సంక్షేమ సేవల చోదకశక్తి పర్యాటకమే! | G Kishan Reddy Article On Tourism Sector | Sakshi
Sakshi News home page

సంక్షేమ సేవల చోదకశక్తి పర్యాటకమే!

Published Tue, Sep 14 2021 12:03 AM | Last Updated on Tue, Sep 14 2021 12:03 AM

G Kishan Reddy Article On Tourism Sector - Sakshi

ఈశాన్య రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సును కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించడానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. ఈ ప్రాంతంలోని స్థానిక ఉత్పత్తుల తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్య ప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు.

భారతదేశం ఇవాళ్టికి 75 కోట్ల జనాభాకు టీకాలు వేసే కార్యక్రమానికి చేరువైంది. పర్యాటక రంగానికి ఇంతకన్నా ఉత్తేజమిచ్చే అంశం మరొకటి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే– అంతర్జాతీయ విమానయానంపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రపంచ పర్యాటక రంగం పూర్వస్థాయిలో ఊపందుకోవడానికి మరింత సమయం పట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికల్లా మన జనాభాలో అత్యధిక శాతానికి టీకాలు వేయడం పూర్తవుతుంది. కాబట్టి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మనకిదే అద్భుతమైన అవకాశం. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఈశాన్య భారత రాష్ట్రాల పర్యాటక–సాంస్కృతిక శాఖ మంత్రుల సదస్సు ప్రారంభ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈశాన్య భారతంలోని ‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు ప్రధానమంత్రి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మూడంచెల వ్యూహంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన అవి శ్రాంతంగా కృషిచేశారు. ఇందులో మొదటిది– నరేంద్రమోదీ నాయకత్వంలో పలు ఒప్పందాలపై సంతకాల ఫలితంగా వివిధ తిరుగుబాటు బృందాలు హింసకు వీడ్కోలు పలికి దేశ ప్రగతి కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దారితీయడం జరిగింది. దీనితో ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగం పుంజుకోగా, ప్రధాని నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ, సకాలంలో తగిన చర్యలు తీసుకుంటూ వాటి అమలులో అడ్డంకులను తొలగిస్తూ వచ్చారు. చివరగా నేటి శాంతియుత వాతావరణం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ అనేవి పర్యాటకులను ఆకర్షించడమేగాక వ్యాపార నిర్వహణలో ఆసక్తిగలవారు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు దోహదపడింది.

ఈ నేపథ్యంలో రెండురోజులపాటు సాగే సదస్సు పర్యాటక అభివృద్ధి, ఈశాన్య ప్రాంతంలో అనుసంధాన సమస్యలపై ప్రధానంగా చర్చించనుంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని భాగస్వాములందరి మధ్య సమన్వయంపై కూడా దృష్టి సారిస్తుంది. అలాగే ఈశాన్య భారతంలో సామర్థ్య వికాస కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి పథకాలు సహా సాహస క్రీడల సంబంధిత యాజమాన్యం, నిర్వహణ, భద్రత ప్రమాణాలు వంటివాటితోపాటు డిజిటల్‌ ప్రోత్సాహం–విపణి సంబంధిత అంశాలను కూడా ఈ సెమినార్‌ పరిగణనలోకి తీసుకోనుంది.

ప్రధానమంత్రి 2019లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులనుంచి ప్రసంగిస్తూ– మన దేశం 2022లో 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకునే నాటికి పౌరులలో ప్రతి ఒక్కరూ కనీసం 15 దేశీయ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. తూర్పున మయన్మార్, పడమట బంగ్లాదేశ్, ఉత్తరాన భూటాన్‌–చైనా సరిహద్దులుగా ఉన్న ఈశాన్య భారత రాష్ట్రాలు భారత దేశానికి మిరుమిట్లు గొలిపే వజ్రాభరణాల వంటివి. అంతేగాక దేశీయ పర్యాటకుల పర్యటన ప్రణాళికలో ఇవి తప్పక ఉండాల్సిందే. మంచుకప్పిన పర్వత శిఖరాలు, పరుగులెత్తే నదులు, లోతైన లోయలు, అచ్చెరువు గొలిపే సుందర ప్రకృతి దృశ్యాలు తదితరాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా వివిధ జాతులు, సంస్కృతులు, భాషా వైవిధ్యానికి ఈ రాష్ట్రాలు పట్టుగొమ్మలు.

ఈ నేల, సంస్కృతి, ప్రజానీకంపై గణనీయమైన సానుకూల ప్రభావం చూపగల శక్తి పర్యాటక రంగానికి ఉంది. వివిధ అధ్యయనాల ప్రకారం... రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే పర్యాటక రంగం 78 ఉద్యోగాలను సృష్టించగలదు. ఆ మేరకు మన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి రంగాల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు సృష్టించగల సామర్థ్యం పర్యాటకానికి మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 2019–20లో ఉపాధి అవకాశాల సృష్టికి సంబంధించి పర్యాటక రంగంవాటా 15.34 శాతంగా నమోదైంది. ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థలో మొత్తం 7 కోట్ల 90 లక్షల మేరకు ప్రత్యక్ష–పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పిం చింది. ఈ రంగానికిగల ఉపాధి కల్పన సామర్థ్యాన్ని ఈశాన్య ప్రాంతంలో చోదకశక్తిగా మార్చుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈశాన్య ప్రాంత వాస్తవికతను పరిరక్షించుకుంటూనే ఈ కృషిని మనం సుస్థిరంగా కొనసాగించవచ్చు. ముఖ్యంగా అపారమైన ప్రకృతి సహజ వారసత్వానికి నెలవు కాబట్టి పర్యావరణ, గ్రామీణ, సాహస క్రీడా పర్యాటకానికి ఈ ప్రాంతంలో ఎన్నో అవకాశాలున్నాయి.

ఈశాన్య ప్రాంతంలో తేయాకు, ఆరోగ్య, చలనచిత్ర పర్యాటకాల వంటి చెప్పుకోదగిన అనేక పర్యాటక అనుభవాలను పొందే వీలుంది. ఇక ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన 100 రకాల వెదురు జాతులు ప్రకృతి సహజంగా లభించడం ఆసక్తికర అంశం. సాంబ్రాణి కడ్డీలు, వెదురు చాపలతోపాటు పుల్లలు, బద్దలు వంటివి లభ్యమవుతాయి. ఈ ప్రాంతంలోని స్థానిక సమాజాల సౌభాగ్యం దిశగా వీటి తయారీని చక్కగా ప్రోత్సహించడం మన బాధ్యత. అసోంలో ‘మూగా పట్టు’... నాగాలాండ్‌ ‘నాగా మిరప’... ఏదైనా కావచ్చు.. వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు ప్రపంచం మొత్తానికీ అందించాల్సి ఉంది.

ఈ సమావేశం నిర్వహణకు ఇంతకన్నా అనువైన సమయం మరొకటి లేదు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ఇతివృత్తం కింద వివిధ కార్యక్రమాలు సాగుతుండగా, భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలు నిర్వహించుకోనుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ మన దేశ సుసంపన్న సంస్కృతి, చరిత్ర, స్పష్టాస్పష్ట వారసత్వాన్ని చాటేవిగా ఉంటున్నాయి. మన దేశ ప్రాచీన మూలాలు, విస్తృత నాగరికతా వారసత్వాలను ప్రముఖంగా ప్రదర్శించడానికి కూడా ఇదొక అవకాశం. అలాగే అత్యాధునిక డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న నవభారత స్ఫూర్తిని అందిపుచ్చుకోవడానికీ ఇదే అదను. అంతేకాకుండా మౌలిక సదుపాయాల వృద్ధిపైనా గట్టిగా దృష్టి సారించడం అవశ్యం. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కింద దేశంలోని వివిధ ప్రాంతాలకు... ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకమైన భారతదేశ పండుగలను దృశ్యరూపం కల్పించడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ పండుగలు వాస్తవంగా మనను ఓ నాగరిక దేశంగా నిర్వచిస్తూ– ‘ఒకే భారతం–శ్రేష్ఠ భారతం’ భావనను ప్రోదిచేస్తాయి.

ఈ ప్రాంతానికిగల మృదువైన శక్తిని ప్రోత్సహించడానికి పర్యాటకం ఒక కీలక ఉపకరణం. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల, ప్రపంచ ప్రజానీకంతో అనుసంధానించే సాధనం కూడా. పర్యాటకాన్ని అత్యున్నత దృష్టితో మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రగతి, ఉపాధి అవకాశాలతో ఈశాన్యప్రాంత సమాజాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పర్యాటక రంగాన్ని సంక్షేమ ప్రదానంలో ఒక ముఖ్యమైన ఉపకరణంగా ప్రధానమంత్రి పరిగణిస్తున్నారు. భారత్‌ వంటి దేశంలో ప్రతి గ్రామానికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. అది సుసంపన్న వారసత్వం... సహజ లేదా పర్యావరణ వైవిధ్యం లేదా సందర్శకులు పాలుపంచుకోగల కార్యకలాపాలు వంటివాటిలో ఏదో ఒకటిగా ఉండవచ్చు. ఈ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడమే మా లక్ష్యం.


జి. కిషన్‌రెడ్డి 
వ్యాసకర్త కేంద్ర పర్యాటక–సాంస్కృతిక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి
ఈ–మెయిల్‌: gkishanreddy@yahoo.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement