Global Entrepreneurship Summit
-
హైదరాబాద్.. హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈనెల 28, 29, 30 తేదీల్లో జరిగే ప్రతిష్టాత్మక సదస్సుకు పది రోజులపాటు హైఅలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. మంగళవారం నుంచి సదస్సు పూర్తయ్యే వరకు ఈ అప్రమత్తత కొనసాగిం చాలని ఐబీ వర్గాలు రాష్ట్ర పోలీస్ శాఖకు సూచించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అత్యంత పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా హుటాహుటిన తనిఖీలు చేపట్టి నివృత్తి చేసుకోవాలని ఐబీ సూచించి నట్టు తెలిసింది. ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఉండటంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిం దని, దేశంలో జరిగే ఇంతటి కార్యక్రమానికి సంఘ విద్రోహ శక్తులు ఆటంకం కల్గించే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో అప్రమత్తం చేసినట్టు తెలిసింది. ఏడు ప్రవేశ మార్గాలు ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యే హెచ్ఐసీసీ సదస్సు ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంది. మంగళవారం ఈ మేరకు శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, ఎస్పీజీ ఐజీలతో కలసి సమీక్షించారు. ఇవాంకా ట్రంప్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెచ్ఐసీసీకి వచ్చే మార్గం, మియాపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా సదస్సు ప్రాంగణానికి ప్రధాని చేరుకునే మార్గం.. ఎలైటింగ్ పాయింట్లను పరిశీలించారు. ప్రధాని మోదీ, ఇవాంకా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సదస్సు లోపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా ఒక మార్గం ఏర్పాటు చేయాలని ఎస్పీజీ ఐజీ సూచించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు లోపలికి వచ్చేందుకు నాలుగు మార్గాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర వీవీఐపీలు వచ్చేందుకు మరో రెండు మార్గాలు.. మొత్తం ఏడు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయాలని ఎస్పీజీ అధికారులు సూచించారు. వెహికల్ ఎలైటింగ్ పాయింట్లు, తిరిగి వెళ్లే పాయింట్లు.. ఇలా 9 పాయింట్లను ఎంపిక చేశారు. మోదీ, ఇవాంకా, కేసీఆర్ కాన్వాయ్ మాత్రమే సదస్సు సమీప ప్రాంతానికి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సదస్సు ఆవరణ ఎస్పీజీ అధీనంలో సదస్సు లోపలి ఆవరణ మొత్తం ఎస్పీజీ అధీనంలోనే ఉండాలని సంబంధిత అధికారులు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. సదస్సు వేదిక మాత్రం ఇవాంకా సెక్యూరిటీ చూసుకుంటుందని, వారి తర్వాత మరో రెండు లేయర్లు ఎస్పీజీ అధికారులు, సిబ్బంది భద్రత పర్యవేక్షిస్తారని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. సదస్సు జరిగే లోపలి ప్రాంతంలో 80 మంది పోలీస్ సిబ్బంది ఉండేలా సెక్యూరిటీ ఆడిటింగ్ చేసినట్టు తెలిసింది. సదస్సు బయటి ప్రాంగణం మొత్తం సైబరాబాద్, ఐఎస్‌డబ్ల్యూ, స్పెషల్ బెటాలియన్లు, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఉపయోగించుకోవాలని ఎస్పీజీ నిర్ణయించినట్లు తెలిసింది. 3 వేల మందితో.. సదస్సు జరిగే ప్రాంతంలో 800 నుంచి 1,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించుతు న్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఇవాంకా విడిది చేసే వెస్ట్రన్ హోటల్, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ షాపింగ్ తదితర ప్రాంతాల్లో 2 వేల మందికి పైగా పోలీస్ సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేశారు. ఇప్పటికే 600 మంది అధికారులు, సిబ్బందిని హెచ్ఐసీసీ, వెస్ట్రన్ హోటల్, మియాపూర్ డిపో, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రాంతాల్లో మోహరించామని ఉన్నతాధికారులు తెలిపారు. మిగతా బలగాలను 24న రంగంలోకి దించుతామన్నారు. -
మహిళా విజయమే ఇతివృత్తం!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) ఎజెండా ఖరారైంది. మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగే ఈ సదస్సులో దేశవిదేశాల నుంచి తరలి వచ్చే పారిశ్రా మికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వీలుగా కార్యక్రమాలను రూపొందించారు. 300– 350 మందితో నిర్వహించే బ్రేక్ ఔట్లో సదస్సు నిర్దేశించిన సందేశం, ఎంచుకున్న లక్ష్యాల తోపాటు వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తారు. ఎంపిక చేసిన ప్యానెల్ ఈ వేదికలను పంచుకుంటుంది. అలాగే సదస్సు నిర్దేశించిన కీలకమైన అంశాలను లోతుగా చర్చించేందుకు మాస్టర్ క్లాస్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు 150 మంది పాల్గొంటారు. నిర్ణీత అంశాలపై ప్యానెల్ బృందంతో ముఖాముఖి చర్చలకు వీలుండేలా 40 మందితో వర్క్‌షాపులు నిర్వహిస్తారు. 28న సాయంత్రం ప్రారంభోత్సవ వేడుక అనంతరం 5.00 నుంచి 7.00 వరకు ప్లీనరీ సెషన్ ఉంటుంది. మార్పునకు స్వాగతం.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. మహిళల నాయకత్వమే ఇతివృత్తంగా ప్లీనరీ కొనసాగుతుంది. తమ వ్యాపారాలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించిన ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ వేదికపై ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. రెండో రోజున 29న ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ‘మేం ఏదైనా సాధిస్తాం’ అనే ఇతివృత్తంతో పని, నైపుణ్యాల శిక్షణలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై గంటన్నర పాటు ప్లీనరీ సెషన్ ఉంటుంది. 10.30 నుంచి 11.15 వరకు స్టార్టప్‌లకు ఊతమిచ్చేలా శాస్త్ర విజ్ఞానంతో ప్రపంచ ఆవిష్కరణలు, అనుసంధానం అనే అంశంపై చర్చ సాగుతుంది. అనంతరం 23 అంశాలపై చర్చలు కొనసాగుతాయి. మనీ కౌంట్స్–ప్రైవేటు ఈక్విటీలను ఆకర్షించటం, షీ మీన్స్ బిజినెస్–మెంటరింగ్ అండ్ నెట్వర్కింగ్, ఈజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్–ప్రభుత్వ రంగం, ఆవిష్కరణల వారధి, హెల్త్‌కేర్ స్టార్టప్‌లలో పెట్టుబడులు, సోషల్ మీడియా సమర్థంగా వినియోగం, హార్వెస్టింగ్ టెక్నాలజీ–అగ్రిటెక్ అంశాలపై మాస్టర్ క్లాస్‌లు, బ్రేక్ఔట్లు నిర్వహిస్తారు. లంచ్ విరామం అనంతరం 1.30కు క్రౌడ్ ఫండింగ్, బూట్ స్ట్రాపింగ్ అనే అంశంపై వర్క్‌షాప్ ఉంటుంది. వ్యాపారంలో తప్పులు అనుభవాలు– గుణపాఠాలు, మీట్ జార్ట్ జెట్సన్–మౌలిక సదుపాయాలు అవరోధాలు, కొత్త పారిశ్రామికవేత్తలు–ç Üులభతర వ్యాపార విధానాలు, సహజ వనరుల కొరతను అధిగమించటం, డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ కంప్యూటర్ల వినియోగం–అధునాతన శిక్షణ, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల పాత్ర–సవాళ్లు.. అనే అంశాలపై మాస్టర్ క్లాస్‌లు నిర్వహిస్తారు. ఎం–పెసా నుంచి డిజిటల్ బ్యాంకింగ్ వరకు గ్లోబర్ ఎకానమీ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యాపార విధానాలు, కొత్త సాంకేతిక విజ్ఞానం, వినియోగదారుల కోణంలో వ్యాపారం, పెట్టుబడిదారుల కోణంలో సులభతర వ్యాపారం, సృజనాత్మక పారిశ్రామికవేత్తలు చవిచూసే ఇబ్బందులు, ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో వస్తున్న మార్పులు, పెట్టుబడులు, మిస్సింగ్ మిడిల్ పేరుతో అభివృద్ధి చెందే తరుణంలో పరిశ్రమలు పెట్టుబడులకు ఎదుర్కొనే సవాళ్లు అనే అంశాన్ని చర్చిస్తారు. సాయంత్రం 5 గంటలకు సదస్సు ముగుస్తుంది. మూడో రోజున మూడో రోజు 25 అంశాలపై చర్చ జరుగుతుంది. పెట్టుబడుల విజయం.. అనే ఇతివృత్తంతో ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది. అభివృద్ధికి అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులు–లాభాలు, ప్రపంచ స్థాయిలో వ్యవసాయం–సవాళ్లు, భవిష్యత్తులో నగరాలు, మహిళలు సొంతంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు–ప్రపంచ వాణిజ్యంతో అనుసంధానం, సొంత ఆవిష్కరణల పరిరక్షణ, ఇన్నోవేషన్ హబ్స్, ల్యాబ్ నుంచి మార్కెట్ దాకా సైన్సును పారిశ్రామిక రంగానికి జోడించటం, కొత్త సాంకేతిక విజ్ఞానం, భారీ మార్కెట్లలోకి ప్రవేశించటం అనే అంశాలను చర్చిస్తారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం నగదు రహిత సమాజం, కృత్రిమ మేథస్సు ప్రభావం, ఆరోగ్యం–భవిష్యత్తు పరిణామాలు, చెత్త రీ సైక్లింగ్, వ్యాపారం–ఒడిదుడుకులు, క్రీడారంగంలో పెట్టుబడులు, ఏఆర్, వీఆర్ టెక్నాలజీ, ఈ–వాణిజ్యం, ఎకో సిస్టమ్, మీడియా రంగంలో మహిళలు–అవకాశాలు, సమర్థమైన టీమ్ నిర్మాణం–నాయకత్వం, పరిశ్రమలు–భాష, అంతరిక్ష రంగంలో పెట్టుబడులు–అవకాశాలు, వ్యాపార అభివృద్ధిలో కీలక దశలు.. అనే అంశాలపై వేర్వేరుగా చర్చలు జరుగుతాయి. సాయంత్రం 4 గంటలకు ‘వెన్ ఉమెన్ విన్.. వియ్ ఆల్ విన్’ అనే సందేశంతో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతోపాటు, విజయం సాధించిన పారిశ్రామికవేత్తలతో ఆఖరి ప్లీనరీ సెషన్ ఉంటుంది. అవార్డుల ప్రదానంతో చర్చల కార్యక్రమం ముగుస్తుంది. రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు వేడుకలు ఉంటాయి. -
అహో అనేలా.. ఆతిథ్యం అదిరేలా!
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలోని ఇంద్రధనుస్సు నేలకు దిగివచ్చిందా అన్నట్లు ఫ్లై ఓవర్ మలుపు వద్ద ఏడు రంగుల అందాలు.. అతిథులకిదే మా స్వాగతం అన్నట్లు నిర్మల్ బొమ్మలు.. రోడ్డు పక్కన జాతీయ పక్షి నెమలి వయ్యారాలు.. రాష్ట్ర పక్షి పాలపిట్ట విన్యాసాలు.. ఒకటేమిటి.. రంగురంగుల అందాలతో హైదరాబాద్ నగర రహదారులు, ఫ్లై ఓవర్ మార్గాలు సరికొత్త సొగసులద్దుకుంటున్నాయి. ప్రకృతి రమణీయ చిత్రాలు, పరవశింపజేసే పక్షులు రోడ్ల వెంబడి దర్శనమిస్తున్నాయి. దేశ, రాష్ట్ర సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబిస్తూ.. తెలంగాణ కళను ప్రదర్శిస్తూ హైదరాబాద్ హైటెక్ సిటీ, పాతబస్తీ, ఫలక్‌నుమా మార్గాలు కొత్త హొయలు పోతున్నాయి. వచ్చే మంగళవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) జరగనున్న నేపథ్యంలో.. 150 దేశాల నుంచి వస్తున్న 1,500 మంది దేశ, విదేశాల ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ జీహెచ్ఎంసీ ఈ ఏర్పాట్లు చేస్తోంది. దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సు నిర్వహణకు దేశంలోని వివిధ నగరాలు పోటీ పడినా హైదరాబాద్‌కే అవకాశం లభించడంతో నగర కీర్తిని ఇనుమడింపజేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మైక్రో సర్ఫేసింగ్ రోడ్లు.. ప్రతినిధులు పర్యటించే మార్గాల్లో ఆటంకం లేకుండా, ప్రయాణం సాఫీగా సాగేలా రహదారులకు మెరుగులు దిద్దుతున్నారు. హెచ్ఐసీసీలో సదస్సు జరుగనుండటంతో హైటెక్ సిటీ ప్రాంతంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, శిల్పారామం, కొండాపూర్, కొత్తగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రహదారుల పనుల స్పీడు పెంచారు. మినీ చార్మినార్ నుంచి న్యాక్ గేట్ వరకు సన్నని బీటీ మిశ్రమంతో మైక్రో సర్ఫేసింగ్ రోడ్డు వేస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ తదితర పర్యాటక ప్రాంతాలను అతిథులు సందర్శించనున్నందున చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు, ఫలక్‌నుమా నుంచి శాలిబండ వరకు, సాలార్జంగ్ మ్యూజియం పరిసరాలు, ఆరాంఘర్, శంషాబాద్, పాత కర్నూల్ రోడ్ ప్రాంతాల్లోనూ పనులు జరుగుతున్నాయి. చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, గోల్కొండ పరిసరాలనూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. నగరంలో ఓ ఫై ఓవర్‌పై ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన నెమలి చిత్రం సీఎస్సార్ ద్వారా రూ.కోటి.. అన్ని మార్గాల్లోని రహదారుల సెంట్రల్ మీడియన్లకు రంగులు, ఫుట్‌పాత్‌లతోపాటు లేన్ మార్క్‌లు, స్టడ్‌లతో పాటు రాత్రివేళల్లో రహదారులు జిగేల్ మనేలా ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. హైటెక్స్ ప్రాంతాల్లో ప్రత్యేక రంగుల విద్యుల్లతలు కోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రముఖ శిల్పకారుడు మనోహర్ రూపొందించే ప్రత్యేక శిల్పాలు, పచ్చని మొక్కలను సదస్సు తేదీ నాటికి ఏర్పాటు చేయనున్నారు. రహదారులు, శిల్ప, చిత్రకళా సౌందర్యాలు, రంగురంగుల విద్యుత్ దీపాల ఏర్పాట్లుకు జీహెచ్ఎంసీ రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో రూ.కోటికి పైగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద వివిధ కార్పొరేట్ సంస్థలు అందించాయి. అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరవుతున్న విషయం తెలిసిందే. మాదాపూర్ రోడ్డు డివైడర్‌పై పూలకుండీలకు పెయింటింగ్ వేస్తున్న దృశ్యం 25 లోగా పూర్తి చేస్తాం రహదారుల పనులు ఇంకా పూర్తికాక పోవడం, సమయం దగ్గర పడుతుండటంపై అధికారులు స్పందించారు. 25వ తేదీ నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. రంగులు, పచ్చదనం, పూల అలంకరణల పనులు సదస్సు ప్రారంభ తేదీ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. చార్మినార్ వద్ద పనులు చేపడుతున్న దృశ్యం ఎప్పుడైనా చేయాల్సిన పనులే ఇంటికి చుట్టాలొస్తున్నారంటే ఇళ్లు శుభ్రం చేసి ఆహ్వానించడం మన సంప్రదాయం. అలాంటిది ఇతర నగరాలకు దక్కని అవకాశం హైదరాబాద్‌ను వరించింది. విదేశీ ప్రతినిధులు నగరానికి వస్తుంటే ‘అతిథి దేవోభవ’అనకుండా ఉంటామా?.. ఇదొక అవకాశంగా భావించి పనులు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా ఖర్చు చేయడం లేదు. రోడ్ల పనులు ఎప్పుడైనా చేయాల్సినవే. సీఎస్సార్ నిధులతో మన సంస్కృతి, కళలు ఉట్టిపడేలా ఆకర్షణగా రహదారులను తీర్చిదిద్దుతున్నాం. సదస్సు తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ పనులు చేస్తాం. – బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
ఇవాంకా పర్యటనతో సుతిమెత్తని హెచ్చరికలు