జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. చిత్రంలో వరప్రసాద్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చి.. రాష్ట్ర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సిరిపురం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మించే క్రమంలో విశాఖ, తిరుపతి నగరాల్లో హోటళ్లను నిర్మించేందుకు ఓబరాయ్ హోటల్ ముందుకొచ్చినట్టు తెలిపారు. కరోనా వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎంపీలు బి.సత్యవతి, మాధవి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, జి.బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులను ఆకర్షించేలా టూరిజం పాలసీ
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి.. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు టూరిజంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేస్తున్నారని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని హరిత బరంపార్క్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టూరిజం పాలసీ దేశంలోనే బెస్ట్ పాలసీ కానుందని తెలిపారు.
వైజాగ్ బీచ్ కారిడార్‌తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లంబసింగి, అరకు ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, రికార్డ్ స్థాయిలో ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వైజాగ్, గండికోటల్లో అడ్వంచర్ బోట్స్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. విజయవాడ హరిత బరంపార్క్‌కు బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ ఫుడ్ ఫాల్, బెస్ట్ ఆపరేషన్స్‌కు గానూ ఏపీటీడీసీ అవార్డ్‌ను ప్రకటించింది. దీనిని బరంపార్క్ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్‌కు రజత్ భార్గవ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment