
రంగులతో తీర్చిదిద్దిన హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్ కింద కళారూపాలు
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలోని ఇంద్రధనుస్సు నేలకు దిగివచ్చిందా అన్నట్లు ఫ్లై ఓవర్ మలుపు వద్ద ఏడు రంగుల అందాలు.. అతిథులకిదే మా స్వాగతం అన్నట్లు నిర్మల్ బొమ్మలు.. రోడ్డు పక్కన జాతీయ పక్షి నెమలి వయ్యారాలు.. రాష్ట్ర పక్షి పాలపిట్ట విన్యాసాలు.. ఒకటేమిటి.. రంగురంగుల అందాలతో హైదరాబాద్ నగర రహదారులు, ఫ్లై ఓవర్ మార్గాలు సరికొత్త సొగసులద్దుకుంటున్నాయి. ప్రకృతి రమణీయ చిత్రాలు, పరవశింపజేసే పక్షులు రోడ్ల వెంబడి దర్శనమిస్తున్నాయి. దేశ, రాష్ట్ర సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబిస్తూ.. తెలంగాణ కళను ప్రదర్శిస్తూ హైదరాబాద్ హైటెక్ సిటీ, పాతబస్తీ, ఫలక్‌నుమా మార్గాలు కొత్త హొయలు పోతున్నాయి. వచ్చే మంగళవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) జరగనున్న నేపథ్యంలో.. 150 దేశాల నుంచి వస్తున్న 1,500 మంది దేశ, విదేశాల ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ జీహెచ్‌ఎంసీ ఈ ఏర్పాట్లు చేస్తోంది. దక్షిణాసియాలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సు నిర్వహణకు దేశంలోని వివిధ నగరాలు పోటీ పడినా హైదరాబాద్‌కే అవకాశం లభించడంతో నగర కీర్తిని ఇనుమడింపజేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మైక్రో సర్ఫేసింగ్ రోడ్లు..
ప్రతినిధులు పర్యటించే మార్గాల్లో ఆటంకం లేకుండా, ప్రయాణం సాఫీగా సాగేలా రహదారులకు మెరుగులు దిద్దుతున్నారు. హెచ్‌ఐసీసీలో సదస్సు జరుగనుండటంతో హైటెక్ సిటీ ప్రాంతంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, శిల్పారామం, కొండాపూర్, కొత్తగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రహదారుల పనుల స్పీడు పెంచారు. మినీ చార్మినార్ నుంచి న్యాక్ గేట్ వరకు సన్నని బీటీ మిశ్రమంతో మైక్రో సర్ఫేసింగ్ రోడ్డు వేస్తున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ తదితర పర్యాటక ప్రాంతాలను అతిథులు సందర్శించనున్నందున చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు, ఫలక్‌నుమా నుంచి శాలిబండ వరకు, సాలార్జంగ్ మ్యూజియం పరిసరాలు, ఆరాంఘర్, శంషాబాద్, పాత కర్నూల్ రోడ్ ప్రాంతాల్లోనూ పనులు జరుగుతున్నాయి. చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, గోల్కొండ పరిసరాలనూ అందంగా తీర్చిదిద్దుతున్నారు.
నగరంలో ఓ ఫై ఓవర్‌పై ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన నెమలి చిత్రం
సీఎస్సార్ ద్వారా రూ.కోటి..
అన్ని మార్గాల్లోని రహదారుల సెంట్రల్ మీడియన్లకు రంగులు, ఫుట్‌పాత్‌లతోపాటు లేన్ మార్క్‌లు, స్టడ్‌లతో పాటు రాత్రివేళల్లో రహదారులు జిగేల్ మనేలా ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. హైటెక్స్ ప్రాంతాల్లో ప్రత్యేక రంగుల విద్యుల్లతలు కోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రముఖ శిల్పకారుడు మనోహర్ రూపొందించే ప్రత్యేక శిల్పాలు, పచ్చని మొక్కలను సదస్సు తేదీ నాటికి ఏర్పాటు చేయనున్నారు. రహదారులు, శిల్ప, చిత్రకళా సౌందర్యాలు, రంగురంగుల విద్యుత్ దీపాల ఏర్పాట్లుకు జీహెచ్‌ఎంసీ రూ.50 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో రూ.కోటికి పైగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద వివిధ కార్పొరేట్ సంస్థలు అందించాయి. అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరవుతున్న విషయం తెలిసిందే.
మాదాపూర్ రోడ్డు డివైడర్‌పై పూలకుండీలకు పెయింటింగ్ వేస్తున్న దృశ్యం
25 లోగా పూర్తి చేస్తాం
రహదారుల పనులు ఇంకా పూర్తికాక పోవడం, సమయం దగ్గర పడుతుండటంపై అధికారులు స్పందించారు. 25వ తేదీ నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. రంగులు, పచ్చదనం, పూల అలంకరణల పనులు సదస్సు ప్రారంభ తేదీ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు.
చార్మినార్ వద్ద పనులు చేపడుతున్న దృశ్యం
ఎప్పుడైనా చేయాల్సిన పనులే
ఇంటికి చుట్టాలొస్తున్నారంటే ఇళ్లు శుభ్రం చేసి ఆహ్వానించడం మన సంప్రదాయం. అలాంటిది ఇతర నగరాలకు దక్కని అవకాశం హైదరాబాద్‌ను వరించింది. విదేశీ ప్రతినిధులు నగరానికి వస్తుంటే ‘అతిథి దేవోభవ’అనకుండా ఉంటామా?.. ఇదొక అవకాశంగా భావించి పనులు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా ఖర్చు చేయడం లేదు. రోడ్ల పనులు ఎప్పుడైనా చేయాల్సినవే. సీఎస్సార్ నిధులతో మన సంస్కృతి, కళలు ఉట్టిపడేలా ఆకర్షణగా రహదారులను తీర్చిదిద్దుతున్నాం. సదస్సు తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ పనులు చేస్తాం.
– బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment