tourism policy
-
డిసెంబర్ చివరి నాటికి టూరిజం పాలసీ సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 31 నాటికి రాష్ట్రానికి ప్రత్యేకంగా పర్యాటక విధానాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దానిని తదుపరి శాసనసభ సమావేశాల్లో చర్చకు ఉంచి సమగ్రంగా చర్చించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన పర్యాటక శాఖపై సమీక్షించారు. తెలంగాణలో వాతావరణపరంగా అనుకూల పరిస్థితి ఉండటం, శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటం పర్యాటక రంగ పురోగతికి కలిసొచ్చే అంశాలని, వీటిని వినియోగించుకుంటూ పర్యాటకులు అధికంగా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పర్యాటకశాఖ స్వయంసమృద్ధి సాధించేలా చూడాలని, ఇందుకోసం కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్, చైనాల్లో పర్యాటకరంగం వృద్ధి చెందేందుకు అనుసరించిన పద్ధతులను అధ్యయనం చేసి స్థానికంగా అనువైన అంశాలను అనుసరించాలని చెప్పారు. తమిళనాడు తరహాలో ఆటోమొబైల్ రంగం స్థానికంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్టులు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయని, ఇందుకోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు పులులు వచ్చేలా చూడాలని సూచించారు. పులులు తిరిగే ప్రాంతాలకు చేరువగా ఉన్న దేవాలయాలను అనుసంధానిస్తూ ఎకో టూరిజం–టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేయాలని సూచించారుమహిళలకు ఉచిత ప్రయాణం వల్ల దేవాలయాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగిందని, ఇది కూడా పర్యాటకాభివృద్ధికి దోహదమయ్యే అంశమేనన్నారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో దానికి చేరుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ నుంచి లీజుకు తీసుకున్న స్థలాలను గడువు ముగిసినా ఖాళీ చేయని సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆయా స్థలాలపై ఉన్న కోర్టు స్టేలను ఎత్తివేసేలా అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని ఖాళీ చేసిన తర్వాత ఆ భవనాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. చార్మినార్ ను మరింత మంది సందర్శించాలంటే ఏం చేయాలో తేల్చి ఆమేరకు చర్యలు తీసుకోవాలన్నా రు. సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
కొత్తకొత్తగా ఉన్నది... పెళ్లి అక్కడే అన్నది
భారతీయ జంటలు వివాహ వేడుకలకు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తున్నాయి. వివాహమనే మధుర ఘట్టాన్ని జీవితంలో మరుపురాని క్షణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అందుకే చారిత్రక, సాంస్కృతిక, బీచ్, పర్యాటక ప్రాశస్త్యం కలిగిన కేంద్రాలను పెళ్లి వేదికలుగా మార్చుకుంటున్నాయి. ఫలితంగా దేశంలో సంప్రదాయ వివాహాలకు భిన్నంగా ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్’కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఆర్థికంగా స్థిరపడినవారు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. మధ్యతరగతి ప్రజలు దేశంలోని సుదీర్ఘ, మూరుమూల ప్రాంతాల్లో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. – సాక్షి, అమరావతి అతిథులు తక్కువ.. ఖర్చు ఎక్కువ! కోవిడ్ సమయంలో తక్కువ మంది అతిథుల మధ్య వివాహాలు జరిగాయి. ఫలితంగా పెళ్లిళ్ల బడ్జెట్ కూడా తగ్గింది. అయితే కోవిడ్‌కి ముందు పెళ్లికి హాజరయ్యే సగటు అతిథుల సంఖ్య 350–400గా ఉండేది. కానీ.. ప్రస్తుతం ఇది 150నుంచి 250 వరకు వచ్చింది. అయినప్పటికీ పెళ్లిళ్ల బడ్జెట్లు మాత్రం భారీగా ఉంటున్నాయి. అతిథుల జాబితాలు తగ్గిపోయినప్పటికీ.. వివాహాలను వైభవంగా చేసుకోవడానికి ఎక్కడా రాజీ పడట్లేదు. చాలామంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు/వెడ్టెక్ సంస్థలను సంప్రదిస్తూ రిసార్ట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్‌లను ఎంచుకోవడమే ఇందుకు కారణం. 25 శాతం వివాహాలు భారతదేశంలోనే..: ప్రపంచవ్యా ప్తంగా ఏటా జరిగే వివాహాల్లో 25 శాతం భారత్‌లోనే ఉంటున్నాయి. భూమ్మీద జరిగే ప్రతి నాలుగు పెళ్లిళ్లలో ఒకటి భారతీయులదే. ప్రపంచ వివాహ పరిశ్రమలో భారత్, చైనాల వాటాయే అత్యధికం. ఇక దేశీయంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా, లక్షద్వీప్, కేరళ, హేవ్‌లాక్ ఐలాండ్, మహారాష్ట్రలోని ఆలీబాగ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కేంద్రాలుగా మారాయి. రాజస్థాన్ దేశంలోనే గొప్ప వెడ్డింగ్ డెస్టినేషన్‌గా కొనసాగుతోంది. అక్కడి పురాతన కోటలు, రాజప్రాసాదాల మధ్య వివాహాలకు యువత ఆసక్తి చూపుతోంది. జైపూర్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, జైసల్మేర్, రణతంబోర్, బికనీర్ వెడ్డింగ్ ప్లానర్లకు ప్రధాన కేంద్రాలు మారాయి. దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సగటున రూ.15 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఉన్నత వర్గాల్లో అయితే ఒక్కో అతిథికి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు యువత ఎక్కువ ఆసక్తి చూపడం విశేషం. థాయ్‌లాండ్‌లో అత్యధికం..: భారతీయులు విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా థాయ్‌లాండ్‌ను ఇష్టపడుతున్నారు. గత ఏడాది అక్కడ జరిగిన విదేశీ పెళ్లిళ్లలో 60% భారతీయులవే కావడం విశేషం. మునుపెన్నడూ లేనంతగా భారతీయ జంటలు బ్యాంకాక్, కో స్యామ్యూయ్, ఫుకెట్, హువా హిన్, చయాంగ్ మాయ్ వివాహ వేడుకలకు కేరాఫ్‌గా మారాయి. థాయ్ టూరిజం అథారిటీ సైతం భారత్‌లోని వెడ్డింగ్ ప్లానర్ల భాగస్వామ్యం కలిగి ఉండటంతో సగటు ఏటా 400 జంటలు బంధుమిత్ర సమేతంగా అక్కడకు వెళ్లి వివాహాలు చేసుకుంటున్నాయి. దేశంలో వెడ్డింగ్ టూరిజం పాలసీ భారతదేశంలో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ముసాయిదాను కూడా సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 50కిపైగా డెస్టినేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు పుణ్యక్షేత్రాలు డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. ఇకపై అరకు, కోనసీమ, విశాఖ సాగర తీరం, హార్ల్సీహిల్స్, ఇరుక్కం దీవి, పిచ్చుకల్లంక, హోప్ఐలాండ్ ప్రాంతాలను విదేశీయులను సైతం ఆకర్షించేలా ఏపీటీడీసీ అభివృద్ధి చేయనుంది. -
పర్యాటకం.. పరవశం.. పెట్టుబడిదారుల చూపు ఏపీ వైపు
సాక్షి, అమరావతి: కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం తర్వాత పర్యాటక రంగానికి నూతన టూరిజం పాలసీ (2020–2025) కొత్త ఊపు ఇచ్చింది. గత పాలసీ కంటే మెరుగ్గా.. పెట్టుబడిదారులను ఆకర్షించే రాయితీలతో సుమారు రూ.2,600 కోట్లకు పైగా ప్రాజెక్టులను సమీకరించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆతిథ్య రంగ సంస్థలైన ఒబెరాయ్, తాజ్ వరుణ్, హయత్ సంస్థలు రాష్ట్రంలో ఏడు, ఐదు నక్షత్రాల హోటళ్లు, అత్యాధునిక వసతులతో విల్లాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా దాదాపు 48 వేల మందికి ఉపాధి దక్కనుంది. చదవండి: చిన్నారులకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలోని బీచ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే విశాఖపట్నంలోని రిషికొండకు ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ గుర్తింపు రాగా.. గుంటూరు జిల్లాలోని సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్‌లను కూడా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తొలిదశలో అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్లతో స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. ఇక వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటను పర్యాటక సిటీగా అభివృద్ధి చేసేందుకు సుమారు 4,300 ఎకరాల భూమిని గుర్తించారు. మరోవైపు.. రాష్ట్రంలో పాడేరు, జంగారెడ్డిగూడెం, పట్టిసీమ ప్రాజెక్టు ప్రాంతంలో అగ్రి టూరిజాన్ని ప్రోత్సహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం.. సుదీర్ఘకాలం తర్వాత నవంబర్ 7న అత్యంత భద్రతా ప్రమాణాలతో పాపికొండలు బోటు యాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కృష్ణా నదిపై కూడా జల విహారం సందడి చేసింది. ప్రస్తుతం పోచమ్మగండి, పోచవరం నుంచి పాపికొండలుకు బోటింగ్ పాయింట్ ఉండగా.. పోచవరం నుంచి భద్రాచలానికి ఏపీ పర్యాటక బోటును తిప్పేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సింగనపల్లి బోటింగ్ పాయింట్ నీటిలో మునిగిపోగా కొత్త పాయింట్ కోసం టూరిజం అధికారులు జలవనరుల శాఖకు విన్నవించారు. మరోవైపు.. పర్యాటక సంస్థలకు చెందిన 33 హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) కింద ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఏడాదికి సుమారు రూ.2 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించేందుకు టెండర్లు పిలిచారు. పాత టెండర్లలో ఎనిమిది ప్రాజెక్టులు త్వరలో ఒప్పందం చేసుకోనున్నాయి. పర్యాటకుల సందడి.. ఆదాయం ఇలా.. ఈ ఏడాది ఇప్పటివరకు 5.81 కోట్ల మంది దేశీయ, 33 వేల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రంలోని పర్యాటక స్థలాలను సందర్శించినట్లు టూరిజం గణాంకాలు చెబుతున్నాయి. గతంలో పోలిస్తే ఇందులో 16 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ ఆదాయంలో మాత్రం పెరుగుదల ఉంది. ముఖ్యంగా పర్యాటక రంగానికి ఎక్కువ ఆదాయం హోటల్ రంగం నుంచి వస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా గతేడాది రూ.29.76 కోట్లు రాగా ఈ ఏడాది 59.95 కోట్లు ఆదాయం గడించింది. మరోవైపు.. వాటర్ ఫ్లిట్ (గుహలు, సౌండ్ అండ్లైట్స్, రోప్‌పే, బోటింగ్) విభాగం ద్వారా గతేడాది రూ.6.45 కోట్లు రాగా ఈ ఏడాది ఇప్పటివరకు 12.68 కోట్లు వచ్చింది. ఈ రెండింటిలో 50 శాతం మేర వృద్ధిరేటు కనిపించడం ఊరటనిచ్చే అంశం. సాంకేతిక ఒరవడి.. ►ఇక పర్యాటకాభివృద్ధికి ఆ శాఖ సాంకేతికతను జోడిస్తోంది. ఇప్పటికే హరిత హోటళ్లలో సాంప్రదాయ మెనూ కార్డు స్థానంలో క్యూఆర్ కోడ్ మెనూను పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది. కొత్త ఏడాదిలో వీటిని అన్ని హోటళ్లలో ప్రవేశపెట్టనుంది. ►రాష్ట్ర పర్యాటక గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు డిజిటల్ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రత్యేక మార్కెటింగ్ స్ట్రాటజీని రూపొందించింది. ►అలాగే, రాజమండ్రిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి తీసుకురాగా విజయవాడ బెరం పార్కులో రెండు భారీ జెట్టీలతో మరో తేలియాడే రెస్టారెంట్‌ను నిర్మిస్తున్నారు. ►సుమారు రూ.వెయ్యి కోట్లతో చేపట్టే విశాఖ బీచ్ కారిడార్ ప్రాజెక్టు పర్యాటక శాఖ నుంచి పురపాలక శాఖకు బదిలీ చేశారు. ఇందులో భాగంగా భీమిలి–భోగాపురం సీప్లేన్ (సముద్ర విమానయానం)కు అవసరమైన జెట్టీని, బీచ్‌లలో మౌలిక వసతులను కల్పించేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. -
పర్యాటక రంగానికి చేయూత
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చి.. రాష్ట్ర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మించే క్రమంలో విశాఖ, తిరుపతి నగరాల్లో హోటళ్లను నిర్మించేందుకు ఓబరాయ్ హోటల్ ముందుకొచ్చినట్టు తెలిపారు. కరోనా వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎంపీలు బి.సత్యవతి, మాధవి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, జి.బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా టూరిజం పాలసీ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి.. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు టూరిజంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని హరిత బరంపార్క్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టూరిజం పాలసీ దేశంలోనే బెస్ట్ పాలసీ కానుందని తెలిపారు. వైజాగ్ బీచ్ కారిడార్‌తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లంబసింగి, అరకు ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, రికార్డ్ స్థాయిలో ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వైజాగ్, గండికోటల్లో అడ్వంచర్ బోట్స్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. విజయవాడ హరిత బరంపార్క్కు బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ ఫుడ్ ఫాల్, బెస్ట్ ఆపరేషన్స్‌కు గానూ ఏపీటీడీసీ అవార్డ్‌ను ప్రకటించింది. దీనిని బరంపార్క్ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్‌కు రజత్ భార్గవ అందించారు. -
పర్యాటకానికి కొత్త కళ
సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పన, మెరుగైన సేవలే లక్ష్యంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టీడీసీ) ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద హోటళ్లు, కాటేజీలు, బీచ్ రిసార్ట్లు, రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. పర్యాటక ఆస్తుల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. 16 ప్రాజెక్టుల అభివృద్ధి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద 16 ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. వీటిలో విజయనగరం జిల్లా తాతిపూడి (రిసార్ట్), విశాఖ జిల్లా నక్కపల్లి (వే ఎమినిటీస్), రేవు పోలవరం, శ్రీకాకుళం జిల్లాలోని మొఫస్ బందర్, నెల్లూరు జిల్లా తుమ్మలపెంట, తుపిలిపాలెం (బీచ్ రిసార్ట్స్), ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాలెం, చిత్తూరు జిల్లా నాగపట్ల, తిమ్మసముద్రం, తానపల్లె (హోటల్, వే ఎమినిటీస్) కడప టౌన్ (బాంకెట్ హాల్), కర్నూలులోని వెంకటరమణ కాలనీ, అనంతపురం జిల్లాలోని హిందూపూర్ (ఫుడ్ కోర్టు, గేమింగ్ జోన్లు), సజ్జలదిన్నె (వే ఎమినిటీస్) ఉన్నాయి. అగ్రి టూరిజంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని 130 ఎకరాల్లో నర్సరీల పెంపకాన్ని ప్రోత్సహించనుంది. వే ఎమినిటీస్ ఇలా.. వే ఎమినిటీస్ కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో జాతీయ రహదారులపై ప్రయాణికుల కోసం పార్కింగ్ సౌకర్యాలు (కార్లు, బస్సులు, ట్రక్కుల కోసం విడివిడిగా), రెస్టారెంట్లు, టెలిఫోన్ బూత్/వైఫై, ఏటీఎం, పెట్రోల్ బంకులు, చిన్నపాటి మరమ్మతు దుకాణాలు, విశ్రాంతి గదులను నిర్మిస్తారు. వీటితోపాటు 15 హరిత హోటళ్లు, రెస్టారెంట్లను రూ.47 కోట్లతో ఆధునికీకరించనుంది. పెట్టుబడులను ఆకర్షించేలా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టూరిజం పాలసీ–2025 పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ప్రోత్సాహకాలను అందిస్తూ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. పాత పాలసీ ప్రకారం పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దె అక్కడి మార్కెట్ విలువలో 2 శాతంగా ఉండేది. దీనికి తోడు ఏటా 5శాతం లీజు పెరుగుతూ వచ్చేది. దీంతో పెట్టుబడి పెట్టేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లీజును ఒక శాతానికి తగ్గించింది. ప్రతి మూడేళ్లకు ఒకసారి 5 శాతం అద్దెను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భూ బదలాయింపు రుసుంలో వంద శాతం మినహాయింపు ఇస్తోంది. అగ్రిమెంట్లో భాగంగా స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఎస్జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్ చేసుకునే అవకాశం కల్పించింది. విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్మెంట్ సౌకర్యం ఇచ్చింది. మెరుగైన సేవల కోసం.. పెరుగుతున్న పర్యాటకులకు అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓ అండ్ ఎం)లో భాగంగా వివిధ రకాల పర్యాటక ఆస్తుల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుంది. ఇప్పటికే 25 ఆస్తుల్లో ప్రైవేటు వ్యక్తులు కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. ఇటీవల 12 ఆస్తుల నిర్వహణకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. తాజాగా కొత్త పాలసీ ప్రకారం 28 ఆస్తులను 15 ఏళ్ల చొప్పున లీజుకు ఇచ్చి తద్వారా ఏడాదికి సుమారు రూ.1.30 కోట్ల మేర ఆదాయం ఆర్జించేలా ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో హోటళ్లు, కాటేజీలు, రెస్టారెంట్లు, బీచ్, లేక్ రిసార్ట్స్, గెస్ట్‌హౌస్‌లు, ఎకో పార్కులు, వే ఎమినిటీస్ సెంటర్లు ఉన్నాయి. పర్యాటక వనరుల అభివృద్ధిపై దృష్టి పర్యాటక వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. అన్ని ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. పీపీపీ విధానంలో హోటళ్లు, రిసార్టులు, ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నాం. మెరుగైన సేవల కోసమే టూరిజం ఆస్తుల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే మా లక్ష్యం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టీడీసీ -
బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా..
సాక్షి, విశాఖపట్నం: టూరిజం రంగానికి రీస్టార్ట్ ప్యాకేజీ అందిస్తున్నామని, రూ.200కోట్ల ప్యాకేజీని అతిధ్య రంగానికి కేటాయించాలని నిర్ణయించామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఆయన శనివారం రాష్ట్ర టూరిజం కొత్త పాలసీని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. కొత్త ప్యాకేజీలో భాగంగా టూరిజంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. మొత్తం రుణాలపై 9శాతం వడ్డీ కాగా, అందులో 4.5శాతం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టె సంస్థలకి త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి అనుమతులు సరళీకరణ చేస్తామన్నారు. చదవండి: 29న మూడో విడత ‘వైఎస్సార్ రైతు భరోసా’ రాష్ట్రంలోని పర్యాటక రంగంలో హోటల్స్ నిర్మాణం కోసం 10 సంస్థలను ఆహ్వానించామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో టూరిజం రంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఏపీలోని పర్యాటక స్థలాల విశిష్టతపై రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామని తెలిపారు. టూరిజం రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపి౦దని, పర్యాటక రంగంలో ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ ఆదాయం కూడా పడిపోయిందని అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క టూరిజం ప్రాజెక్ట్ కూడా రాలేదని, గత ప్రభుత్వ పాలసీ కారణముగా ఏ ఒక్క సంస్థ ముందుకు రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ఆకర్షణీయంగా టూరిజం పాలసీని రూపొందించామని చెప్పారు. బంగ్లాదేశ్ షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మారుస్తున్నామని తెలిపారు. షిప్ యజమానితో చర్చలు చివరదశలో ఉన్నాయని, కొలిక్కి రాగానే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. కైలాసగిరిపై వాచ్ టవర్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాబు మనవడికి ఈ బూతులే నేర్పిస్తున్నాడా? అని ప్రశ్నించారు. అమరావతిలో 100 మంది మహిళలను చూసి రెచ్చిపోతావా? అని ధ్వజమెత్తారు. అమరావతిపై రెఫరెండంకి ముందు విశాఖలో ఆ పార్టీ ఎమ్మెల్యే లు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. సీఎం జగన్‌కు ఎన్నికలు కొత్త కాదని, విశాఖ రైల్వే జోన్‌ను బీజేపీ తాత్సరాం చేస్తోందన్నారు. పోలవరంపై నిధులు విషయంలో కూడా బీజేపీ నేతలు కేంద్రాన్ని అడగాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్హికి బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి సహకరించాలన్నారు. -
శుభ 'గడి'యలొస్తున్నాయ్
- పర్యాటక కేంద్రాలుగా తెలంగాణ గడిలు, చారిత్రక కోటలు - రాష్ట్ర టూరిజం పాలసీ ముసాయిదా సిద్ధం - జూన్ రెండో వారంలో ఆవిష్కరించనున్న ప్రభుత్వం - సీఎం సారథ్యంలో తెలంగాణ టూరిజం ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు - పర్యాటకులను ఆకట్టుకోవటం.. ఉపాధి కల్పనే లక్ష్యాలు - పర్యాటక ప్రాజెక్టులకు భారీగా పన్ను రాయితీలు, స్టాంప్ డ్యూటీ మాఫీ - లగ్జరీ ట్యాక్స్, వినోదపు పన్ను, విద్యుత్తు చార్జీల్లో రాయితీలు సాక్షి, హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలోని పురాతన గడిలు, చారిత్రక కోటలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ప్రవేశపెట్టబోయే ‘నూతన తెలంగాణ పర్యాటక విధానం 2016-2020’లో భాగంగా వీటికి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదాను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక విధానాల కంటే మెరుగైన రీతిలో ఈ విధానాన్ని రూపకల్పన చేసింది. కొత్త పారిశ్రామిక విధానం, కొత్త ఐటీ పాలసీతో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులను ఆకర్షించిన ప్రభుత్వం.. ఇదే క్రమంలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా కొత్త విధానానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈ కొత్త విధానంలో సీఎం చైర్మన్‌గా తెలంగాణ టూరిజం ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (టీటీపీబీ) ఏర్పాటు చేస్తారు. పర్యాటక శాఖ, రెవెన్యూ, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. పర్యాటక కేంద్రాలకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సమీకరణపై ఈ బోర్డు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. జూన్ మొదటి లేదా రెండో వారంలో టూరిజం పాలసీని ప్రకటించే అవకాశాలున్నాయి. దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, విదేశాలకు చెందిన పర్యాటక మంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. గడీలకు కొత్త సొబగులు కొత్త విధానంలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న పర్యాటక కేంద్రాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే గడీలు, కోటలపై దృష్టి కేంద్రీకరించింది. గడీలకు చారిత్రక ప్రాధాన్యముంది. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా పెద్ద గడీలు, వివిధ జిల్లాల్లో పెద్దపెద్ద కోటలున్నాయి. రాచకొండ, దోమకొండ, దేవరకొండ, భువనగిరి, ఖమ్మం, ఎలగందుల, జగిత్యాల, నగునూరు, మెదక్, రామగిరి కోటలు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటితోపాటు కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, విస్నూరు, దోమకొండ తదితర ప్రాంతాల్లో ఉన్న గడీలు నిజాం కాలం నాటి నుంచి చరిత్రకారులందరి దృష్టిని ఆకర్షించాయి. ఉద్యమాలతో పాటు చారిత్రక నేపథ్యమున్న తెలంగాణలోని గడీలు సాయుధ పోరాట సమయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటిలో కొన్ని ఇప్పటికే శిథిలమయ్యాయి. కొన్ని ఆనాటి దేశ్‌ముఖ్‌లు, దొరల వారసుల చేతిలో ఉన్నాయి. వీటిలో కొన్ని గడీలను సందర్శనకు వీలుగా తీర్చిదిద్దితే పర్యాటకులను అమితంగా ఆకర్షించే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడగడీలున్నాయి.. వాటిలో శిథిలమైనవెన్ని.. వేటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి? అనే వివరాలపై తుది ప్రతిపాదనలు తయారు చేస్తోంది. విదేశీ పర్యటకులపై దృష్టి.. కొత్త విధానంలో విదేశీ పర్యాటకులను ఆకర్షించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఏటా రాష్ట్రానికి సుమారు లక్షన్నర మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. ఈ సంఖ్యను రానున్న పదేళ్లలో పది లక్షలకు పెంచాలని లక్ష్యంగా ఎంచుకుంది. గతానికి భిన్నంగా జిల్లా స్థాయి, మున్సిపల్, మండల స్థాయిల్లో లోకల్ టూరిజంను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. స్థానిక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సైతం గుర్తించి వాటిని టూరిజం ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఈ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించి ఆదాయం పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాయితీలు వరాలు.. కొత్త విధానంలో స్టార్ హోటళ్లు, రిస్టార్ట్స్, హెరిటేజ్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, మోటళ్లు, టెంటెడ్ అకమడేషన్స, అమ్యూజ్మెంట్ పార్క్‌లు, థీమ్ పార్క్‌లు, టూరిజం శిక్షణ కేంద్రాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వంచర్ స్పోర్ట్స్ యూనిట్లకు ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పించనుంది. ప్రభుత్వ స్థలాల కేటాయింపుతోపాటు కనీసం 15 నుంచి 20 శాతం పెట్టుబడి సాయం అందించనుంది. దీంతోపాటు మెగా టూరిజం ప్రాజెక్టులకు స్టాంప్ డ్యూటీ మాఫీ చేయటంతో పాటు ఏడేళ్ల పాటు లగ్జరీ టాక్స్, వినోదపు పన్నును మినహాయించనుంది. మూడేళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో సగం రాయితీ ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా పెట్టుబడిదారులకు అదనపు రాయితీలివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టూరిజం యూనిట్లను నెలకొల్పేందుకు మరింత ప్రోత్సాహకాలను ప్రకటించనుంది.