జిల్లా అధికారుల పర్యవేక్షణకు దూరంగా ఉండే పర్యాటక శాఖలో అవినీతి, అక్రమాలు నిరాటకంగా సాగుతున్నాయి. ఈ శాఖ ఆధ్వర్యంలో హోటల్స్, రిసార్ట్స్, గదుల బుకింగ్స్ వంటి కార్యకలాపాల నిర్వహణ ఉంటుంది. ప్రతిదాంట్లో కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ శాఖలో జరిగే అవినీతి, అక్రమాలపై విచారణ నివేదికలు వెలుగుచూడడం లేదు. టూరిజంలో అక్రమార్కుల వీర విహారం తారస్థాయికి చేరింది. కాంట్రాక్ట్ ఉద్యోగినిపై దాడి ఘటనతో వివాదాస్పదమైన ఏపీ టూరిజం శాఖలో లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
నెల్లూరు(టౌన్): నెల్లూరు డివిజన్ పర్యాటక శాఖ అక్రమాలకు అడ్డాగా మారింది. ఈ శాఖలో జరిగే అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమేనని, రానివి చాలా ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులు కొందరు బహిరంగంగా చెబుతున్నారు. పర్మినెంట్ ఉద్యోగులను తీసుకోకపోవడంతో ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లపై ఈ శాఖలోకి తీసుకురావడంతో అక్రమాలు, వివాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. పర్యాటక శాఖలోని లొసుగులు, అవకాశాలను అదనుగా తీసుకుని పలువురు అధికారులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
అవినీతి, అక్రమాలెన్నో..
►కూరగాయలు, ప్రొవిజన్స్, పాలు, మాంసాహార కొనుగోళ్లతో పాటు గదుల బుకింగ్, రిసార్ట్స్, హోటళ్ల నిర్వహణలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
►వీటికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖాపరంగా పలు విచారణలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
►గతేడాది తడ టూరిజం హోటల్‌లో రేవ్ పార్టీ జరిగిందని ప్రచారం ఉంది. రెండు రోజుల పాటు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో టూరిజం అధికారులు హడావుడి చేశారు.
►విచారణ అధికారిగా వెళ్లిన అప్పటి డివిజనల్ మేనేజర్ ఏమి నివేదిక ఇచ్చారో తెలియదు కానీ, ఆ యూనిట్ మేనేజర్‌ను సస్పెండ్‌తో సరిపెట్టారు.
►అతను కొద్ది రోజులకే ఏపీ టూరిజం కార్యాలయంలో ఉన్న లొసుగులు, పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ సంపాదించాడు.
►ఏపీ టూరిజంలో చిరుద్యోగులుగా ప్రస్థానం ప్రారంభించిన పలువురు అనతికాలంలోనే లక్షాధికారులుగా అవతారమెత్తారు. ఆ శాఖలోని లోపాలు వారికి వరంలా మారాయి.
►సాధారణంగా ఏ శాఖకైనా భారీ మొత్తంలో ఏవైనా వస్తువులు అవసరమైతే టెండర్ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేస్తారు. ఇక్కడ మాత్రం అంతా వీరిదే పెత్తనం. వారు కొన్నదే వస్తువు. చెప్పిందే ధర.
మాయాజాలం
►ఏపీ టూరిజం శాఖకు ప్రధాన ఆదాయ వనరు హోటల్ గదులు. అయితే ఆ శాఖలోనే కొందరు ఉద్యోగులు తమ తెలివితేటలు ప్రదర్శించి అందిన కాడికి దోచుకుంటున్నారు.
►సాధారణంగా గది బుకింగ్ చేసుకుంటే 24 గంటలు సమయం ఉంటుంది. అయితే ఈ హోటల్స్‌కు వచ్చే ఎక్కువ మంది కొద్ది గంటలు మాత్రమే ఉండి వెళ్లిపోతుంటారు. ఇది వారికి అవకాశంగా మారింది.
►ఒక వ్యక్తి రెండు, మూడు గంటలకు ఖాళీ చేసి వెళ్లిపోతే ఆ తర్వాత వచ్చిన వారికి కూడా అదే పేరు మీద గదిని ఇచ్చేస్తారు. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగి డ్యూటీ రోజు భారీగా సంపాదిస్తారని ఆరోపణలు ఉన్నాయి.
►దీంతో పాటు బుకింగ్ కాకుండా ఖాళీగా ఉన్న రూములను అనధికారికంగా రెండు నుంచి మూడు గంటలు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
►డివిజనల్ మేనేజర్ లేదా విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వచ్చినా కొద్ది గంటల ముందే సమాచారం తెలిసి పోయేలా సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
►మరో వైపు హోటల్స్, రిసార్ట్స్ ఆవరణల్లో నిర్వహించే పలు విందులు, ఫొటో షూట్లకు సంబంధించి కస్టమర్ల నుంచి భారీగా వసూలు చేసినా లెక్కల్లో చూపేది మాత్రం కొంతే.
బహిరంగ రహస్యమే
ఏపీ టూరిజం శాఖలో జరుగుతున్న అక్రమాలు బహిరంగ రహస్యమే. ఆయా విభాగాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఉన్నతాధికారులకు తెలిసినా తమ వాటాలు తీసుకుని పట్టించుకోరని చెబుతున్నారు. తనపై జరిగిన దాడి విషయంలోనూ ఉన్నతాధికారులు సకాలంలో స్పందించలేదని బాధితురాలు సీనియర్ అసిస్టెంట్ ఉషారాణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కార్పొరేట్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు అవినీతి పరులుగా తయారై ప్రతి నెలా వాటాల పేరుతోనే వేధించడంతోనే కింది స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment