Tourism Department
-
కట్టలు తెగిన దుష్ప్రచారం.. రుషికొండ భవనాలపై దిగజారుడు మాటలు
ప్రభుత్వ అవసరాల కోసం రుషికొండలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం రూ.430 కోట్లతో భవనాలు నిర్మించింది. ఇవి శాశ్వత భవనాలు. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖలో ప్రభుత్వ పరంగా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. వీటిని గుడ్లప్పగించి చూస్తూ.. నోరెళ్లబెట్టిన చంద్రబాబు.. గట్టిగా వానొస్తే నీళ్లు కారేలా ఏకంగా రూ.2,500 కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఏ లెక్కన నిర్మించారు? ఇప్పుడు ఈ తాత్కాలిక కట్టడాలను కూల్చేసి.. శాశ్వత భవనాల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు? తన విలాసాల కోసం చేసిన ఖర్చు ఎవరికి తెలియదు? కుట్రలు, దుష్ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్న ఈ పెద్దమనిషికి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. వాటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంతకైనా దిగజారుతానని మరోమారు నిరూపించుకున్నారు. సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు విష ప్రచారాలనే నమ్ముకున్నారు. జరగని వాటిని జరిగినట్లు, లేని విషయాలను ఉన్నట్లు ఎడతెగని దుష్ప్రచారం చేస్తూ రోజుకో కుట్రకు తెరతీస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ తన పని మరచిపోయి, రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ భవనాల వద్దకు వెళ్లి అవాకులు చెవాకులు పేలారు. గంట సేపు అక్కడ గడిపి వీడియో, ఫొటో షూట్లు చేయించడమే కాకుండా నోటికి వచ్చిన అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు. ప్రభుత్వ అవసరాల కోసం టూరిజం శాఖ కట్టిన భవనాలను అప్పటి సీఎం విలాసాల కోసం కట్టారని.. రాజులు, చక్రవర్తులు ఇలాంటివి కట్టించుకుంటారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. కమోడ్‌కు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారంటూ అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. 2014లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో నెలల తరబడి కుటుంబంతో ఉండి రూ.30 కోట్ల బిల్లును ప్రభుత్వంతో కట్టించిన విషయాన్ని మరచిపోయారు. ఉండవల్లి, హైదరాబాద్, ఢిల్లీలోని తన క్యాంపు ఆఫీసులకు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు కట్టడాన్ని తప్పుగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ మదీనాగూడలోని తన సొంత ఫామ్‌హౌస్‌లో మరమ్మతులకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాలపై అడ్డగోలు నిందలు మోపుతూ శుద్ధపూస కబుర్లు చెప్పడాన్ని ఏమనాలి? రుషికొండపై టూరిజం శాఖ రూ.430 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాల కోసమేననే విషయాన్ని పక్కదారి పట్టించి వైఎస్ జగన్ కోసం నిర్మించినట్లుగా దాన్ని చిత్రీకరించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి ఒక ఉదాహరణ. ఇందులో భూమి చదును చేయడానికే ఎక్కువ మొత్తం ఖర్చయింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాల కోసం ఇదే చంద్రబాబు ప్రభుత్వం గతంలో రూ.2,500 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు వీటిని కూలగొట్టి శాశ్వత భవనాలు నిర్మించడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారో ఆయనే సెలవివ్వాలి. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్⇒ హనీ ట్రాప్‌ల మాయలేడి, ముంబయికి చెందిన నటి కాదంబరి జత్వాని కేసును తెరపైకి తెచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు బనాయించారు. పారిశ్రామికవేత్తలు, ధనికులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్‌తో బ్లాక్ మెయిల్ చేసే కేసును ఏపీ పోలీసులు చాకచక్యంగా ఛేదిస్తే, దాన్ని కూడా రాజకీయం చేసి ఆమెకు వత్తాసు పలికి రాచమర్యాదలు చేయించారు చంద్రబాబు. ⇒ మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే.. దాన్ని వైఎస్సార్సీపీ కావాలని చేసిందంటూ ఆ ఘటనను రాజకీయానికి వాడుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఫైళ్లు తగుల బెట్టించడానికి ఇది చేయించారంటూ అడ్డగోలు వాదనకు దిగి కేసులు పెట్టి నానా రభస సృష్టించారు. డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి పంపించారు. ఆ కేసులో ఇంతవరకు ఏమీ నిరూపించలేకపోయారు. ⇒ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్నప్పుడల్లా ఇలా ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి, వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించి ఆయనపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు, ఆయన కూటమి పనిగా పెట్టుకుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోననే భయంతో ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు చేస్తూ చంద్రబాబు తన దిగజారుడుతనాన్ని ప్రతిరోజూ బయట పెట్టుకుంటున్నారు. మోసం, నయవంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటినే ఆలంబనగా చేసుకుని తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించి వాటిని పక్కదారి పట్టించేందుకు దారుణంగా దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ప్రమాదంపై అడ్డగోలుతనం రెండేళ్ల క్రితం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదాన్ని ఇటీవలి ఎన్నికలకు ముందు జరిగినట్లు ప్రచారం చేస్తూ కుట్ర రాజకీయం మొదలుపెట్టారు. ఎప్పుడో 2022లో విజయమ్మ వాహనం టైర్లు ప్రమాదవశాత్తు పంక్చర్ అయితే, దాన్ని ఇటీవలే జరిగినట్లు.. దాని వెనుక కుట్ర ఉన్నట్లు, జగన్ కావాలని చేయించినట్లు అనుమానాలు కలిగేలా టీడీపీ సోషల్ మీడియా మూడు రోజులుగా వైరల్ చేస్తూ శునకానందం పొందుతోంది. అబద్ధానికి రెక్కలు తొడిగి పబ్బం గడుపుకునే చంద్రబాబుకు, ఆయన పరివారానికి కనీస విచక్షణా జ్ఞానం లేదని, కుట్రతో బురద జల్లడమే తెలుసని ఈ విషయం ద్వారా తేటతెల్లమైంది. అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని రెండేళ్ల తర్వాత తెరపైకి తెచ్చి, దానిపై ఆరోపణలు చేయడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. శ్రీవారి సాక్షిగా అబద్ధాలుకలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలనే వేదికగా చేసుకుని వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు అభాసుపాలయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమని దారుణమైన అబద్ధాన్ని పదే పదే చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. వేంకటేశ్వరస్వామి తన కుల దైవం అని చెప్పుకుంటూనే ఆయన్ను రాజకీయంలోకి లాగి చివరికి సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నారు. నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదని తేలడంతో దానిపై అడ్డగోలుగా మాట్లాడిన చంద్రబాబు, ఆయన అనుయాయుల నోళ్లు మూత పడ్డాయి.బెజవాడ వరదల్లోనూ రాజకీయంవిజయవాడ వరదలను ఎదుర్కోవడంలో దారుణంగా వైఫల్యం చెంది లక్షలాది మందిని నీటిలో ముంచిన చంద్రబాబు... ఆ విషయం నుంచి రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకు ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయడానికి జగన్ పథకం పన్నారంటూ విష ప్రచారం చేశారు. వరదలో కొట్టుకువచ్చిన 4 బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డం పడితే, దాన్ని రాజకీయం చేసి వైఎస్సార్సీపీయే కావాలని బోట్లతో గుద్దించిందని, దీని వెనుక జగన్ ఉన్నారని చెబుతూ కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చరిత్రలో ఇంతటి దగుల్బాజీ రాజకీయం చంద్రబాబు తప్ప వేరెవరూ చేయలేరని ఆ కేసు ద్వారా నిరూపించుకున్నారు. వాస్తవానికి వరద నీటిని నగరంలోకి మళ్లించిందే చంద్రబాబు. ఆ పడవలన్నీ టీడీపీ వాళ్లవే. -
వారంలోగా నిర్ణయం తీసుకోండి: టూరిజం ఎండీ సస్పెన్షన్ ఎత్తివేతపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహ ర్రావు సస్పెన్షన్ ఎత్తివేతపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టుధిక్కారం కింద నోటీసులు జారీచేసి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చ రించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మనోహర్‌రావును సస్పెండ్ చేస్తూ గతనెల 17న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఎండీతోపాటు ఓఎస్డీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనోహర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారిక సమావేశంలో భాగంగా తిరుమ ల వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఎన్నికల సస్పెన్షన్లు దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరంలేదని, సస్పెన్షన్ ఎత్తి వేతపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచా రణ చేపట్టింది. తమ ఆదేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
‘జనశక్తి’ ఎగ్జిబిషన్లో మోదీ
న్యూఢిల్లీ: మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి. ఎగ్జిబిషన్లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్‌కీ బాత్‌లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది. -
తీరానికి అందాల హారం! బీచ్‌లలో ఆధునిక సదుపాయాలు.. పోటీలు షురూ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీచ్‌ల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ(ఆప్టా) చర్యలు చేపడుతోంది. బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌కు అనుగుణంగా పర్యావరణ హితంగా, అందంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో ఆధునిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉత్తమ ప్రాజెక్టు డిజైన్ల కోసం ఆర్కిటెక్ట్ పోటీలను నిర్వహిస్తోంది. ఆర్కిటెక్ట్ సంస్థలతోపాటు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ (సీవోఏ)లో రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ)లో రిజిస్టర్డ్ ప్లానర్లు, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల (వ్యక్తిగత/బృందాలుగా)నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలించి ఉత్తమ ఆర్ఎఫ్పీలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించనుంది. టెక్నికల్ బిడ్ల దాఖలుకు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది. పూర్తి వివరాలను https://tourism.ap.gov.in/tenders వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభివృద్ధి ప్రణాళిక ఇలా... తొలి దశలో కాకినాడ, సూర్యలంక, పేరుపాలెం బీచ్‌లలో సుమారు 1,500 మీటర్లు చొప్పున అభివృద్ధి చేయనున్నారు. ఈ బీచ్‌లను పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతోపాటు స్థానికులకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, వ్యూ పాయింట్లు, పిల్లల కోసం ఆట స్థలాలు, టూరిస్ట్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ రిసెప్షన్ సెంటర్, రెస్క్యూ, వైద్య సౌకర్యాలు, ల్యాండ్ స్కేపింగ్, సీటింగ్, పార్కింగ్, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తారు. మరోవైపు పశ్చిమగోదారి జిల్లా పేరుపాలెంలో 104 ఎకరాల్లో, పల్నాడు జిల్లా నాగులవరంలో 250 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. వీటిల్లో బీచ్ కాటేజీలు, హోటళ్లు, రిసార్ట్స్, సావనీర్ దుకాణాలు, రెస్టారెంట్లు, వాటర్ స్పోర్ట్స్, ఎగ్జిబిషన్లు, థీమ్ పార్క్, వ్యూ పాయింట్లు, టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వంటివి ఆధునిక సౌకర్యాలో ఏర్పాటు చేయనున్నారు. నగదు బహుమతులు ఇలా.. ఆర్కిటెక్ట్ సంస్థల నుంచి వచ్చిన మొదటి మూడు ఉత్తమ ఎంపికలకు రూ.1,50,000, రూ.1,00,000, రూ.75,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తారు. సీవోఏ రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్, ఐటీపీఐ రిజిస్టర్డ్ ప్లానర్ నుంచి వచ్చిన ఉత్తమ డిజైన్లకు రూ.1,00,000, రూ.75,000, రూ.55,000 చొప్పున, విద్యార్థి విభాగంలో విజేతలకు రూ.50,000, రూ.40,000, రూ.30,000 చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేస్తారు. ప్రతిభగల ఆర్కిటెక్ట్‌లకు ఆప్టాతో కలిసి పని చేసే అవకాశం కూడా కల్పిస్తారు. చదవండి: సైన్యం సన్నద్ధం -
‘పాపికొండల’ ప్రత్యేక ప్యాకేజీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలని కోరారు. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి ఒక రోజు పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి 2 రోజుల పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. -
కళ్లకు కట్టేలా ‘ఇంజనీరింగ్ పర్యాటకం’
సాక్షి, అమరావతి: పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వినోద, విహార యాత్రలకే పరిమితం కాకుండా ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణ పాటవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తాజాగా విదేశాల్లో ‘ఇంజనీరింగ్ పర్యాటకం’ కొత్త ధోరణిగా అవతరిస్తోంది. వంతెనలు, డ్యామ్‌లు, పోర్టులు, భారీ కట్టడాలు చూసిన వెంటనే సందర్శకులను ఆకర్షిస్తాయి. అటువంటి వాటిల్లో చారిత్రక, వారసత్వ నిర్మాణాల విలువలను భావితరాలకు, యువ ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చేలా పర్యాటకం తోడ్పాటునందిస్తోంది. విదేశాల్లో ఎక్కువగా.. వంతెనలు, నీటి ప్రాజెక్టులు ఆయా ప్రాంతాలకు చిహ్నాలు. వాటి నిర్మాణం వెనుక కథ ఆసక్తిగా ఉంటుంది. ఎంతో మంది రేయింబవళ్లు ఏళ్లపాటు కష్టపడి చేపట్టిన నిర్మాణాల సంక్లిష్టతను, సామర్థ్యాన్ని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, జర్మనీ, ఇంగ్లండ్‌లు భావితరాలకు అందిస్తున్నాయి. చారిత్రక ఇంజినీరింగ్ ప్రదేశాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దడంలో విజయం సాధించాయి. భారీ యంత్రాలు లేని సమయంలో వంతెనలు, డ్యామ్‌ల రూపకల్పనకు సంబంధించిన ఆనాటి సాంకేతికత విలువలను మ్యూజియంల రూపంలో భద్రపరుస్తున్నాయి. వీటిని ప్రజలు సందర్శించేలా మౌలిక వసతులు కల్పిస్తూ పర్యాటక రంగం విస్తరణకు దోహదపడుతున్నాయి. చైనాలో ప్రతి వంతెనకు ఒక మ్యూజియం ఉంటుంది. ఆ వంతెన ముఖ్య విషయాలను అందులో ప్రదర్శిస్తారు. భారత్‌లో అయితే ఏపీలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ విశేషాలను, నమూనాలను ప్రదర్శించేందుకు, యూపీలో పాత నైనీ బ్రిడ్జికు ప్రత్యేక మ్యూజియంలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు.. సమాజ సంస్కృతి, అభివృద్ధి శ్రేయస్సుకు మూల స్తంభాలుగా డ్యామ్‌లు, వంతెనలు నిలుస్తున్నాయి. రోడ్డు వంతెన అయినా..రైలు వంతెన అయినా, సైన్యం నిర్మించినది అయినా, సస్పెన్షన్ బ్రిడ్జిలు, సపోర్డెట్ బ్రిడ్జ్‌లు, కంటిన్యూస్ స్పాన్ బ్రిడ్జిలు దేశంలో, రాష్ట్రంలో అనేకం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఏపీ పర్యాటకంలో ఇంజనీరింగ్ టూరిజం కేవలం 2.28 శాతం మాత్రమే. అయినప్పటికీ వాటికున్న ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలైన డ్యామ్‌లు, రిజర్వాయర్లు, సైన్స్ సెంటర్లు, హార్బర్లు, పోర్టులు, వంతెనలను విదేశీ తరహా పర్యాటకంగా అభివృద్ధికి కసరత్తు చేస్తోంది. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాధాన నిర్మాణాలతోపాటు వివిధ రిజర్వాయర్లు, వంతెనల టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఆయా ప్రాంతాలను గుర్తించనుంది. రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి గోదావరి అందాల్లో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖలో సబ్‌మెరైన్, జెట్ మ్యూజియంలు ఆకట్టుకుంటున్నాయి. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి రాష్ట్రంలో అపార పర్యాటక వనరులు ఉన్నాయి. వాటిని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రముఖ ఇంజనీరింగ్ నిర్మాణ ప్రాంతాలను కూడా పర్యాటక స్థలాలుగా గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి -
రాష్ట్రంలో కోటి జాతీయ జెండాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కోటి జాతీయ జెండాలను పింఛన్‌దారులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. శనివారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు మూడు కిలో మీటర్ల జాతీయ పతాక ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 278 మంది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడంతో పాటు 399 చెరువులను ఆధునికీకరించి అమృత్ సరోవర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని చాటేలా చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని వర్గాలను జెండా పండుగలో మమేకం చేయడానికి మూడు లఘు చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్టు వివరించారు. -
మంగమారిపేటలో ఎంటర్టైన్మెంట్ సిటీకి ప్రణాళికలు
సింగపూర్ వెళ్లే ప్రతి పర్యాటకుడూ సందర్శించే ఏకైక ప్రాంతం సెంటోసా దీవులు. భిన్నమైన పర్యాటక ప్రాంతాలన్ని ఒకే చోట కనువిందు చేసే ఈ ప్రాంతానికి వెళ్తే.. సరికొత్త ప్రపంచాన్ని చుట్టొచ్చినట్లే. సరిగ్గా ఇదే ఆలోచనతో సుందర నగరం విశాఖ తీరంలోనూ మెగా టూరిజం కాంప్లెక్స్‌కు పర్యాటక శాఖ శ్రీకారం చుడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 24 విభిన్న టూరిజం ప్రాజెక్టులు ఒకే చోట రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొన్నింటికి కేబినెట్ ఆమోదముద్ర లభించింది. త్వరలోనే స్టేక్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ సన్నద్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: భారత్‌కు వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో ఐదుగురు విశాఖ నగరాన్ని సందర్శిస్తుంటారు. అందుకే పర్యాటకంగా నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టూరిజం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సెంటోసా దీవుల తరహాలో ఎంటర్టైన్మెంట్ సిటీని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి 16 కి.మీ, భీమిలి నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న మంగమారిపేట బీచ్‌ను ఎంపిక చేశారు. 25 ఎకరాలు.. 24 ప్రాజెక్టులు.. రూ.700 కోట్లు మంగమారిపేట బీచ్‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎంటర్టైన్మెంట్ సిటీకి రూపకల్పన చేశారు. ఈ మెగా టూరిజం కాంప్లెక్స్‌లో మొత్తం 24 విభిన్న తరహా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న భీమిలి–భోగాపురం ఆరులైన్ల గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌కు అనుసంధానంగా ఈ ఎంటర్టైన్మెంట్ సిటీ రానుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో పాటు.. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలైన అంశాలతో టూరిజం అధికారులు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒకే కాంప్లెక్స్‌లో పార్కింగ్, ఫుడ్ కోర్టులు, ఇతర మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఎఎంఎల్) సహకారంతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. పలు ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇప్పటికే ఈ ఎంటర్టైన్మెంట్ సిటీలో రానున్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం వేసింది. జెయింట్ వీల్, స్నో పార్క్, స్కై టవర్, టన్నెల్ అక్వేరియం వంటి ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను రూపొందించిన తర్వాత.. కేబినెట్ ముందుకు ఈ ఫైల్ రానుంది. కేబినెట్ ఆమోదం అన్నింటికీ లభించిన తర్వాత.. మెగా టూరిజం కాంప్లెక్స్‌కు వడివడిగా అడుగులు పడనున్నాయి. (క్లిక్: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం) ఎంటర్టైన్మెంట్ సిటీ విశేషాలు ఎంటర్టైన్మెంట్ సిటీలో టన్నెల్ అక్వేరియం, జెయింట్ వీల్, స్కైటవర్, స్నోవరల్డ్తో పాటు పలు అడ్వెంచర్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఐస్ స్కల్ప్ చర్ పార్క్, అవుట్ డోర్ స్కై డైవింగ్, టెథర్డ్ గ్యాస్ బెలూన్, వేవ్ సర్ఫింగ్, ఎలివేటెడ్ ట్రాక్డ్ ట్రైన్, డైనోసర్ పార్క్, డైనోసార్ 5డీ ఇండోర్ షో, గ్లో గార్డెన్, మినియేచర్ వరల్డ్, గ్లాస్ వ్యూయింగ్ డెక్, ఈవెంట్ డోమ్, అవుట్డోర్ మువీ సిస్టమ్, పెర్ఫార్మెన్స్ థియేటర్, గ్లాస్ డెక్ రెస్ట్ అకామిడేషన్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బీచ్ రాంట్, వాటర్ బస్తో పాటు భిన్నమైన ఆటలు, చిల్డ్రన్ పార్క్, పిల్లల అడ్వెంచర్ గేమ్స్, ఇండోర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) త్వరలోనే ఎంవోయూలు ఎంటర్టైన్మెంట్ సిటీ కోసం మంగమారిపేటని గుర్తించాం. బీచ్‌రోడ్డులో కొంత భూమి కోతకు గురైన కారణంగా ఆరు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించాం. భూ సేకరణకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయి. అవి త్వరలోనే పరిష్కృతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి మార్పులు చేర్పులు కూడా చేపట్టాం. పెట్టుబడిదారుల కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించి ప్రాజెక్టు గురించి వివరించనున్నాం. ఇప్పటికే చాలా మంది ఎంటర్టైన్మెంట్ సిటీలో పెట్టుబడుల కోసం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఎంవోయూలు నిర్వహించి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. – శ్రీనివాస్‌పాణి, టూరిజం రీజనల్ డైరెక్టర్ -
క్రేజీ.. క్యారవాన్ టూర్!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా క్యారవాన్ పర్యాటకం పరుగెడుతోంది. వినోద, విహార యాత్రలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబం, స్నేహితులతో కలిసి బడ్జెట్లో విలాస టూర్లు చేయిస్తోంది. నచ్చిన చోటుకు.. కావాల్సిన సమయంలో తీసుకెళ్తూ.. బస గురించి బెంగ లేకుండా.. సకల వసతులతో హోం స్టే అనుభూతులన్నీ అందిస్తోంది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. విస్తరిస్తున్న క్యారవాన్ సంస్కృతి.. విదేశాల్లో ఉండే ఓవర్ ల్యాండర్ (క్యారవాన్) సంస్కృతి భారత్‌లోనూ క్రమంగా విస్తరిస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, ఈశాన్య భారతం, హిమాచల్ ప్రదేశ్, నాగ్‌పూర్, మహారాష్ట్ర, గోవాలో ప్రత్యేక ప్యాకేజీల్లో మొబైల్ హౌస్ పర్యాటకం లభిస్తోంది. ఇటీవల కేరళలో ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా క్యారవాన్ టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే టూరిజం శాఖ క్యారవాన్ పర్యాటకాన్ని ప్రవేశపెట్టగా.. రాష్ట్ర విభజన అనంతరం టీఎస్‌టీడీసీ దానిని నిర్వహిస్తోంది. తాజాగా ఏపీటీడీసీ తీర్థయాత్రల ప్యాకేజీలు అందిస్తున్న విధానంలోనే క్యారవాన్ టూరిజాన్ని కూడా తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. చక్రాలపై పర్యాటకం! సినిమా స్టార్స్ షూటింగ్ సమయాల్లో, రాజకీయ నాయకులు తమ పర్యటనల్లో సకల సౌకర్యాలు ఉండే క్యారవాన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో విశ్రాంతి తీసుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ఏసీ, ఆధునిక టాయిలెట్లు, షవర్ (వేడి, చల్ల నీళ్లతో), ఎల్ఈడీ స్క్రీన్లు ఉండడమే కాకుండా ఒక రిఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్, బార్బిక్యూ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ నచ్చిన ఆహారాన్ని వండుకుని తినేందుకు పాత్రలుంటాయి. ఇందులో ఉండే సోఫాలను బెడ్లుగా కూడా మార్చుకోవచ్చు. గుడారాలు వేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. అయితే ఇలాంటి వాహనాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడదు. అయితే అద్దెకు తీసుకొని కోరిన చోటుకి విహార యాత్రకు వెళ్లడానికి వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, టూర్ ఆపరేటర్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. వినోదానికి బోర్డ్ గేమ్‌లు, మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. వాహనం సైజును బట్టి.. ఒక్కో వాహనం సైజును బట్టి నలుగురు నుంచి 9 మంది వరకు ప్రయాణించవచ్చు. డ్రైవర్‌తో పాటు లేకుంటే సెల్ఫ్ డ్రైవింగ్‌లో కూడా క్యారవాన్ టూర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణ దూరం, సమయాన్ని బట్టి చార్జీలు వసూలు చేస్తారు. -
ఆర్టీసీలో టూరిజం విభాగం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్తగా టూరిజం విభాగం ఏర్పాటు అవుతోంది. పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు తిప్పాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ బాధ్యతను పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. కానీ కొంత కాలంగా ఆ సంస్థ బాగా బలహీనపడింది. చాలినన్ని బస్సులను నిర్వహించే స్థితిలో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ లోటును తన బస్సులతో భర్తీ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే హోటళ్లు, విశ్రాంతి గదులున్నాయి. ఇప్పడు వాటిని ఆర్టీసీ వినియోగించుకుంటుంది. ఇందుకోసం ఆర్టీసీ–పర్యాటక శాఖలు సంయుక్తంగా ఓ విధానాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో బస్‌భవన్‌లో రెండు విభాగాల సంయుక్త సమావేశం జరిగింది. ఇప్పటికే టూరిజం విభాగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆర్టీసీ, తన ప్రణాళికను పర్యాటక శాఖ ముందుంచింది. అటువైపు నుంచి వచ్చే స్పందన ఆధారంగా సంయుక్త విధానాన్ని రూపొందించుకుందామని ప్రతిపాదించింది. ఆర్టీసీ ఇటీవలే ప్రయోగాత్మకంగా కేపీహెచ్‌బీ–వికారాబాద్, అనంతగిరి మధ్య ప్రతి ఆదివారం పర్యాటకుల కోసం సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులకు మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలో ఇలాంటి మరికొన్ని ప్రాంతాలకు కూడా సాధారణ ప్రయాణికుల సర్వీసులుగా కాకుండా, పర్యాటకుల సర్వీసులు ప్రారంభించాలని భావిస్తోంది. దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పర్యాటకరంగంలో తెలంగాణనే వెనకబడి ఉంది. కోవిడ్ భయం తగ్గిపోవటంతో గత నెలరోజులుగా పర్యాటక ప్రాంతాలకు జనం తాకిడి పెరిగింది. దీన్ని అందిపుచ్చుకుని ఇటు పర్యాటక శాఖ, అటు ఇతర అనుబంధ సంస్థలతో కలసి ముందుకు సాగాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాస గుప్తా, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, ఇతర అధికారులు మునిశేఖర్, జీవన్‌ప్రసాద్, యుగేందర్, రఘునాథ్ పాల్గొన్నారు. -
Visakhapatnam: టూరిజంలో వైజాగ్‌కు ట్రెండ్ సెట్ చేసే సత్తా
టీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖ నగరానికి పర్యాటక రంగంలో ట్రెండ్ సెట్ చేసే సత్తా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌర్ కంజీలాల్ అన్నారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే గోవా కంటే మిన్నగా విశాఖ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే 10 విభిన్న రకాల టూరిజం డెస్టినేషన్‌గా వైజాగ్‌ను తీర్చిదిద్దవచ్చని వివరించారు. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గౌర్ కంజీలాల్.. టూరిజం రంగంలో విశాఖకు ఉన్న అవకాశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, విశాఖపట్నం ప్రపంచంలో ప్రతి మనిషి ఆలోచనలు ఎప్పటికప్పుడు విభిన్నంగా మారిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ టూరిజం ట్రెండ్‌కు తగినట్లుగా ఆలోచనలు చేస్తూ ప్రాజెక్టులను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వరుసలో అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ పర్యాటక పరంగా వనరులు అపారంగా ఉన్నాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేస్తే దేశంలో నంబర్ వన్‌గా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్‌లుగా.. 1952 నుంచి 1980 మధ్యలో భారత్‌లో పర్యటించింది కేవలం ఒక మిలియన్ పర్యాటకులు మాత్రమే. దీనిపై మేము లండన్ వెళ్లి అధ్యయనం చేశాం. అప్పుడే ఛార్టర్ విమానాలు నడపాలన్న ప్రతిపాదనలను తీసుకొచ్చాం. క్రమంగా ఒక్కో ప్రాంతానికి ఎయిర్ కనెక్టివిటీ పెంచుతూ పర్యాటకంగా అభివృద్ధికి దోహదపడింది. ఇదే కాన్సెప్ట్‌లో వైజాగ్‌కు పెద్ద సంఖ్యలో టూరిస్టులను ఆకర్షితుల్ని చెయ్యాలి. ఇందుకు కాన్సెప్ట్ డెవలప్మెంట్ చాలా అవసరం. దేశంలో ఉన్న 365 బీచ్‌లతో పోలిస్తే.. విశాఖలో మంచి బీచ్‌లున్నాయి. వీటన్నింటినీ క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్‌లుగా తీర్చిదిద్దాలి. తీరప్రాంత వినియోగంతో అద్భుతాలు విశాఖకు 135 కిలోమీటర్ల సువిశాల సాగర తీరం ఉన్నా.. టూరిజం పరంగా సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. పోర్ట్ ఆఫ్ కాల్ పేరుతో క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. పెద్ద క్రూయిజ్‌ని సముద్ర మధ్య భాగంలో నిలిపి.. డైనింగ్, ఫంక్షన్లు నిర్వహించేలా, క్యాసినోలు మొదలైన కమర్షియల్ టూరిజంని ప్రవేశపెడితే అద్భుతంగా ఉంటుంది. గోవా ఈ తరహాలోనే అభివృద్ధి చెందింది. అక్కడ జనాభా 2 మిలియన్లుంటే.. వచ్చే పర్యాటకులు మాత్రం 5 మిలియన్లుంటారు. కారణం.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా స్థానికుల్లోనూ మార్పు వచ్చింది. ఫలితంగా గోవా మొత్తం టూరిస్ట్ డెస్టినీగా మారిపోయింది. దానికంటే మిన్నగా విశాఖను అభివృద్ధి చేయవచ్చు. ప్రజలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తే... వైజాగ్ కచ్చితంగా.. దేశంలోనే నెంబర్ వన్ పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఛార్టర్లను అందుబాటులోకి తీసుకురావాలి.. ఛార్టర్లను విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశాల నుంచి ఛార్టర్లు వస్తే.. ఒకేసారి 400 మంది పర్యాటకులు వస్తారు. వారికి తగిన ఏర్పాట్లను కల్పించాల్సి ఉంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. గల్ఫ్, ఖతార్, కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్, కొలంబో మొదలైన దేశాల నుంచి ఇక్కడి పర్యాటకులకు ఆహ్వానం పలికేలా ప్యాకేజీలు రూపొందించాలి. విదేశీ పర్యాటకులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టులో మౌలిక వసతులు, నగరంలో సదుపాయాలు, హాస్పిటాలిటీ పెంచాలి. వైజాగ్ ప్రపంచాన్ని టూరిస్టులకు పరిచయం చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఉన్న స్టాఫ్‌ని నియమించుకోవాలి. 10 విభిన్నతల టూరిజం.. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, సస్టైనబుల్ టూరిజం, ఎకోటూరిజం, విలేజ్ టూరిజం, కల్చరల్ టూరిజం, అగ్రి టూరిజం, క్రియేటివ్ టూరిజం, డార్క్ టూరిజం.. ఇలా పది విభిన్న రకాల పర్యాటక అభివృద్ధికి కావల్సిన వనరులు విశాఖలో ఉన్నాయి. ఉదాహరణకు అరకులో కూల్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. గ్రామీణ విశాఖ, అరకు ప్రాంతంలో అగ్రి టూరిజం, విలేజ్ టూరిజం ప్రమోట్ చేస్తే అంతర్జాతీయ నగరాల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. అదేవిధంగా.. హోమ్ స్టే సంస్కృతి తీసుకురావాలి. టూరిజం మార్కెట్లో హోమ్‌స్టేలకు మంచి డిమాండ్ ఉంది. -
మొసళ్లు ఉన్నాయంటూ కథలు చెప్పారు.. అసలు విషయం వేరు.. బోటింగ్ లేనట్టేనా?
ఖానాపురం (వరంగల్): పర్యాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణకు నోచుకోకుండా మిగిలిపోగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిపై ఆశలు పెంచుకుంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. దీంతో పాటు పోస్టల్ స్టాంపుపై ముద్రణకు ఎంపికైంది. అన్ని అర్హతలున్నా అభివృద్ధిలో మాత్రం అంతంతమాత్రంగానే ముందుకు సాగుతుంది పాకాల సరస్సు. పర్యాటకానికి వచ్చే వారిని తన అందాలతో మంత్రముగ్ధులను చేసి మరోసారి తన ఒడిలోకి వచ్చే విధంగా చేస్తుంది. కానీ అధికారుల సమన్వయ లోపం, పాలకుల పట్టింపులేని తనంతో పర్యాటకులు పెదవి విరుస్తున్న దుస్థితి నెలకొంది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులో పాకాల సరస్సు సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సరస్సు చుట్టూ 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభయారణ్యం. (చదవండి: Hyderabad: డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..) బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) 30 ఫీట్ల నీటిసామర్థ్యం కలిగిన సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. మత్తడిపోసే సమయంలో అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి చిలుకలగుట్ట అందాలు, ఔషధవనం, బటర్‌ఫ్లై గార్డెన్తో పాటు అభయారణ్యంలోని వివిధ రకాల పక్షులను తలకిస్తూ ఆనందంగా గడుపుతారు. అభయారణ్యంలో ఉత్సాహంగా గడిపిన తర్వాత నీటిమధ్య ఆనందంగా గడపడానికి బోటింగ్‌కు వెళ్తుంటారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే బోటింగ్‌కు వెళ్లి సరస్సు అందాలను తనివితీరా వీక్షిస్తుంటారు. బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) ఫారెస్ట్ అధికారుల మోకాలడ్డు.. పాకాల పర్యాటక ప్రాంతం అటవీ ప్రాంతం మధ్యలో ఉంటుంది. అభయారణ్యం మధ్యలో ఉండే సరస్సులో బోటింగ్‌ను అనేక సంవత్సరాలుగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇదే క్రమంలో సరస్సులో బోటింగ్‌ను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పర్యాటకులతో పాటు స్థానిక ప్రజల నుంచి బోటింగ్‌పై మండల ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందాయి. మండల స్థాయి అధికారులు ఫారెస్ట్ అధికారులతో గతంలో వాగ్వాదాలకు దిగడంతో కొంత కాలం యథావిధిగా నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఫారెస్ట్ అధికారులు మోకాలడ్డు పెట్టడంతో 2020 అక్టోబర్ 7 నుంచి బోటింగ్ సేవలు నిలిచిపోయాయి. (చదవండి: గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్ ) బోటింగ్ దృశ్యాలు (ఫైల్ ఫొటో) ఇదేంటని పలువురు పర్యాటకులు ప్రశ్నించడంతో సరస్సులో మొసళ్లు ఉన్నాయంటూ కాలం వెళ్లదీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్ శాఖకు పంచాలనే నిబంధన తీసుకువచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. బోటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఫారెస్ట్ శాఖకు పంచితే టూరిజం శాఖకు నష్టం కలుగుతుండటంతో బోటింగ్‌ను ప్రారంభించడానికి ముందుకు రావడంలేదని పలువురు అనుకుంటున్నారు. ఇరు శాఖల సమన్వయలోపంతో పర్యాటకులు బోటింగ్ చేయకుండా వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు, పర్యాటకులు కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులతో చర్చిస్తాం.. పాకాలలో బోటింగ్ విషయాన్ని ఫారెస్ట్ అధికారులతో త్వరలో చర్చిస్తాం. బోటింగ్‌ను తప్పకుండా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. – మనోహర్, ఎండీ, టూరిజం -
వన్ ఇండియా.. వన్ టూరిజం
పర్యాటకానికి సంబంధించి దేశం మొత్తం మీద ఒకే విధానం అమలయ్యేలా వన్ ఇండియా వన్ టూరిజం పద్ధతిని పరిశీలించాలని ట్రావెల్ ఏజెంట్ల అసోసియేషన్ (టీఏఏఐ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని కోరింది. తద్వారా మహమ్మారి ధాటికి సంక్షోభంలో చిక్కుకున్న దేశీ ట్రావెల్, టూరిజం, ఆతిథ్య రంగానికి తోడ్పాటు అందించాలని టీఏఏఐ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, సంబంధిత వర్గాలందరికీ విమాన ప్రయాణం మరింత చౌకగా అందుబాటులో ఉండేలా విమాన ఇంధనాన్ని (ఏటీఎం) కూడా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చాలని కోరింది. అలాగే, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిధిని మరింత విస్తృతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలు తోడ్పాటునివ్వాలి.. టూరిజం రంగం కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలని టీఏఏఐ పేర్కొంది. విచక్షణాయుత ఖర్చులు పెట్టేందుకు వీలుగా మధ్యతరగతి ప్రజల చేతిలో తగు స్థాయిలో డబ్బులు ఆడేందుకు సముచిత చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. స్టార్టప్‌లు, చిన్న .. మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) వర్కింగ్ క్యాపిటల్ భారాన్ని తగ్గించేందుకు, నగదు లభ్యత మెరుగుపడేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అలాగే ఆదాయపు పన్ను రేటు, జీఎస్టీ రేటును తగ్గించాలని, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2022–2023లో అన్ని టూరిస్ట్ వీసాలపై ఈ–వీసా ఫీజు మినహాయింపునివ్వాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈలను పటిష్టం చేయడం, పరిశ్రమలో టెక్నాలజీ వినియోగానికి ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమును ఏర్పాటు చేయడం, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ కోసం క్రెడిట్ ఆధారిత క్యాపిటల్ సబ్సిడీ స్కీము (సీఎల్సీఎస్ఎస్)ను పునరుద్ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని టీఏఏఐ కోరింది. అలాగే, ట్రావెల్ ఏజెంట్లు, ఆపరేటర్ల మనుగడ కోసం వారికి రావల్సిన చెల్లింపులకు భద్రత కల్పించే విధంగా తగు వ్యవస్థను నెలకొల్పాలని విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ ఎంఐసీఈ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్) కార్యక్రమాలను భారత్‌కు రప్పించే దిశగా, దేశీ ఎంఐసీఈ కంపెనీలు అంతర్జాతీయ బిడ్డింగ్‌లలో పాల్గొనేందుకు ఉపయోగపడే గ్లోబల్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటు అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని టీఏఏఐ కోరింది. -
టూరిజం డే, అల్లూరి జయంతి.. ఛాన్స్ దొరికితే చాలు దోచేస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటక శాఖ ఖజానాను ఖాళీ చేసే పనిలో టూరిజం రీజనల్ డైరెక్టర్ కార్యాలయం నిమగ్నమైపోయింది. దొరికిందే తడవుగా.. ఏ చిన్న అవకాశం దొరికినా తమదైన శైలిలో దోపిడీకి తెరతీస్తున్నారు. టూరిజం సీఈవో నోటమాట పేరుతో నిధుల్ని తమ ఖాతాల్లోకి పంపించేసుకుంటున్నారు. టూరిజం డే.. అల్లూరి జయంతి.. కాదేదీ కాసుల వర్షానికి అనర్హం అన్న రీతిలో కలెక్టర్‌కు పంపించకుండానే బిల్లులతో ఖజానాకు చిల్లులు పెడుతున్నారు. 2021 ఆగస్ట్ 27న వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో పర్యాటక దినోత్సవం నిర్వహించారు. వరల్డ్ టూరిజం డేకు గతంలో రూ.2 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకూ ఖర్చు చేసేవారు. ప్రభుత్వం కూడా రూ.5 లక్షలు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. గతంలో ఘనంగా నిర్వహించేవారు. ఈసారి కోవిడ్ కారణంగా ఇన్‌డోర్‌లోనే చేపట్టారు. కానీ.. ఏకంగా రూ.8 లక్షల వరకూ బిల్లులు పెట్టారు. కొందరు కళాకారులకు రూ.19 వేలు ఇచ్చి.. రూ.40 వేలు డ్రా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నృత్య కళాకారులకు రూ.30 వేలు ఇచ్చి.. రూ.40 వేలు బిల్లు వేశారనీ.. మిగిలిన వారికీ అదేరీతిలో గోరంత ఇచ్చి.. కొండంత బిల్లు లాగేసుకున్నారనే విమర్శలొస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవానికి గతేడాది రూ.1.20 లక్షలు ఖర్చు చేయగా.. ఈసారి మాత్రం రూ.2.75 లక్షలు చేశారు. గతేడాది చేసిన మాదిరిగానే ఈసారీ నిర్వహించారు. కానీ.. ఒకే ఒక్క తేడా.. వర్షం పడుతుందని వాటర్ ప్రూఫ్ టెంట్ వేశారు. దానికే అదనంగా లాగేశారని కొందరు టూరిజం సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఇలా అవకాశం దొరికిన ప్రతిసారీ.. టూరిజం ఖజానా ఖాళీ చేసేందుకు టూరిజం ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది రెడీగా ఉంటున్నారని పర్యాటక శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటిమాట చాలంట! ప్రతి జిల్లా పర్యాటక శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ అకౌంట్ ఉంటుంది. దీనిని ప్రతి జిల్లాలోనూ జిల్లా పర్యాటక అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. కానీ విశాఖ జిల్లాలో మాత్రం రెండేళ్ల క్రితం నుంచి వేరే అధికారి పర్యవేక్షణలో ఉంది. రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది ఇటీవల కొన్ని పనులకు సంబంధించి టూరిజం సీఈవో (నోటిమాట) ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఇటీవలే రూ. 1.50 లక్షలు వివిధ పనులకు డ్రా చేసుకున్నట్లు సమాచారం. పర్యాటక శాఖకు సంబంధించిన ప్రతి ప్రధాన బిల్లుని జిల్లా కలెక్టర్‌కు పంపించాల్సి ఉంటుంది. కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో ఫైల్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించకుండానే నడిపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టూరిజం సీఈవో సత్యనారాయణని ప్రశ్నించగా.. ఈ బిల్లు విషయం తన దృష్టికి వచ్చిందనీ.. దీనిపై వివరణ కోరినట్లు తెలిపారు. -
రెండేళ్ల క్రితం సాదాసీదాగా వచ్చి.. ఇప్పుడు ఆ శాఖలో పెత్తనమంతా అతనిదే..!
ఎవ్రిథింగ్ ఈజ్ పాజిబుల్.. ఏపీ పర్యాటక శాఖ ట్యాగ్‌లైన్. ఇక్కడ జరిగే వింతలు చూస్తే.. నిజంగా ఈ శాఖకు ఈ ట్యాగ్‌లైన్ కరెక్ట్ అనిపిస్తుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సీనియర్ మేనేజర్ హోదాని కట్టబెట్టేశారు. గైడ్‌గా మొదలైన సదరు ఉద్యోగి ప్రస్థానం.. జిల్లా టూరిజం మేనేజర్‌గానూ.. ఇప్పుడు ఐటీడీఏ టూరిజం ఎస్ఎం వరకూ చేరింది. ఆరోపణలు, వివాదాలతో నిత్యం సావాసం చేసే ఉద్యోగికి ఇలా ఏకంగా పెద్ద బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: సుందరి నగరి విశాఖ రాష్ట్రంలో ప్రధాన టూరిస్ట్ కేంద్రంగా భాసిల్లుతూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఇక్కడ రూ.కోట్ల విలువైన టూరిజం ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అలాంటి కీలకమైన జిల్లా పర్యాటక శాఖలో ఎంతో ప్రాధాన్యం ఉన్న బాధ్యతలన్నింటినీ ఓ గైడ్ చేతుల్లోనే కొనసాగుతున్నాయి. పైగా.. సదరు గైడ్ ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. టూరిజం డిగ్రీ లేకపోయినా.. కేవలం గైడ్‌గా పనిచేయడం మొదలు పెట్టారు. గైడ్‌కి పోస్ట్ ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నా.. అప్పటి అధికారుల అండదండలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిపోయాడు. ఇటీవలే అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తిరస్కరించడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగానే కొనసాగుతున్నారు. తాజాగా ఐటీడీఏ సీనియర్ మేనేజర్ కమ్ కోఆర్డినేటర్‌గా రెగ్యులర్ అధికారిగా కొనసాగేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసేశారు. డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు కూడా వెహికల్ ప్రోవిజన్ లేదు. కానీ.. సదరు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మాత్రం వాహన సౌకర్యం కల్పించేశారు. అడ్మిన్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఏపీటీఏ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సీఈవో మాత్రం ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించడం విశేషం. దీనికి తోడు మూడు రోజులు జిల్లా టూరిజం కార్యాలయంలోనూ, మూడు రోజులు ఐటీడీఏ సీనియర్ మేనేజర్‌గా వ్యవహరించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా పర్యాటకశాఖ కార్యాలయంలోనూ అన్నీ తానై కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ సదరు ఉద్యోగికి జిల్లా టూరిజం ఆఫీసర్‌గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంపైనా పెద్ద వివాదమే చెలరేగింది. ఆది నుంచీ ఆరోపణలే.. రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న అతన్ని ఇక్కడి అవసరాల నిమిత్తం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే పాతుకుపోయిన ఈ గైడ్.. క్రమంగా అసిస్టెంట్ టూరిజం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గానూ, తర్వాత టూరిజం మేనేజర్‌గానూ కొనసాగుతున్నాడు. మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్న అతనిపై గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ రాయలసీమ జోన్‌కు బదిలీ చేశారు. అయితే ఆ బదిలీని సైతం ఆపేసుకొని.. ఇక్కడే కొనసాగుతూ చక్రం తిప్పేశాడు. గతంలో తొట్లకొండ పర్యాటక క్షేత్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా తన భార్య పేరిట ఓ నిర్మాణం చేపట్టాడు. దీనిపై అప్పటి కలెక్టర్ యువరాజ్‌కు ఫిర్యాదులు రావడంతో వెంటనే జేసీబీతో కూల్చివేయించారు. అలాంటి వ్యక్తికి ఏకంగా ఐటీడీఏ సెల్ సీనియర్ మేనేజర్ కమ్ కోర్డినేటర్‌గా బాధ్యతలు కట్టబెట్టడం పర్యాటశాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ బాధ్యత ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్వయంగా పర్యాటక శాఖ అధికారులే చెబుతున్నారు. నిబంధనలను అనుసరించాల్సిన ఉన్నతాధికారులు సదరు గైడ్‌కు ‘దాసో’హం అవడం టూరిజం ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతుండటం కొసమెరుపు. చదవండి: వేల కిలోమిటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్! -
తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు..
న్యూఢిల్లీ: తెలంగాణలోని పోచంపల్లి (యాదాద్రి భువనగిరి జిల్లా) గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు. చదవండి: (బీజేపీ నేతలకు సిగ్గుండాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి) -
పర్యాటకానికి 'జల'సత్వం
సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్ పాయింట్‌ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. నిరంతరం బోటింగ్ పర్యవేక్షణ రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓపీని రూపొందించింది. దీని ప్రకారం.. ► బోట్ల రూట్ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్ఓసీ జారీచేస్తున్నారు. ► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. ► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. ► లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు. ► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు. ► ప్రైవేటు బోట్లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలతో సేవలు ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్ బాడీతో, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్ కంట్రోల్ రూమ్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్ బోటుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. నావిగేషన్ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) రేడియోలతో బోట్లను నడపనున్నారు. పాపికొండలుకు విహారయాత్ర గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
బెజవాడలో హెలీ రైడ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరాను పురస్కరించుకుని భక్తులు హెలీకాఫ్టర్లో విహరిస్తూ బెజవాడ అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కృష్ణా జిల్లా యంత్రాంగం కల్పించింది. పర్యాటకశాఖ, నగర మునిసిపల్ కార్పొరేషన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించారు. శనివారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విహంగ సేవలు ప్రారంభించారు. తొలుత ఆలయ ఈవో భ్రమరాంబ ప్రయాణికులతో నగర అందాలను తిలకించారు. కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ (అభివృద్ధి) శివశంకర్ కూడా హెలీకాఫ్టర్లో విహరించారు. నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, మేయర్ భాగ్యలక్ష్మి, ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి హెలీరైడ్.. : ఈ నెల 17 వరకు జరిగే హెలీ రైడ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 6 నిమిషాల విహంగ యాత్రకు రూ.3,500, 13 నిమిషాలకు రూ.6 వేలుగా ధరను నిర్ణయించారు. సన్ రైజ్ ఎయిర్ చార్టర్ సంస్థ, తుంబై ఏవియేషన్ ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా హెలికాప్టర్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. -
ఏపీకి పర్యాటక రంగంలో 2 అవార్డులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో రెండు అవార్డులను సొంతం చేసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు. టూరిజం ట్రావెల్ అసోసియేషన్ ఈ అవార్డులను ప్రకటించినట్లు పేర్కొన్నారు. బెస్ట్ టూరిజం పాలసీగా ఏపీ పాలసీకి అవార్డు దక్కిందని తెలిపారు. అదేవిధంగా బెస్ట్ టూరిజం ప్లేస్‌గా విశాఖపట్నం అవార్డు పొంతం చేసుకుందని పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూరిజంలో విశేష సేవలను అందించిన స్టేక్ హోల్డర్లకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను మంత్రి అందించారు. చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి గుర్తింపు లభించే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, సీఎం కేసీఆర్ కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కార్పొరేషన్ ఎండీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రాంతాలకు మందులు -
పర్యాటక రంగానికి చేయూత
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/భవానీపురం(విజయవాడ పశ్చిమ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చి.. రాష్ట్ర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మించే క్రమంలో విశాఖ, తిరుపతి నగరాల్లో హోటళ్లను నిర్మించేందుకు ఓబరాయ్ హోటల్ ముందుకొచ్చినట్టు తెలిపారు. కరోనా వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎంపీలు బి.సత్యవతి, మాధవి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, జి.బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ పి.రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా టూరిజం పాలసీ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి.. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు టూరిజంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని హరిత బరంపార్క్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన టూరిజం పాలసీ దేశంలోనే బెస్ట్ పాలసీ కానుందని తెలిపారు. వైజాగ్ బీచ్ కారిడార్‌తో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లంబసింగి, అరకు ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించామని, రికార్డ్ స్థాయిలో ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. వైజాగ్, గండికోటల్లో అడ్వంచర్ బోట్స్‌ను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. విజయవాడ హరిత బరంపార్క్కు బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ ఫుడ్ ఫాల్, బెస్ట్ ఆపరేషన్స్‌కు గానూ ఏపీటీడీసీ అవార్డ్‌ను ప్రకటించింది. దీనిని బరంపార్క్ యూనిట్ మేనేజర్ శ్రీనివాస్‌కు రజత్ భార్గవ అందించారు. -
‘బెస్ట్ విలేజ్’ పోటీలో భూదాన్‌పోచంపల్లి
భూదాన్‌పోచంపల్లి: తెలంగాణలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. తాజాగా ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీఓ) నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ తరఫున తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం పోటీపడుతోంది. మన దేశంలోని భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని ప్రఖ్యాతిగాంచిన కాంగ్థాన్, మధ్యప్రదేశ్‌లోని చారిత్రక గ్రామం లద్‌పురాఖాస్ కూడా పోటీలో నిలిచాయి. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు పంపించింది. పోచంపల్లికి ఘనమైన చరిత్ర భూదాన్‌పోచంపల్లికి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉంది. 1951లో మహాత్మాగాంధీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లికి రావడం, ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణ జరిగింది. దాంతో భూదాన ఖ్యాతితో భూదాన్‌పోచంపల్లిగా మారి ప్రపంచపుటల్లోకెక్కింది. అలాగే ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే్ట చీరలు నేసి ఔరా అన్పించారు. ఇక్కడి చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్‌సిటీగా పేరు తెచ్చుకుంది. నాటి నిజాం రాజులతో పాటు అరబ్‌దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయం. అంతేగాక నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు గాంచింది. దాంతో పోచంపల్లిని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు సందర్శించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్ టూరిజం విలేజ్’పోటీని నిర్వహిస్తో్తంది. -
సంక్షేమ సేవల చోదకశక్తి పర్యాటకమే!
ఈశాన్య రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సును కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. ఈ ప్రాంతంలోని స్థానిక ఉత్పత్తుల తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్య ప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారతదేశం ఇవాళ్టికి 75 కోట్ల జనాభాకు టీకాలు వేసే కార్యక్రమానికి చేరువైంది. పర్యాటక రంగానికి ఇంతకన్నా ఉత్తేజమిచ్చే అంశం మరొకటి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే– అంతర్జాతీయ విమానయానంపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రపంచ పర్యాటక రంగం పూర్వస్థాయిలో ఊపందుకోవడానికి మరింత సమయం పట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా మన జనాభాలో అత్యధిక శాతానికి టీకాలు వేయడం పూర్తవుతుంది. కాబట్టి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మనకిదే అద్భుతమైన అవకాశం. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఈశాన్య భారత రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సు ప్రారంభ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈశాన్య భారతంలోని ‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు ప్రధానమంత్రి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అవి శ్రాంతంగా కృషిచేశారు. ఇందులో మొదటిది– నరేంద్రమోదీ నాయకత్వంలో పలు ఒప్పందాలపై సంతకాల ఫలితంగా వివిధ తిరుగుబాటు బృందాలు హింసకు వీడ్కోలు పలికి దేశ ప్రగతి కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దారితీయడం జరిగింది. దీనితో ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకోగా, ప్రధాని నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ, సకాలంలో తగిన చర్యలు తీసుకుంటూ వాటి అమలులో అడ్డంకులను తొలగిస్తూ వచ్చారు. చివరగా నేటి శాంతియుత వాతావరణం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ అనేవి పర్యాటకులను ఆకర్షించడమేగాక వ్యాపార నిర్వహణలో ఆసక్తిగలవారు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు దోహదపడింది. ఈ నేపథ్యంలో రెండురోజులపాటు సాగే సదస్సు పర్యాటక అభివృద్ధి, ఈశాన్య ప్రాంతంలో అనుసంధాన సమస్యలపై ప్రధానంగా చర్చించనుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని భాగస్వాములందరి మధ్య సమన్వయంపై కూడా దృష్టి సారిస్తుంది. అలాగే ఈశాన్య భారతంలో సామర్థ్య వికాస కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి పథకాలు సహా సాహస క్రీడల సంబంధిత యాజమాన్యం, నిర్వహణ, భద్రత ప్రమాణాలు వంటివాటితోపాటు డిజిటల్ ప్రోత్సాహం–విపణి సంబంధిత అంశాలను కూడా ఈ సెమినార్ పరిగణనలోకి తీసుకోనుంది. ప్రధానమంత్రి 2019లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులనుంచి ప్రసంగిస్తూ– మన దేశం 2022లో 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకునే నాటికి పౌరులలో ప్రతి ఒక్కరూ కనీసం 15 దేశీయ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. తూర్పున మయన్మార్, పడమట బంగ్లాదేశ్, ఉత్తరాన భూటాన్–చైనా సరిహద్దులుగా ఉన్న ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. అంతేగాక దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ జాతులు, సంస్కృతులు, భాషా వైవిధ్యానికి ఈ రాష్ట్రాలు పట్టుగొమ్మలు. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. వివిధ అధ్యయనాల ప్రకారం... రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే పర్యాటక రంగం 78 ఉద్యోగాలను సృష్టించగలదు. ఆ మేరకు మన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి రంగాల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు సృష్టించగల సామర్థ్యం పర్యాటకానికి మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 2019–20లో ఉపాధి అవకాశాల సృష్టికి సంబంధించి పర్యాటక రంగంవాటా 15.34 శాతంగా నమోదైంది. ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థలో మొత్తం 7 కోట్ల 90 లక్షల మేరకు ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పిం చింది. ఈ రంగానికిగల ఉపాధి కల్పన సామర్థ్యాన్ని ఈశాన్య ప్రాంతంలో చోదకశక్తిగా మార్చుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈశాన్య ప్రాంత వాస్తవికతను పరిరక్షించుకుంటూనే ఈ కృషిని మనం సుస్థిరంగా కొనసాగించవచ్చు. ముఖ్యంగా అపారమైన ప్రకృతి సహజ వారసత్వానికి నెలవు కాబట్టి పర్యావరణ, గ్రామీణ, సాహస క్రీడా పర్యాటకానికి ఈ ప్రాంతంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఈశాన్య ప్రాంతంలో తేయాకు, ఆరోగ్య, చలనచిత్ర పర్యాటకాల వంటి చెప్పుకోదగిన అనేక పర్యాటక అనుభవాలను పొందే వీలుంది. ఇక ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన 100 రకాల వెదురు జాతులు ప్రకృతి సహజంగా లభించడం ఆసక్తికర అంశం. సాంబ్రాణి కడ్డీలు, వెదురు చాపలతోపాటు పుల్లలు, బద్దలు వంటివి లభ్యమవుతాయి. ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాల సౌభాగ్యం దిశగా వీటి తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. అసోంలో ‘మూగా పట్టు’... నాగాలాండ్ ‘నాగా మిరప’... ఏదైనా కావచ్చు.. వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు ప్రపంచం మొత్తానికీ అందించాల్సి ఉంది. ఈ సమావేశం నిర్వహణకు ఇంతకన్నా అనువైన సమయం మరొకటి లేదు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఇతివృత్తం కింద వివిధ కార్యక్రమాలు సాగుతుండగా, భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకోనుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ మన దేశ సుసంపన్న సంస్కృతి, చరిత్ర, స్పష్టాస్పష్ట వారసత్వాన్ని చాటేవిగా ఉంటున్నాయి. మన దేశ ప్రాచీన మూలాలు, విస్తృత నాగరికతా వారసత్వాలను ప్రముఖంగా ప్రదర్శించడానికి కూడా ఇదొక అవకాశం. అలాగే అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న నవభారత స్ఫూర్తిని అందిపుచ్చుకోవడానికీ ఇదే అదను. అంతేకాకుండా మౌలిక సదుపాయాల వృద్ధిపైనా గట్టిగా దృష్టి సారించడం అవశ్యం. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద దేశంలోని వివిధ ప్రాంతాలకు... ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకమైన భారతదేశ పండుగలను దృశ్యరూపం కల్పించడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ పండుగలు వాస్తవంగా మనను ఓ నాగరిక దేశంగా నిర్వచిస్తూ– ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ భావనను ప్రోదిచేస్తాయి. ఈ ప్రాంతానికిగల మృదువైన శక్తిని ప్రోత్సహించడానికి పర్యాటకం ఒక కీలక ఉపకరణం. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల, ప్రపంచ ప్రజానీకంతో అనుసంధానించే సాధనం కూడా. పర్యాటకాన్ని అత్యున్నత దృష్టితో మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్యప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారత్ వంటి దేశంలో ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది సుసంపన్న వారసత్వం... సహజ లేదా పర్యావరణ వైవిధ్యం లేదా సందర్శకులు పాలుపంచుకోగల కార్యకలాపాలు వంటివాటిలో ఏదో ఒకటిగా ఉండవచ్చు. ఈ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడమే మా లక్ష్యం. జి. కిషన్‌రెడ్డి వ్యాసకర్త కేంద్ర పర్యాటక–సాంస్కృతిక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com -
ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి అవంతి
-
ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్: మంత్రి అవంతి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తితో పర్యాటక శాఖకు నష్టం వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 13 చోట్ల 5 స్టార్ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేశాం.. సింహాచలంలో ఆ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటన ప్రాంతాల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజిలు రూపొందిస్తామని వెల్లడించారు. సీ ప్లేన్స్ కూడా తీసుకొచ్చి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తుచేశారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం ప్రోత్సహించాలన్నది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన ఇద్దరు పర్యాటక కాంటాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీస్కున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. 36 పర్యాటక హోటళ్లలో నిర్వహణ పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందమైన సముద్రం... అడవులు ఉన్నాయని, ఎకో టూరిజం అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నామని.. దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని మంత్రి తెలిపారు. లోకల్ టూరిస్ట్‌లకు నాలుగు జోన్లుగా చేస్తున్నామని, జోన్‌కొక మేనేజర్ ఉంటాడని చెప్పారు.