PMGSY
-
బాబు వదిలేశారు.. జగన్ నిర్మిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద మేం ఇచ్చిన నిధులకు రాష్ట్రం వాటా కలిపి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లేయమని కేంద్రం చెబితే.. రాష్ట్రం నిధులు కలపలేదు సరికదా.. అక్కడి నుంచి వచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లూ వేయలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అదే పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులకు రాష్ట్రం వాటా కలిపి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచి రోడ్లు వేసింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వాస్తవమిది. పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే కొత్త రోడ్ల నిర్మాణం ఎక్కువగా జరిగిందని కేంద్రం తేల్చి చెప్పింది. రాష్ట్రంలో గ్రామాలను సమీప పట్టణాలకు కలిపే గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి కేంద్రమిచ్చిన నిధులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేయని విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల రాజ్యసభలో గణాంకాల సహితంగా వెల్లడించింది. పీఎంజీఎస్వైలో రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40 శాతం భరించాలి. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రంలో పీఎంజీఎస్‌వై కింద కేంద్రం రూ.470 కోట్లు నిధులిచ్చింది. దీనికి రాష్ట్ర వాటా 40 శాతం కలిపి మొత్తం రూ.783 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలో కేవలం రూ. 393 కోట్ల మేరకే కొత్త రోడ్లకు ఖర్చు చేసినట్టు కేంద్రం రాజ్యసభకు తెలియజేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత మూడేళ్లలో కేంద్రమిచ్చిన నిధులకు రాష్ట్ర వాటా 40 శాతం కలిపి మొత్తాన్ని రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేసినట్టు వివరించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021– 2022 వరకు మూడేళ్లలో రాష్ట్రంలో పీఎంజీఎస్‌వై కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 579 కోట్లు రాష్ట్రానికి ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం కలిపి మొత్తం రూ. 1,244.45 కోట్లతో రాష్ట్రంలో కొత్త రోడ్లు నిర్మించినట్టు కేంద్రం పేర్కొంది. పీఎంజీఎస్వైతోనే ఈ మూడేళ్లలో 2,271 కిలోమీటర్ల కొత్త రోడ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక కేంద్రం పీఎంజీఎస్‌వై పథకంలో రాష్ట్రానికి ఇప్పటివరకు 2,308 కిలోమీటర్ల మేర 298 రోడ్లను కొత్తగా మంజూరు చేసింది. అందులో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 1,490 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వం ఇదే పథకంలో నిర్మించకుండా పెండింగ్‌లో పెట్టిన దాదాపు 781 కిలోమీటర్ల రోడ్లను సైతం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మొదలు పెట్టి ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తంగా రాష్ట్రంలో ఒక్క పీఎంజీఎస్‌వై పథకంలోనే 2,271 కిలోమీటర్ల కొత్త రోడ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించింది. కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్ర వాటాను కలుపుతుండటంతో మరికొద్ది రోజుల్లోనే మరో 907 కిలోమీటర్ల మేర అదనంగా రోడ్లను మంజూరు చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
బ్రిడ్జి త్వరలో ప్రారంభం, అంతలోనే..
భోపాల్: భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్‌లోని ఓ బ్రిడ్జి కుప్పకూలింది. వైన్‌గంగా నదిపై సియోని జిల్లాలో 3.7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అధికారికంగా నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన 30, ఆగస్టు 2020 రోజునే బ్రిడ్జి కూలిపోవడం విశేషం. ఇక 150 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నెల క్రితమే పూర్తి కావడంతో స్థానికులు దాని ద్వారా రాకపోకలు కూడా సాగించారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇళ్లకే పరిమితమైన వేళ బ్రిడ్జి కూలిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బ్రిడ్జి పిల్లర్లు నదిలోకి కుంగిపోవడంతో అది పేకమేడలా వైన్ గంగలోకి ఒరిగిపోయింది. (చదవండి: కుక్కకు బర్రె వాహనం: భారీ భద్రత!!) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో భాగంగా 1,సెప్టెంబర్ 2018 న దీని పనులు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ హరిదాస్ దర్యాప్తునకు ఆదేశించారు. నిర్మాణంలో లోపాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక బ్రిడ్జి కూలిపోవడంతో సున్వారా, భీంఘర్కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ పాల్ సింగ్ ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నర్మదా నదీపరీవాహక ప్రాంతాల్లో కూడా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదకర స్థాయిలో నర్మద ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో ఇప్పటివరకు రాష్ట్రంలోని 251 రిజర్వాయర్లలో 120 పూర్తిగా నిండిపోయాయి. (చదవండి: ‘వందల కోట్ల బ్రిడ్జి.. 29 రోజుల్లో కూలిపోయింది’) -
గ్రామీణ రోడ్లలో కొబ్బరి పీచు వినియోగం
సాక్షి, న్యూఢిల్లీ: పీఎంజీఎస్‌వై–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను ఉపయోగిస్తామని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏజెన్సీ తెలిపింది. కొబ్బరి పీచుతో తయారైన చాపలు మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి సహజమైనవి. బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయి. చిరుగులకు లోనకావు. సూక్ష్మజీవులను దరి చేరనివ్వవు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి పీచును గ్రామీణ రోడ్ల నిర్మాణంలో వాడేందుకు అనుమతి లభించింది. గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కొబ్బరి పీచును ప్రత్యామ్నాయంగా వాడేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో ఎంఎస్ఎంఈ, రహదారి రవాణా–హైవే శాఖల మంత్రి నితిన్ గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇది ముఖ్యమైన పరిణామం. రోడ్ల నిర్మాణంలో కాయిర్ జియో టెక్స్టైల్స్ వాడడంలో మనం ఇప్పుడు విజయం సాధించాం. కోవిడ్ –19 సమయంలో కుదేలైన కొబ్బరి పీచు పరిశ్రమకు ఈ నిర్ణయం ప్రాణం పోస్తుంది..’అని చెప్పారు. పీఎంజీఎస్‌వై ఇచ్చిన కొత్త సాంకేతిక మార్గదర్శకాల ప్రకారం, ప్రతి నిర్మాణ ప్రతిపాదనలో 15 శాతం పొడవైన రోడ్లను కొత్త సాంకేతికత ఉపయోగించి నిర్మించాలి. ఇందులో 5 శాతం రోడ్లను ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్(ఐఆర్సీ) గుర్తింపు పొందిన సాంకేతికత ఆధారంగా నిర్మించాలి. కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను నిర్మాణ సామగ్రిగా ఐఆర్సీ ప్రస్తుతం గుర్తించింది. కేంద్ర సూచనల ప్రకారం పీఎంజీఎస్‌వై–3 కింద నిర్మించే గ్రామీణ రహదారుల్లో 5 శాతాన్ని కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను ఉపయోగించి నిర్మించాలి. దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 164 కిలోమీటర్లు, తెలంగాణలో 121 కి.మీ., గుజరాత్లో 151, కేరళలో 71, మహారాష్ట్రలో 328, ఒడిశాలో 470, తమిళనాడులో 369 కిలోమీటర్ల రహదారిని కాయిర్ జియో టెక్స్టైల్స్ ఉపయోగించి నిర్మిస్తారు. ఈ ఏడు రాష్ట్రాల్లో మొత్తం 1674 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంలో కాయిర్ జియో టెక్స్‌టైల్స్‌ను వినియోగిస్తారు. ఇందుకోసం ఒక కోటి చదరపు మీటర్ల కాయిర్ జియో టెక్స్టైల్స్ అవసరమని, ఇందుకు రూ. 70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. -
3,285 కిలో మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 3,285 కిలో మీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయ్యే వ్యయంలో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. పీఎంజీఎస్‌వై మూడో దశ అమలులో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల కిలోమీటర్ల గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 3,285 కిలోమీటర్ల పొడవు రోడ్లను మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జిల్లాల వారీగా పనులు గుర్తించే ప్రక్రియ మొదలైందని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి చెప్పారు. పనుల గుర్తింపు ప్రక్రియతో పాటు ఆయా పనుల నిర్మాణానికి అయ్యే అంచనాలను కూడా సిద్దం చేయాలని జిల్లా ఎస్ఈలను ఆదేశించినట్టు తెలిపారు. 13 జిల్లాల్లో దాదాపు 650 కొత్త రోడ్లు ఈ కార్యక్రమంలో చేపట్టే అవకాశం ఉందన్నారు. మొత్తం రూ.1,971 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నామని.. ఇందులో రూ.1,314 కోట్లు కేంద్రం మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. అక్టోబరు 15 కల్లా పనుల అంచనాలతో కూడిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కేంద్రానికి పంపనుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మరో 535 కిలోమీటర్ల పనులు రాష్ట్రంలో తీవ్రవాద ప్రభావిత జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మరో 535 కిలోమీటర్ల రోడ్డు పనులు కూడా మంజూరయ్యాయి. ఈ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా 4 జిల్లాల్లో 62 రోడ్డు పనులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కొత్తగా చేపడుతుంది. ఇందులో విశాఖ జిల్లాకే 44 పనులు మంజూరయ్యాయి. రూ.320 కోట్లు ఖర్చు అవుతుందని పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇందులో రూ.192 కోట్లు కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తోంది. -
సొంతింటి ‘కల’వరం
ఆదోని టౌన్: ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన (పీఎం జీఎస్వై), ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం నీరుగారి పోతోంది. ఇళ్లులేని పేదలకు జీ+3 అపార్ట్మెంట్ల రూపంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ఇళ్లు మంజూరయ్యాయని ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. తీరా వివిధ కారణాలు చూపుతూ ఇళ్లు రద్దయ్యాయని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతు న్నారు. పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ఎంతగానో ఆశపెట్టి చివరకు నిరాశే మిగిల్చారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సొంతింటి ఆశలపై నీళ్లు.. సొంతింటి కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పేదలు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకానికి మున్సిపల్ కమిషనర్ పేరుతో రూ.500, రూ.50 వేలు, లక్ష రూపాయలతో డీడీలు తీసి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు సర్వే చేసి పక్కా ఇళ్లు మంజూరు అయినట్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. తమకు ఆధునాతన వసతులతో నిర్మించిన పక్కా గృహాలు మంజూరయ్యాయని ఎంతో ఆశతో సంతోషంగా ఉన్న లబ్ధిదారులకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ సర్వే ప్రకారం వివిధ రకాల నిబంధనల మేరకు ఇళ్లు రద్దు చేశారంటూ అధికారులు చావుకబురు చల్లాగా చెబుతుండడంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. అధికారుల సమాధానంతో తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ప్రభుత్వ పథకాలను టీడీపీ అనుచరులకు కట్టబెట్టేందుకే నిబంధనలు, సర్వేలు అంటూ సాకులు చెబుతున్నారని లబ్ధిదారులు బహిరంగంగా ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు. చదరపు అడుగుల్లోఇళ్ల నిర్మాణం జీ+3 అపార్ట్‌మెంట్స్‌లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించడానికి లబ్ధిదారులు రూ.500 డీడీతోపాటు దరఖాస్తులు చేసుకున్నారు. 365 చదరపు అడుగుల విస్తీర్ణానికి రూ.50 వేలు, 430 చదరపు అడుగులలో డబుల్ బెడ్రూం ఇంటికి లక్ష రూపాయలు డీడీ కట్టి దరఖాస్తు చేసుకున్నారు. -
అన్నల పొలిమేరల్లో అనువైన దారులు..
విజయనగరం, పార్వతీపురం: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ షడక్ యోజన పథకంలో భాగంగా రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. గతంలో పోలీసుశాఖ సూచించిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టకేలకు రహదారులు నిర్మాణానికి పీఆర్ నుంచి రహదారులు మంజూరయ్యాయి. ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లో గతంలో ప్రతిపాదించిన రహదారుల్లో 21 రహదారులు మంజూరైనట్లు ఐటీడీఏకు మంగళవారం ఉత్తర్వులు వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గ్రామీణ షడక్యోజన పథకంలో భాగంగా తమవంతు వాటాగా నిధులు కేటాయించడం, ఈ రహదారుల నిర్మాణం ఐటీడీఏ ఇంజినీరింగ్‌శాఖ తరఫున కాకుండా పంచాయతీరాజ్ శాఖ తరఫున మంజూరు చేయడం ఐటీడీఏలో ప్రప్రథమం. ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లో 318.06 కిలోమీటర్లమేర 21 రహదారుల నిర్మాణానికి రూ. 150.70 కోట్లు మంజూరు అయ్యాయి. మంజూరైన రహదారులు ఇవే... ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో గుణద వయా కోసింగిభద్ర, టెంకసింగి గ్రామాల మధ్య 3.96 కిలోమీటర్లు, కొమరాడ మండలం విక్రాంపురం నుంచి కంచరపాడు వరకు 8.36 కిలోమీటర్లు, కురుపాం మండలం జి. శివడ ఆర్అండ్బీ నుంచి పెదంటిజోల వరకు 1.76 కిలోమీటర్లు, పార్వతీపురం మండలం కొత్త అడారు నుంచి జిల్లేడు వలస వరకు 2.16కిలోమీటర్లు, టేకులోవ రోడ్డు నుంచి బిత్రటొంకి వరకు 1.52 కిలోమీటర్లు, పాచిపెంట మండలం మాతుమూరు నుంచి సీల గ్రామం గుండా తాడూరు, కొత్తవలస వరకు 103.78 కిలోమీటర్లు, మక్కువ మండలం దుగ్గేరు మెండంగి రోడ్డు నుంచి బాగుజోల వరకు 1.80 కిలోమీటర్లు, దుగ్గేరు రోడ్డునుంచి తలగడవలస వరకు 0.60 కిలోమీటర్లు, దబ్బగడ్డనుంచి కొట్టంకి వరకు 4.50 కిలోమీటర్లు, పుట్టినంద రోడ్డు నుంచి బట్టివలస వరకు 1.30 కిలోమీటర్లు, కవిరిపల్లి రోడ్డు నుంచి నాయుడువలసకు 1.50 కిలోమీటర్లు, గోపాలపురం రోడ్డు నుంచి గొడేవలస వరకు 1.50 కిలోమీటర్లు, పార్వతీపురం మండలం డోకిశీల నుంచి డెప్పివలస 1.70 కి.మీ, సూడిగాం నుంచి హిందూపురం 2.80 కిలోమీటర్లు, కొరాపుట్ రోడ్డు నుంచి పనస భద్ర 1.58 కిలోమీటర్లు, కొరాపుట్ రోడ్డు నుంచి రంగాలగొగ వరకు 1.76 కి.మీ, వెలగవలస నుంచి ఎల్డీవలస వరకు 0.67 కిలోమీటర్లు, సంగంవలస నుంచి ఎం. గదబవలస వరకు 1.05కి.మీ, పెదబొండపల్లినుంచి సూరంపేట గదబవలస వరకు 0.56కి.మీ, గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడు కాలనీకి 1.44 కి.మీ, సాలూరు మండలం నంద నుంచి పగుల చెన్నేరు వరకు 9.80కి.మీ మేర తారు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. టెండర్లు ఖరారుకాగానే పనులకు చర్యలు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో భాగంగా ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లో పలు గిరిజన గ్రామాలకు పంచాయతీ రాజ్ శాఖద్వారా రహదారులు మంజూరు కావడం ఆనందంగా ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాధాన్యం ఇస్తూ రహదారులు మంజూరయ్యాయి. వీటితోపాటు ఐటీడీఏ సబ్‌ప్లాన్ మండలాల్లో పలు గ్రామీలతో కలుపుకొని 21 రహదారులు మంజూరయ్యాయి. వీటికి టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తాం. -డా. జి. లక్ష్మీశా, ఐటీడీఏ పీఓ,పార్వతీపురం 250 జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాలకు రహదారులు మంజూరు.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో భాగంగా 100నుంచి 250 మధ్య ప్రజలు ఉన్న గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రహదారులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా 181.76 కి.మీ గాను రూ. 12.477 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా గుమ్మలక్ష్మీపురం మండలం కోసంగిభద్ర, తాడంగి వలస రహదారి, కొమరాడ మండలం విక్రాంపురం– కంచరపాడు రహదారి, కురుపాం మండలం జి. శివడ–పెదండజోల రహదారి, పార్వతీపురం మండలం కొత్త అడారి– జిల్లేడు వలస రహదారి, టేకులోవ–బిత్రటొంకి రహదారులు మంజూరయ్యాయి. -
వేయని రోడ్లకూ సొమ్ము
వాషింగ్టన్: భారత్‌లో వేయని రోడ్లను నిర్మించినట్లు బిల్లులు చూపించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారు. ఇందుకు స్థానిక రాజకీయ నేతలు, వారి బంధువులు, అవినీతి పరులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దిగమింగేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై)లో లొసుగుల ఆసరాగా స్థానిక ప్రజాపతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి భారీ అవినీతికి పాల్పడ్డారు. విస్తుగొలిపే ఈ అంశాలన్నీ అమెరికాలోని ప్రిన్స్టన్ వర్సిటీ, ఫ్రాన్స్‌లోని పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి. గ్రామీణ ప్రాంతాలను బాహ్య ప్రపంచానికి అనుసంధానిస్తూ చేపట్టే రహదారి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని అధ్యయనంలో తేలింది. రాజకీయనేతల కనుసన్నల్లోనే మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ గ్రామీణ రహదారులను నిర్మించినట్లు పీఎంజీఎస్‌వై సమాచార జాబితాలో పేర్కొన్నారు. వాటికి కేంద్రం నిధులు అందజేసినట్లు రాసేశారు. కానీ, అందులో పేర్కొన్న రోడ్లలో కనీసం ఒక్కరోడ్డు వేయలేదు. ఇలాంటివి 500 రోడ్లు ఉన్నట్లుగా పరిశోధక బృందం గుర్తించింది. కేంద్రం అందించిన నిధులు మాత్రం రహదారి నిర్మాణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, పనులు కేటాయించిన స్థానిక రాజకీయనేతల ఖాతాల్లోకి వెళ్లిపోయాయని వెల్లడైంది. ఈ అవినీతి అంతటికీ స్థానిక ప్రజాప్రతినిధులే కారణమని పరిశోధకులు తేల్చారు. స్థానిక రాజకీయనేతలే ఈ అవినీతికి కారణమని నిర్ధారించేందుకు పరిశోధకుల బృందం శ్రమించాల్సి వచ్చింది. కాంట్రాక్టులను దక్కించుకున్న వారి ఇంటిపేర్లను స్థానిక ప్రజాప్రతినిధుల ఇంటిపేర్లతో సరిపోల్చాకే బృందం ఈ నిర్ణయానికొచ్చింది. రాజకీయనేతలు సిఫారసు చేసిన కాంట్రాక్టర్లకే రహదారి పనులు దక్కేలా చూసిన అధికారులు కూడా ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందినట్లు పరిశోధకులు గుర్తించారు. -
ఆ కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై), నాబార్డ్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోతే సదరు కాంట్రాక్టర్ల నుంచి నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. నాబార్డ్, పీఎంజీఎస్‌వై పనుల పురోగతిపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పనులు, జాప్యానికి గల కారణాలపై ఈఈ, ఎస్ఈలతో చర్చించారు. ఆశించినంత వేగంగా పనులు జరగకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన పనులను పూర్తి చేయడం ద్వారా కేంద్రం నుంచి అదనంగా నిధులను పొందేందుకు వీలుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోను మార్చి 31లోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. 151 పనులకు టెండర్లు పూర్తి.. పీఎంజీఎస్‌వై కింద దాదాపు రూ.600 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని జూపల్లి వెల్లడించారు. ఇందులో రూ.300 కోట్ల విలువైన పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని, మిగిలిన పనులను కూడా జూన్ 30లోగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 154 పనులను పూర్తి చేసే లక్ష్యం రూపొందించుకున్నామని, ఇందులో 151 పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. -
మరో 5 లక్షల ఇళ్లు మంజూరుకు సిద్ధం
► కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంజీఎస్‌వై) కింద తెలంగాణకు మంజూరు చేసిన ఇళ్లను పూర్తిచేస్తే, మరో 5 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌తో ఆయన ఇక్కడ భేటీ అయ్యి తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి అమలవుతున్న పథకాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పీఎంజీఎస్‌వై కింద కేంద్రం తెలంగాణకు రూ. 203 కోట్లను విడుదల చేసిందని, అయితే దీనికి రూ.135 కోట్ల మ్యాచింగ్ గ్రాంటును రాష్ట్రం విడుదల చేయలేదని తోమర్ తెలిపారు. గ్రామీణ తాగునీటి పథకం కింద రూ. 88 కోట్లు ఇవ్వగా, అందులో ఇంకా రూ. 37 కోట్లు ఖర్చు చేయలేదని తోమర్ వివరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.262 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. ఇక పీఎంజీఎస్‌వై కింద కేంద్రం మంజూరు చేసిన 38,157 ఇళ్లను డబుల్ బెడ్రూమ్లతో లింకు పెట్టడంతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతుందని దత్తాత్రేయకు వివరించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘పీఎంజీఎస్‌వై’ నత్తనడక
► రాష్ట్రాలకు 2017–18 లక్ష్యాలను కుదించిన నీతి ఆయోగ్ సాక్షి,న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీ ఎస్‌వై) పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న పీఎంజీఎస్‌వై అమలు తెలుగు రాష్ట్రాల్లో అసంతృప్తికరంగా ఉందని నీతి ఆయోగ్ గుర్తించింది. 2016–17కు గాను పీఎంజీఎస్‌వై కింద చేపట్టిన రహదా రుల నిర్మాణంలో ఏపీ 54 శాతం, తెలంగాణ 45 శాతం లక్ష్యాలను మాత్రమే సాధించాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం 2016–17కుగాను ఏపీలో రహదారుల నిర్మాణం లక్ష్యం 1,350 కి.మీ. కాగా గత మార్చి నాటికి 733.55 కి.మీ. మేరకు రహదారుల నిర్మాణం పూర్తి అయింది. తెలంగాణలో 2016–17కుగాను 900 కి.మీ. లక్ష్యంకాగా కేవలం 408.64 కి.మీ. మేరకు రహదారుల నిర్మాణం పూర్తి అయింది. దీంతో ఏపీ, తెలంగాణల్లో 2017–18 కిగాను పీఎంజీఎస్‌వై అమలు లక్ష్యాలను నీతిఆయోగ్ కుదించింది. తెలుగురాష్ట్రాలతోపాటుగా దేశంలోని పలు రాష్ట్రాలకు 2017–18 కిగాను ఇప్పటికే ఖరారు చేసింది. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అధ్యక్షతన గత వారం జరిగిన ప్రధానమంత్రి మౌలిక సదుపాయాల సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. పీఎంజీఎస్‌వై అమలు లక్ష్యాలను సంతృప్తికరంగా సాధించిన రాష్ట్రాలకు 2017–18కిగాను లక్ష్యాలను పెంచింది. 2017–18కిగాను దేశవ్యాప్తంగా 55,370 కి.మీ. రహదారుల నిర్మాణం లక్ష్యంగా పేర్కొంది. అయితే, సమావేశం తర్వాత రహదారుల నిర్మాణ లక్ష్యం 57,000 కిలోమీటర్లకు పెరిగింది. ఏపీ, తెలంగాణల్లో ఇప్పటికే ఖరారైన 800, 700 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యాన్ని 500 కిలోమీటర్లకు కుదించారు. ఫలితంగా తెలుగురాష్ట్రాలకు పీఎంజీఎస్‌వై కింద నిధుల మంజూరులో కోత ఏర్పడింది. నెలవారీగా లక్ష్యాలను కేటాయించుకొని కచ్చితమైన పర్యవేక్షణ ద్వారా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. -
ఏపీకి రూ.41 కోట్లు, తెలంగాణకు రూ.37 కోట్లు
పీఎంజీఎస్‌వైకి కేంద్రం నిధుల పెంపు సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన గ్రామ సడక్ యోజన పథకం(పీఎంజీఎస్‌వై) కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం నిధులను పెంచింది. పీఎంజీఎస్‌వై వార్షిక నిధులను ఏపీకి రూ.41 కోట్లు, తెలంగాణకు రూ.37 కోట్లు పెంచుతూ కేంద్ర గ్రామీణాభి వృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. ఏపీకి రూ.167 కోట్ల వార్షిక నిధులుండగా, దాన్ని రూ.208.70 కోట్లకు, తెలంగాణకు రూ.122 కోట్ల నుంచి రూ.159.20 కోట్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్వాగతించారు. నిధులను పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, సామాజిక సంబంధాలు, సేవలు విస్తృతమవుతాయని పేర్కొన్నారు.