నెల్లూరు (టౌన్): ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నెల్లూరు డివిజన్‌లో అవినీతి, అక్రమాల డొంక కదులుతోంది. నెల్లూరు డివిజన్ కార్యాలయంలో దివ్యాంగురాలైన సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ దాడి ఘటన తర్వాత ఇక్కడి కార్యకాలపాలపై సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన ఆ శాఖ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. టూరిజం శాఖ నెల్లూరు డివిజన్‌లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై విచారించి వెంటనే నివేదిక సమరి్పంచాలని ఆ శాఖ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. రెండు రోజుల్లో విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
►ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ టూరిజం శాఖ జీఎం సుదర్శన్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆయన మూడు రోజులుగా నెల్లూరులో ఉండి దాడి ఘటనకు సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు.
►దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ శేషగిరిబాబు జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ నాగరాజకుమారిని నియమించారు. ఈ ఇద్దరి విచారణలతో పాటు అవినీతి అక్రమాలపై మరో కమిటీ ఏర్పాటు కానుండటంతో ఆ శాఖ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
అక్రమాలెన్నో..
ఏపీ టూరిజం నెల్లూరు డివిజన్ పరిధిలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.
►ప్రధానంగా ఆ శాఖకు సంబంధించి హోటళ్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు కొనుగోళ్లు, గదుల బుకింగ్‌లో జరిగిన లొసుగులు, తడ హరిత హోటల్లో జరిగిన విందు తదితర అంశాలపై విచారణ జరగనుంది.
►ఆ శాఖ పరిధిలో జరిగిన కాంట్రాక్ట్ పనులు, వాటిల్లో నాణ్యత తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు.
►ఈ నేపథ్యంలో కొనుగోళ్లన్నీ అకౌంట్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగాయా లేక సొంతంగా జరిగాయా అనే విషయాన్ని నిగ్గు తేల్చనున్నారు.
►బోటింగ్ యూనిట్లు నిర్వహణపైన విచారణ కమిటీ ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది.
►హోటల్ గదుల బుకింగ్‌కు సంబంధించి గతంలో పలు అక్రమాలు చోటు చేసుకున్న సందర్భంలో బాధ్యులను బదిలీలతో సరిపెట్టారు.
►ఇప్పుడు వాటి గుట్టును కూడా విచారణ కమిటీ వెలికి తీయనుంది.
►మరొక వైపు నెల్లూరు హరితా హోటల్ ఆవరణలోని డివిజన్ కార్యాలయంలో నెలకొన్న విభేదాలు, వర్గపోరుపైన విచారణ కమిటీ దృష్టి పెట్టనుంది.
►గతంలో ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేయడం, మరో ఉద్యోగి సహచర ఉద్యోగినిపై కుర్చీ విసరడానికి దారి తీసిన పరిస్థితి, కార్యాలయంలో క్రమశిక్షణ పరిస్థితులపై విచారణ కమిటీ ఆరా తీయనుంది.
►విజిలెన్స్, డివిజనల్ మేనేజర్ తదితర ఉన్నతాధికారుల కదలికలను యూనిట్ల మేనేజర్లు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విచారిస్తే గుట్టు మొత్తం బయట పడుతుందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు.
►ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గతంలో తిరుపతికి బదిలీ చేసినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తన పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి నెల్లూరుకు వచ్చి నెల్లూరు డివిజన్ మొత్తాన్ని శాసిస్తున్నాడు.
సాక్షి కథనాలతో కలకలం
ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలను సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ శాఖలో కలకలం రేగుతోంది. విచారణ జరిగితే ఎవరెవరికి ముప్పు ఉందో అనే అంశంపై ఆ శాఖ ఉద్యోగులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.
తడలో హరిత హోటల్లో జరిగిన విందుపై డివిజనల్ మేనేజర్ తూతూ మంత్రంగా విచారణ చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
►అప్పట్లో బాధ్యుడైన అధికారిని సస్పెండ్‌తో సరిపెట్టగా కేవలం రెండు నెలల్లోనే తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని చిత్తూరు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంబంధిత తడ హోటల్ మేనేజర్‌ను సస్పెండ్ చేశారు.
►గతంలో నెల్లూరు డివిజన్ కలిసి ఉన్న తిరుపతి డివిజన్‌లోని హార్స్‌లీ హిల్స్‌లోని హరితా హోటల్‌లో గదుల బుకింగ్‌లో జరిగిన మాయాజాలం, కడప, తిరుపతిల్లో ప్రొవిజన్స్ కొనుగోళ్లు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారించి నివేదిక సమరి్పచినా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం.
►అయితే ఈ నివేదికలపై కూడా ప్రస్తుత ఎండీ ప్రవీణకుమార్ విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసింది.
►విచారణ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment