Cheap stores
-
‘ప’రేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. స్టాక్ పాయింట్ల నుంచి చౌక దుకాణాల వరకు అక్రమాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సిబ్బంది, మరోవైపు డీలర్లు ‘రేషన్’ కొల్లగొడుతున్నారు. పేదల పొట్టకొడుతూ బ్లాక్మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చాలా కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా..పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇటు పౌరసరఫరాల శాఖ గానీ, అటు తూనికలు, కొలతల శాఖ గానీ శ్రద్ధ చూపకపోవడంతో కార్డుదారులు నష్టపోతున్నారు. రసీదులేవీ?: చౌక దుకాణంలో సరుకులు తీసుకునే కార్డుదారులకు ఈ–పాస్ మిషన్ నుంచి వచ్చే రసీదులను విధిగా ఇవ్వాలి. జిల్లాలో 2,436 చౌక దుకాణాలు ఉండగా.. ఏ ఒక్క దాంట్లోనూ రసీదులు ఇస్తున్న దాఖలాలు లేవు. రసీదులు ఇస్తే తమ అక్రమాలు బయట పడతాయనే ఉద్దేశంతో డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ తూకం తక్కువ ఇస్తూ కార్డుదారులను దగా చేయడం డీలర్లకు పరిపాటిగా మారింది. ఈ మోసాన్ని అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతల శాఖపై ఉంది. అయితే.. ఈ శాఖ టార్గెట్‌కు అనుగుణంగా కేసులు నమోదు చేసి..చేతులు దులిపేసుకుంటోంది. స్టాక్ పాయింట్ల నుంచే అక్రమాలు.. అక్రమాల పర్వం స్టాక్ పాయింట్ల నుంచే మొదలవుతోంది. నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాలతో తూకం వేసి డీలర్లకు సరుకులివ్వాలి. జిల్లాలోని ఏ స్టాక్ పాయింట్లోనూ ఇలా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. స్టాక్ పాయింట్లలోనే క్వింటాల్‌కు ఐదు కిలోల వరకు కోత కోసి బియ్యం ఇస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని డీలర్లు మరింత చెలరేగిపోతున్నారు. తూకంలో రెండు కిలోల డబ్బా వాడుతూ.. దాని బరువు మేర బియ్యం కాజేస్తున్నారు. 25 కిలోల బియ్యం ఇవ్వాలంటే రెండుసార్లు తూకం వేయాలి. అంటే 25 కిలోల బియ్యంలో డీలర్లు నాలుగు కిలోల వరకు కాజేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అంత్యోదయ కార్డులకు విధిగా 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలి. అనేక మంది డీలర్లు 30 నుంచి 32 కిలోల వరకే ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 50 వేల క్వింటాళ్ల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఈ నెల నుంచి కార్డుకు రెండు కిలోల ప్రకారం ఇస్తున్న జొన్నలకు డిమాండ్ ఉంది. అయితే.. బియ్యంలో రెండు కిలోలు తగ్గించి.. ఆ మేర జొన్నలు ఇవ్వడంపై కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందే ప్యాక్ చేసి.. బియ్యం, చక్కెర, జొన్నలు తదితర సరుకులను విధిగా కార్డుదారుల ముందే తూకం వేసి ఇవ్వాల్సి ఉంది. కానీ డీలర్లు చక్కెరను ముందుగానే ప్యాక్ చేసి పెట్టుకొని ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతి 500 గ్రాములకు 100 గ్రాముల చొప్పున కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముందుగా తూకం వేసిన సరుకులను తీసుకోరాదని, తమ సమక్షంలోనే తూకం వేయించుకోవాలనే విషయంపై కార్డుదారులకు అవగాహన కల్పించే చర్యలు కరువయ్యాయి. డీలర్లు సేవల్లో నాణ్యత పాటించకపోయినా, రసీదు ఇవ్వకపోయినా, అనుచితంగా ప్రవర్తించినా 1100కు లేదా 1800114000 నంబరుకు ఫోన్ చేయవచ్చన్న విషయం కార్డుదారులెవరికీ తెలియదు. యాక్టివ్‌లోకి తెచ్చుకోవడానికి తంటాలు రేషన్‌కార్డు ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటుందో, ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌లోకి పోతుందో తెలియని పరిస్థితి. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లోకి వెళితే.. దాన్ని యాక్టివ్‌లోకి తెచ్చుకోవాలంటే కార్డుదారులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలని, ఈకేవైసీ వేసి ఉండాలనే నిబంధన పెట్టారు. నాలుగైదు నెలల క్రితం ఒక్క కర్నూలు నగరంలోనే 8,200 కార్డులను ఇన్‌యాక్టివ్‌లో పెట్టారు. కార్డుదారులు ప్రతి నెలా సరుకులు తీసుకుంటున్నా.. ఉన్నట్టుండి ఇన్‌యాక్టివ్‌లో పెట్టడంతో బాధితుల ఆందోళన అంతాఇంతా కాదు. యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు కార్డుదారులు అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ దాదాపు ఐదువేల మందికి సమస్య పరిష్కారం కావడం లేదు. -
చౌకదుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలు
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తం గా 16,560 రేషన్ దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడిం చారు. వీటి వాడకంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరిగి, పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దుకాణాల్లో స్టాకు వివరాలను సమీక్షించేందుకు ఉపకరిస్తుందన్నారు. దీంతో ఏటా ప్రభుత్వానికి 15–20 శాతం ఖర్చు తగ్గుతుందని, రూ.800 కోట్ల వరకు ఆదా అవుతుందన్నారు. చెన్నై ఒయాసిస్ కంపెనీకి టెండర్లు: పీవోఎస్ యంత్రాలను సమకూర్చేందుకు నిర్వహించిన టెండర్లను శనివారం ఖరారు చేశామని ఆనంద్ తెలిపారు. ఒక్కో పీవో ఎస్ యంత్రాన్ని ప్రతి నెలా రూ.1,499 ధరతో అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చి న చెన్నైకి చెందిన ఒయాసిస్ కంపెనీ ఈ టెండర్లను దక్కించుకుందన్నారు. ఈ అద్దె ను పౌర సరఫరాల శాఖే చెల్లిస్తుందన్నారు. మరో 2 కంపెనీలు వరుసగా రూ.1,548, రూ.1,775 రేటుకు టెండర్లు దాఖలు చేశాయన్నారు. నగరంలో ప్రస్తుతం వేలి ముద్రలకే పరిమితమైన ఈ–పాస్ యంత్రాల కోసం ప్రతి నెలా రూ.1,650 అద్దెను చెల్లిస్తున్నామన్నారు. వీటిని నగదురహిత లావాదేవీల కోసం వినియోగిం చేలా మార్పులుచేశామన్నారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించడంతో ఒక్కో యంత్రంపై రూ.151 చొప్పున నెలకు రూ.24లక్షలు, ఏడాదికి రూ.3 కోట్లు ఆదా అవుతుందన్నారు. కొందరు వినియోగదారుల వేలి ముద్రలు చెరిగిపోయి సమస్యలు వస్తుండడంతో ఐరీష్, వాయిస్ ఓవర్ విధానాన్ని కూడా తీసుకువస్తున్నామన్నారు. మిషన్ ఏర్పాటు చేసుకొంటే: రేషన్ డీలర్ స్వయంగా ఈపాస్ మిషన్ ఏర్పాటు చేసుకుంటే క్వింటాల్‌కు రూ.17 చెల్లిస్తామని, అందులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరిస్తాయన్నారు. అద్దె ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే యంత్రాలను అందిస్తుం డడంతో కేంద్రం ఇచ్చే రూ.8.50 రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుందన్నారు. మార్చి 31లోగా అన్ని రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల అమలుకు కేంద్ర మంత్రి గడువు విధించారని సీవీ ఆనంద్ తెలిపారు. ఏఈపీఎస్ విధానం ఇలా: ప్రతి కార్డుదారుడు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. సరుకులు పంపిణీ చేసిన డీలర్ లబ్ధిదారుని ఆధార్ నంబర్‌తో పాటు బ్యాంక్ ఖాతా నంబర్‌ను ఏఈపీఎస్ సిస్టమ్‌లో పొందుపరుస్తాడు. దీంతో సరుకులకు సరిపడా డబ్బులు లబ్ధిదారుడి ఖాతా నుంచి డీలర్ ఖాతాకు జమవుతాయి. చౌక ధరల దుకాణాల ద్వారా బ్యాకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామని ఆనంద్ తెలిపారు. -
డీలర్లకు కొత్త బాధ్యతలు
నెలలో సగం రోజులు బ్యాంకు ఏజెంట్లుగా విధులు త్వరలోనే వీరికి శిక్షణ తిరుపతి మంగళం: చౌక దుకాణాల డీలర్ల సేవలను ప్రభుత్వం విసృ్తతం చేయాలని నిర్ణరుుంచింది. ఇన్నాళ్లూ లబ్ధిదారులకు సరుకులు మాత్రమే అందించేవారు. ఇప్పుడు బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)లుగా కూడా వారు పనిచేయనున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓిపీ) ద్వారా వారిని నియమించాలని ఈనెల 15న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చర్యలు చేపట్టారు. జిల్లా స్థారుు బ్యాంకర్ల కమిటీ (డీఎల్‌బీసీ) సమావేశం నిర్వహించేందుకు సిద్ధ మయ్యారు. తమ పరిధిలోని డీలర్లకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆర్డీవోలు, తహశీల్దార్లను ఆదేశించారు. దీనిపై గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్‌సప్లైస్ అధికారులతో సివిల్‌సప్లైస్ రాష్ట్ర కమిషనర్ రాజశేఖర్, డెరైక్టర్ రవిబాబు వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. నెలలో పదిహేను రోజులు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తారని, మిగతా పదిహేను రోజులు బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉపయోగించుకుని బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని తెలిపారు. డీలర్ల వద్ద ఉన్న ఈ-పాస్ మిషన్‌కు యాప్‌ను జోడించి శిక్షణ కల్పిస్తారు. డీలర్లు ఏంచేయాలంటే.. డీలర్లు తమ పరిధిలో, ప్రాంతంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగిస్తారు. బ్యాంకులకు ప్రజలు చెల్లించాల్సిన రుణాలను స్వీకరించడం, వాటిని బ్యాంకుల్లో జమచేయం, రుణాలు తీసుకోదలచినవారికి అవసరమైన ఫారాలను ఇవ్వడం లాంటివి చేస్తారు. ఖాతాదారులకు, బ్యాంకులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. ఇందుకుగాను వీరికి కమీషన్ చెల్లిస్తారు. -
మూడు రోజులు.. ముప్పు తిప్పలు!
ప‘రేషాన్’ ► మొరాయిస్తున్న సర్వర్ ► మొండికేస్తున్న డీలర్లు ► పేదలకు అందని రేషన్ ► ముగిసిన పంపిణీ గడువు కర్నూలు (అగ్రికల్చర్): పేదల పొట్టకొట్టే ప్రయత్నాలకు ప్రభుత్వం తెర తీసింది. అన్ని చౌకదుకాణాల్లో విధిగా ఒకటో తేదీ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ ప్రారంభించి మూడో తేదీలో పూర్తి చేయాలని డీలర్లను ఆదేశించింది. సర్వర్ మొరాయించడం, డీలర్ల నిర్లక్ష్యం తదితర కారణాలతో 3వ తేదీ నాటికి జిల్లాలో 64.73 శాతం పంపిణీ పూర్తయింది. రేషన్ కోసం లబ్ధిదారులకు మూడు రోజుల పాటు ముప్పు తిప్పలు తప్పలేదు. జిల్లా కేంద్రమైన కర్నూలులో సరుకుల పంపిణీ నత్తనడకన సాగింది. ప్రజాపంపిణీలో కర్నూలు జిల్లానే ప్రథమస్థానంలో ఉంది. అయితే 3వ తేదీలోపు సరుకుల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఈ-పాసు మిషన్ల ద్వారా మూడో తేదీలోపు సరుకుల పంపిణీ చేసి, వేలిముద్రలు పడని వారికి, ఇతరులకు 5వ తేదీలోపు పంపిణీ చేయాల్సి ఉంది. గతనెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ప్రజాపంపిణీ కొంత వరకు మెరుగైనా.. డీలర్లలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. జిల్లాలో 2414 చౌకదుకాణాలు ఉన్నాయి. ఇందులో 7 షాపులకు మినహా మిగిలి 2407 షాపుల్లో ఈ-పాస్ మిషన్ల సరుకులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్ నెలకు 11,18,340 సరుకులకు రేషన్ విడుదల అయింది. మూడో తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 7,12,477 కార్డులకు ఈ-పాస్ మిషన్ల ద్వారా సరుకులు పంపిణీ చేశారు. ఇంకా 4,05,863 కార్డులకు సరుకులు అందాల్సి ఉంది. ఆదివారం తెరచుకోని చౌక దుకాణాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం 106 షాపులు తెరచుకోలేదు. కౌతాళం మండలంలో -8, ఆలూరు మండలంలో -7 కోసిగిలో-10, పెద్దకడుబూరులో-5, ఆదోనిలో-6, వెల్దుర్తిలో-4, ప్యాపిలిలో-3, కర్నూలు అర్బన్‌లో-2, కొలిమిగుండ్లలో-2, నంద్యాలలో-2, చాగలమర్రిలో-2, రుద్రవరంమండలంలో మూడు ప్రకారం షాపులు తెరువలేదు. రేషన్ సరుకుల కోసం కార్డుదారులు వచ్చి గంటల తరబడి వేచిచూసి వెనుతిరిగారు. ఈనెల 1వ తేదీ 2.80 లక్షల కార్డులకు, 2వ తేదీ 3.15 లక్షల కార్డులకు సరుకులు పంపిణీ చేశారు. మూడో తేదీ ఆదివారం డీలర్లు సెలవు తీసుకోవడంతో 1,22,477 కార్డులకు మాత్రమే సరుకులు చేరాయి. మొత్తం 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి 7,12,477 కార్డులకు పంపిణీ పూర్తి అయింది. దీంతో జిల్లాలో ఇంకా 4,05,863 కార్డులకు సరుకులు అందాల్సి ఉంది. వీటికి సరుకులు పంపిణీ చేయడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. వేలిముద్రలు పడని వారికి, ఇతరులకు సరుకుల పంపిణీ మరింత జాప్యం కానుంది. స మస్య ఇదీ.. మార్చి నెలలో పోలిస్తే ఈనెలలో డీలర్లు షాపులు తెరువడం మెరుగ్గా ఉన్నా సర్వర్ మొరాయిస్తుండం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. 95 శాతంపైగా షాపులు తెరచి ప్రజాపంపిణీ మొదలు పెట్టడం వల్ల సర్వర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇందువల్ల లైన్లు దొరకక ప్రజా పంపిణీ ఆలస్యం అవుతోంది. దీనికి తోడు హార్డ్‌వేర్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. సర్వర్ సమస్యలు, హార్డ్‌వేర్ సమస్యలను అధిగమించకుండా ప్రజాపంపిణీ చేపట్టడంతో తల ప్రాణం తోకకు వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముందున్నాం: ఈ-పాస్ విధానం ద్వారా ప్రజాపంపిణీలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అత్యధిక కార్డులకు సరుకుల పంపిణీలో గతనెల వరకు గుంటూరు జిల్లా మొదటి స్థానంలో ఉండింది. ఆ స్థానాన్ని కర్నూలు జిల్లా చేజిక్కించుకుంది. జాయింట్ కలెక్టర్ తీసుకున్న చర్యల వల్ల కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. డీఎస్ఓ తిప్పేనాయక్ -
ఇంత చౌకబారుతనమా?
సాంకేతిక సమస్యలను సాకుగా చూపి దోపిడీకి పాల్పడుతున్న డీలర్లు ఆందోళనలో లబ్ధిదారులు జిల్లాలో చౌకదుకాణాల ద్వారా జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బయోమెట్రిక్, ఐరిష్ మిషన్లు మొరాయిస్తుండడంతో వేలాది కార్డులకు సరుకులు సక్రమంగా అందడంలేదు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాలను సాకుగా చూపి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నా అడిగే దిక్కులేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు: జిల్లాలో 2,828 చౌక దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 10,73,780 వివిధ రకాల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా కార్డుదారులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో రేషన్‌కార్డు నంబరు రాసి నిత్యావసరాలు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు బయోమెట్రిక్, ఐరిష్ మిషన్ల సహాయంతో వేలిముద్రలు తీసుకుని తద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే విజన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన బయోమెట్రిక్ మిషన్లు సక్రమంగా పనిచేయడంలేదు. ఫలితంగా కార్డుదారుల వేలిముద్రలు నమోదుగాక అగచాట్లు ఎదురవుతున్నాయి. పనిచేయని వాటి స్థానంలో కొత్త మిషన్ల ఏర్పాటు విషయమై అటు కంపెనీ ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. మరోవైపు బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో ఐరిష్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీచేయాల్సి ఉంది. కానీ విప్రో కంపెనీ సరఫరా చేసిన ఐరిష్ మిషన్లు సక్రమంగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారులే నవంబర్ నెలలో విప్రో కంపెనీకి చెందిన 2,200 ఐరిష్ మిషన్లు పంపిణీ చేశారు. వీటిలో 50 శాతం మిషన్లు వివిధ సాంకేతిక కారణాలతో పనిచేయడంలేదు. పనిచేయని మిషన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ చెప్పినా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో వాటిని సరిదిద్దేందుకు కంపెనీ ఇంజినీర్లను ఏర్పాటు చేయాలి. కానీ జిల్లావ్యాప్తంగా ఒక్క ఇంజినీర్ మాత్రమే ఉండడంతో పాడైన మిషన్లను సరిచేయలేక పోతున్నారు. బయోమెట్రిక్, ఐరిష్‌లు పనిచేయక పోవడంతో ప్రతినెలా వేలాది కార్డుదారులకు సరుకులు ఎగనామం పెడుతున్నారు. గతనెలలో 14,057 మందికి రేషన్ అందలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నా ఈ సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా కుష్ఠువ్యాధి గ్రస్తులకు సరుకులు నిలిపి వేశారని బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి మొరపెట్టుకున్నారు. అంతకుముందునెలలో దాదాపు 92 వేల మందికి సరుకుల పంపిణీ ఆగిపోయిందని పౌరసరఫరాలశాఖకు చెందిన ఓ అధికారి చెప్పడం గమనార్హం. ఈ లెక్కన ప్రతినెలా వేలాది మందికి సరుకులు అందలేదని తెలుస్తోంది. సాంకేతిక కారణాలను పక్కనబెట్టి కార్డుదారులకు సంబంధిత వీఆర్వోల వేలి ముద్రలు తీసుకొని సరుకులు ఇవ్వాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఇదే అదునుగా చాలామంది డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై కార్డుదారులకు ఇవ్వకుండానే సరుకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సాంకేతిక సమస్యలు పరిష్కరించి, పేదలకు నిత్యావసర సరుకులు అందేలా చూడాల్సి ఉంది. -
పండుగకు పరేషాన్
విశాఖ రూరల్ : జిల్లాలో 12.3 లక్షల తెల్లరే షన్‌కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతీ నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్‌ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ కుటుంబానికి అవసరమైన ఈ వంటనూనె సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయింది. గత మార్చి నుంచి ఉత్పత్తి కొరత పేరుతో పామాయిల్ పంపిణీ పూర్తిగా ఆపేశారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌డిపోల్లో సరఫరా చేసే పామోలిన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ విడుదల చేయాల్సి ఉంటుంది. గత ఏడు నెలలుగా రాయితీ నిధులు జమ చేయడం లేదు. దీంతో సరఫరా నిలిచిపోయింది. పామోలిన్ లీటర్ ధర రూ.63.50 ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రాయితీ రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూ.8.50 చెల్లించి.. కార్డుదారులకు రూ.40కే చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసేది. మలేషియా నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్‌ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయింపులు చేసేవారు. కానీ గత ఏడు నెలలుగా పామాయిల్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో 12.3 లక్షల మంది కార్డుదారులు బహిరంగ మార్కెట్లో లీటర్ పామోలిన్‌ను రూ.63 నుంచి రూ.68కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాధారణంగా కార్డుదారులకు ప్రతీ నెలా అరకిలో పంచదార ఇస్తున్నారు. పండుగ మాసాల్లో మాత్రం అదనంగా మరో అరకిలో ఇచ్చేవారు. వినాయక చవితి పండుగకు అదనపు చక్కెర ఇస్తారని భావించినప్పటి ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కనీసం దసరాకైనా అరకిలో అదనంగా ఇస్తారనుకున్నా ప్రభుత్వం కనీసం ఆ విషయంపైనే దృష్టి సారించలేదు. ఇందుకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు గాని, అదనపు కేటాయింపులు గానీ జరగకపోవడంతో దసరాకు కూడా పంచదార అదనంగా ఇచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన సరుకులు ఇవ్వడం లేదు. దీంతో పండుగ మాసంలో కూడా పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.