
మంగళవారం హైటెక్‌సిటీ వద్ద భద్రతా దళాల తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈనెల 28, 29, 30 తేదీల్లో జరిగే ప్రతిష్టాత్మక సదస్సుకు పది రోజులపాటు హైఅలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. మంగళవారం నుంచి సదస్సు పూర్తయ్యే వరకు ఈ అప్రమత్తత కొనసాగిం చాలని ఐబీ వర్గాలు రాష్ట్ర పోలీస్ శాఖకు సూచించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అత్యంత పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా హుటాహుటిన తనిఖీలు చేపట్టి నివృత్తి చేసుకోవాలని ఐబీ సూచించి నట్టు తెలిసింది. ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్ లిస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఉండటంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిం దని, దేశంలో జరిగే ఇంతటి కార్యక్రమానికి సంఘ విద్రోహ శక్తులు ఆటంకం కల్గించే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో అప్రమత్తం చేసినట్టు తెలిసింది.
ఏడు ప్రవేశ మార్గాలు
ప్రపంచవ్యాప్తంగా 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యే హెచ్‌ఐసీసీ సదస్సు ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంది. మంగళవారం ఈ మేరకు శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, ఎస్పీజీ ఐజీలతో కలసి సమీక్షించారు. ఇవాంకా ట్రంప్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెచ్‌ఐసీసీకి వచ్చే మార్గం, మియాపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా సదస్సు ప్రాంగణానికి ప్రధాని చేరుకునే మార్గం.. ఎలైటింగ్ పాయింట్లను పరిశీలించారు. ప్రధాని మోదీ, ఇవాంకా, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సదస్సు లోపలికి వచ్చేందుకు ప్రత్యేకంగా ఒక మార్గం ఏర్పాటు చేయాలని ఎస్పీజీ ఐజీ సూచించారు. అలాగే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు లోపలికి వచ్చేందుకు నాలుగు మార్గాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర వీవీఐపీలు వచ్చేందుకు మరో రెండు మార్గాలు.. మొత్తం ఏడు ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేయాలని ఎస్పీజీ అధికారులు సూచించారు. వెహికల్ ఎలైటింగ్ పాయింట్లు, తిరిగి వెళ్లే పాయింట్లు.. ఇలా 9 పాయింట్లను ఎంపిక చేశారు. మోదీ, ఇవాంకా, కేసీఆర్ కాన్వాయ్ మాత్రమే సదస్సు సమీప ప్రాంతానికి చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సదస్సు ఆవరణ ఎస్పీజీ అధీనంలో
సదస్సు లోపలి ఆవరణ మొత్తం ఎస్పీజీ అధీనంలోనే ఉండాలని సంబంధిత అధికారులు రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. సదస్సు వేదిక మాత్రం ఇవాంకా సెక్యూరిటీ చూసుకుంటుందని, వారి తర్వాత మరో రెండు లేయర్లు ఎస్పీజీ అధికారులు, సిబ్బంది భద్రత పర్యవేక్షిస్తారని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. సదస్సు జరిగే లోపలి ప్రాంతంలో 80 మంది పోలీస్ సిబ్బంది ఉండేలా సెక్యూరిటీ ఆడిటింగ్ చేసినట్టు తెలిసింది. సదస్సు బయటి ప్రాంగణం మొత్తం సైబరాబాద్, ఐఎస్‌డబ్ల్యూ, స్పెషల్ బెటాలియన్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్స్ ఉపయోగించుకోవాలని ఎస్పీజీ నిర్ణయించినట్లు తెలిసింది.
3 వేల మందితో..
సదస్సు జరిగే ప్రాంతంలో 800 నుంచి 1,000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించుతు న్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఇవాంకా విడిది చేసే వెస్ట్రన్ హోటల్, ఫలక్‌నుమా ప్యాలెస్, చార్మినార్ షాపింగ్ తదితర ప్రాంతాల్లో 2 వేల మందికి పైగా పోలీస్ సిబ్బందిని బందోబస్తులో నిమగ్నం చేశారు. ఇప్పటికే 600 మంది అధికారులు, సిబ్బందిని హెచ్‌ఐసీసీ, వెస్ట్రన్ హోటల్, మియాపూర్ డిపో, ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రాంతాల్లో మోహరించామని ఉన్నతాధికారులు తెలిపారు. మిగతా బలగాలను 24న రంగంలోకి దించుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment