వాషింగ్టన్: భారత్‌లో వేయని రోడ్లను నిర్మించినట్లు బిల్లులు చూపించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారు. ఇందుకు స్థానిక రాజకీయ నేతలు, వారి బంధువులు, అవినీతి పరులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దిగమింగేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై)లో లొసుగుల ఆసరాగా స్థానిక ప్రజాపతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి భారీ అవినీతికి పాల్పడ్డారు. విస్తుగొలిపే ఈ అంశాలన్నీ అమెరికాలోని ప్రిన్స్‌టన్ వర్సిటీ, ఫ్రాన్స్‌లోని పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి. గ్రామీణ ప్రాంతాలను బాహ్య ప్రపంచానికి అనుసంధానిస్తూ చేపట్టే రహదారి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని అధ్యయనంలో తేలింది.
రాజకీయనేతల కనుసన్నల్లోనే
మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ గ్రామీణ రహదారులను నిర్మించినట్లు పీఎంజీఎస్‌వై సమాచార జాబితాలో పేర్కొన్నారు. వాటికి కేంద్రం నిధులు అందజేసినట్లు రాసేశారు. కానీ, అందులో పేర్కొన్న రోడ్లలో కనీసం ఒక్కరోడ్డు వేయలేదు. ఇలాంటివి 500 రోడ్లు ఉన్నట్లుగా పరిశోధక బృందం గుర్తించింది. కేంద్రం అందించిన నిధులు మాత్రం రహదారి నిర్మాణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, పనులు కేటాయించిన స్థానిక రాజకీయనేతల ఖాతాల్లోకి వెళ్లిపోయాయని వెల్లడైంది.
ఈ అవినీతి అంతటికీ స్థానిక ప్రజాప్రతినిధులే కారణమని పరిశోధకులు తేల్చారు. స్థానిక రాజకీయనేతలే ఈ అవినీతికి కారణమని నిర్ధారించేందుకు పరిశోధకుల బృందం శ్రమించాల్సి వచ్చింది. కాంట్రాక్టులను దక్కించుకున్న వారి ఇంటిపేర్లను స్థానిక ప్రజాప్రతినిధుల ఇంటిపేర్లతో సరిపోల్చాకే బృందం ఈ నిర్ణయానికొచ్చింది. రాజకీయనేతలు సిఫారసు చేసిన కాంట్రాక్టర్లకే రహదారి పనులు దక్కేలా చూసిన అధికారులు కూడా ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందినట్లు పరిశోధకులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment