సాంకేతిక సమస్యలను సాకుగా చూపి దోపిడీకి పాల్పడుతున్న డీలర్లు
ఆందోళనలో లబ్ధిదారులు
జిల్లాలో చౌకదుకాణాల ద్వారా జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బయోమెట్రిక్, ఐరిష్ మిషన్లు మొరాయిస్తుండడంతో వేలాది కార్డులకు సరుకులు సక్రమంగా అందడంలేదు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాలను సాకుగా చూపి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నా అడిగే దిక్కులేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు: జిల్లాలో 2,828 చౌక దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 10,73,780 వివిధ రకాల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా కార్డుదారులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో రేషన్‌కార్డు నంబరు రాసి నిత్యావసరాలు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు బయోమెట్రిక్, ఐరిష్ మిషన్ల సహాయంతో వేలిముద్రలు తీసుకుని తద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే విజన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన బయోమెట్రిక్ మిషన్లు సక్రమంగా పనిచేయడంలేదు. ఫలితంగా కార్డుదారుల వేలిముద్రలు నమోదుగాక అగచాట్లు ఎదురవుతున్నాయి. పనిచేయని వాటి స్థానంలో కొత్త మిషన్ల ఏర్పాటు విషయమై అటు కంపెనీ ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. మరోవైపు బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో ఐరిష్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీచేయాల్సి ఉంది. కానీ విప్రో కంపెనీ సరఫరా చేసిన ఐరిష్ మిషన్లు సక్రమంగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారులే నవంబర్ నెలలో విప్రో కంపెనీకి చెందిన 2,200 ఐరిష్ మిషన్లు పంపిణీ చేశారు. వీటిలో 50 శాతం మిషన్లు వివిధ సాంకేతిక కారణాలతో పనిచేయడంలేదు. పనిచేయని మిషన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ చెప్పినా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో వాటిని సరిదిద్దేందుకు కంపెనీ ఇంజినీర్లను ఏర్పాటు చేయాలి. కానీ జిల్లావ్యాప్తంగా ఒక్క ఇంజినీర్ మాత్రమే ఉండడంతో పాడైన మిషన్లను సరిచేయలేక పోతున్నారు. బయోమెట్రిక్, ఐరిష్‌లు పనిచేయక పోవడంతో ప్రతినెలా వేలాది కార్డుదారులకు సరుకులు ఎగనామం పెడుతున్నారు. గతనెలలో 14,057 మందికి రేషన్ అందలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నా ఈ సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా కుష్ఠువ్యాధి గ్రస్తులకు సరుకులు నిలిపి వేశారని బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి మొరపెట్టుకున్నారు.
అంతకుముందునెలలో దాదాపు 92 వేల మందికి సరుకుల పంపిణీ ఆగిపోయిందని పౌరసరఫరాలశాఖకు చెందిన ఓ అధికారి చెప్పడం గమనార్హం. ఈ లెక్కన ప్రతినెలా వేలాది మందికి సరుకులు అందలేదని తెలుస్తోంది. సాంకేతిక కారణాలను పక్కనబెట్టి కార్డుదారులకు సంబంధిత వీఆర్వోల వేలి ముద్రలు తీసుకొని సరుకులు ఇవ్వాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఇదే అదునుగా చాలామంది డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై కార్డుదారులకు ఇవ్వకుండానే సరుకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సాంకేతిక సమస్యలు పరిష్కరించి, పేదలకు నిత్యావసర సరుకులు అందేలా చూడాల్సి ఉంది.
ఇంత చౌకబారుతనమా?
Published Mon, Feb 22 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement