భారత్‌కు 40 మార్కులు.. | Transparency International ranks India 81 in Corruption Perceptions Index 2017, down two slots | Sakshi
Sakshi News home page

అవినీతిలో భారత్‌ @ 81

Published Fri, Feb 23 2018 1:25 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Transparency International ranks India 81 in Corruption Perceptions Index 2017, down two slots - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం ఆయా దేశాల్లో గతేడాది జరిగిన సంఘటనలను పరిగణనలోనికి తీసుకున్న సంస్థ.. ‘ప్రపంచ అవినీతి సూచీ–2017’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అవినీతి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అత్యంత తీవ్రమైన నేరాలు జరుగుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఈ నివేదిక పేర్కొంది. 2016 అవినీతి సూచీలో 79వ ర్యాంకు పొందిన భారత్‌ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 81వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అవినీతి అత్యంత ఎక్కువగా, పత్రికా స్వేచ్ఛ అత్యంత తక్కువగా ఉన్న దేశాలు ఫిలిప్పీన్స్, ఇండియా, మాల్దీవులని నివేదిక వెల్లడించింది. జర్నలిస్టుల, సామాజిక కార్యకర్తల హత్యలను ఇందుకు కారణంగా చూపింది.

భారత్‌కు 40 మార్కులు..
అవినీతి, పత్రికా స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ప్రతి దేశానికీ 0 నుంచి 100 మధ్య మార్కులు కేటాయించింది. అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్‌ (89 మార్కులు–మొదటి ర్యాంకు), డెన్మార్క్‌ (88 మార్కులు–రెండో ర్యాంకు)లు నిలిచాయి. భారత్‌కు వందకు 40 మార్కులు వచ్చాయి. సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియాలు వరుసగా 9, 12, 14 మార్కులతో చివరి మూడు స్థానాలకు పరిమితమయ్యాయి.

పొరుగు దేశాల్లో భూటాన్‌ నంబర్‌ 1..
మన పొరుగు దేశాల్లో భూటాన్‌ 67 మార్కులతో ఏకంగా 26వ ర్యాంకును దక్కించుకోవడం గమనార్హం. భారత్‌ కన్నా చైనా ఒక్క మార్కు ఎక్కువ సాధించి 77వ స్థానంలో నిలిచింది. శ్రీలంక (91వ ర్యాంకు), పాకిస్తాన్‌ (117వ ర్యాంకు), మయన్మార్‌ (130వ ర్యాంకు) బంగ్లాదేశ్‌ (143వ ర్యాంకు)లు భారత్‌ కన్నా దిగువ స్థానాల్లోనే ఉన్నాయి. బ్రిక్స్‌ దేశాల వరకు చూస్తే దక్షిణాఫ్రికాకు అన్నింటికన్నా మెరుగైన ర్యాంకు (71) లభించగా, రష్యా అట్టడుగున (135వ ర్యాంకు) ఉంది. బ్రెజిల్‌కు 96వ ర్యాంకు దక్కింది.

వారానికో జర్నలిస్టు హత్య..
గత ఆరేళ్లుగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన ప్రతి 10 మంది జర్నలిస్టుల్లో.. జాబితాలో 45 లేదా అంతకన్నా తక్కువ మార్కులు పొందిన దేశాలకు చెందిన వారే 9 మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో వారానికి కనీసం ఒక జర్నలిస్ట్‌ హత్యకు గురవుతున్నారంది. అవినీతిపై వార్తలు రాయడం వల్లనే ప్రతి ఐదుగురు జర్నలిస్టుల్లో ఒకరు చనిపోతున్నారని వెల్లడించింది. వీటిలోని చాలా కేసుల్లో దోషులకు సరైన శిక్ష కూడా పడటం లేదంది. పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలనీ, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఎండీ పాట్రీసియా మొరీరా పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement