
పర్యాటక రంగం ద్వారా పెద్దఎత్తున ఉపాధి: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: అందాల పోటీ ద్వారా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తామని, ఇందులో తప్పేముందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చాలా దేశాలకు తెలంగాణ అంటే తెలియదని, అందుకే హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీన్ని కొంతమంది వక్రీకరించడం సరికాదన్నారు. ఎక్సైజ్, పర్యాటకశాఖ పద్దులపై శాసనసభలో మంగళవారం చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన పలు సందేహాలకు మంత్రి బదులిచ్చారు. పర్యాటకరంగం ద్వారా ఉద్యోగ ఉపాధి పెద్దఎత్తున కల్పిస్తున్నామని, పర్యాటక పాలసీ ద్వారా ఐదేళ్లలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఎకోవెల్‌నెస్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, యాదగిరిగుట్ట సహా 27 ప్రత్యేక టూరిజం కేంద్రాలను గుర్తించినట్టు చెప్పారు. అంతర్జాతీయ సమావేశాలకు 20 వేల మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో బెల్ట్‌షాప్‌ల నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 1,200 మంది కొత్త వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వబోతున్నామని, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గద్దర్ సహా పలువురు ప్రముఖ కళాకారులకు రూ. కోటి ఇవ్వనున్నట్టు చెప్పా రు.
కాగా, అందాల పోటీ వల్ల ఆదాయం వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఏం న్యాయమని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ఈ పోటీలకు రూ.54 కోట్లు వ్యయం చేస్తున్న సర్కారు, అదే ఫార్ములా వన్‌కు నిధులు వ్యయం చేయడాన్ని తప్పుపట్టడం డబుల్ స్టాండర్డ్ కాదా అని ప్రశ్నించారు. సచివాలయం ఎదుట అంబేడ్కర్ విగ్రహానికి ఎందుకు ముసుగు తొలగించలేదని అడిగారు. దీనికి మంత్రి జూపల్లి బదులిస్తూ, అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి బీఆర్‌ఎస్‌కు పదేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు.
పలు పద్దులు ఆమోదం
సుదీర్ఘ చర్చ అనంతరం పలు పద్దులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. ఇందులో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన సేవ లు, రోడ్లు, భవనాలు, మద్య నిషేధం, సాంస్కృతి క, పురావస్తు, దేవాదాయ, అడవులు, శాస్త్ర సాంకేతిక, పర్యావరణం సంబంధిత పద్దులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment