ముడుపులు ముట్టచెప్పింది ఎందరంటే.. | 45% Indians paid bribe in past one year  | Sakshi
Sakshi News home page

ముడుపులు ముట్టచెప్పింది ఎందరంటే..

Published Sun, Dec 10 2017 12:57 PM | Last Updated on Sat, Sep 22 2018 8:31 PM

45% Indians paid bribe in past one year  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: గత ఏడాదిగా తమ పనులు చక్కబెట్టుకునేందుకు భారత్‌లో 45 శాతం మంది ముడుపులు ముట్టచెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. అంతకుముందు ఏడాది లంచాలిచ్చిన వారి సంఖ్య 43 శాతంగా ఉండటం గమనార్హం. పదకొండు రాష్ట్రాల్లో చేపట్టిన ఈ సర్వే 34,696 మందిని పలుకరించగా అవినీతి పెరిగిందని చెప్పిన వారి సంఖ్య 37 శాతం కాగా, అవినీతి తగ్గిందని 14 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక 45 శాతం మంది పరిస్థితి యథాతథంగా ఉందని ప్రతిస్పందించారు.

అవినీతి విషయంలో పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ ముందువరసలో ఉండట గమనార్హం. తమ రాష్ట్రాల్లో అవినీతి గణనీయంగా పెరిగిందని సర్వేలో పాల్గొన్నవారిలో 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక మహారాష్ట్రలో అవినీతి పెరిగిందని కేవలం 18 శాతం మందే పేర్కొన్నారు. ఇక దేశరాజధాని ఢిల్లీలో 33 శాతం మంది అవినీతి పెరిగిందని చెప్పగా, యథాతథంగా ఉందని 38 శాతం మంది తేల్చారు. 28 శాతం మంది అవినీతి తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. స్ధానిక సంస్థలు, స్ధానిక ప్రభుత్వాలకు సంబంధించిన పనుల్లోనే ముడుపులు చెల్లించినట్టు 84 శాతం మంది చెప్పడం గమనార్హం.

మున్సిపాలిటీ, పోలీస్‌, ట్యాక్స్‌, విద్యుత్‌, ఆస్తి రిజిస్ట్రేషన్‌, టెండర్లకు సంబంధించి ప్రభుత్వ శాఖలకు లంచాలు చెల్లించినవారే అధికమని సర్వేలో తేలిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రతినిధి పంకజ్‌ కుమార్‌ చెప్పారు.అవినీతి నియంత్రణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టడంలేదనే అథ్యయనంలో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.తొమ్మిది రాష్ట్రాల్లో అసలు లోకాయుక్త ఊసే లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement