కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాక్ పాయింట్ల నుంచి చౌక దుకాణాల వరకు అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సిబ్బంది, మరోవైపు డీలర్లు ‘రేషన్’ కొల్లగొడుతున్నారు. పేదల పొట్టకొడుతూ బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా..పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇటు పౌరసరఫరాల శాఖ గానీ, అటు తూనికలు, కొలతల శాఖ గానీ శ్రద్ధ చూపకపోవడంతో కార్డుదారులు నష్టపోతున్నారు.
రసీదులేవీ?:
చౌక దుకాణంలో సరుకులు తీసుకునే కార్డుదారులకు ఈ–పాస్ మిషన్ నుంచి వచ్చే రసీదులను విధిగా ఇవ్వాలి. జిల్లాలో 2,436 చౌక దుకాణాలు ఉండగా.. ఏ ఒక్క దాంట్లోనూ రసీదులు ఇస్తున్న దాఖలాలు లేవు. రసీదులు ఇస్తే తమ అక్రమాలు బయట పడతాయనే ఉద్దేశంతో డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ తూకం తక్కువ ఇస్తూ కార్డుదారులను దగా చేయడం డీలర్లకు పరిపాటిగా మారింది. ఈ మోసాన్ని అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతల శాఖపై ఉంది. అయితే.. ఈ శాఖ టార్గెట్‌కు అనుగుణంగా కేసులు నమోదు చేసి..చేతులు దులిపేసుకుంటోంది.
స్టాక్ పాయింట్ల నుంచే అక్రమాలు..
అక్రమాల పర్వం స్టాక్ పాయింట్ల నుంచే మొదలవుతోంది. నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాలతో తూకం వేసి డీలర్లకు సరుకులివ్వాలి. జిల్లాలోని ఏ స్టాక్ పాయింట్‌లోనూ ఇలా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. స్టాక్ పాయింట్లలోనే క్వింటాల్‌కు ఐదు కిలోల వరకు కోత కోసి బియ్యం ఇస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని డీలర్లు మరింత చెలరేగిపోతున్నారు. తూకంలో రెండు కిలోల డబ్బా వాడుతూ.. దాని బరువు మేర బియ్యం కాజేస్తున్నారు.
25 కిలోల బియ్యం ఇవ్వాలంటే రెండుసార్లు తూకం వేయాలి. అంటే 25 కిలోల బియ్యంలో డీలర్లు నాలుగు కిలోల వరకు కాజేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంత్యోదయ కార్డులకు విధిగా 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలి. అనేక మంది డీలర్లు 30 నుంచి 32 కిలోల వరకే ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 50 వేల క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఈ నెల నుంచి కార్డుకు రెండు కిలోల ప్రకారం ఇస్తున్న జొన్నలకు డిమాండ్ ఉంది. అయితే.. బియ్యంలో రెండు కిలోలు తగ్గించి.. ఆ మేర జొన్నలు ఇవ్వడంపై కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముందే ప్యాక్ చేసి..
బియ్యం, చక్కెర, జొన్నలు తదితర సరుకులను విధిగా కార్డుదారుల ముందే తూకం వేసి ఇవ్వాల్సి ఉంది. కానీ డీలర్లు చక్కెరను ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకొని ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతి 500 గ్రాములకు 100 గ్రాముల చొప్పున కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముందుగా తూకం వేసిన సరుకులను తీసుకోరాదని, తమ సమక్షంలోనే తూకం వేయించుకోవాలనే విషయంపై కార్డుదారులకు అవగాహన కల్పించే చర్యలు కరువయ్యాయి. డీలర్లు సేవల్లో నాణ్యత పాటించకపోయినా, రసీదు ఇవ్వకపోయినా, అనుచితంగా ప్రవర్తించినా 1100కు లేదా 1800114000 నంబరుకు ఫోన్ చేయవచ్చన్న విషయం కార్డుదారులెవరికీ తెలియదు.
యాక్టివ్‌లోకి తెచ్చుకోవడానికి తంటాలు
రేషన్‌కార్డు ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటుందో, ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌లోకి పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లోకి వెళితే.. దాన్ని యాక్టివ్‌లోకి తెచ్చుకోవాలంటే కార్డుదారులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలని, ఈకేవైసీ వేసి ఉండాలనే నిబంధన పెట్టారు. నాలుగైదు నెలల క్రితం ఒక్క కర్నూలు నగరంలోనే 8,200 కార్డులను ఇన్‌యాక్టివ్‌లో పెట్టారు. కార్డుదారులు ప్రతి నెలా సరుకులు తీసుకుంటున్నా.. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లో పెట్టడంతో బాధితుల ఆందోళన అంతాఇంతా కాదు. యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు కార్డుదారులు అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ దాదాపు ఐదువేల మందికి సమస్య పరిష్కారం కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment