
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) ఎజెండా ఖరారైంది. మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరిగే ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి తరలి వచ్చే పారిశ్రా మికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వీలుగా కార్యక్రమాలను రూపొందించారు. 300– 350 మందితో నిర్వహించే బ్రేక్ ఔట్‌లో సదస్సు నిర్దేశించిన సందేశం, ఎంచుకున్న లక్ష్యాల తోపాటు వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తారు. ఎంపిక చేసిన ప్యానెల్ ఈ వేదికలను పంచుకుంటుంది. అలాగే సదస్సు నిర్దేశించిన కీలకమైన అంశాలను లోతుగా చర్చించేందుకు మాస్టర్ క్లాస్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు 150 మంది పాల్గొంటారు. నిర్ణీత అంశాలపై ప్యానెల్ బృందంతో ముఖాముఖి చర్చలకు వీలుండేలా 40 మందితో వర్క్‌షాపులు నిర్వహిస్తారు. 28న సాయంత్రం ప్రారంభోత్సవ వేడుక అనంతరం 5.00 నుంచి 7.00 వరకు ప్లీనరీ సెషన్ ఉంటుంది. మార్పునకు స్వాగతం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. మహిళల నాయకత్వమే ఇతివృత్తంగా ప్లీనరీ కొనసాగుతుంది. తమ వ్యాపారాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిన ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ వేదికపై ప్రసంగించే అవకాశం కల్పిస్తారు.
రెండో రోజున
29న ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ‘మేం ఏదైనా సాధిస్తాం’ అనే ఇతివృత్తంతో పని, నైపుణ్యాల శిక్షణలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై గంటన్నర పాటు ప్లీనరీ సెషన్ ఉంటుంది. 10.30 నుంచి 11.15 వరకు స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా శాస్త్ర విజ్ఞానంతో ప్రపంచ ఆవిష్కరణలు, అనుసంధానం అనే అంశంపై చర్చ సాగుతుంది. అనంతరం 23 అంశాలపై చర్చలు కొనసాగుతాయి. మనీ కౌంట్స్–ప్రైవేటు ఈక్విటీలను ఆకర్షించటం, షీ మీన్స్ బిజినెస్–మెంటరింగ్ అండ్ నెట్‌వర్కింగ్, ఈజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్–ప్రభుత్వ రంగం, ఆవిష్కరణల వారధి, హెల్త్‌కేర్ స్టార్టప్‌లలో పెట్టుబడులు, సోషల్ మీడియా సమర్థంగా వినియోగం, హార్వెస్టింగ్ టెక్నాలజీ–అగ్రిటెక్ అంశాలపై మాస్టర్ క్లాస్‌లు, బ్రేక్‌ఔట్లు నిర్వహిస్తారు.
లంచ్ విరామం అనంతరం 1.30కు క్రౌడ్ ఫండింగ్, బూట్ స్ట్రాపింగ్ అనే అంశంపై వర్క్‌షాప్ ఉంటుంది. వ్యాపారంలో తప్పులు అనుభవాలు– గుణపాఠాలు, మీట్ జార్ట్ జెట్‌సన్–మౌలిక సదుపాయాలు అవరోధాలు, కొత్త పారిశ్రామికవేత్తలు–ç Üులభతర వ్యాపార విధానాలు, సహజ వనరుల కొరతను అధిగమించటం, డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ కంప్యూటర్ల వినియోగం–అధునాతన శిక్షణ, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల పాత్ర–సవాళ్లు.. అనే అంశాలపై మాస్టర్ క్లాస్‌లు నిర్వహిస్తారు. ఎం–పెసా నుంచి డిజిటల్ బ్యాంకింగ్ వరకు గ్లోబర్ ఎకానమీ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యాపార విధానాలు, కొత్త సాంకేతిక విజ్ఞానం, వినియోగదారుల కోణంలో వ్యాపారం, పెట్టుబడిదారుల కోణంలో సులభతర వ్యాపారం, సృజనాత్మక పారిశ్రామికవేత్తలు చవిచూసే ఇబ్బందులు, ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులు, పెట్టుబడులు, మిస్సింగ్ మిడిల్ పేరుతో అభివృద్ధి చెందే తరుణంలో పరిశ్రమలు పెట్టుబడులకు ఎదుర్కొనే సవాళ్లు అనే అంశాన్ని చర్చిస్తారు. సాయంత్రం 5 గంటలకు సదస్సు ముగుస్తుంది.
మూడో రోజున
మూడో రోజు 25 అంశాలపై చర్చ జరుగుతుంది. పెట్టుబడుల విజయం.. అనే ఇతివృత్తంతో ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. అభివృద్ధికి అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులు–లాభాలు, ప్రపంచ స్థాయిలో వ్యవసాయం–సవాళ్లు, భవిష్యత్తులో నగరాలు, మహిళలు సొంతంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు–ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానం, సొంత ఆవిష్కరణల పరిరక్షణ, ఇన్నోవేషన్ హబ్స్, ల్యాబ్ నుంచి మార్కెట్ దాకా సైన్సును పారిశ్రామిక రంగానికి జోడించటం, కొత్త సాంకేతిక విజ్ఞానం, భారీ మార్కెట్లలోకి ప్రవేశించటం అనే అంశాలను చర్చిస్తారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం నగదు రహిత సమాజం, కృత్రిమ మేథస్సు ప్రభావం, ఆరోగ్యం–భవిష్యత్తు పరిణామాలు, చెత్త రీ సైక్లింగ్, వ్యాపారం–ఒడిదుడుకులు, క్రీడారంగంలో పెట్టుబడులు, ఏఆర్, వీఆర్ టెక్నాలజీ, ఈ–వాణిజ్యం, ఎకో సిస్టమ్, మీడియా రంగంలో మహిళలు–అవకాశాలు, సమర్థమైన టీమ్ నిర్మాణం–నాయకత్వం, పరిశ్రమలు–భాష, అంతరిక్ష రంగంలో పెట్టుబడులు–అవకాశాలు, వ్యాపార అభివృద్ధిలో కీలక దశలు.. అనే అంశాలపై వేర్వేరుగా చర్చలు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు ‘వెన్ ఉమెన్ విన్.. వియ్ ఆల్ విన్’ అనే సందేశంతో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు, విజయం సాధించిన పారిశ్రామికవేత్తలతో ఆఖరి ప్లీనరీ సెషన్ ఉంటుంది. అవార్డుల ప్రదానంతో చర్చల కార్యక్రమం ముగుస్తుంది. రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు వేడుకలు ఉంటాయి.