bribes
-
Siddaramaih: లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే... రాజకీయాలకు గుడ్‌బై
బెంగళూరు: ప్రభుత్వ శాఖల్లో పోస్టింగులు, బదిలీల్లో తన కుమారుడు యతీంద్ర భారీగా లంచాలు తీసుకున్నారన్న జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపణలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్రంగా ఖండించారు. తాను గానీ, యతీంద్ర గానీ లంచాలు తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. లంచాలు తీసుకున్న చరిత్ర కుమారస్వామిదేనని ఎద్దేవా చేశారు. ఆయన హయాం పొడవునా అలాంటి వ్యవహారాలే జరిగాయని ఆరోపించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధరామయ్య–యతీంద్ర ఫోన్ సంభాషణ పోస్టింగులు, బదిలీల్లో లంచాల గురించేనని కుమారస్వామి ఆరోపిస్తుండటం తెలిసిందే. యతీంద్ర సూపర్ సీఎంగా మారారంటూ ఆయన మండిపడ్డారు. -
జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. బొమ్మై మెడకు మరో వివాదం!
బెంగళూరు: కర్ణాటక అధికార బీజేపీ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు జర్నలిస్టులకు ‘క్యాష్ గిఫ్ట్‌లు’ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. పలువురు జర్నలిస్టులకు మిఠాయి బాక్సులతో పాటు రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు నగదు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎంఓ స్వీట్ బాక్సులతో లంచాలు ఇచ్చిందని ఆరోపించింది. దీపావళి పండగను పురస్కరించుకుని పలు మీడియా సంస్థలకు చెందిన 10 మందికిపైగా సీనియర్ జర్నలిస్టులకు సీఎంఓ నుంచి స్వీటు బాక్సులు గిఫ్ట్‌లుగా వెళ్లాయి. అయితే అందులో మిఠాయిలతో పాటు రూ.లక్షల్లో డబ్బులు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. స్వీటు బాక్సుల్లో నగదు ఉన్నట్లు ముగ్గురు జర్నలిస్టులు స్వయంగా అంగీకరించినట్లు పేర్కొన్నాయి. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డబ్బును తిప్పి పంపించినట్లు అందులోని ఇద్దరు జర్నలిస్టులు వెల్లడించినట్లు ద న్యూస్ మినట్ పేర్కొంది. ‘సీఎం కార్యాలయం నుంచి నాకు స్వీట్ బాక్సు వచ్చింది. తెరిచి చూడగా అందులో రూ.1 లక్ష క్యాష్ ఉంది. ఈ విషయాన్ని మా ఎడిటర్స్‌కు తెలియజేశాను. ఆ నగదును తాను తీసుకోనని సీఎంఓ అధికారులకు తెలిపాను. ఇది చాలా తప్పు.’ అని మరో జర్నలిస్టు పేర్కొన్నారు. జర్నలిస్టులకు క్యాష్ గిఫ్ట్‌ల వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై అవినీతికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ.. కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి బొమ్మై మీడియా అడ్వైజర్ పలు మీడియా సంస్థల చీఫ్ రిపోర్టర్లకు ఈ గిఫ్ట్‌లు అందించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ విమర్శలు.. జర్నలిస్టులకు నగదు గిఫ్ట్‌ల నేపథ్యంలో బీజేపీ సర్కారుపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.‘సర్కారు రూ.లక్షల్లో లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇది సీఎం ఆపర్ చేసిన లంచం కాదా? ఈ లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ఖజానా నుంచా లేదా సీఎం వ్యక్తిగత ఖాతా నుంచా? దీనిపై ఈడీ/ఐటీ చర్యలు తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు బొమ్మై సమాధానం చెప్పగలరా?’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ట్విటర్లో విమర్శించారు. దీనిపై జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: సీఎం ముఖచిత్రంతో ‘పేసీఎం’.. కర్ణాటక సర్కార్‌పై కాంగ్రెస్ అస్త్రం! -
లంచగొండులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల మాట వినిపించకూడదని, ఎక్కడ అవినీతి ఉన్నా కూకటివేళ్లతో పెకిలించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ చేసిన ఆదేశాలతో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) లంచ గొండుల భరతం పడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దాడులకు శ్రీకారం చుట్టింది. అవినీతి నిరోధానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘14400’ కాల్ సెంటర్లకు పెద్దఎత్తున కాల్స్ వస్తుండడంతో వీటిపైనా ఏసీబీ వేగంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజల్లో అవగాహన బాగా పెరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. అలాగే, లంచగొండులపై నిఘాను ముమ్మరం చేసింది. 10 నెలల్లో 44,999 కాల్స్ ► గత ఏడాది నవంబర్‌లో ‘14400’ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ► ఇప్పటివరకు ఈ కాల్ సెంటర్‌కు 44,999 కాల్స్ రాగా ఇందులో అవినీతికి సంబంధించిన కాల్స్ 1,747 ఉన్నాయి. ► ఇందులో 1,712 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 161 కాల్స్‌పై చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 13 ట్రాప్ కేసులను కూడా ఏసీబీ నమోదు చేసింది. మూడు కేసుల్లో క్రిమినల్ దుష్ప్రవర్తన చర్యలను చేపట్టింది. ► మరో 67 ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ► 46 రెగ్యులర్ విచారణలు.. 32 డిస్క్రీట్ విచారణలను చేపట్టారు. ► దీంతో ఈ కాల్‌సెంటర్ సూపర్‌హిట్ అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► అలాగే, వస్తున్న కాల్స్ ద్వారా ఏఏ శాఖల్లో ఏఏ అంశాలపై అక్రమార్కులు ప్రజలను లంచాలు డిమాండ్ చేస్తున్నారో ఏసీబీ గుర్తించింది. ► దీని ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తిమింగలాలతో పాటు సామాన్య ప్రజలను లంచాల పేరుతో పీడించే వారిపై తక్షణం దృష్టిసారించాలని నిర్ణయించింది. ► ఇందులో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖల్లో అక్రమార్కులపై ప్రధానంగా నిఘా పెట్టనుంది. -
రిజిస్ట్రేషన్ శాఖలో వసూల్ రాజాలు
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జరిగే ఆస్తుల క్రయవిక్రయాల్లో అక్రమాలు, అవినీతిని వెలికి తీయాల్సిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం మామూళ్ల మత్తులో జోగుతోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే లావాదేవీల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చాల్సిన విభాగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ప్రతి నెలా ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించాల్సిన అధికారులు జల్సాలు, మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి నెల్లూరు: జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో 9 కార్యాలయాలు, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన భూముల విలువలను తారుమారు చేసి అవినీతికి పాల్పడుతున్నట్లు ఆ శాఖ తేల్చిన ఆడిట్ రిపోర్టులే అద్దం పడుతున్నాయి. కొంత కాలంగా రెండు జిల్లాల పరిధిలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు అయితే ఆడిట్ శాఖ సైతం అవినీతి సొమ్ములో వాటాలు పంచుకుంటుంది. ♦సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, మార్ట్ గేజ్, సవరణ లీజు అగ్రిమెంట్, వీలునామా, జీపీఏ కమ్ సేల్, జనరల్ పవర్, రెంటల్ అగ్రిమెంట్ తదితరాలకు సక్రమంగా స్టాంప్ డ్యూటీ చెల్లించారా? లేదా? అనే విషయాలను ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగం నిగ్గు తేల్చుతోంది. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు తేలితే వెంటనే పెనాల్టీ వేసి, సబ్‌రిజిస్ట్రార్‌కు నోటీసు పంపిస్తోంది. ♦అయితే మార్కెట్ విలువ ప్రకారమే స్టాంప్ డ్యూటీ సక్రమంగా చెల్లించి ఉంటే జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ వద్ద అప్పీల్ చేసుకుని సరిచేసుకోవచ్చు. ♦స్టాంప్ డ్యూటీ చెల్లింపులో నిజంగా తేడా ఉంటే సబ్‌రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ఓనర్‌కు పెనాల్టీ చెల్లించాలని నోటీసు అందిస్తారు. ♦రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం అధికారులు డాక్యుమెంట్లపై అభ్యంతరాలు ఉన్నాయని సాకు చూపుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦జిల్లాలో నిషేధిత భూములు జాబితాలో ఉన్న ప్రభుత్వ, దేవదాయ భూములకు సైతం సబ్ రిజిస్ట్రార్లు కాసుల కోసం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ♦నెలవారీగా అధికారులు నిర్వహించే ఇంటర్నల్ ఆడిట్లో ఆయా రిజిస్టేషన్లకు రేటు ఫిక్స్ చేసి వసూళ్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆడిటింగ్‌లో జాప్యం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఆడిట్ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇంటర్నల్ ఆడిటింగ్ చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. చేయి తడిపిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిటింగ్ పూర్తి చేసి పెనాల్టీలు లేకుండా సరి చేసిన ఉదంతాలు ఉన్నాయి. మిగిలిన కార్యాలయాల్లో మాత్రం ఆడిట్ చేయకుండా నెట్టుకొచ్చాడు. ఆ అధికారి తీరు వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు.. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆర్ఓ నెల్లూరులో గతేడాది నవంబర్ నుంచి ఆడిట్ జరగలేదు. దాదాపు 318 డాక్యుమెంట్లకు స్టాంప్ డ్యూటీలో తేడాలున్నట్లు నిర్ధారణ చేశారు. ♦నగరంలోని స్టౌన్‌హౌస్‌పేట, బుచ్చిరెడ్డిపాళెంలో గతేడాది డిసెంబర్ నుంచి ఆడిటింగ్ జరగలేదు. స్టౌన్‌హౌస్‌పేట రిజిస్ట్రార్ కార్యాలయంలో 136 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు నిర్ధారించారు. ♦ఉదయగిరి, వింజమూరు, అల్లూరు, ఆత్మకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆడిట్ నిర్వహించలేదు. ♦గూడూరు జిల్లా పరిధిలో గూడూరు ఆర్ఓ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా గతేడాది డిసెంబర్ నుంచి ఆడిట్ నిర్వహణ జరగలేదు. ఆ కార్యాలయంలో సుమారు 62 డాక్యుమెంట్లు తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. ♦బుజబుజనెల్లూరు, ఇందుకూరుపేట, కోట, పొదలకూరు, రాపూరు, వెంకటగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా జనవరి నుంచి ఆడిట్ నిర్వహణ చేయలేయకపోవడం గమనార్హం ♦ఆడిటింగ్ విభాగంలో ఉద్యోగ విరమణ చేసిన జిల్లా అధికారి ఇద్దరు సబ్రిజిస్ట్రార్లను టీమ్‌గా ఏర్పాటు చేసి వారి ద్వారా ఆడిటింగ్ నిర్వహణ చేయించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి పాత తేదీలతో అధికారి సంతకాలు చేసేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో ఆ ఎత్తుగడకు చెక్ పెట్టారు. రూ.3.23 కోట్ల రికవరీపై దృష్టి ఏదీ జిల్లాలో 933 డాక్యుమెంట్లలో రూ.5.74 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ జరిగింది. ఇందులో అత్యధికంగా 648 డాక్యుమెంట్లకు సంబంధించి అవినీతి సొమ్మును రికవరీ చేసినట్లు చెబున్నా.. సగం కూడా లేకపోవడం గమనార్హం. 648 డాక్యుమెంట్లకు సుమారు రూ.2.51 కోట్లు ఉంటే.. మిగిలిన 285 డాక్యుమెంట్లకు సంబంధించి రూ.3.23 కోట్ల రికవరీ చేయాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు, అధికారులపై శాఖా పరమైన చర్యలు కూడా చేపట్టాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి వసూళ్లు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆడిటింగ్ విభాగంపై చర్యలుంటాయి మా శాఖ ఇంటర్నల్ ఆడిటింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నట్లు నా దృష్టికి అయితే రాలేదు. వారు అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆడిట్లో గుర్తించిన అక్రమాలకు సంబంధించి దాదాపు రూ.3 కోట్లు పైనే రికవరీ పెండింగ్ ఉంది. త్వరలోనే రికవరీ చేస్తాం. – అబ్రహం, డీఐజీ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
సీబీఐ కేసుల్లో సాయం చేస్తామంటూ లంచాల డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: తాము సీబీఐ ఉన్నతాధికారులమని పరిచయం చేసుకుని సీబీఐ కేసుల్లో సాయం చేస్తామంటూ లంచాలు డిమాండ్ చేసిన వ్యవహారంలో హైదరాబాద్ వాసి సహా ఇద్దరిని అరెస్టు చేసింది. దీనిపై జనవరి 16న సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి నిందితులు హైదరాబాద్ నివాసి వై.మణివర్దన్ రెడ్డి, తమిళనాడులోని మధురై నివాసి సెల్వం రామరాజ్ సహా పలువురు ఇతరులు పెద్ద మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకును మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని వారు సంప్రదించి ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులుగా చెప్పుకొంటూ భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఈ ఇద్దరు నిందితులు మోసపూరితమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ల్యాండ్ లైన్ టెలిఫోన్ నంబర్ 011–24302700 ద్వారా ఫోన్ చేసినట్టు ఆరోపణలు తెలుస్తోంది. తమను సీబీఐ అధికారులుగా చెప్పుకొంటూ పలుమార్లు బ్యాంకు మోసం కేసులోని నిందితుడి మొబైల్‌కు ఫోన్ చేశారు. జనవరి 4న వై.మణివర్దన్‌రెడ్డి ఏకంగా గుంటూరు వెళ్లి అతణ్ని వ్యక్తిగతంగా కలిసి రెండు రోజుల్లో అడిగిన మేరకు లంచం ఇవ్వనిపక్షంలో పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు చెన్నైలో రెండు చోట్ల, హైదరాబాద్, మధురై, శివకాశిల్లో ఒక చోట తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనేక మొబైల్ ఫోన్లు, నేరానికి చెందిన వాట్సాప్ సంభాషణలు, డాక్యుమెంట్లు లభించాయి. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ శనివారం వెల్లడించింది. -
వీరు.. మారరు!
జిల్లాలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి బ్రేక్‌లు పడటం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అధికారులపై వేటు పడుతున్నా.. మరో పక్క ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా సబ్ రిజిస్ట్రార్లు మాత్రం వెరవడం లేదు. జిల్లా నుంచి ట్రోల్ ఫ్రీ నంబర్ 14400 కాల్ సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో రిజిస్ట్రేషన్ శాఖ నాల్గో స్థానంలో ఉన్నట్లు సమాచారం. కాల్ సెంటర్ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు. దీంతో దళారులను పెట్టుకుని దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటీవల గూడూరు, తాజాగా బుచ్చిరెడ్డిపాళెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారుల వద్ద దొరికిన అదనపు సొమ్ములే ఇందుకు నిదర్శనం. సాక్షి నెల్లూరు: జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు అవినీతి జలగల్లా క్రయ విక్రయదారులను పీల్చిపిప్పి చేస్తున్నారు. అవినీతి సొమ్ముకు అలవాటు పడిన వీరు దొరికిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. డబ్బులు ముట్టచెప్పితే నిషేధిత జాబితాల్లోని భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్లకు భారీ మొత్తంలో లంచాలు జేబుల్లో వేసుకుంటున్నారు. చేయి తడపకపోతే.. చిన్న చిన్న కారణాలు చూపించి రిజిస్ట్రేషన్లకు కొర్రీలు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ జిల్లాను నెల్లూరు, గూడూరు జిల్లాలుగా విభజించింది. నెల్లూరు జిల్లా పరిధిలో 9, గూడూరు జిల్లా పరిధిలో 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లతో పాటు భూముల ఈసీలు, డాక్యుమెంట్ల నకళ్లు, జనరల్ పవరాఫ్ అటారీ్న(జీపీ), వీలునామా, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. కానీ ప్రతిదానికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుంతో పాటు అదనపు దోపిడీ పక్కాగా జరుగుతోంది. రోజంతా చేసిన వసూళ్లను సాయంత్రానికి అధికారి నుంచి అటెండర్ వరకు స్థాయిని బట్టి మామూళ్ల పంపకం జరుగుతోంది. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు కాకుండా అడపా దడపా నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు, ప్లాట్లకు కూడా రేటు ఫిక్స్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబరులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన విషయం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో విచారణ జరిపిన అధికారులు వాస్తవాలను నిగ్గు తేల్చి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేసింది. కోవూరులో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు? గతంలో కోవూరులో కూడా నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన విషయంలో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లపై ఆరోపణలు రావడంతో విచారణ చేసిన అధికారులు ఏడాది పాటు ఆ నివేదికను తొక్కిపెట్టారు. తాజాగా అవినీతిపై యుద్ధం చేస్తున్న కొత్త ప్రభుత్వం రాకతో అధికారులు విచారణ నివేదికను రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది. ఆ నివేదికపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదుల్లో నాల్గో స్థానం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి పెచ్చు మీరిందన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. స్థానికంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని వసూళ్ల చేయించుకుంటున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల అవినీతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వెళ్తున్నాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖపై ఫిర్యాదుల్లో నాలుగో స్థానంలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయగా ఉద్యోగుల పైళ్ల కింద, ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద అనధికారికంగా రూ.40,110 దొరికింది. గతంలో గూడూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు గంటల పాటు సోదాలు చేస్తే దళారుల వద్ద రూ.1,39,150 నగదు దొరికింది. నెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ దాడులు జరిపితే ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.లక్షల్లో నగదు దొరికిన ఘటనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ శాఖలో మహిళా అధికారురులే అవినీతిలో టాప్‌లో ఉన్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం ఉండటం కొసమెరుపు. రిజిస్ట్రేషన్ విలువలో ఒక శాతం లంచం.. భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్‌లో సబ్‌రిజిస్ట్రార్‌కు మార్కెట్ విలువలో ఒక శాతం అదనంగా చెల్లించాలి. గిఫ్ట్ డీడ్‌కు అరశాతం, పార్టీషన్ (అన్నదమ్ముల భూపంపకాలు)కు అరశాతం వంతున వసూలు చేయడం బహిరంగ సత్యమే. ఉదాహరణకు వంద అంకణాల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే.. మార్కెట్ విలువ ప్రకారం అంకణం రూ.12 వేలు వంతున రూ.12 లక్షలకు ఒక శాతం అంటే రూ.12 వేలు సబ్ రిజిస్ట్రార్‌కు అనధికారికంగా చెల్లించాలి. దీంతో పాటు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు రూ. లక్షకు రూ.300 వంతున చెల్లించాలి. అలా చేస్తే కానీ సకాలంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. లేదంటే ఎన్నో కొర్రీలు పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ రుసుం (సేల్ డీడీ) బ్యాంక్‌ల్లో చెల్లింపులు చేసినా అదనపు వసూళ్లు మాత్రం పక్కాగా ఇవ్వాలి. ఇదంతా డాక్యుమెంట్ రైటర్ ద్వారా లావాదేవీలు జరుపుతారు. ఫిర్యాదులొస్తే దాడులు చేస్తాం ప్రభుత్వ కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులన్నింటిపై మా పరిశీలనకు వస్తాయి. అందులో అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా ఉంచుతాం. బాధితులను పీడించే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేస్తాం. ఏ శాఖపైనా ఫిర్యాదులొస్తే.. వదిలి పెట్టం. – సీహెచ్ దేవానంద్ శాంతో, నెల్లూరు ఏసీబీ డీఎస్పీ -
ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు : జేసీ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో అధికారుల పేరుతో రైస్‌మిల్లుర్లు, వ్యాపారులు వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, జిల్లాలో మిల్లులు యజమానులు, వ్యాపారులు ఎవరూ అటువంటివారికి ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని జేసీ కె. వెంకటరమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు పేరుతో వ్యాపారులు నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని తెలియవచ్చిందని, అటువంటి వారు ఎవరైనా వచ్చినట్లైతే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. -
రెవెన్యూ అధికారులు చుక్కలు చూపుతున్నారు
తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరిగాయంటూ సామాన్యులు సంతృప్తి చెందే పరిస్థితి కల్పించాలి.. అవినీతి రహిత పారదర్శక పాలన ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ అధికారులను ఆదేశిస్తున్నారు. గత పాలనలో అలవాటు పడిన తమ పాత ధోరణిని అధికారులు ఇంకా వదులుకోలేకపోతున్నారు. ఇంకా పైసలు ఇవ్వందే ఫైళ్లు ముట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చుక్కల భూముల సమస్యే ఇందుకు నిదర్శనం. క్లెయిమ్స్ పరిష్కారంలో మన జిల్లా రాష్ట్రంలో అట్టడుగున ఉండడం బాధాకరం. సాక్షి, కడప: నాటి బ్రిటీషు ప్రభుత్వం రీ సర్వే అండ్ రీ సెటిల్మెంట్ చేపట్టినపుడు భూములు సాగు చేసుకుంటున్న కొందరు రైతులు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆర్‌ఎస్‌ఆర్‌లో ఆ సర్వే నెంబర్ల వద్ద కాలమ్–16లో చుక్కలు పెట్టారు. పట్టాదారు పేర్లు లేవు గనుక అలాంటి చుక్కల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపి వేసింది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఆ భూములు విక్రయించుకోవాలన్నా రైతులకు అవకాశం లేకుండా పోయింది. వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం అలాంటి భూములను సేకరించినా పరిహారం అందక రైతులు ఎన్నో అవస్థలు పడ్డారు. చివరకు గత ప్రభుత్వం ఇలాంటి భూములపై 12 సంవత్సరాలుగా అనుభవించుకుంటున్న రైతుల పేరిట క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం కల్పించింది. 2017 జులై 17న జీఓ ఎంఎస్ నెంబరు 298 జారీ చేసింది. అదేనెల 28వ తేది సీసీఎల్ఏ సర్క్యులర్ కూడా విడుదల చేశారు. మామూళ్లు ముట్టజెప్పందే.... చుక్కల భూముల సమస్య రెవెన్యూ అధికారులకు కల్పతరువుగా మారింది. భూముల విలువను బట్టి రేట్లు నిర్ణయించుకున్నారు. జిల్లా కేంద్రమైన కడపకు ఆనుకుని ఉన్న సీకే దిన్నె పరిధిలోని మామిళ్లపల్లె, పాపాసాహెబ్‌పేట, కొప్పర్తి వంటి చోట్ల ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. చెన్నూరు, వల్లూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతోం ది. గతంలో ఒంటిమిట్ట, కొండాపురం తహసీల్దార్లపై ఈ విషయంలో ఆరోపణలు గుప్పుమన్నాయి. తాజాగా ఖాజీపేట మండలంలో రెవెన్యూ అధికారుల లంచగొండి వ్యవహారాలు వెలుగు చూశాయి. చుక్కల భూముల విషయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాడన్న అభియోగంపై వీఆర్వో శ్రీనివాసులురెడ్డి ఇటీవల సస్పెండ్ అయ్యారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం చిత్తూరుజిల్లా కలకడలో ఉన్న పార్వతి కొందరు వీఆర్వోల ద్వారా రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చుక్కల భూమిని క్రమబద్దీకరించుకునేందుకు పుల్లూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని బోసిరెడ్డిపల్లెలో ఓ మహిళా రైతు తాను రూ.75 వేలు సమర్పించినట్లు చెబుతున్నారు. కేఆర్ఆర్సీ డెప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌రావు ఇటీవల ఈ ఆరోపణలపై విచారణ నిర్వహించారు. తుడుములదిన్నె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే రైతు తాను రూ.10 వేలు వీఆర్వోకు, రూ.28 వేల తహసీల్దార్ పార్వతికి సమర్పించాల్సి వచ్చిం దని విచారణ అధికారి దృష్టికి తెచ్చారు. ఇలా 26 మంది రైతులు రాత పూర్వకంగా తహసీల్దార్‌పై ఫిర్యాదు చేశారు. సన్నపల్లె గాంధీనగర్, త్రిపురవరం, తుడుములదిన్నె తదితర గ్రామాల్లోని రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చుక్కల భూములు అధికంగా ఉన్న చాపాడు, దువ్వూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, సీకే దిన్నె మండలాల్లో రెవెన్యూ అధికారులు మామూళ్ల కోసం రైతులను పీడిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పరిష్కారంలో జాప్యం చుక్కల భూములకు పట్టాలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు అంటున్నారు. ఆర్ఎస్ఆర్లోని 16వ కాలమ్‌లో చుక్కలు ఉన్నప్పటికీ 17వ కాలమ్‌లో కొండపొరంబోకు, గయాళు, వంక పొరంబోకు అనే రిమార్క్స్ ఉన్నాయని కొన్ని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అడంగల్, ఈసీ, రిజిష్టర్ ఆఫ్ ఫోల్డింగ్స్ తదితర డాక్యుమెంట్లు సక్రమంగా లేవంటూ ఏదో ఒక నెపం చూపుతూ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి 1801 దరఖాస్తులు తిరస్కరించారు. చుక్కల భూముల క్రమబద్దీకరణకు జిల్లాలో 9708 దరఖాస్తులు రాగా 90 మాత్రమే జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. పులివెందుల నియోజకవర్గంలో 1003 దరఖాస్తులు రాగా 30 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. జిల్లాలో ఇంకా 7817 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో చుక్కల భూములు లేవు. మిగిలిన ఏడు జిల్లాలలో క్లెయిమ్‌ల పరిష్కారంలో గుంటూరు జిల్లా ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా, వైఎస్సార్ కడప మాత్రం చివరిస్థానంలో ఉంది. -
పైసా వసూల్!
మెదక్ జిల్లా కేంద్రం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని హవేళి ఘణాపూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలోని మహిళపై ఓ వ్యక్తి ఇటీవల లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి బాధిత మహిళ కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిన ఖాకీలు.. అలాంటి ప్రయత్నమేదీ చేయకుండానే ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. కేసు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి కాంప్రమైజ్ చేసి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు ఈ ఒక్క ఠాణాకు మాత్రమే పరిమితం కాలేదు. జిల్లాలోని చాలా పోలీస్ స్టేషన్లలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. న్యాయం చేయాలని వచ్చే బాధి తులకు భరోసా ఇవ్వాల్సిన.. రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే వసూల్ రాజాలుగా మారారు. పంచాయితీకో రేటు.. తీర్పుకింత అన్నట్లు పెద్ద మనుషుల సహకారంతో వసూళ్ల పర్వం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి, మెదక్: క్షణికావేశంలో చోటుచేసుకునే చిన్న చిన్న సంఘటనలకు సంబంధించి కేసులు వద్దు.. రాజీయే ముద్దు.. ఇటీవల పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు పోలీస్ అధికారులు చెబుతున్న మంచి మాట. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణలో ఇది పక్కదారి పడుతోంది. ఇటీవల జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవినీతికి అలవాటుపడిన పలువురు పోలీసులు పంచాయితీలను ప్రత్యేక ఆదాయ వనరుగా మల్చుకుంటున్నారు. పెద్ద మనుషుల సహకారంతో వసూళ్లకు తెగబడ్డారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. ఎలా అంటే.. పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసుకుని.. ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘పెద్దల’ సహకారంతో దిద్దుబాటుచర్యలు చేపడుతున్నారు. సమస్య, పంచాయితీ తీవ్రత, ఫిర్యాదుదారులు, అవతలి వైపు వారి ఆర్థిక స్థోమతను బట్టి రేటు ఫిక్స్ చేసి.. ప్రత్యేకంగా నియమించుకున్న సిబ్బందితో వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. మరీ చిన్న సంఘటనలైతే కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకే వదిలి పెడుతుండగా.. ఇతర పంచాయితీలకు సంబంధించి తీవ్రతను బట్టి సుమారు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కోసారి ఇరువర్గాల నుంచి.. మరోసారి తప్పు ఎవరిది అని పెద్దలు నిర్ణయిస్తారో వారి నుంచి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పెద్ద మనుషులే రాయబారం చేస్తున్నట్లు వినికిడి. ఇటు పోలీసులు, అటు పెద్దమనుషులకు తప్పనిసరిగా ముడుపులు ఇవ్వాల్సి వస్తుండడంతో బాధితులు ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి ఇచ్చామని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ తగాదాల్లో అధికం జిల్లాలో ఎస్పీ కార్యాలయం, రెండు డీఎస్పీ, ఆరు సర్కిల్ కార్యాలయాలతోపాటు 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తలు, బంధువుల మధ్య గొడవలు, భూ, ఆస్తి తగాదాలు, ఇరువర్గాల ఘర్షణ వంటి ఇతరత్రా ఘటనల్లో ప్రజలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తుంటారు. ఇందులో భూ సంబంధిత సమస్యలే అధికంగా ఉంటున్నాయి. సివిల్ కేసుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. ఈ క్రమంలో అవినీతికి అలవాటు పడిన పలువురు పోలీస్ అధికారులు ఇరువర్గాలను పిలిపించి పెద్దమనుషుల సమక్షంలో రాజీ పేరిట డబ్బులు గుంజుతున్నారు. ప్రధానంగా భూ సంబంధిత కేసుల్లో స్థోమతను బట్టి అక్రమార్కులకు అండగా ఉంటూ పెద్దమొత్తంలో దండుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో భూ సమస్యలు అధికం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తగాదాలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయంటూ భూ సంబంధిత కేసుల్లో తలదూర్చి కావాల్సినంత చక్కబెట్టుకుంటున్నట్లు సమాచారం. కొన్ని ఉదాహరణలు.. ఔ హవేళిఘనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఇటీవల అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. పెద్ద మనుషుల సహకారంతో స్టేషన్ బెయిల్ ఇప్పించి ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.ఔ సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చొద్దనే నిబంధనలు ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య పేరిట ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నంలో డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తూప్రాన్ డివిజన్లోని ఓ మండలంలో నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఒకరిపై వేటుపడింది. ఆ ఉద్యోగిని అధికారులు వేరొక ప్రాంతానికి బదిలీ చేశారు. అయినా.. ఆ పోలీస్ స్టేషన్లో పలువురు ఖాకీలు పిటిషన్‌దారుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నట్లు సమాచారం. ఔ ఉమ్మడి తూప్రాన్ మండలంలో 44వ జాతీయ రహదారి సుమారు 45 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నిత్యం ఏదో ఒక చోట వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుల్లో సైతం పెద్దమనుషుల సహకారంతో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది.ఔ పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్‌కు చిల్లర దొంగతనాలు, అక్రమ సంబంధం, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇరువర్గాల ఘర్షణ వంటి ఘటలనకు సంబంధించి నిత్యం రెండు నుంచి మూడు వరకు ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. రాజీ అనంతరం కింది స్థాయి పోలీస్ సిబ్బందికి మద్యంతోపాటు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు సమర్పించాల్సి వస్తోందని తెలిసింది. ఇదే పరిస్థితి టేక్మాల్, అల్లాదుర్గం, కొల్చారం మండలాల్లోనూ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఔ రేగోడ్ మండలంలోని పోలీస్ స్టేషన్లో రాజీ పేరిట దండుకోవడం మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవల తాజాగా చోటుచేసుకున్న ఘటన అవినీతి, దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. ఓ కేసు విషయమై ఒకరిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన ఓ కానిస్టేబుల్ అతడి జేబులో చేయి పెట్టాడు. సెల్‌ఫోన్‌తోపాటు జేబులో ఉన్న రూ.200 తీసుకున్నాడు. మెడికల్ షాపునకు వెళ్లి మందు గోలీలు తీసుకోవాలని.. ఇంటికెళ్లి ఇచ్చి వస్తానని సదరు వ్యక్తి చెప్పినా ఆ పోలీస్ వినలేదు. ఇంతలో ఫోన్ మోగింది.. మందు గోలీలు ఏమయ్యాయని అవతలి వ్యక్తి అంటుండగా..కానిస్టేబుల్ స్విచ్ఛాఫ్ చేసి తిట్టి పంపాడు. -
నీతిని అణిచేస్తున్న రాజనీతి
అవినీతిని, భ్రష్టాచారాన్ని, లంచగొండితనాన్ని నిజంగా వ్యతిరేకించే వారెవరయినా ఉన్నారా అని అనుమానం వస్తున్నది. లంచాలు తీసుకునే అధికారులు పెరిగితే నీతివంతుడే వారికి శత్రువు. పగబట్టి నీతివంతుడిని వేధించే పనిలో ముందుండేది ప్రభుత్వమే. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో తమ ఉద్యోగులమీద, అధికారుల మీద ప్రభుత్వం కేసులు నడుపుతున్నది. అన్యాయంగా సస్పెండ్ చేస్తారు. ఉద్యోగి విధిలేక కాట్ న్యాయం అర్థిస్తాడు. అక్కడ న్యాయం దొరికితే ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటుంది. హైకోర్టులో గెలిచినా అతనికి న్యాయం దక్కనివ్వకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుంది. తన వద్ద ఉన్న పెద్ద పెద్ద లాయర్లకు ప్రజల డబ్బు ఫీజుగా చెల్లిస్తూ చిరుద్యోగిమీద సుప్రీం సమరం సాగిస్తుంది. సివిల్ సర్వీసులో ఉద్యోగం దొరికితే నీతివంతంగా పనిచేయాలని చిత్తశుద్ధితో అనుకున్నాడొక యువకుడు. ఇండియన్ ఫారెస్టు సర్వీసులో దొరి కింది. ఫైళ్లలో స్పష్టంగా కనిపిస్తున్న అవినీతిని చూసీచూడనట్టు ఉండటం తెలివైన మేనేజ్ మెంట్, దానికి బదులు చట్టం ప్రకారం చర్య తీసుకోవడం పిచ్చి కింద లెక్క. కనిపిస్తున్న తప్పులన్నింటి మీద కేసులు పెట్టడం ఒక మానసిక వ్యాధి అని ప్రస్తుతం జనం నమ్ముతుంటారు. ఆ అధికారి సంజయ్ చతుర్వేది. తన ముందుకు వచ్చిన కలప రక్షణ ఫైళ్ళలో అక్రమాలు, లంచాలు బయటపడ్డాయి. కేసులు పెట్టారు. అందులో పై అధికారులు, మంత్రులు కూడా ఉన్నారు. వారందరికీ కోపం వచ్చింది. ఈ అధికారి మీద తప్పుడు కేసులు సృష్టించారు. సస్పెండు చేశారు. బదిలీలతో పాటు అరెస్టు దాకా వెళ్లే ప్రమాదం ఉండటంతో మంత్రిగారికి మొర పెట్టుకున్నారు. అప్పుడు పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేశ్‌కు కేసులో నిజానిజాలు అర్థమై, దర్యాప్తుచేయమని ఇంటెలిజెన్స్ బ్యూరోని ఆదేశించారు. ఈ యువ అధికారి పెట్టిన కేసులన్నీ వాస్తవాలనీ, ఆయనమీద పెట్టినవన్నీ తప్పుడు కేసులని నిర్ధారించారు. కానీ ఆ నివేదిక ప్రతిని ఆయనకు ఇవ్వడం లేదు. అది రహస్యమట. చివరకు ఆ సమాచారం ఇవ్వాలని కమిషన్ తీర్పుచెప్పింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ప్రభుత్వం పక్షాన పెద్ద లాయరుగారు దిగారు. ఇటువైపు ఒంటరిగా ఈ మధ్యతరగతి నీతివంతుడైన అధికారి, అంటే డబ్బులు విపరీతంగా లేని వాడని అర్థం. అయినా తనే సొంతంగా వాదించాడు. డిల్లీ హైకోర్టు కరుణించి న్యాయంగా తీర్పు చెప్పి ఆ సమాచారం ఇమ్మని ఆదేశించింది. కానీ హోంమంత్రిత్వశాఖ ఇంకా పెద్ద లాయర్‌ను రంగంలోకి దించి పెద్ద కోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచి ముందుకు వెళ్లింది. ప్రభుత్వం ఇలా నీతిపైన పోరాడుతూ ఉంటుంది. ఐదేళ్ల నుంచి సంజయ్ చతుర్వేదికి వార్షిక కార్య సమీక్షా నివేదికల్లో అత్యున్నత తరగతినిచ్చారు పైఅధికారులు. ఆరో సంవత్సరం 2014–15లో ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పనిచేశారు. ఆయన పని అక్రమార్జకుల పని పట్టడమే. పెద్దపెద్ద డాక్టర్లతో సహా అనేక మంది పెద్దల అక్రమాలు ఆయన దృష్టికి రావడం, ఆయన కేసులు పెట్టడం జరిగిపోయింది. దాంతో పైఅధికారులు, ఆపైన ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాగారు 2014–సంవత్సరం పనితీరుకు శూన్యం మార్కులు ఇచ్చారు. మధ్యలో సున్నావల్ల ఆయనకు ఉద్యోగంలో పైపదవికి వెళ్లేందుకు వీలుండదు. కనుక పునఃసమీక్షించాలని కోరాడు. హైకోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇటువంటి ఎన్నో కేసుల్లో ఎందరికో న్యాయం చేసిన హైకోర్టు ఈయన గారి కేసులో మాత్రం కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లమని ఉత్తర్వు జారీ చేసింది. ఆయన నైనిటాల్‌లోని కాట్ బెంచ్‌కు విన్నవించుకున్నాడు. సెప్టెంబర్ 2017లో తీర్పు ఇస్తూ చతుర్వేదికి మంత్రిగారిచ్చిన సున్నాను పరగణించరాదని కాట్ ఇద్దరు సభ్యుల బెంచి ఆదేశించింది. దానిపైన ప్రభుత్వం వారు డిల్లీలోని కాట్ చైర్పర్సన్ ముందు అప్పీలు చేసుకున్నారు. వారు నైనిటాల్ కాట్ ఉత్తర్వు మీద స్టే జారీ చేశారు. మళ్లీ చతుర్వేది ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లక తప్పని స్థితి. ప్రభుత్వం అనవసరంగా వేధిస్తున్నందుకు పాతిక వేల రూపాయలను ఖర్చులుగా చెల్లించాలని ఆదేశించింది. అయినా, కాట్ అధ్యక్షుడే న్యాయమైన తీర్పు ఇచ్చా రని, హైకోర్టే తీవ్ర అన్యాయం చేసిందని వాదిస్తూ ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకు వెళ్లింది కేంద్ర ప్రభుత్వం. అంతా విన్న ధర్మాసనం కాట్ తీర్పును కొట్టివేస్తూ, నీతివంతుడైన అధికారిని వేధించే ఈ ప్రభుత్వం మరో పాతిక వేలు ఖర్చులు చెల్లించాలని ఫిబ్రవరి 1న ఆదేశించింది. విచిత్రం ఏమంటే నీతివంతుడైన అధికారిని కోర్టుల చుట్టూ తిప్పుతూ, ఆయన పెట్టిన కేసులను తొక్కిపెట్టడమే. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
జన్మభూమి కమిటీ ద్వార ప్రతిదానికి లంచం
-
బెంగాల్లో ‘సిండికేట్’ రాజ్యం
మిడ్నాపూర్/కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సిం డికేట్ రాజ్యం నడుస్తోందనీ, దాని అను మతి లేకుండా రాష్ట్రంలో చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తల్ని వరుసగా హత్యచేసినా ప్రజ లు తమవెంటే నిలిచారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ దుష్పరిపాలన నుంచి బెంగాలీలు త్వరలోనే విముక్తి పొందుతారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ న్నారు. పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్‌లో సోమవారం నిర్వహించిన ‘కిసాన్ కళ్యాణ్ ర్యాలీ’లో మోదీ నిప్పులుచెరిగారు. జనగణమన గడ్డపై: ‘జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం పుట్టిన భూమిని ప్రస్తుతం రాజకీయ సిండికేట్ పాలిస్తోంది. ఈ సిండికేట్ బుజ్జగింపు, ముడుపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిండికేట్ల ద్వారా చిట్ ఫండ్లను నడుపుతూ రైతులకు దక్కాల్సిన లబ్ధిని లాగేసుకుంటోంది. చివరికి కేంద్రం పంపే నిధుల్ని సైతం వీరి అనుమతి లేకుండా ఖర్చుపెట్టడం కుదరడం లేదు’ అని మోదీ అన్నారు. తన పర్యటనను నిరసిస్తూ తృణమూల్ కార్యకర్తలు మమత ఫొటోలు, పోస్టర్లను సభలో ప్రదర్శించడంపై మోదీ స్పందిస్తూ.. ‘మేం సాధించిన విజయాలను తృణమూల్ కూడా అంగీకరిస్తోంది. అందుకే చేతులు జోడించిన సీఎం మమతా బెనర్జీ పోస్టర్లతో వాళ్లు ప్రధానికి స్వాగతం పలికారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూలిన టెంట్.. 67 మందికి గాయాలు ప్రధాని కిసాన్ కళ్యాణ్ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ టెంట్ కూలిపోవడంతో 13 మంది మహిళలు సహా 67 మంది గాయపడ్డారు. ప్రధాని ప్రసంగం సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వెంటనే స్పందించిన మోదీ బాధితులకు సాయమందించాలని పక్కనే ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అధికారుల్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు ప్రథమ చికిత్స చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మోదీ ప్రసంగం సందర్భంగా పలువురు కార్యకర్తలు టెంట్‌పైకి ఎక్కారు. చివరికి టెంట్ పైభాగంగా బరువు ఎక్కువ కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. -
వరంగల్ ఎంజీఎమ్‌లో అడుగడుగునా లంచావతారాలు
-
ముడుపులు ముట్టచెప్పింది ఎందరంటే..
సాక్షి,న్యూఢిల్లీ: గత ఏడాదిగా తమ పనులు చక్కబెట్టుకునేందుకు భారత్‌లో 45 శాతం మంది ముడుపులు ముట్టచెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. అంతకుముందు ఏడాది లంచాలిచ్చిన వారి సంఖ్య 43 శాతంగా ఉండటం గమనార్హం. పదకొండు రాష్ట్రాల్లో చేపట్టిన ఈ సర్వే 34,696 మందిని పలుకరించగా అవినీతి పెరిగిందని చెప్పిన వారి సంఖ్య 37 శాతం కాగా, అవినీతి తగ్గిందని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక 45 శాతం మంది పరిస్థితి యథాతథంగా ఉందని ప్రతిస్పందించారు. అవినీతి విషయంలో పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ముందువరసలో ఉండట గమనార్హం. తమ రాష్ట్రాల్లో అవినీతి గణనీయంగా పెరిగిందని సర్వేలో పాల్గొన్నవారిలో 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక మహారాష్ట్రలో అవినీతి పెరిగిందని కేవలం 18 శాతం మందే పేర్కొన్నారు. ఇక దేశరాజధాని ఢిల్లీలో 33 శాతం మంది అవినీతి పెరిగిందని చెప్పగా, యథాతథంగా ఉందని 38 శాతం మంది తేల్చారు. 28 శాతం మంది అవినీతి తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. స్ధానిక సంస్థలు, స్ధానిక ప్రభుత్వాలకు సంబంధించిన పనుల్లోనే ముడుపులు చెల్లించినట్టు 84 శాతం మంది చెప్పడం గమనార్హం. మున్సిపాలిటీ, పోలీస్, ట్యాక్స్, విద్యుత్, ఆస్తి రిజిస్ట్రేషన్, టెండర్లకు సంబంధించి ప్రభుత్వ శాఖలకు లంచాలు చెల్లించినవారే అధికమని సర్వేలో తేలిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రతినిధి పంకజ్ కుమార్ చెప్పారు.అవినీతి నియంత్రణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టడంలేదనే అథ్యయనంలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.తొమ్మిది రాష్ట్రాల్లో అసలు లోకాయుక్త ఊసే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. -
చిల్లర దేవుళ్లకు.. వెయ్యి కోట్ల ‘మామూళ్లు’
సాక్షి, హైదరాబాద్ : ప్రజలకు నిత్యం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో ఎన్నో రకాల సేవలు అవసరం. అవన్నీ జనానికి ఉచితంగానే అందాలి. కానీ ఇలా మామూలుగా అందాల్సిన సేవలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘మామూళ్లు’గా మారాయి. ప్రతి సేవకూ తృణమో, పణమో సమర్పించక తప్పదు కదా అన్న భావన కూడా స్థిరపడిపోయింది. రాష్ట్రంలో ఏటా ఇలాంటి చిన్న చిన్న ‘చిల్లర’లంచాల మొత్తమే ఏకంగా రూ. 1,000 కోట్లు దాటిపోతోంది. ప్రజలకు తరచూ ఏదో ఒక పనిపడే ప్రభుత్వ విభాగాల్లో ఈ జాడ్యం ఎక్కువగా ఉంటోంది. ఇలా ఒక్కో శాఖ పరిధిలోని అధికారులు, సిబ్బంది జేబుల్లోకి ఏటా వేల కోట్ల రూపాయలు చేరుతున్నట్లు ఏసీబీ, విజిలెన్స్ విభాగాల రహస్య అధ్యయనంలోనే వెల్లడైంది. ఇక అవసరమైన పెద్ద పనుల కోసం, అక్రమాలు, అవకతవకలకు సహకరిస్తూ అధికారులు, సిబ్బంది డిమాండ్ చేసే ‘ముడుపులు’వేరే. అవన్నీ లెక్కగడితే వేల కోట్ల రూపాయలకు చేరుతాయని అంచనా. ‘చిల్లర’లంచాల్లో రెవెన్యూ టాప్ అన్ని ప్రభుత్వ విభాగాలతో పోలిస్తే.. రెవెన్యూ విభాగం ప్రజలకు మరింత దగ్గరగా ఉంటుంది. అదే క్రమంలో చిన్న చిన్న లంచాల స్వీకరణలోనూ టాప్‌లో నిలుస్తోంది. స్థానిక, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నుంచి భూముల లెక్కలు సరిచేసే వరకు చాలా రకాల సేవలు అందించే రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి చదివింపులు భారీగానే ఉంటున్నట్టు విజిలెన్స్ అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో కొత్త మండలాలతో కలిపి మొత్తంగా 584 మండలాలు ఉన్నాయి. వీటిలో 510 కార్యాలయాలు నిత్యం బిజీగా ఉంటాయి. వీటిలో పనుల కోసం వచ్చే జనం.. రోజూ సగటున సుమారు రూ.35 వేల వరకు సమర్పించుకుంటున్నారు. ఈ లెక్కన మండల రెవెన్యూ కార్యాలయాలన్నింటిలో కలిపి రోజుకు రూ.1.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 645 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నట్లు విజిలెన్స్, ఏసీబీల అధ్యయనంలో వెల్లడైంది. కలెక్టరేట్లలోనూ.. రెవెన్యూ శాఖ పరిధిలో 31 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ ‘మామూళ్లు’కోట్లకు చేరిపోయాయి. ఒక్కో జిల్లా కలెక్టరేట్లో సగటున రోజూ రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు చదివింపులు జరుగుతున్నాయని.. ఇలా ఏటా రూ.273 కోట్ల మేర లంచాలు వసూలవుతున్నాయని ఏసీబీ ఇటీవల జరిపిన రహస్య అధ్యయనంలో గుర్తించింది. రవాణా శాఖలో ఏటా రూ.220 కోట్లు వాహనాల రిజిస్ట్రేషన్లు సహా పలు రకాల సేవలు అందించే రవాణా శాఖలో లంచాల పర్వం ఎక్కువగానే ఉంది. ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని ఉండకుండా అప్పటికప్పుడే పని పూర్తికావాలంటూ వాహనదారులు మామూళ్లు చెల్లిస్తున్నారని.. ఇలా రోజూ సుమారు రూ. 60 లక్షల మేర లంచంగా సమర్పించుకుంటున్నారని ఏసీబీ, విజిలెన్స్ అధ్యయనంలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ఆర్టీఏ, యూనిట్ ఆఫీసులలో ఒక్కో యూనిట్లో రోజుకు రూ.లక్ష మేరకు చిన్న చిన్న లంచాలు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళుతున్నట్లు అంచనా. ఇలా ముడుపుల సొమ్ము ఏటా రూ.220 కోట్ల వరకు చేరుతోంది. రిజిస్ట్రేషన్‌లో ‘మామూలే’! స్థలం అమ్మినా, కొన్నా, బదిలీ చేసినా.. ఇలా 14 రకాల సేవలు అందించే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలోనూ చిన్న చిన్న ముడుపులు మామూలైపోయాయి. రాష్ట్రంలో 22 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లోని 22 కార్యాలయాల్లో ఒక్కో దానిలో నెలకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు (మొత్తంగా 66 లక్షలు).. 195 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్కోదానిలో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ( మొత్తంగా రూ.1.56 కోట్లు) చిల్లర లంచాలు జమవుతున్నాయి. మొత్తంగా జిల్లా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కలిపి నెలకు సుమారు రూ.2.2 కోట్ల చొప్పున ఏటా రూ.26 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోందని ఏసీబీ, విజిలెన్స్ సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ఎక్సైజ్‌లో నెలకు రూ.15 కోట్లు.. మద్యం అమ్మకాలపై రాష్ట్ర ఖజానాలకు వేల కోట్ల రూపాయలు వచ్చిచేరుతున్నట్టే.. అధికారులు, సిబ్బంది జేబుల్లోకి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఏసీబీ అధికారులు చేసిన అధ్యయనం మేరకు.. ప్రతీ నెల జిల్లాల వారీగా రూ.45 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా చిన్న చిన్న చదివింపులు ఉంటున్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల రూ. 15 కోట్ల చొప్పున ఏడాదికి రూ.180 కోట్ల మేర ‘మామూళ్లు’అందుతున్నాయి. జీఎస్టీతో తగ్గిన ‘వాణిజ్య’జోరు వాణిజ్య పన్నుల శాఖలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది. జీఎస్టీ రాకముందు వాణిజ్య పన్నుల శాఖకు వ్యాపారుల నుంచి రోజు వారీ చెల్లింపులు భారీగానే ఉండేవి. కానీ జీఎస్టీ వచ్చిన తర్వాత నెల వారీగా మాత్రమే చదివింపులు వస్తున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలోని 12 డివిజన్లలో ప్రతీ నెలా రూ.65 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ‘చిన్న మొత్తాలు’వస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇలా ఏటా రూ.10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతోంది. వీటిలో నెలవారీ వసూళ్లు..! సమయం, సందర్భాన్ని బట్టి ప్రజలు ఉపయోగించుకునే విభాగాల్లో.. రోజు లెక్కన కాకుండా నెలవారీగా ‘చదివింపులు’జరుగుతున్నాయి. పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాలకు నెలవారీగా చిన్న లంచాలు అందుతున్నాయి. వీటిల్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా... జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ శాఖలు అనుమతులను బట్టి మూడో స్థానంలో ఉన్నాయి. తూనికలు కొలతలు, పోలీసుశాఖ నాలుగో స్థానంలో ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ‘చదివింపులు’ ⇒ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ విభాగాల్లో అనుమతుల అవసరాలు, సందర్భాన్ని బట్టి ‘చిల్లర లంచం’సమర్పణలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో కలిపి ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిన్న మొత్తాలు’అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరుతున్నాయి. ⇒ పోలీసు శాఖలోనూ జిల్లాల్లో నెలవారీ మామూళ్ల లెక్క కోట్లు దాటుతోంది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్ విభాగాల పరిధిలో 740 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. పట్టణ ప్రాంత పోలీస్స్టేషన్లలో రూ.5 లక్షల వరకు, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రూ.లక్ష వరకు మామూళ్లు వస్తున్నట్లు ఏసీబీ అధ్యయనంలో గుర్తించింది. ఈ లెక్కన మొత్తంగా ఏటా రూ.180 కోట్ల మేర చిల్లర చెల్లింపులు ఉంటున్నట్టు తేల్చింది. ⇒ తూనికలు కొలతలు, కాలుష్య నియంత్రణ మండలిలకు కేసుల వారీగా చెల్లింపులు ఉంటున్నట్టు ఏసీబీ అధ్యయనంలో తేల్చింది. ఈ రెండు విభాగాల్లో ఏటా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ‘చిల్లర’చెల్లింపులు ఉంటున్నట్టు అంచనా వేసింది. -
పైసా వసూల్!
ఒంగోలు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు, ఆక్రమ కట్టడాలు, పబ్లిసిటీ ఫ్లెక్సీలు ఇలా..పలు అంశాల్లో పైసానే పరమావధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. విభాగ అ«ధిపతి నుంచి చైన్‌మెన్ వరకు అందరిదీ అదే దారి. రోజువారీ కలెక్షన్లు, టార్గెట్లు పెట్టుకొని మరీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు కూడా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు అర్బన్: నగరంలోని విలేకరుల కాలనీ, ఇందిరా కాలనీ, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు వంటి ప్రధాన రోడ్లలో అనుమతులు మీరి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు చాలానే ఉన్నాయి. అయినా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థకు చెందిన తాగునీటి పైపులైన్లు ఉన్న చోట్ల కొంతమంది ఆక్రమించి మరీ వ్యాపార సముదాయలు నిర్మించారు. చివరకు పక్కపక్కనే ఉండే రెండు భవనాల యజమానుల మధ్య తలెత్తే తగాదాల్లో సైతం వీరి తలదూర్చుతున్నారు. ఒకరికి లోపాయికారిగా అండగా ఉంటున్నారు. అవతలి వ్యక్తి భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం, నిర్మించిన భవనాలను కూలగొట్టడం దగ్గరుండి చేస్తున్నారు. ఇక్కడ మరీ దారుణం నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు వీల్లేని బాపూజీ కాంప్లెక్స్ పై అంతస్తులో వందల సంఖ్యలో గదులు నిర్మిస్తుంటే పట్టించుకున్న దాఖాలాలు లేవు. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న భనాలను సైతం కూలదోసిన ఘటనలు లేకపోలేదు. మూడు నెలల క్రితం అనధికారిక భవనాల పేరుతో 21 భవనాలు తొలగించారు. అయితే ఎటువంటి పలుకుబడి లేని వాళ్ల భవనాలను భారీగా కూలదోసి, పలుకుబడి ఉన్న భవనాలను నామమాత్రంగా రంధ్రాలు వేసి వదిలేశారు. అదే సామాన్య ప్రజలు ఒక చిన్న ఇల్లు నిర్మించుకుంటే అనుమతులు లేవని, అక్రమ కట్టడాలు తొలగిస్తున్నామని ప్రకటనలు చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలు వంటి నిర్మాణాల్లో అ«ధికార పార్టీ నేతల సిఫార్సులు, మాముళ్లు ఉంటే ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చిరు వ్యాపారులపై కొరడా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ రోడ్డు మార్జిన్లలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారిపై కొరడా ఝుళిపించడం ఆనవాయితీగా మారింది. చివరకు రోడ్డు విస్తరణ పనుల్లోనూ సమన్యాయం పాటించడం లేదు. పలుకుబడి, డబ్బు ఉన్న వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దానికి ఉదాహరణే కర్నూలు రోడ్డు విస్తరణలో రోడ్డు అష్ట వంకర్లు తిరగటం. రెండు నెలల నుంచి కమ్మపాలెం రోడ్డు విస్తరణ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ ఇచ్చారు. ఆ తర్వాత రోడ్డు విస్తరణను కుదించి ఒక వైపే భవనాలు తొలగిస్తామని అధికారులు చెప్పారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ గుమాస్తాపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన వద్ద కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడులు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల్లో జంకుబొంకు లేకపోవడం గమనార్హం. -
కొత్త నోట్లలో లంచం తీసుకోరా?
-
కొత్త నోట్లలో లంచం తీసుకోరా?
న్యూఢిల్లీ: నోట్ల రద్దు వ్యవహారంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోట్ల రద్దుపై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నోట్ల రద్దు ద్వారా అవినీతి నిర్మూలన జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు నిజం కాదని.. కొత్త నోట్లలో లంచం తీసుకోరనడానికి, బ్లాక్ మనీ ఉండదనడానికి ఎలాంటి గ్యారంటీ లేదన్నారు. నోట్ల రద్దుతో తీవ్రవాదులకు నష్టం జరుగుతుందన్న వాదన సైతం అవాస్తవం అని, ఉగ్రవాదులకు ఫేక్ కరెన్సీ మాత్రమే అందటం లేదని చిదంబరం అన్నారు. సెప్టెంబర్ 30 నుంచి జమ్మూకశ్మీర్‌లో 33 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారని వెల్లడించారు. 2016లో కశ్మీర్లో మృతి చెందిన భద్రతా సిబ్బంది సంఖ్య 87 అని.. ఇది 2015లో మృతి చెందిన భద్రతా సిబ్బంది సంఖ్య కంటే రెట్టింపు అని తెలిపారు. దీనిని బట్టి తీవ్రవాదం విషయంలో పరిస్థితి మెరుగైనట్లుగా కనిపించడం లేదని చిదంబరం అన్నారు. నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఆగ్రహంతో లేరు అని చెప్పడం సరికాదన్నారు. -
12 దేశాల్లో రోల్స్ రాయిస్ భారీ అక్రమాలు
లండన్ : బ్రిటన్ ప్రముఖ తయారీ సంస్థ రోల్స్ రాయిస్, ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడవుతోంది. సీక్రెట్‌గా ఏజెంట్స్‌ను నియమించుకుని లాభాదాయకమైన భూ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వారికి లంచాలు కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. గార్డియన్, బీబీసీ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోమవారం బ్రాడ్ కాస్ట్ అయిన పనోరమ ప్రొగ్రామ్‌లో ఈ విషయాలు బీబీసీ పేర్కొంది. లాభాలు పెంచుకోవడానికి అక్రమ చెల్లింపుల పద్ధతిని అనుసరించి రోల్స్ రాయిస్ ప్రయోజనాలు పొందిందని బీబీసీ, గార్డియన్లు తెలిపాయి. ల్యాండ్ కాంట్రాక్టులు పొందడానికి కూడా ఏజెంట్లు అక్రమ చెల్లింపులకు తెరతీశారని సంస్థ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు. ఈ విషయంపై అమెరికా, బ్రిటన్ అవినీతి నిరోధక ఏజెన్సీలు నెట్వర్క్ ఏజెంట్లను విచారించడం ప్రారంభించాయి. 13 బిలియన్ పౌండ్ల(రూ.1,06,125కోట్లకు పైగా) విలువ కలిగిన టర్బైన్లను, ఇంజన్లను ప్యాసెంజర్, మిలటరీ ఎయిర్క్రాప్ట్లకు విక్రయించిన రోల్స్ రాయిస్ వాటిపై మాత్రం పూర్తి వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న విచారణకు తాము సహకరిస్తామని, కానీ మధ్యవర్తిత్వలు పాల్పడిన అవినీతి, లంచాలకు సంబంధించిన విషయాలు మాత్రం సీరియస్ ఫ్రాడ్ ఆఫీసు, ఇతర అథారిటీలు విచారిస్తాయని దాటవేస్తోంది. బ్రెజిల్, భారత్, చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అంగోలా, ఇరాక్, ఇరాన్, కజాఖ్స్తాన్, అజర్బైజాన్, నైజీరియా, సౌదీ అరేబియాలలో రోల్స్ రాయిస్ ఏజెంట్లను నియమించుకుని ఈ అక్రమాలకు పాల్పడిందని బీబీసీ రిపోర్టు చేసింది. బీబీసీ రిపోర్టులో భారత్‌కు చెందిన తన డిపెన్స్ ఏజెంట్ సుధీర్ చౌదరికి అక్రమంగా 10 మిలియన్ పౌండ్ల(రూ.81కోట్లకు పైగా) ను రోల్స్ రాయిస్ చెల్లించిందని వెల్లడైంది. భారత వైమానిక దళం వాడే హాక్ ఎయిర్క్రాప్ట్ల అతిపెద్ద కాంట్రాక్ట్ రోల్స్ రాయిస్ చేతికి వెళ్లడానికి ఆయన సహకారం అందించినట్టు బీబీసీ తెలిపింది. -
వసూల్ రాజా
టీనగర్: కురువై సాగుబడి రాయితీలకు లంచాలు వసూలు చేస్తున్న ఓ అధికారి వీడియో కెమెరాకు చిక్కాడు. వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు పడుతున్న కష్టాల గురించి తెలిసిందే. అయితే, బోరు బావుల ఆధారంగా వ్యవసాయం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వ రాయితీలు ప్రకటించింది. ఈ రాయితీల నిమిత్తం దరఖాస్తు చేసుకుంటున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. రాయితీల కోసం అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు నాలుగు వేల రాయితీతో పాటుగా, ఇతర సదుపాయాలు అందుకునేందుకు రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంది. ఇందులో భాగంగా నాగపట్నం జిల్లాలో 30 వేల ఎకరాల్లో రూ.12 కోట్ల రాయితీ ప్రకటించి ఉన్నారు. యంత్రం ద్వారా నాట్లు వేయడానికి తగ్గ రాయితీల కల్పనకు చర్యలు చేపట్టారు. రైతులు సమర్పించే దరఖాస్తుల పరిశీలన మేరకు బ్యాంక్‌ల ద్వారా రాయితీల చెల్లింపు ఉంటుంది. నాగపట్నం జిల్లా కుర్తాలం వ్యవసాయ విస్తరణ కార్యాలయం పరిధిలోని అసిస్టెంట్ వ్యవసాయ అధికారి కన్నన్ కోమల్ దరఖాస్తులు సమర్పిస్తున్న రైతుల నుంచి ఎకరానికి రూ.500 చొప్పన వసూలు చేయడం మొదలెట్టారు. రూ.500 ఇవ్వని వారి దరఖాస్తులు తిరస్కరించే పనిలో పడ్డారు. కన్నన్ వసూళ్ల వ్యవహారాన్ని కొందరు రహస్యంగా తమ సెల్ కెమెరాతో బంధించి వ్యవసాయ ఉన్నతాధికారులకు అప్పగించారు. వసూల్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మరి లంచాలెందుకు అడుగుతున్నట్లు?
* సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు * మాటలు కట్టిపెట్టి రైతులకు ఏం చేస్తున్నారో చెప్పండి * పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వపరంగా ప్రజలకు అందాల్సిన సేవలన్నీ ఆన్లైన్ ద్వారా సక్రమంగా అందుతుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఎందుకు అడుగుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మాటలు కట్టిపెట్టి, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుం చాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ, విద్యుత్‌శాఖల అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు కట్టి రైతుల నుంచి ఆ మొత్తాలను వసూలు చేస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. -
లంచాల క్రీడ రక్షణపై నీలినీడ
జాతిహితం ఎలాంటి లొసుగులూ లేని కొనుగోళ్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం నేటి రాజకీయ వ్యవస్థలో అసాధ్యం. కాబట్టి మన వ్యవస్థలోని అంతర్గత పరిమితులను అంగీకరించి సకాలంలో కావల్సిన వాటిని సమకూర్చుకోవడం ఉత్తమం. ఆ తర్వాత మన దౌత్యాన్ని, వ్యూహాత్మక వైఖరిని తదనుగుణంగా మలుచుకోవచ్చు. ఇది ఎవరికీ ఎక్కదు. బహుశా మనం ఈ గందరగోళాన్ని భరిస్తూ, కుంభకోణాల దెబ్బలు తింటూ, కొరతలతో కొట్టుమిట్టాడుతూ, దోషులను పట్టుకోకుండా మన సైనికులను నిరాశానిస్పృహలకు గురిచేస్తూనే ఉంటాం. 'స్నానం నీటితో పాటూ బిడ్డను కూడా పారేసుకోకూడదు' వంటి మాటలు చెప్పే బామ్మల విసుగెత్తించే విజ్ఞతకు మన భారతీయులం అతీతులం. మనం స్నానం నీళ్లను ఉంచుకుని బిడ్డను పారేసే బాపతు. మన సైనిక కొనుగోళ్ల వ్యవహారాన్నే ఉదాహరణగా తీసుకోండి. కొత్త కొనుగోళ్లలో అత్యధిక భాగం కుంభకోణాలే. దీంతో పలు కొనుగోళ్ల ఒప్పందాలు రద్దయి మన సాయుధ బలగాలు కొద్దిపాటి నిల్వలతో, విడిభాగాలు, మందుగుండు సామగ్రి కొరతతో సతమతమవుతున్నాయి. అలా అని ఈ కుంభకోణాల్లో ఎవరూ పట్టుబడ్డదీ లేదు, ఎవరికీ శిక్ష పడిందీ లేదు. మన కాలానికి సంబం ధించిన కొన్ని ఉదాహరణలను చూద్దాం: 1. అత్యంత ఎక్కువ కథనాలు వెలువడ్డ కుంభకోణం బోఫోర్స్. మొదటి ఆర్డర్‌కు అందిన శతఘు్నలే మన సైన్యం వద్ద ఉన్నాయి. దేశీయంగా వాటి తయారీ మొదలు కాలేదు. ఇప్పుడు ఉన్న శతఘు్నలకు విడిభాగాలు, మందుగుండు కొరత ఏర్పడింది. 17 ఏళ్ల క్రితం, కార్గిల్‌లో పోరాడుతుండగా సైన్యం ఎంతంటే అంతా చెల్లించి మరీ దిగుమతులు చేసుకోవాల్సి వచ్చింది. బోఫోర్స్ కుంభకోణం తర్వాత 30 ఏళ్లలో కొత్తగా శతఘు్నలను దిగుమతి చేసుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా, లంచాలు తీసుకున్నందుకు ఎవరినీ శిక్షించిందీ లేదు, డబ్బును తిరిగి రాబట్టిందీ లేదు. బిడ్డను పారేసి మురికి స్నానపు నీటిని దాచుకోవడానికి ఇది ఉత్తమమైన ఉదాహరణ. 2. 'టైప్ 2090' కుంభకోణంగా పిలిచిన జర్మన్ తయారీ హెచ్‌డీడబ్ల్యూ జలాంతర్గాముల కుంభకోణం కూడా అదే కాలం నాటిది. అవి మన సైన్యం సమకూర్చుకున్న మొట్టమొదటి ఎస్ఎస్కేలు (జలాంతర్గాములను ధ్వంసించే జలాంతర్గాములు) అయ్యేవి. ఆ కార్యక్రమమూ మూలన పడింది. పదేళ్ల తర్వాత కేవలం రెండిటిని కొనుక్కున్నాం, మరో రెండిటిని అసెంబుల్ చేసుకున్నాం. ఇక సాంకేతికత బదలాయింపు, విస్తరణ జరిగిందే లేదు. 3. సరిగ్గా ఈ రెండు కుంభకోణాల సమయంలోనే జరిగినందున రక్షణశాఖ కొనుగోళ్ల కిందకు రాని ఎయిర్ బస్-320ల కుంభకోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందాం. అప్పుడే ముడుపుల గురించిన పుకార్లు విన బడుతుండగా బెంగళూరు వద్ద ఒక ఏ-320 కూలిపోయింది. దీంతో కొన్న మొత్తం విమానాలను ఉపయోగించకుండా పక్కన పెట్టేశారు. సద్దాం హుస్సేన్ కువైట్‌పై దండెత్తినప్పుడు వేలాది మంది భారత పౌరులను కువైట్ నుంచి విమానాల్లో తరలించాల్సి వచ్చింది. నిజ జీవితంలో ఆ పని చేసిపెట్టే అక్షయకుమార్ లేడు, మన ఎయిర్ ఇండియా సామర్థ్యం అందుకు సరిపోదు. కాబట్టి నాటి వీపీ సింగ్ ప్రభుత్వానికి మూలనపడి ఉన్న ఏ-320ల దుమ్ముదులిపి తీయడం తప్ప గత్యంతరం లేకపోయింది. ఒక్కసారి అవి అలా ఎగరడం మొదలు పెట్టాక ఇక ఆగింది లేదు. ఆ విమానాలన్నిటినీ మూలన పడేయడం వల్ల వచ్చిన నష్టాల నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ కోలుకున్నది లేదు. ఈ విషయంలో కూడా ఏమీ రుజువు కాలేదు, ఎరినైనా పట్టుకోవడమో లేదా శిక్షించడమో జరగలేదు. రాజకీయ ప్రతీకార క్రీడ బోఫోర్స్‌తో తగిలిన ఎదురుదెబ్బ, కలిగిన అవమానం అత్యంత క్రూర రాజకీయ ప్రతీకారాల పరంపరకు దారితీసింది. ‘తెహెల్కా’ స్టింగ్ ఆపరే షన్తో కాంగ్రెస్‌కు అవకాశం దొరికింది. పథకం ప్రకారం తమ వాళ్లను ఇరికించారని ఎన్డీఏ గగ్గోలు పెట్టింది. బంగారు లక్ష్మణ్, ఫెర్నాండెజ్‌లు తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది (రెండోవారు తాత్కాలికంగానే). నిజానికి ఎలాంటి రక్షణ ఒప్పందంతోనూ సంబంధం లేని బంగారు లక్ష్మణ్ ఒక్కరు తప్ప మరెవరినీ చట్టం శిక్షించలేదు. 'తెహెల్కా' స్టింగ్ ఆపరేషన్‌లో ఇందిరా గాంధీ కుటుంబం... బోఫోర్స్ విషయంలో రాజీవ్‌పై విరుచుకుపడ్డ బీజేపీపైన, ప్రత్యేకించి అతి తీవ్రంగా దాడి చేసిన ఫెర్నాండెజ్పైన కసిగా ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశాన్ని చూసింది. అయితే వాజ్‌పేయి విశ్వసనీయత, జనాకర్షణ ఫలితంగా బీజేపీ వదుల్చుకోదగిన బంగారు లక్ష్మణ్‌ను పక్కనబెట్టి, ఫెర్నాండెజ్ ప్రతిష్ట పునరుద్ధరణకు సహకరించింది. కాంగ్రెస్ ప్రతీకారం అసంపూర్తిగానే మిగిలిపోయింది. కాబట్టి ఆ తర్వాతి కాలంలో ఎన్డీఏపై మరో ప్రతీకార యత్నం సాగింది. 'శవ పేటికల కుంభకోణం'గా పిలిచిన ఆ వ్యవహారంలో కూడా చివరికి ఏమీ రుజువు కాలేదు. అయితే, దాని పర్యవసానంగా కార్గిల్‌లో పరిమిత సంఘర్షణ సాగుతున్నా, ఇంచుమించు పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డా (ఆపరేషన్ పరాక్రమ్)... ఆరేళ్ల వాజ్‌పేయి పాలనా కాలంలో పెద్దగా రక్షణ కొనుగోళ్లు జరగలేదు. చేతలుడిగిన ప్రభుత్వం చెప్పుకోదగిన రష్యాయేతర తయారీ రక్షణ వ్యవస్థలు వేటినీ ప్రవేశపెట్టలేదు. శత్రు క్షిపణుల, వైమానిక దాడుల నుంచి మన నావికా బలగాలకు రక్షణను కల్పించే ఇజ్రాయెలీ బరాక్ క్షిపణి వ్యవస్థల తయారీదారు రాఫేల్‌పై నిషేధం వల్ల అవి మూలనపడ్డాయి. దీంతో అత్యంత విలువైన మన నౌకలు రక్షణ లేకుండా ఉండాల్సి వచ్చింది. ఇప్పడు కూడా అలాంటి పరిణామమే జరిగింది. మన అత్యాధునిక జలాంతర్గామి స్కోర్పెని టోర్పెడోలు (నౌకా విధ్యంసక వ్యవస్థలు) లేకుండానే జలప్రవేశం చెయ్యాల్సి వచ్చింది. వాటిని తయారుచేసే 'వాస్' అగస్టాకు అనుబంధ సంస్థ కావడంతో దానిపై యూపీఏ రక్షణ మంత్రి ఆంథోనీ నిషేధం విధించారు. క్రియాశూన్యతే ఉత్తమమా? అనుకోకుండా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి తిరిగి రావడంతో అది ఎన్డీఏ హయాంలోని రక్షణ ‘‘కుంభకోణాల’’కు సంబంధించి ఏదైనా కనిపెట్టాలని నానా ప్రయాస పడింది. కానీ ఏమీ దొరకలేదు. యూపీఏ మొదటి రక్షణమంత్రి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞతాయుతులైనందువల్ల కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. ఈ పరస్పర కక్ష సాధింపుల పర్యవసానంగా చివరికి మన సాయుధ బలగాలు మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఆయన కు తెలుసు. కుంభకోణాలు వేటినీ ‘కనిపెట్ట’లేని ఆయన అశక్తత సోనియా కుటుంబానికి చిరాకు తెప్పించింది. ఆయనను రక్షణశాఖ నుంచి తప్పించి విధేయుడైన ఏకే ఆంథోనీని నియమించడానికి బహుశా అదే కారణం కావచ్చు. ఆంథోనీ కూడా ఈ కక్ష సాధింపును ప్రారంభించలేకపోయారు. ఆయన తన సంగతి తాను చూసుకుంటూ, తన చేతులకు బురద అంటకుండా చూసుకోవడమే ప్రధాన కర్తవ్యంగా భావించారు. ఒక కుంభ కోణం గురించి మొదటి పుకారు వెలువడటంతోనే సీబీఐని పిలవడం, ఆ సరఫరాదారును నిషేధించడం ఆయన విశిష్ట స్పందనగా ఉండేది. ఈ క్రమంలోనే ఆయన అత్యంత సుదీర్ఘ కాలం రక్షణమంత్రిగా పనిచేసినవారు కాగలిగారు. అంతేకాదు, బహుళజాతి రక్షణ సంస్థల విలీనాలు, స్వాధీనాలు (ఎమ్-ఏలు) జోరుగా సాగుతున్న వాతావరణంలో...అత్యధికంగా సరఫరా దారులను నిషేధించి సైన్యానికి మచ్చలేని సరఫరాదారునే కనుగొనలేని పరిస్థితి ఏర్పరచారు. ఉదాహరణకు, ఆయన 2012లో జర్మనీకి చెందిన రీన్మెటాల్ని నిషేధించడంతో, దానికి అనుబంధంగా ఉన్న 109 ఇతర పాశ్యాత్య ఆయుధ కంపెనీలపైన కూడా నిషేధం వేటు పడింది. యూరో పియన్ కంపెనీలనే కాదు, సింగపూర్, ఇజ్రాయెల్ కంపెనీలను కూడా ఆయన నిషేధించారు. ‘త్వరలోనే ఆయన పాకిస్తానీ సైన్యాన్ని కూడా నిషేధిం చేస్తారు కాబట్టి అసలు సమస్యే పరిష్కారమైపోతుంది’ అనే జోక్ రక్షణశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రచారంలో ఉండేది. సాయుధ బలగాలు ఈ ధోరణితో నిరాశానిస్పృహలకు గురవుతుండటంతో, నేను ఆయన రక్షణశాఖ ఆధునికీకరణ వైఖరిని ‘‘మెత్తటి గొలుసులతో బంధించినది’’గా వర్ణించడం ప్రారంభించాను. అగస్టా వెస్ట్‌ల్యాండ్ లంచానికి సంబంధించి పెద్ద విచిత్రమేమిటంటే అది ఆంథోనీ రక్షణమంత్రిగా ఉన్నాగానీ జరిగినది. లంచాలు తీసుకున్నది నిజమేనని అంగీకరించి ఆయన ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. పెనాల్టీ షరతులపై విజ్ఞప్తి చేసుకుని విచారణలకు ఆదే శించారు. ఇటాలియన్ అధికారులు ఈ వ్యవహారంలో అవకతవకలను క నుగొన్న తర్వాత, వాటిని ఒక భారత వార్తాపత్రిక, దాని విలేకరి వాటిని బయటపెట్టి, ఆ కథనాన్ని విడవకుండా అదేపనిగా దాని గుట్టుమట్టులను వెలికితీసిన తర్వాతనే ఆయన చర్య తీసుకున్నారనేది నిర్వివాదమైన వాస్తవం. నేటికీ ఆ విలేకరి ఆ కృషిని కొనసాగిస్తుంటే... మిగతావారు జోరుగా గతానికి సంబంధించిన ‘‘న్యూస్- బ్రేక్’’లకు తామంటే తామే కారకులమని చెప్పుకోగలుగుతున్నారు. అగస్టా లంచాలు ఇచ్చిందనేది నిర్వివాదం కాబట్టి కేసును వేగంగా విచారించి దోషులను శిక్షించాల్సిందే. అయితే ఈ కుంభకోణాన్ని, అంతకంటే పెద్ద సమస్య అయిన సైన్యం ఆధునికీకరణ నుంచి వేరుచేసి చూపేది ఏమిటో చెప్పగల వివేకం మనకుందా? మనం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లా డగలం. కానీ అత్యధిక ‘‘భారత’’ వ్యవస్థలు సైతం ఇంజన్లు, వైమానిక ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు, ఆయుధాల గెడైన్స్ వ్యవస్థలు తదితరాల కోసం భారీ ఎత్తున దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యంత ప్రము ఖంగా కనిపించే తేజాస్, ఏఎల్‌హెచ్, స్టెల్త్ ఫ్రిగేట్లు, ఎమ్బీడీ అర్జున్‌లు సైతం అనుకున్న దానికంటే 30 ఏళ్లు వెనుకబడి ఉన్నాయి. నిరాశా నిస్పృహలే సైన్యానికి ‘బలం’ మన దేశం ఎంచుకోడానికి మూడు మార్గాలున్నాయి. ఒకటి, చీకటి ఆయుధాల బజార్లో టెండర్ల ప్రాతిపదికపై కొనుగోళ్లు జరపడం ఇక ఎంత మాత్రమూ సాధ్యంకాదని అంగీకరించాలి. భావి కొనుగోళ్లన్నీ ప్రభుత్వం నుంచి పూర్తిగా ప్రభుత్వానికి లేదా అమెరికన్లు పిలిచేట్టు ఎఫ్ఎమ్ఎస్ (ఫారిన్ మిలిటరీ సేల్స్) ప్రాతిపదికపైనే జరగాలి. ఈ మార్గం ద్వారానే ఐఏఎఫ్, నావికా బలగాల కోసం కొత్త సీ-130లు, సీ-17లు, పీ-81లకు యూపీఏ ఆర్డర్లను ఇచ్చింది. దీని ఫలితంగా ఆంథోనీ తనకు భావజా లపరంగా ఏ మాత్రం గిట్టని అమెరికా నుంచి ఈ కొనుగోళ్లు చేయాల్సింది. ఆయన హయాంలో గత 65 ఏళ్లలోనే మొదటిసారిగా అమెరికా మనకు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా మారింది. బీజేపీ ఇప్పుడు రెండు స్క్వాడ్రన్ల ఫ్రెంచ్ రాఫేల్ విమానాలను అదే మార్గం ద్వారా కొంటోంది, అమెరికా శతఘు్నలను పరిశీలిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులుగా మనకు ఎంచుకోవడానికి ఉండే అవకాశాలు, బేరసారాలాడే శక్తీ తగ్గిపోతుంది. అయితే మధ్యవర్తులను దూరంగా ఉంచగలం. ఇక రెండవది, ఎలాంటి లొసుగులూ లేని కొనుగోళ్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం. చీలిన మన రాజకీయ వ్యవస్థలో అది అసాధ్యం. మూడవది, మన వ్యవస్థలో అంతర్నిహితమై ఉన్న పరిమితులను అంగీకరించి సకాలంలో కావల్సిన వాటిని సమకూర్చుకోవడం (వీవీఐపీల హెలికాప్టర్ అవసరాన్ని 1999లోనే ఆమోదించినా ఇంకా సమకూరలేదు) ఉత్తమం. ఆ తర్వాత మనం మన దౌత్యాన్ని, వ్యూహాత్మక వైఖరిని తదను గుణంగా మలుచుకోవచ్చు. ఇది ఎవరికీ అక్క ర్లేదు. కాబట్టి బహుశా మనం ఈ గందరగోళాన్ని భరిస్తూ, కుంభకోణాల దెబ్బలు తింటూ కొరతలతో కొట్టుమిట్టాడుతూ, దోషులు ఎవరినీ పట్టు కోకుండా మన సైనికులను నిరాశానిస్పృహలకు గురిచేస్తూనే ఉంటాం. క్లుప్తంగా చెప్పాలంటే, బిడ్డను పారేస్తూ, మురికి స్నానపు నీటిలో ఆటలాడుతూ ఉంటాం. శేఖర్ గుప్తా: twitter@shekargupta -
గుట్టుచప్పుడు కాకుండా మింగేస్తున్నారు!
లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు భారీ వసూళ్లు ప్లానింగ్ అధికారి పట్టుబడటంతో ఉలికిపాటు విజయవాడ బ్యూరో : ఒకవైపు రాజధాని వ్యవహారాల హడావుడి నడుస్తున్నా సీఆర్డీఏలో లంచాల పర్వం యథావిధిగా కొనసాగుతోంది. పెద్దగా లేఅవుట్లు లేవంటూనే వెంచర్లలో, నిబంధనల హెచ్చరికలు చేస్తూనే అపార్టుమెంట్ల నిర్మాణ వ్యవహారాల్లో ప్లానింగ్ అధికారులు అందినకాడికి డబ్బు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం సీఆర్డీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారి రెహ్మాన్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకోవడంతో అందులో జరుగుతున్న అవినీతి మళ్లీ చర్చ నీయాంశమైంది. సర్వేయర్ స్థాయి నుంచి పైస్థాయి వరకు అందరూ గుట్టుచప్పుడు కాకుండా లంచాలు మింగేస్తున్నారు. పైకి మాత్రం తమ చేతుల్లో ఏముందని బిల్డప్‌లు ఇస్తూనే తెర వెనుక నుంచి చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు. కొత్తగా విధించిన నిబంధనల పేరుతో వెంచర్లకు గతంలో మాదిరిగా సులువుగా అనుమతులు ఇవ్వడంలేదు. అలాగని అందరికీ అదే రూలు పాటించకుండా తమకు కావల్సినంత డబ్బు సమకూర్చిన వారికి మాత్రం పచ్చజెండా ఊపి వెంచర్లకు అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు కొద్దిరోజుల నుంచి బాగా వినిపిస్తున్నాయి. వెంచర్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడంతో ప్లానింగ్ అధికారులు నగర శివార్లలోని అపార్టుమెంట్లు, గ్రూపు భవనాలు, భవనాలపై దృష్టి సారించారు. విజయవాడ, గుంటూరు నగర శివార్లలో లెక్కలేనన్ని అపార్టుమెంట్లు, భవనాలు పైకి లేస్తున్నాయంటే దానికి ప్లానింగ్ అధికారుల చేతివాటమే కారణం. గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం, కానూరు నుంచి కంకిపాడు, రామవరప్పాడు నుంచి గన్నవరం వరకు విజయవాడ చుట్టుపక్కల జాతీయ రహదారుల వెంబడి వందల కొద్దీ భారీ భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమవుతున్నాయి. నిర్మాణం ప్రారంభానికి ముందే వారు తమ పలుకుబడిని ఉపయోగించి ప్లానింగ్ అధికారులను లొంగదీసుకుంటుకున్నారు. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులు హడావుడి చేస్తున్న అధికారులు మళ్లీ కొంత మొత్తం దండుకుని అనుమతులిచ్చేస్తున్నారు. గుంటూరు శివార్లలోనూ ఇదే పరిస్థితి. పలుకుబడి లేని వారి భవనాలు, అపార్టుమెంట్ల వద్ద సర్వేయర్లు, ఇతర అధికారులు హడావుడి చేసి మొదట్లో నిలిపివేసినా ఆ తర్వాత కావాల్సినవి సమకూర్చిన తర్వాత నిర్మాణానికి గేట్లు ఎత్తేస్తున్నారు. ఏసీబీ అధికారులు ఫిర్యాదు వచ్చిన ఒకరిద్దరిపైనే కాకుండా ప్లానింగ్ విభాగంలో పనిచేసే మరింత కీలక అధికారులు, సిబ్బందిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
లంచం ఇవ్వొద్దు
ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ మానకొండూర్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్‌గౌడ్ కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకంలో అవినీతి చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపైన సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్లు చెప్పారు. షాదీ ముబారక్ కోసం 1,912 దరఖాస్తులు రాగా.. 1614 మంజూరయ్యాయని, వివిధ కారణాలతో 270 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మంజూరైన వాటికి రూ.8.23కోట్లు జమైనట్లు చెప్పారు. ఇంకా రూ.14.98లక్షలు జమ కావాల్సి ఉందన్నారు. విచారణ పేరిట జాప్యం చేస్తే సదరు అధికారిపై చర్య తీసుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కళ్యాణలక్ష్మి పథకంపై కూడా విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. లంచాలు అడిగితే చెప్పండి కరీంనగర్ సిటీ : షాదీముబారక్, కల్యాణలక్ష్మి, సబ్సిడీ రుణాల మంజూరులో ఉద్యోగులు, దళారులు లంచాలు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. షాదీముబారక్ పథకం లబ్దిదారుల ఎంపికలో వచ్చిన ఆరోపణలపై వరుసగా రెండో రోజు శుక్రవారం విచారణ నిర్వహించారు. మైనార్టీ కార్పొరేషన్, డీటీవో అధికారులను కూడా విచారిస్తామన్నారు. ప్రాథమికంగా అక్రమాలు జరిగాయని లబ్ధిదారులు చెబుతున్నారని పేర్కొన్నారు. సాధ్యమైనంత మేరకు ఎస్‌బీెహ చ్ సేవింగ్ అకౌంట్ ఇవ్వాలన్నారు. లంచాలు అడిగితే 9440446150కు ఎస్ఎంఎస్, ఫోన్ చేయొచ్చనిacb krn@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు. -
ఆన్ లైన్ కాదు.. అదే 'లైన్'
ఆర్టీఏ దారి అడ్డదారి సాక్షి, హైదరాబాద్: గోషామహల్‌కు చెందిన మహేశ్ తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన హైపోతికేషన్ (రుణ ఒప్పందం) రద్దు కోసం నెల రోజుల పాటు టోలిచౌకిలోని పశ్చిమ మండలం రోడ్డు, రవాణా సంస్థ (ఆర్టీఏ) కార్యాలయం చుట్టూ తిరిగాడు. వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక ధ్రువీకరణ పత్రం లేదనే సాకుతో తిప్పి పంపారు. చివరికి మహేశ్ ఓ ఏజెంట్‌ను ఆశ్రయించాడు. రూ. 1,000 చేతిలో పెడితే.. క్షణాల్లో పని పూర్తయింది. ద్విచక్ర వాహనం హైపోతికేషన్ రద్దు కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.435 మాత్రమే. ఇదే కాదు ఆర్టీఏలో లెర్నింగ్ లెసైన్స్ నుంచి వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల దాకా ‘వసూళ్ల’ మోత తప్పదు. హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ దళారుల దందా యథేచ్చగా కొనసాగుతోంది. రవాణాశాఖ నుంచి లభించే ప్రతి సేవకు ఒక ధర నిర్ణయించి, వసూలు చేస్తున్నారు. ఏ పనికావాలన్నా ఏజెంట్లను ఆశ్రయించి.. వారు అడిగినంత సమర్పించుకోవాల్సిందే. అలాకాదని నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళితే... ఏదో ఒక సాకు చెప్పి తిప్పి పంపుతారు. రోజులు కాదు నెలల పాటు తిప్పించుకుంటారు. చివరికి ఏజెంట్లను ఆశ్రయించడమే మేలనే పరిస్థితి కల్పిస్తారు. ఇలా ఏజెంట్లకు అందిన సొమ్ము నుంచి ఆర్టీఏ సిబ్బందికి వాటాలు అందుతాయి. మొత్తంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా సుమారు రూ. 78 కోట్లదాకా దండుకుంటున్నట్లు అంచనా. ఆర్టీఏలో దళారుల రాజ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆన్లైన్ ఉన్నా అంతంతే! లెర్నింగ్ లెసైన్స్, డ్రైవింగ్ లెసైన్సు సహా వివిధ రకాల సేవల కోసం వినియోగదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొనే సదుపాయం ఉంది. ఈసేవ కేంద్రాల్లో, ఇంటర్నెట్ కేంద్రాల్లో నేరుగా స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఫీజు చెల్లించి, తమకు కేటాయించిన తేదీల్లో సేవలను పొందవచ్చు. కానీ ఆన్లైన్ పట్ల చాలా మందిలో అవగాహన లేకపోవడం, ప్రచారం కొరవడడం, ఎలా నమోదు చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఏజెంట్లను, దళారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో నమోదు చేసుకున్నా... కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో రకరకాల కొర్రీలు పెట్టి తిరిగి ఏజెంట్ ద్వారానే వచ్చేలా చేస్తున్నారు. కోట్లు కొల్లగొట్టేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖై రతాబాద్, టోలిచౌకి, తిరుమలగిరి, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, అత్తాపూర్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, నాగోల్, కూకట్పల్లి, కొండాపూర్ ఆర్టీఏ కేంద్రాల ద్వారా రోజూ సుమారు 2,500 మందికిపైగా వివిధ రకాల సేవలను పొందుతారు. ప్రభుత్వానికి ఏటా సుమారు రూ. 46 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. రవాణాశాఖ అందజేసే సేవల ఫీజులు చాలా వరకు రూ.500 నుంచి రూ.1,000లోపే ఉంటాయి. కానీ ఏజెంట్లు, బ్రోకర్లు అంతకన్నా రెండు మూడింతలకుపైగా వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు డ్రైవింగ్ లెసైన్స్ కోసం వినియోగదారుల నుంచి ఏజెంట్లు రూ. 3,000 వరకు వసూలు చేస్తున్నారు. కానీ సర్కారుకు చెల్లించేది లెర్నింగ్ ఫీజు రూ.90, డ్రైవింగ్ లెసైన్స్ ఫీజు రూ.675 కలిపి రూ.765 మాత్రమే. అంటే మిగతా రూ. 2,235ను బ్రోకర్లు, ఆర్టీఏ సిబ్బంది పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వివిధ సేవలపై ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజుకు అదనంగా సగటున ఒక్కో వినియోగదారుడు రూ.1,000 చొప్పున బ్రోకర్‌కు ముట్టజెబుతున్నట్లు భావించినా... నగరంలో 2,500 మంది వినియోగదారులు ప్రతి రోజు చెల్లించే సొమ్ము రూ.25 లక్షలు అవుతుంది. అంటే ప్రతి నెలా రూ.6.5 కోట్లు, ఏడాదికి రూ.78 కోట్లకుపైగా సొమ్ము ఏజెంట్లకు అందుతోంది. ఇందులోంచి ఆర్టీఏ సిబ్బందికి వాటాలు అందుతున్నాయి. మొత్తంగా ఫీజుల రూపంలో ప్రభుత్వానికి వస్తున్నది సుమారు రూ.46 కోట్లయితే... అక్రమంగా వసూలు చేస్తున్నది రూ.78 కోట్లు. రవాణాశాఖ ఫీజులు (రూ.లలో) ఒక కేటగిరీ వాహనం కోసం లెర్నింగ్ లెసైన్స్ 60 రెండు కేటగిరీల వాహనాల కోసం 90 డ్రైవింగ్ లెసైన్స్ (ఒక కేటగిరీ) 475 డ్రైవింగ్ లెసైన్స్ (2 కేటగిరీలు) 625 డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ 485 అంతర్జాతీయ డ్రైవింగ్ లెసైన్స్ 650 వాహనాల రిజిస్ట్రేషన్ (ద్విచక్రవాహనం) 395 వాహనాల రిజిస్ట్రేషన్ (కారు) 635 వాహనాల ఫిట్నెస్ (తేలికపాటి వాహనాలు) 360 వాహనాల ఫిట్నెస్ (మధ్యతరహా వాహనాలకు) 460 వాహనాల ఫిట్నెస్ (భారీ వాహనాలకు) 560 డూప్లికేట్ ఆర్సీ (ద్విచక్ర వాహనం) 365 డూప్లికేట్ ఆర్సీ (కార్లు) 485 వాహనం యాజమాన్య బదిలీ (ద్విచక్ర వాహనం) 365 వాహనం యాజమాన్య బదిలీ ( కారు ) 535 చిరునామా మార్పు (ద్విచక్ర వాహనం) 220 చిరునామా మార్పు (కారు) 420 ఎన్వోసీ 85 ‘బ్యాడ్జ్’ కోసం రూ.3,500 ఖర్చయింది ‘‘కారు డ్రైవర్‌ను. బ్యాడ్జ్ కోసం వెళ్లాను. ఎన్ని సర్టిఫికెట్లు తీసుకెళ్లినా ఏదో ఒకటి తక్కువగా ఉందని చెప్పేవారు. ఆరు నెలల పాటు తిరగాల్సి వచ్చింది. చివరికి ఒక బ్రోకర్‌కు రూ. 3,500 కంటే ఎక్కువే ఇచ్చాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాడ్జ్ వచ్చేసింది..’’ - గణేశ్, మెహదీపట్నం వారం నుంచి తిప్పుకొంటున్నారు ‘‘బ్యాడ్జ్ రెన్యువల్ కోసం వారం రోజుల నుంచి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ చుట్టూ తిరుగుతున్నా.. గతంలో దీనికోసం రూ.3,500 ఖర్చు చేశాను. రెన్యువల్ కోసం వస్తే అధికారులు సమాధానం చెప్పడం లేదు. - కిషన్, హయత్‌నగర్ ఎవరూ పట్టించుకోలేదు.. ‘‘కారు హైపోతికేషన్ రద్దు కోసం ఎల్బీనగర్ నుంచి వచ్చాం. నేరుగా వెళితే ఎవరూ పట్టించుకోలేదు. చివరకు రూ.1,000 ఇచ్చి బ్రోకర్‌ను కలిశాము. వెంటనే పని అయిపోయింది..’’ - అరుణగుప్తా, హైదరాబాద్