![Corruption In PMGSY Housing Scheme In Kurnool - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/14/house_0.jpg.webp?itok=SbShsspq)
జీ+3 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం
ఆదోని టౌన్: ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన (పీఎం జీఎస్‌వై), ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం నీరుగారి పోతోంది. ఇళ్లులేని పేదలకు జీ+3 అపార్ట్‌మెంట్ల రూపంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఇళ్లు మంజూరయ్యాయని ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. తీరా వివిధ కారణాలు చూపుతూ ఇళ్లు రద్దయ్యాయని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతు న్నారు. పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామని ఎంతగానో ఆశపెట్టి చివరకు నిరాశే మిగిల్చారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సొంతింటి ఆశలపై నీళ్లు..
సొంతింటి కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న పేదలు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకానికి మున్సిపల్ కమిషనర్ పేరుతో రూ.500, రూ.50 వేలు, లక్ష రూపాయలతో డీడీలు తీసి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు సర్వే చేసి పక్కా ఇళ్లు మంజూరు అయినట్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. తమకు ఆధునాతన వసతులతో నిర్మించిన పక్కా గృహాలు మంజూరయ్యాయని ఎంతో ఆశతో సంతోషంగా ఉన్న లబ్ధిదారులకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ సర్వే ప్రకారం వివిధ రకాల నిబంధనల మేరకు ఇళ్లు రద్దు చేశారంటూ అధికారులు చావుకబురు చల్లాగా చెబుతుండడంతో లబ్ధిదారులు అవాక్కవుతున్నారు. అధికారుల సమాధానంతో తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ప్రభుత్వ పథకాలను టీడీపీ అనుచరులకు కట్టబెట్టేందుకే నిబంధనలు, సర్వేలు అంటూ సాకులు చెబుతున్నారని లబ్ధిదారులు బహిరంగంగా ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు.
చదరపు అడుగుల్లోఇళ్ల నిర్మాణం
జీ+3 అపార్ట్‌మెంట్స్‌లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించడానికి లబ్ధిదారులు రూ.500 డీడీతోపాటు దరఖాస్తులు చేసుకున్నారు. 365 చదరపు అడుగుల విస్తీర్ణానికి రూ.50 వేలు, 430 చదరపు అడుగులలో డబుల్ బెడ్‌రూం ఇంటికి లక్ష రూపాయలు డీడీ కట్టి దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment