రిజిస్ట్రేషన్‌ శాఖలో వసూల్‌ రాజాలు | Corruption In Registration Department In Nellore District | Sakshi
Sakshi News home page

ఆడిట్‌.. డౌట్‌

Published Tue, Aug 25 2020 10:19 AM | Last Updated on Tue, Aug 25 2020 10:19 AM

Corruption In Registration Department In Nellore District - Sakshi

జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలు, అవినీతిని వెలికి తీయాల్సిన స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఇంటర్నల్‌ ఆడిటింగ్‌ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సిన విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ప్రతి నెలా ఇంటర్నల్‌ ఆడిట్‌ నిర్వహించాల్సిన అధికారులు జల్సాలు, మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సాక్షి నెల్లూరు: జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలో 9 కార్యాలయాలు, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన భూముల విలువలను తారుమారు చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆ శాఖ తేల్చిన ఆడిట్‌ రిపోర్టులే అద్దం పడుతున్నాయి. కొంత కాలంగా రెండు జిల్లాల పరిధిలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు అయితే ఆడిట్‌ శాఖ సైతం అవినీతి సొమ్ములో వాటాలు పంచుకుంటుంది.  

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే సేల్‌ డీడ్, గిఫ్ట్‌ డీడ్, మార్ట్‌ గేజ్, సవరణ లీజు అగ్రిమెంట్, వీలునామా, జీపీఏ కమ్‌ సేల్, జనరల్‌ పవర్, రెంటల్‌ అగ్రిమెంట్‌ తదితరాలకు సక్రమంగా స్టాంప్‌ డ్యూటీ చెల్లించారా? లేదా? అనే విషయాలను ఇంటర్నల్‌ ఆడిటింగ్‌ విభాగం నిగ్గు తేల్చుతోంది.
స్టాంప్‌ డ్యూటీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు తేలితే వెంటనే పెనాల్టీ వేసి, సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసు పంపిస్తోంది.
అయితే మార్కెట్‌ విలువ ప్రకారమే స్టాంప్‌ డ్యూటీ సక్రమంగా చెల్లించి ఉంటే జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ వద్ద అప్పీల్‌ చేసుకుని సరిచేసుకోవచ్చు. 
స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులో నిజంగా తేడా ఉంటే సబ్‌రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్‌ ఓనర్‌కు పెనాల్టీ చెల్లించాలని నోటీసు అందిస్తారు.
రిజిస్ట్రేషన్‌ శాఖ ఆడిట్‌ విభాగం అధికారులు డాక్యుమెంట్లపై అభ్యంతరాలు ఉన్నాయని సాకు చూపుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో నిషేధిత భూములు జాబితాలో ఉన్న ప్రభుత్వ, దేవదాయ భూములకు సైతం సబ్‌ రిజిస్ట్రార్లు కాసుల కోసం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 
నెలవారీగా అధికారులు నిర్వహించే ఇంటర్నల్‌ ఆడిట్‌లో ఆయా రిజిస్టేషన్లకు రేటు ఫిక్స్‌ చేసి వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.   

ఆడిటింగ్‌లో జాప్యం 
ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఆడిట్‌ జిల్లా అధికారి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇంటర్నల్‌ ఆడిటింగ్‌ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. చేయి తడిపిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆడిటింగ్‌ పూర్తి చేసి పెనాల్టీలు లేకుండా సరి చేసిన ఉదంతాలు ఉన్నాయి. మిగిలిన కార్యాలయాల్లో మాత్రం ఆడిట్‌ చేయకుండా నెట్టుకొచ్చాడు. ఆ అధికారి తీరు వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఉదాహరణకు..
నెల్లూరు రీజియన్‌ పరిధిలో ఆర్‌ఓ నెల్లూరులో గతేడాది నవంబర్‌ నుంచి ఆడిట్‌ జరగలేదు. దాదాపు 318 డాక్యుమెంట్లకు స్టాంప్‌ డ్యూటీలో తేడాలున్నట్లు నిర్ధారణ చేశారు. 
నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బుచ్చిరెడ్డిపాళెంలో గతేడాది డిసెంబర్‌ నుంచి ఆడిటింగ్‌ జరగలేదు. స్టౌన్‌హౌస్‌పేట రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 136 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు నిర్ధారించారు.  
ఉదయగిరి, వింజమూరు, అల్లూరు, ఆత్మకూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాయాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆడిట్‌ నిర్వహించలేదు. 
గూడూరు జిల్లా పరిధిలో గూడూరు ఆర్‌ఓ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కూడా గతేడాది డిసెంబర్‌ నుంచి ఆడిట్‌ నిర్వహణ జరగలేదు. ఆ కార్యాలయంలో సుమారు 62 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. 
బుజబుజనెల్లూరు, ఇందుకూరుపేట, కోట, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా జనవరి నుంచి ఆడిట్‌ నిర్వహణ చేయలేయకపోవడం గమనార్హం  
ఆడిటింగ్‌ విభాగంలో ఉద్యోగ విరమణ చేసిన జిల్లా అధికారి ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లను టీమ్‌గా ఏర్పాటు చేసి వారి ద్వారా ఆడిటింగ్‌ నిర్వహణ చేయించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి పాత తేదీలతో అధికారి సంతకాలు చేసేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఆ ఎత్తుగడకు చెక్‌ పెట్టారు.

రూ.3.23 కోట్ల రికవరీపై దృష్టి ఏదీ 
జిల్లాలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది. ఇందులో అత్యధికంగా 648 డాక్యుమెంట్లకు సంబంధించి అవినీతి సొమ్మును రికవరీ చేసినట్లు చెబున్నా.. సగం కూడా లేకపోవడం గమనార్హం. 648 డాక్యుమెంట్లకు సుమారు రూ.2.51 కోట్లు ఉంటే.. మిగిలిన 285 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.3.23 కోట్ల రికవరీ చేయాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, అధికారులపై శాఖా పరమైన చర్యలు కూడా చేపట్టాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి వసూళ్లు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు.   

ఆడిటింగ్‌ విభాగంపై చర్యలుంటాయి
మా శాఖ ఇంటర్నల్‌ ఆడిటింగ్‌ విభాగంలో అక్రమాలు జరుగుతున్నట్లు నా దృష్టికి అయితే రాలేదు. వారు అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆడిట్‌లో గుర్తించిన అక్రమాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్లు పైనే రికవరీ పెండింగ్‌ ఉంది. త్వరలోనే రికవరీ చేస్తాం. 
– అబ్రహం, డీఐజీ, స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement