫారెస్ట్ సిబ్బంది, అగ్నిమాపకదళ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఒక్కోసారి దారి తప్పడమో, మంచులో కూరుకుపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వారున్న చోటును తెలిసేలా అద్భుతమైన తుపాకిని రూపొందించాడు మంగుళూరుకు చెందిన విద్యార్థి పి.తేజస్. ఓ వైపు శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతోపాటు సైనికుడి ఉనికిని తన బృందానికి చేరవేసేలా సెన్సార్‌ను బిగించాడు. ఇది బయటి వారికి సిగ్నల్స్‌ను పంపించి ఆచూకీ చెబుతుంది. తేజస్ తయారు చేసిన తుపాకి ఒక్కసారి వినియోగానికి రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. మంటల్లో కాలిపోతున్న ఎత్తయిన భవనాల్లోకి ఈ తుపాకి ద్వారా ఆక్సిజన్ బాల్స్‌ను ఫైర్ చేసి మంటలను సైతం ఆర్పేయవచ్చు. -
కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వుతామో తెలుసా!
కితకితలు పెడుతున్నారనంగానే నవ్వు ఆటోమెటిగ్గా వచ్చేస్తుంది. ముఖ్యంగా చిన్నిపిల్లల ఏడుపు ఆపించాలనుకున్నప్పుడూ కితకితలు పెడుతుంటా. జస్ట్ అలా పెట్టేందుకు యత్నించంగానే నవ్వు తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆపుకోవడం కష్టం కూడా. అయితే మనంతట మనం పెట్టుకుంటే నవ్వు రాదు. అవతలివాళ్లు పెడితేనే నవ్వు వస్తుంది. ఎందుకిలా? అస్సలు కితకితలు పెట్టగానే ఎందుకు నవ్వు వస్తుంది?. తదితర ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం! ఇలా చక్కిలిగింతలు పెట్టగానే నవ్వడానికి వెనుకున్న సైన్స్ ఉందంట. సాక్షాత్తు ఎవల్యూషనరీ బయాలజిస్టులు, న్యూరో సైటింస్టులే చక్కిలగింతలు పెడితే కచ్చితంగా నవ్వుతామని, దాని వెనుకు ఉన్న కారణాలను కూడా వివరించారు. సున్నితమైన స్పర్శను అనుభవించినపుడు మెదడులోని హైపోథాలమనస్ ప్రాంతం నవ్వమని ఆదేశాలు ఇస్తుందిట. చేతుల క్రింద, గొంతు దగ్గర, పాదాల క్రింద చక్కిలిగింతలు పెడితే నవ్వు ఆపుకోలేం. అందుకే కితకితలు పెడితే అరవడం, విదిలించుకోవడం, ఎగరడం వంటివి చేస్తుంటాం. అయితే కొందరిలో చక్కిలిగింతలు ఇష్టపడరు. వారిలో నాడులు తీవ్రమైన ఒత్తిడికి లోనై కోపం ప్రదర్శిస్తారు. నవ్వు ఎలా వస్తుంది? మన శరీరంపై ఎవరైనా కితకితలు (చక్కిలిగింతలు) పెడితే, వాటి వల్ల కలిగే అనుభవాన్ని మెదడులోని రెండు ప్రదేశాలు పంచుకుంటాయి. అందులో ఒకటి సొమాటో సెన్సరీ కార్టెక్స్. ఇది శరీరానికి స్పర్శజ్ఞానం కలుగజేస్తుంది. రెండోది ఏంటీరియర్ సింగులేట్ కార్టెక్స్. ఇది ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ రెండు అనుభూతుల వల్ల మనం సిగ్గుపడుతూ, నవ్వుతాము. మనకై మనం చక్కిలిగింత పెట్టుకున్నప్పుడు ఈ రెండు ప్రదేశాలు అంతగా ఉత్తేజం చెందవు. మనకు మనం పెటుకుంటే నవ్వు ఎందుకు రాదంటే.. మెదడు వెనుక భాగంలో ఉన్న చిన్న మెదడు మీకు మీరే కితకితలు పెట్టుకోబోతున్నారని ముందుగానే మెదడుకి సంకేతాలు ఇస్తుంది. దాని వల్ల మెదడు సరైన సంకేతాలు ఇవ్వదట. అందుకే మనకి మనం కితకితలు పెట్టుకుంటే నవ్వు రాదట. పిల్లల్ని ఆట పట్టిస్తూ చక్కిలిగింతలు పెడతారు. వారిలో నవ్వడం నేర్పడానికి అలా చేస్తారు. నవ్వు అనేది ఒక అంటువ్యాధిలా అంతటా ఆవరిస్తుంది. ఒకరు నవ్వడం ప్రారంభిస్తే ఆ ప్రదేశంలో ఉన్నవారంతా నవ్వుతారు. నవ్వు వల్ల సమాజంలో మంచి సానుకూల బంధాలు ఏర్పడతాయి. చక్కిలిగింతల రకాలు 1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..) -
హైదరాబాద్ మహిళకు ఇన్ఫోసిస్ అవార్డ్.. భారీ ప్రైజ్ మనీ
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ మహిళ 'కరుణ మంతెన' (Karuna Mantena)కు టెక్ దిగ్గజం 2023 ఇన్ఫోసిస్ అవార్డు అందించింది. సైన్స్‌లో ఈమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ అవార్డుల ప్రదానోత్సవంలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ వంటి పలు రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి అవార్డులు అందించడం జరిగింది. ఇన్ఫోసిస్ అవార్డు 2023లో గోల్డ్ మెడల్, 100000 డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,97,855) ప్రైజ్ మనీ ఉంటాయి. ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు.. హైదరాబాద్ మహిళ కరుణ మంతెన మాత్రమే కాకుండా.. ఈ అవార్డు గ్రహీతల్లో ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్లు సచ్చిదా నంద్ త్రిపాఠి, అరుణ్ కుమార్ శుక్లా, సైన్స్ గ్యాలరీ బెంగళూరు డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీ, అడ్వాన్స్డ్ స్టడీ ఇన్స్టిట్యూట్లో ఫెర్న్‌హోల్జ్ జాయింట్ ప్రొఫెసర్ భార్గవ్ భట్ మొదలైనవారు ఉన్నారు. #InfosysPrize2023 in Social Sciences is awarded to @KMantena, @Columbia, for her research on the theory of imperial rule, and the claim that this late imperial ideology became one of the important factors in the emergence of modern social theory. pic.twitter.com/fKYBXhr2eC — Infosys Prize (@InfosysPrize) November 15, 2023 -
సంక్రాంతి వెనుక సైన్స్
సాక్షి, అమరావతి: సూర్యుడు జ్ఞానానికి.. జీవిత శ్రేయస్సుకు ప్రతీక. సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం.. చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. మకర సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి మారతాడు. సూర్యుని ఖగోళ ప్రయాణంతో ముడిపడి ఉన్న మకర సంక్రాంతితో శీతాకాలం ముగుస్తుంది. ఎండ రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుని పథం మారుతున్న రుతువులపై ప్రభావం చూపిస్తుంది. ఈ కాలం సాంస్కృతిక, వ్యవసాయ ప్రాముఖ్యతకు ప్రతీక. శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి ఉంటుంది. మకర సంక్రాంతి నాడు కీలకమైన మార్పు వస్తుంది. సూర్యుడు తన ప్రయాణంలో భూమధ్య రేఖను దాటి ఉత్తరం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడు. వసంత కాలం మొదలవుతుంది. సూర్యుడు హారిజోన్పైన ఎక్కువ సమయం గడపడం వల్ల పగటి వేళలు క్రమంగా పెరుగుతాయి. పెరిగిన సూర్యరశ్మి భూమిని వేడెక్కిస్తుంది. మంచు తగ్గుతుంది. ఫలితంగా పంటలు వృద్ధి చెందడానికి అనుకూల పరిస్థితులను వస్తాయి. పండుగ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు కీడు ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొడుకులున్న తల్లులు పరిహారం చేయాలని, ముఖ్యంగా ఒక్కడే కొడుకు ఉన్నవారు గాజులు వేసుకోవాలని కొత్త ఆచారం పుట్టుకొచ్చింది. ఒకే అల్లుడు ఉన్న అత్త, అల్లుడిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు, తులం బంగారం పెట్టాలని.. కొత్త అల్లుడైతే కాళ్లను పాలతో కడగాలంటూ వింత నియమం చక్కర్లు కొడుతోంది. అయితే.. ఎవరి గాజులు వారే కొనుక్కుని వేసుకోకూడదు. వేరే వాళ్ల నుంచి తీసుకోవాలి. దీనిని నమ్మి గ్రామాల్లో ఎక్కువగా మహిళలు ఒకరికొకరు గాజులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. దీనిలో వాస్తవం ఉందా లేదా అని అన్వేషిస్తే.. ఈ సంక్రాంతి కీడు వెనుక సైన్స్ ఉందని తేలింది. అల్లుళ్లకు కాళ్లు కడగడం, కానుకలివ్వడం అనేది కేవలం పుకారు మాత్రమేనని పండితులు కొట్టిపడేశారు. కానీ గాజులు ధరించడానికి కొన్ని శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. దేవతల చేతులకూ గాజులు ఆలయాల్లో దేవతా శిల్పాల ముంజేతికి ఆభరణాలు ఉంటాయి. వాస్తవానికి ముంజేతి మణికట్టు భాగంలో వినాళ వ్యవస్థకు అనుసంధానం చేసే నాడులు ఉంటాయి. ఈ భాగంలో చిన్నగా ఒత్తిడి కలిగించడం వల్ల ఇవి చురుకుగా పనిచేస్తాయి. ఫలితంగా పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు బాగుంటుందని సైన్స్ చెబుతోంది. ఇలా మనం ధరించే ఆభరణాల వెనుక ఇలాంటి శాస్త్రీయ కోణం ఉంది. శాస్త్రంతో నిండిన పండుగ రోజులు ప్రతికూలతలను దహనం చేయడానికి ప్రతీకగా వేసే భోగి మంటలు సూర్యుని వెచ్చదనాన్ని స్వాగతిస్తాయి. ఈ మంటల్లో మట్టి పాత్ర వేసి వండే పాయసంలో అనేక పోషకాలుంటాయి. నువ్వులు, బెల్లం వంటి నైవేద్యాలు సంతానోత్పత్తిని పెంచుతాయి. ఎగురుతున్న గాలిపటాలు సూర్యుని ఆరోహణను అనుకరిస్తాయి. సాంస్కృతిక వేడుకలతో నూతనోత్సాహం వస్తుంది. ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంత గూటికి చేరడంతో సంతోషం వెల్లివిరుస్తుంది. -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్‌పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్‌ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? విమానాలకు సంబంధం ఏమిటి?
మీరు ఎప్పుడైనా ఏదైనా మహానగరంలో రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని ఎత్తైన భవనాల పైన ఎరుపురంగు లైట్లు కనిపిస్తాయి. ఈ రెడ్ లైట్లు అలంకారం కోసం కాదని, దీని వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహానగరాలు కాంక్రీట్ అడవులుగా ఎప్పుడో మారిపోయాయి. ఆ నగరాల్లో ఎత్తైన భవనాలన్నింటిపైనా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ లైట్లు భారీ భవనాలపైననే ఎందుకు కనిపిస్తాయి? ఓ మాదిరి భవనాలపై ఎందుకు కనిపించవు? దీని వెనుక ఏదైనా ప్రభుత్వ మార్గదర్శకం ఉందా లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భవనాల పైభాగంలో ఎరుపు రంగు దీపాలను అమర్చడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైట్లు లేదా ఎయిర్‌క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. ఆకాశహర్మ్యాలు, కమ్యూనికేషన్ టవర్లు, విండ్ టర్బైన్లు తదితర ఎత్తైన నిర్మాణాలు.. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా దృశ్యమానత తగ్గినప్పుడు, అననుకూల వాతావరణంలో రెడ్ లైట్లు నిరంతర ఫ్లాషింగ్ సిగ్నల్స్‌ను విడుదల చేస్తాయి. అవి విమాన పైలట్లకు సులభంగా కనిపిస్తాయి. ఇది విమానాలకు హెచ్చరికలా పనిచేస్తుంది. విమానయాన అధికారులకు ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇటువంటి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పలు దేశాలలో కఠినమైన నిబంధనలను ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ భద్రతను నిర్ధారించడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ లైట్లను అమర్చనిపక్షంలో భవన యజమానులు జరిమానాలతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎత్తైన భవనాలపైన ఉండే రెడ్ లైట్లు విమానాల కోసం నావిగేషనల్ ఎయిడ్స్‌గా కూడా పనిచేస్తాయి. వాటి స్థానాన్ని, దిశను గుర్తించడంలో సహాయపడతాయి. విమాన భద్రతతో పాటు, భవనాలపై కనిపించే ఎరుపురంగు లైట్లు సమీపంలోని ఎత్తైన నిర్మాణాలకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి: దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి? -
చిత్రకారుల్లో ఇతడు వేరయా..! సైన్సుకే చిత్ర రూపం ఇచ్చి..
బొమ్మల భాషఅక్షరం పుట్టక ముందే చిత్రం రూపుదిద్దుకుంది. ప్రపంచంలో సైగల తర్వాత భాష బొమ్మలదే. పది వాక్యాల విషయాన్ని ఒక బొమ్మ చెప్తుంది. ఆ బొమ్మలతోనే శాస్త్రాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం వినోద శాస్త్రమవుతుంది. ఆనందంగా మెదడుకు చేరుతుంది. మరిచిపోలేని జ్ఞానంగా మిగులుతుంది. అధ్యయనానికి అక్షర రూపమిస్తే మహాగ్రంథమవుతుంది. అధ్యయనానికి చిత్రరూపమిస్తే అద్భుతమైన చిత్రకావ్యం అవుతుంది. అలాంటి వందల చిత్రకావ్యాలకు రూపమిచ్చారు అబ్దుల్ మన్నాన్. డెబ్బై ఏళ్ల మన్నాన్ ఐదు వేలకు పైగా బొమ్మలు వేశారు. ‘‘నా వయసులో నుంచి మూడేళ్లు తగ్గిస్తే నాలోని చిత్రకారుడి వయసది. నా బొమ్మల్లో ఒక్కొక్క థీమ్‌తో కొన్ని వందల చిత్రాలున్నాయి. ఆ చిత్రాల్లో ఒక్కటి చేజారినా చిత్రకావ్యంలో అనుసంధానత లోపిస్తుంది. అందుకే నా బొమ్మలను ఎవరికీ ఇవ్వలేదు, డబ్బు కోసం అమ్మనూ లేదు’’ అన్నారు అబ్దుల్ మన్నాన్. బొమ్మల చదువు! మా సొంతూరు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, బంటుమిల్లి దగ్గర చిన పాండ్రాక. ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నా చదువు గుడివాడలో సాగింది. ఏఎన్నార్ కాలేజ్‌లో బీఎస్సీ చదివాను. బొమ్మల మీదున్న ఆసక్తి కొద్దీ చెన్నైకి వెళ్లి ‘శంతనుస్ చిత్ర విద్యాలయం’లో ఆర్ట్ డిప్లమో చేశాను. చెన్నైలోనే బాలమిత్ర, బాలభారతి, బుజ్జాయి వంటి పిల్లల పత్రికల్లో ఇలస్ట్రేటర్‌గా ఐదారేళ్లపాటు ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి నా అడుగులు సినీఫీల్డ్ వైపు పడ్డాయి. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా సుమారు ఐదేళ్లు చేశాను. చెన్నైలో కవి సమ్మేళనాలు ఎక్కువగా జరిగేవి. మహాలక్ష్మి క్లబ్లో తెలుగు వాళ్ల కార్యక్రమాలు జరిగేవి. దాదాపుగా అన్నింటికీ హాజరయ్యేవాడిని. అలా శ్రీశ్రీ,, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి కవులతోపాటు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆర్ నారాయణమూర్తి వంటి చాలామందితో పరిచయాలయ్యాయి. దక్షిణాది భాషలు వచ్చాయి. ఇలా కొంత వైవిధ్యంగానే మొదలైంది నా కెరీర్. వైవిధ్యత ఆకట్టుకుంది! సైన్స్ చిత్రాల చిత్రకారుడిగా మారడానికి బీజం పడింది మాత్రం ఇంటర్‌లోనే. డార్విన్ సిద్ధాంతం ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ చదవడం నా మెదడులో కొత్త ప్రపంచానికి ఆవిష్కారం జరిగింది. అలాగే మరో పుస్తకం ‘ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’. ప్రపంచంలోని చిత్రకారులను చదివినప్పుడు పికాసో నుంచి డావిన్సీ వరకు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులెవ్వరూ సైన్స్ ఇతివృత్తంగా బొమ్మలు వేయలేదని అవగతమైంది. దాంతో ఆ ఖాళీని పూరించాలనుకున్నాను. అలా నా చిత్రాలకు సైన్స్, నేచర్ ప్రధానమైన టాపిక్స్ అయ్యాయి. జీవ వైవిధ్యత నన్ను కట్టి పడేసే అంశం. దాంతో ప్రతి జీవి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. డార్విన్ సిద్ధాంతం చదివినప్పుడు కలిగిన సందేహాలకు సమాధానాల కోసం లెక్కలేనన్ని పుస్తకాలు చదివాను. ఉదాహరణకు క్యాట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ ఖండంలో ఎలాంటి జాతి క్యాట్లుంటాయో అనర్గళంగా చెప్పగలను. శిలాజాలను అధ్యయనం చేసి ఆ ప్రాణి ఊహాచిత్రాన్ని వేయడం, ఎండమిక్ స్పీసీస్ బొమ్మలేయడంలో అనంతమైన సంతృప్తి కలగడం మొదలైంది. ఇక ఆ అలవాటును కొనసాగించాను. సైన్స్ పాఠాల బోధన! నా వృత్తి ప్రవృత్తి రెండూ సైన్స్‌లోనే వెతుక్కున్నాను. ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవాడిని. నా భార్య గవర్నమెంట్ టీచర్. నేను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ట్యూటోరియల్స్ నిర్వహించాను. స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించాను. నేను అందుకున్న అవార్డులకంటే నా విద్యార్థులు అందుకున్న అవార్డులే ఎక్కువ. నేను పీటీరెడ్డి అవార్డు, మూడు జాతీయ స్థాయి అవార్డులందుకున్నాను. నా బొమ్మలు ఆహ్లాదం కోసం చూసేవి కాదు. అవి అధ్యయన మాధ్యమాలు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలు, వైజాగ్‌లో కాలేజీలు, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్, చాలాచోట్ల స్కూళ్లలోనూ ప్రదర్శనలు నిర్వహించాను’’ అని తన చిత్రప్రస్థానాన్ని వివరించారు అబ్దుల్ మన్నాన్. ‘చిత్ర’ ప్రమాదాలు చిత్రకారుడు తన దేహానికి గాయమైనా పట్టించుకోడు. కానీ తన బొమ్మలకు ప్రమాదం వాటిల్లితే ప్రాణం పోయినట్లు విలవిలలాడుతాడు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా చిత్రకార జీవితంలో మూడు ప్రమాదాలను ఎదుర్కొన్నాను. గుడివాడలో ఇల్లు అగ్నిప్రమాదానికి గురయ్యి చిన్నప్పటి నుంచి వేసిన బొమ్మలన్నీ కాలిపోయాయి. మరోసారి చెన్నైలో ఇంట్లో దొంగలు పడి నా పెయింటింగ్స్ పెట్టెను కూడా దోచుకుపోయారు. ఇక మూడవది హైదరాబాద్‌లో. ఈ ఏడాది వరదల్లో టోలిచౌకిలోని మా ఇంట్లో మూడు రోజులు నీళ్లు నిలిచిపోయాయి. అప్పుడు తడిసిపోయినవి పోగా మళ్లీ వేసిన బొమ్మలు ఐదు వందలు ఎగ్జిబిషన్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదం తర్వాత నాలోని చిత్రకారుడు మళ్లీ మళ్లీ పుట్టాడు. – అబ్దుల్ మన్నాన్, సైన్స్ చిత్రకారుడు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా?
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతులు తమ పొలాల్లో నీటి జాడలను కనిపెట్టేందుకు జియాలజిస్ట్‌లను పిలిపించలేరు. ఎందుకంటే వారు అంత డబ్బు వెంచ్చించలేరు. పైగా అంత సమయం కూడా ఉండదు. అందుకని రైతులు నీటి జాడలను కనిపెట్టే వారిపై ఆధారపడుతుంటారు. అయితే ఇది శాస్త్రీయమేనా? దీని గురించి సైన్సు ఏం చెబుంతుంది తదితరాల గురించే ఈ కథనం. చాలమంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయడానికి ఫీల్డ్ సర్వేయర్లను పిలుస్తారు. వారు చేతిలో కొబ్బరికాయ, వేప పుల్ల, నీళ్ల చెంబు తదితరాలను ఉపయోగించి నీటి జాడలను చెబుతారు. దీన్నే విశ్వసించి రైతులు వారు చెప్పిన చోట బోర్లు వేయించుకుంటారు. ఇటువంటి పద్ధతులు నిజానికి శాస్త్రీయమా? దీని గురించి రైతులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. మూడు పద్ధతుల్లో నీటి జాడను.. తనకు తెలిసిన పద్ధతుల్లో నీటిజాడలను గుర్తిస్తున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలువురు రైతులకు వాటర్ పాయింట్లను ఈ పద్ధతిని అనుసరించే ఏర్పాటు చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పొలవరానికి చెందిన వారు. సుబ్బారెడ్డి నీటిని కనుగొనడానికి కొబ్బరికాయ లేదా వై ఆకృతిలోని వేప కర్ర లేదా కానుగ కర్ర, వాటర్ బాటిల్‌ని ఉపయోగిస్తారు. కొబ్బరి పీచులు వేళ్ల వైపు ఉండేలా కొబ్బరికాయను అరచేతిలో ఉంచుతారు. పొలంలో అలా చేతిలో కొబ్బరికాయ పెట్టకుని వెళ్తున్నప్పుడూ ఎక్కడ కొబ్బరికాయ నిటారుగా నిలబడితే అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు. అదికాకపోతే అరచేతిలో వై ఆకారంలో ఉన్న వేప ఆకులతో ముందుకు వెళ్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుంది లేదా మరీ ఎక్కువగా ఉంటే గిరిగిర తిరుగుతుంది. అదే నీళ్ల చెంబు పద్ధతి అయితే నీరు ఎక్కడ పక్కకు ఒరిగితే అక్కడ నీళ్లు వస్తాయని సురేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇలానే ఎన్నో బోర్లు వేయించానని, ఈ పద్ధతిని తానే సొంతంగా నేర్చుకున్నట్లు తెలిపారు. కొబ్బరికాయను బట్టి నీరు ఎన్ని అడుగుల్లో ఉందో చెప్పేయొచ్చు అని అన్నారు. జియాలజిస్టులు యంత్రాల సాయంతో తనిఖీ చేసినా ఎంత నీరు పడుతుందనేది కచ్చితంగా చెప్పలేరని అన్నారు. తాను నీటి జాడను గుర్తించిన ప్రతి చోటు 99 శాతం విజయవంతమయ్యాయని సురేందర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం. పుల్ల కానీ, టెంకాయ గానీ పైకి లేస్తుంది. రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది. ఒక లైను పోయే చోట లేచి నిల్చుకుంటుంది. దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది. ఏ వైపు ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం. మరీ ఫోర్స్‌గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి. మూడు లేదా నాలుగు అంగుళాలు పడతాయి. ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయన్నారు సురేందర్ రెడ్డి. శాస్త్రీయ పద్ధతిలోనే కనిపెట్టగలం.. కొబ్బరి వేపపుల్ల, వాటర్ బాటిళ్లతో నీటి జాడలను గుర్తించే పద్ధతులను అశాస్త్రీయమైనవని తిరుపతికి చెందిన జియాలజిస్టు, భూగర్భ జల మైనింగ్ కన్సల్టెంట్ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టెంకాయ కాకుండా ఉత్తరేణిపుల్ల, వేప పుల్ల, రేగి చెట్టు పుల్ల, లాంటి వాటితో కూడా నీటిజాడలను గుర్తిస్తారు. వీటిని అశాస్త్రీయమైనవిగా పరిగణించాలన్నారు. అంతేగాదు కొందరి చేతుల్లో నీటి రేఖ ఉందని, తమ కలలో దేవుడు కనిపించి చెప్పాడని అంటుంటారు కానీ అవన్నీ సరైన పద్ధతులు కావని తేల్చి చెప్పారు. కేవలం శాస్త్రీయ పద్ధతుల్లోనే నీటి జాడను కచ్చితంగా కనిపెట్టగలమని చెప్పారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పుడూ ఏ పద్ధతిలోనైనా నీరు పడుతుంది. ఛాలెంజింగ్ ఏరియాల్లో..వెయ్యి అడుగులు బోరు వేసినా పడని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఈ పద్ధతులు విఫలమయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి చోట భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బోర్లు వేసి డబ్బులు వృథా చేసుకొవద్దని రైతులకు సూచిస్తామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో కచ్చితత్వం.. భూగర్భంలో నీటి జాడలను కనిపెట్టడంలో శాస్త్రీయ పద్ధతులు సమర్థవంతంగా పనిచేస్తాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ జలాల జాడను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే ఒకటి అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలిస్తే..భూమి పొరలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాళ్లు మట్టి కలిసి ఉంటాయి. భూమి పొరల రెసిస్టివిటీని అంచనావేసి నీటి జాడను నిర్థారిస్తాం అని సుబ్బారెడ్డి తెలిపారు. పూర్వీకుల నుంచే నీటి జాడలు కనిపెట్టే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. భూమి భౌగోళిక లక్షణాల ప్రకారం కొందరూ నీటి జాడను అంచనా వేయగలరని చెప్పారు. వరహ మిహరుడు గ్రంథంలో నీటి అన్వేషణ.. భూగర్భ జల వనరులను ఎలా గుర్తించాలో వరాహ మిహిరుడు ఒక గ్రంథాన్ని రాశాడు. నీటి అన్వేషణ కోసం చెప్పిన టెక్నిక్‌లో బయో ఇండికేటర్లు గురించి కూడా ప్రస్తావించారు. నీరు ఉన్నచోట ఉడగ, రెల్ల, మద్ది, తంగేడు వంటి చెట్లు గుంపులుగా ఉంటాయని పూర్వీకులు ప్రగాఢంగా నమ్మేవారు. దీన్ని ఆధారం చేసుకునే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం నీరు పడే అవకాశాలను చెబుతారని అన్నారు. నీటి కుంటలు ఉండే చోట కూడా నీరు పడుతుందని నిరూపితమైంది. జియాలజిస్ట్‌లు సైంటిఫిక్ పద్ధతుల తోపాటు వీటిని కూడా పరిగణలోని తీసుకుంటారని చెప్పారు. ఇక్కడ అనుభవం కీలకం... చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బోర్ పాయింట్‌ని గుర్తించాలంటే.. జిల్లాలో ఎంత లోతులో నీరు పడుతుందో, ఏ వైపు సర్వే చేస్తే బాగుంటుందో అవగాహన ఉండాలి. నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి, అది నాకు సులభం. అదే కొత్త ప్రాంతమైతే.. అక్కడి జియాలజిస్ట్ కమాండింగ్ చేస్తున్నాడు. అక్కడ నాకంటే ఆయనే ఎక్కువ విజయాలు సాధిస్తారు అని సుబ్బారెడ్డి అన్నారు. కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన వేప చెట్లను కూడా పరిగణలోనికి తీసుకుని చెబుతారు. దీన్ని జీవ సూచికగా పరిగణిస్తారు. “వేప చెట్టు ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు మరియు ఆకులు ఒక వైపుకు వంగి ఉంటే... అటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక నీటి కాలువ ఉందని సూచిస్తుంది. అటువంటి ప్రాంతంలో పరికరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యం. ఇది ఆ ప్రాంతంలోని జియాలజిస్ట్ పరిజ్ఞానం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది, ”అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కొన్నిసార్లు రాతి నిర్మాణాలు చాలా సవాలుగా ఉంటాయని, అలాంటి చోట భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రమే నీటి వనరులను గుర్తించగలరని ఆయన అన్నారు. భూగర్భ జలాలను గుర్తించే సాంకేతికత 1910 నుంచి అభివృద్ధి చెందుతోందని, విమానంలో ప్రయాణిస్తూ కూడా నీటి జాడలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వేలు అందుబాటులో ఉన్నాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. (చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!) -
అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?
1960 దశాబ్ధంలో చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్లిన సాటర్న్ వీ నుండి నేటి ఫాల్కన్ 9 లేదా ఏరియన్ 5 వరకు చాలా రాకెట్లు తెలుపు రంగులోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్న సైన్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాకెట్లు ప్రధానంగా తెలుపు రంగులోనే ఉంటాయి. ఫలితంగా అంతరిక్ష నౌక వేడిగా మారదు. అలాగే లాంచ్ప్యాడ్పై, ప్రయోగ సమయంలో సూర్యుని రేడియేషన్‌కు గురికావడం వల్ల దానిలోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లకు వేడి నుండి రక్షణ దొరుకుతుంది. అధికశాతం అంతరిక్ష నౌకలలో చల్లని ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు. చాలా రాకెట్ల మొదటి దశలలో ఉపయోగించే ఆర్పీ-1 ఇంధనంతో పాటు, దాదాపు అన్ని ఇతర ద్రవ ప్రొపెల్లెంట్లు క్రయోజెనిక్ పదార్థాలై ఉంటాయి. వీటిని ద్రవ రూపంలో ఉంచడానికి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఎంతో అవసరం. ఉదాహరణకు రాకెట్ ఎగువ దశలలో ఉపయోగించే ద్రవ హైడ్రోజన్ -253 ° C (-423 ° F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు తీసుకురావలసి ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ ఇంధన రకాలతో ఉపయోగించే ఆక్సిడైజర్ -183°C (-297°F) వరకూ చల్లబరిచేలా చూడటం అత్యవవసరం. ఈ ప్రొపెల్లెంట్లను లాంచ్ వెహికల్లోకి పంప్ చేసిన తర్వాత, శీతలీకరణకు మరో మార్గం ఉండదు. అందుకే అవి వేడెక్కడం జరుగుతుంది. దీని వెనుకగల కారణం ఏమిటంటే పలు రాకెట్ ప్రయోగ కేంద్రాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇక్కడ వెచ్చని వాతావరణం వేడి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పుడు రాకెట్లు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయో అర్థమయ్యే ఉంటుంది. స్పెక్ట్రమ్‌లోని అన్ని రంగులలో తెలుపు రంగు అనేది సూర్యకాంతి నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా చూడటంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఎండ అధికంగా ఉన్న రోజున తెలుపు రంగు చొక్కా ధరించి, బయట తిరిగినప్పుడు ఈ దృగ్విషయాన్ని ఎవరైనా గమనించవచ్చు. రాకెట్ ఇంజనీర్లు ఈ దృగ్విషయాన్ని ఆధారంగా చేసుకుని.. రాకెట్ అంతర్గత ట్యాంకుల్లోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లు వేడెక్కడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే లాంచ్ వెహికల్‌కి తెల్లని పెయింట్ వేయడం చవకైన మార్గం అని గుర్తించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! -
ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగలరా? ఇది సాధ్యమేనా!
మహిళ ప్రెగ్నెంట్‌గా ఉండగానే మరోసారి ప్రెగ్నెంట్ కాగాలదా? అంటే ఔననే చెబుతోంది సైన్సు. ఏంటిది ఎలా సాధ్య? అసలు ఇలా ఎవరికైనా జరిగిందా? అని పలు సందేహాలు మొదలయ్యాయి కదా. కానీ నిజానికి ఇలాంటి అరుదైన కాసులు చాలనే జరిగాయని అంటున్నారు వైద్యులు. ఇలా గర్భవతిగా ఉండగానే మళ్లీ గర్భం దాల్చడాన్ని సూపర్ఫెటేషన్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులో ఆ తల్లికి పుట్టిన పిల్లలు కవలలుగా పరిగణించినప్పటికీ వేర్వురు తేదిల్లో పుడతారట. అరుదైన కేసుల్లో ఒకేసారి పుట్టిన ఆ పిల్లల బరువు, పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయని అంటున్నారు. ఆ పిండాల పీరియాడిక్ టైం కూడా వేరుగా ఉంటుంది. ఇది ఒక ఋతుకాలంలోనే విడుదలైన రెండు గుడ్ల ఫలదీకరణాన్ని సూచిస్తుంది. నిజానికి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ ఆమె అండాశయాలు గర్భాశయానికి గుడ్లు విడుదల చేయడం ఆపేస్తాయి. ఎందుకంటే హార్మోన్లు శిశువు పెరగడానికి సిద్ధంగా ఉండేలా శరీరానికి ఒక సంకేతాన్ని పంపుతాయి. అయినప్పటికీ సూపర్ఫెటేషన్ జరిగితే అండాశయాలు మరొక గుడ్డును విడుదల చేస్తాయి. అది కూడా ఫలదీకరణం చెందుతుంది. గతంలో ఇలాంటి ఘటన జరిగిన పలు కేసులు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కేట్ హిల్ అనే మహిళకు ఇలానే జరిగింది. ఆమె కేవలం పది రోజుల్లో రెండుసార్లు గర్భవతి అయ్యింది. ఆమె ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు ఇద్దరు ఒకే రోజు జన్మించినప్పటికీ వారి బరువులు, పరిమాణలు భిన్నంగా ఉన్నాయి. అలాగే ఇలాంటి సూపర్ఫెటేషన్ జంతువులలో కూడా జరుగుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎలుకలు, కంగారులు, కుందేళ్లు, పిల్లి జాతులు, గొర్రెలు అన్ని సూపర్ఫెటేషన్కు లోబడి ఉన్నాయని పేర్కొన్నారు. చేపలు కూడా ఇదే విధమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాయని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!) -
సైఫాబాద్ సైన్స్ కాలేజీలో మూడు కొత్త కోర్సులు
బంజారాహిల్స్: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్‌లో బుధవారం న్యూ అకడమిక్ కేలెండర్, యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సైఫాబాద్ కాలేజ్ 2023–24 అకడమిక్ ఇయర్లో కొత్త కోర్సులు రావడం, అదే విధంగా పీజీ లేడీస్ హాస్టల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జె. లక్ష్మణ్ నాయక్ అన్నారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ చొరవతో ఈ కాలేజీలో కొత్తగా మూడు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశ పెట్టారన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్, బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నామని అన్నారు.కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవనీత, హాస్టల్ వైస్ ప్రిన్సిపాల్ జగదీశ్వర్, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ రామయ్య, డాక్టర్ వెంకటేష్ , రమణ తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ ఆగిపోయిన సమయాన ..
ఆపిల్ చెట్టు నుంచి పండు కిందపడిపోతుందని అందరికీ తెలుసు... కానీ అది కిందనే ఎందుకు పడాలి..? అని అడిగిన వాడు సర్ ఐజాక్ న్యూటన్. ఉత్తమమైన ప్రశ్న వేస్తే సారవంతమైన పరిష్కారాలు బయటికి వస్తాయి. భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని, అంతరిక్షం లో గ్రహాల కదలికలకు సంబంధించిన విషయాలను ప్రతి పాదించిన ఆయన అఖండ మేధావి, గణిత, భౌతిక శాస్త్రవేత్త. ‘‘అంతరిక్షం లో గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి... అన్న విషయాన్ని ఆకర్షణ సిద్ధాంతం ప్రతి పాదన చేస్తుందనీ, కానీ అక్కడ గ్రహాలు పెట్టిన వారు ఎవరు? అలా పెట్టి వాటిని నియమబద్ధమైన రీతిలో ఇంత వేగంతో ఇలానే కదలాలని నియంత్రిస్తున్నది ఎవరు? ...అన్న విషయాన్ని చెప్పదు’’ అని కూడా ఆయన అన్నారు అందుకే పెద్దలు..‘‘ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది’’ అంటూంటారు. ఉన్న విషయాన్నే కనుక్కొని ప్రతిపాదిస్తే డిస్కవరీ, సృష్టిలో ఇతః పూర్వం లేని విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకుంటే ఇన్వెన్షన్. ఈ రెండింటి ద్వారా నిరూపణచేస్తూ వెడుతుంది సైన్స్. కానీ ఆ సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో... అక్కడ వేదాంతం ప్రారంభం అవుతుంది. అదే న్యూటన్ మాటల్లో తెలుస్తున్నది. మంట పైకే రావాలి, కిందకుపోతే ఎవరికీ పనికిరాదు. నీరు కిందకు పోకుండా పైకి వెడితే సృష్టి నిలబడదు. గాలి దానంతట అది కదులుతూ పోతుంటుంది. సముద్రాలు భూమిని పూర్తిగా ముంచెత్తకుండా ఒక హద్దు దగ్గరే ఆగిపోతుంటాయి... ఇవి కంటికి కనిపించే విషయాలే అయినా ఎవరు వాటిని అలా నియంత్రిస్తున్నారు లేదా ఏ శక్తి వాటిని అలా శాసిస్తున్నది అన్న విషయం ఈ భౌతిక నేత్రానికి కనపడేది కాదు. మొగ్గ పువ్వు అవుతుంది. పరిమళం వెదజల్లుతుంటుంది. పువ్వు పిందె అయింది, పిందె కాయ అయింది, కాయ పండు అయింది, గుజ్జు రసమయింది, బాగా పండిన తరువాత చెట్టుకున్న ముచ్చెను వదిలి కిందపడిపోతున్నది.. సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో చుక్కలు... ఇవన్నీ మనకు కనపడేవే... కానీ వాటిని చక్కగా నియమబద్ధంగా చేసి మనకు చూపుతున్న ఆ శిల్పి ఎవరు? ఆయన మాత్రం కనపడడు. మరి ఆయనను చూడాలని ఉందా!!! ఒక్కటే మార్గం. భక్తి. దీని ద్వారా భారతదేశం సృష్టి రహస్యాలను విప్పి చూపింది... ఎప్పటినుంచో చూపుతూ వస్తున్నది... అందుకే సనాతనమయింది. వేదం ప్రమాణం గా నిర్ణయింపబడింది. అది ఎవరో రచించినది కాదు.. అది ఈశ్వర వాక్కు. భగవద్గీత కూడా అంతే... అందుకే సర్వజనాదరణ ΄పొందింది. సైన్స్ పరిమితులను గురించి న్యూటన్ నిజాయితీగా చెప్పినా గొప్ప మాట చెప్పడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ... నీటిని ఎవరు ఏ పేరు పెట్టి పిలిచినా, దాహం తీరుస్తుంది... అలా తీర్చడం దాని లక్షణం. సైన్స్ అందుకోలేని లేదా విప్పి చెప్పలేని విషయాలను ఆధ్యాత్మికత జన సామాన్యానికి సుళువుగా అందిస్తుంది భక్తి అనే మాథ్యమం ద్వారా.