Distribution system
-
నైజీరియాలో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ
అబూజా: ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో గురువారం గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో దేశమంతటా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం విద్యుత్ ఉత్పత్తి సున్నా మెగావాట్లుగా నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. నైజీరియాలో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడడం మామూలే. 2022లో ఏకంగా నాలుగు సార్లు గ్రిడ్ కుప్పకూలింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రెండు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అనుసంధానించే లైన్ అగ్నిప్రమాదానికి గురైందని, అందుకే గ్రిడ్ విఫలమైందని నైజీరియా విద్యుత్ శాఖ మంత్రి అడెబయో అడెలాబూ చెప్పారు. -
గుప్పిట్లో.. సకల జనుల సమాచారం
♦ ఒకే చోట పౌరులకు సంబంధించిన సమస్త సమాచారం ♦ సమగ్ర పౌర సమాచార కేంద్రంపై సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సరుకులు పక్కదారి పట్టడం వంటి అవలక్షణాలను రూపుమాపేందుకు సమగ్ర పౌర సమాచార నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కూడా ఈ అప్లికేషన్‌ను వినియోగిస్తే దుర్వినియోగమైపోతున్న కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, దుర్ఘటనలు సంభవించినప్పుడు టెక్నాలజీ ఉపయోగం ఎంతో ఉంటుందన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే సుపరిపాలన ఎంతో కీలకమని, ఇందు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త కొత్త యాప్‌లను వినియోగంలోకి తేవడం సరైందని ముఖ్యమంత్రి అన్నారు. సమగ్ర పౌర సమాచార నిధి కేంద్రం ఏర్పాటుపై శనివారం అధికారిక నివాసంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పౌరులకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసి అవసరమైన క్లిష్ట సమయాల్లో విశ్లేషించగల ఈ అప్లికేషన్‌ను ప్రభుత్వం రూపొందించనుంది. ఇప్పటికే ఈ యాప్‌ను వాణిజ్య పన్నుల శాఖలో పన్ను ఎగవేతదారులను పట్టుకోవడానికి ప్రయోగాత్మకంగా అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయని యాప్ తయారీదారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ యాప్‌ను పోలీసు శాఖ, శాంతి భద్రతల అంశానికే పరిమితం చేయకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు, శాఖలకు విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమను గమనిస్తున్నారనే ధ్యాస ఉద్యోగి సహా ప్రతీ పౌరునికి ఉండడం వల్ల తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు వీలుంటుందని, అందుకు ఈ యాప్ దోహదపడుతుందని చెప్పారు. విరివిగా వినియోగించాలి..: ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాలనలో సాంకేతికతను, వినూత్న యాప్‌లను విరివిగా వినియోగించుకోవాలని సూచిం చారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు గురించి మీడియా తదితర సాంకేతిక మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. సమయం వృథా కాకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మంత్రులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాలు అమలు చేసే నూతన విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉండడమే కాకుండా వారిని భాగస్వాములు చేసే విధంగా ఉండాలని, అప్పుడే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోలేని గత ప్రభుత్వాలు ‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్’ అన్న పద్ధతిలో పరిపాలన చేశాయని కేసీఆర్ విమర్శించారు. ప్రభుత్వ విభాగాల పనితీరులో పారదర్శకత లేని అస్తవ్యస్త పాలనను అందించాయని, సాంకేతికతను జోడించి సుపరిపాలన అందించాలనే చిత్తశుద్ధి లోపించడమే దీనికి కారణమని చెప్పారు. ఈ సమావేశంలో మీ సేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు, పోలీసు ఉన్నతాధికారి నాగిరెడ్డి, ఐటీ విభాగం నిపుణులు శ్రీధర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇంత చౌకబారుతనమా?
సాంకేతిక సమస్యలను సాకుగా చూపి దోపిడీకి పాల్పడుతున్న డీలర్లు ఆందోళనలో లబ్ధిదారులు జిల్లాలో చౌకదుకాణాల ద్వారా జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బయోమెట్రిక్, ఐరిష్ మిషన్లు మొరాయిస్తుండడంతో వేలాది కార్డులకు సరుకులు సక్రమంగా అందడంలేదు. కొన్ని చోట్ల సాంకేతిక కారణాలను సాకుగా చూపి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నా అడిగే దిక్కులేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు: జిల్లాలో 2,828 చౌక దుకాణాలున్నాయి. వీటి పరిధిలో 10,73,780 వివిధ రకాల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా కార్డుదారులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో రేషన్‌కార్డు నంబరు రాసి నిత్యావసరాలు పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడు బయోమెట్రిక్, ఐరిష్ మిషన్ల సహాయంతో వేలిముద్రలు తీసుకుని తద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే విజన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన బయోమెట్రిక్ మిషన్లు సక్రమంగా పనిచేయడంలేదు. ఫలితంగా కార్డుదారుల వేలిముద్రలు నమోదుగాక అగచాట్లు ఎదురవుతున్నాయి. పనిచేయని వాటి స్థానంలో కొత్త మిషన్ల ఏర్పాటు విషయమై అటు కంపెనీ ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. మరోవైపు బయోమెట్రిక్ పనిచేయని పక్షంలో ఐరిష్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీచేయాల్సి ఉంది. కానీ విప్రో కంపెనీ సరఫరా చేసిన ఐరిష్ మిషన్లు సక్రమంగా పనిచేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారులే నవంబర్ నెలలో విప్రో కంపెనీకి చెందిన 2,200 ఐరిష్ మిషన్లు పంపిణీ చేశారు. వీటిలో 50 శాతం మిషన్లు వివిధ సాంకేతిక కారణాలతో పనిచేయడంలేదు. పనిచేయని మిషన్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ చెప్పినా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో వాటిని సరిదిద్దేందుకు కంపెనీ ఇంజినీర్లను ఏర్పాటు చేయాలి. కానీ జిల్లావ్యాప్తంగా ఒక్క ఇంజినీర్ మాత్రమే ఉండడంతో పాడైన మిషన్లను సరిచేయలేక పోతున్నారు. బయోమెట్రిక్, ఐరిష్‌లు పనిచేయక పోవడంతో ప్రతినెలా వేలాది కార్డుదారులకు సరుకులు ఎగనామం పెడుతున్నారు. గతనెలలో 14,057 మందికి రేషన్ అందలేదని అధికారిక గణాంకాలు చెబుతున్నా ఈ సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా రెండు వేల మందికి పైగా కుష్ఠువ్యాధి గ్రస్తులకు సరుకులు నిలిపి వేశారని బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి మొరపెట్టుకున్నారు. అంతకుముందునెలలో దాదాపు 92 వేల మందికి సరుకుల పంపిణీ ఆగిపోయిందని పౌరసరఫరాలశాఖకు చెందిన ఓ అధికారి చెప్పడం గమనార్హం. ఈ లెక్కన ప్రతినెలా వేలాది మందికి సరుకులు అందలేదని తెలుస్తోంది. సాంకేతిక కారణాలను పక్కనబెట్టి కార్డుదారులకు సంబంధిత వీఆర్వోల వేలి ముద్రలు తీసుకొని సరుకులు ఇవ్వాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఇదే అదునుగా చాలామంది డీలర్లు వీఆర్వోలతో కుమ్మక్కై కార్డుదారులకు ఇవ్వకుండానే సరుకులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సాంకేతిక సమస్యలు పరిష్కరించి, పేదలకు నిత్యావసర సరుకులు అందేలా చూడాల్సి ఉంది. -
ఆధార్‌పై నిర్ణయాన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి
సుప్రీంను కోరిన కేంద్రం శుక్రవారం నిర్ణయం చెబుతామన్న సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ అనుసంధానాన్ని పరిమితం చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ‘పిటిషన్ విచారణకు తొమ్మిది మంది జడ్జిలతో కూడిన బెంచ్ అవసరం. అంతమందిని ఇస్తే మిగతాపనులు ఏమవ్వాలి. అందుకే రేపు సాయంత్రం వరకు నాకు సమయం ఇవ్వండి’ అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు చెప్పారు. కేవలం పీడీఎస్, ఎల్పీజీలకు మాత్రమే ఆధార్ స్వచ్ఛంద వినియోగానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును మార్చాలని రోహత్గీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, హరీశ్ సాల్వే కూడా మద్దతు తెలిపారు. ఉపాధి హామీ, జన్‌ధన్ యోజన లాంటి పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రాముఖ్యతను గురువారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించిన రోహత్గీ.. పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని కోరారు. -
రేషన్..ఆన్లైన్
- జిల్లాలో రేషన్ దుకాణాలు: 1,852 - గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి: 1,164 - జీహెచ్ఎంసీ పరిధిలోనివి : 688 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు సర్కారు మరో అడుగు ముందుకేసింది. ఇటీవల మండలస్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. తాజాగా రేషన్ డీలర్లకు నెలవారీ సరుకుల పంపిణీకి సంబంధించి సమాచారాన్ని ఆన్లైన్ పద్ధతితో అనుసంధానం చేసింది. గతంలో నిర్దేశిత కోటాకు సంబంధించి డీలర్లు బ్యాంకు చలానా ఇచ్చి మండలస్థాయి స్టాక్ పాయింట్ల నుంచి సరుకులు పొందేవారు. ఈ వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పౌరసరఫరాల శాఖ.. చలానా పద్ధతికి చెల్లుచీటీ పలికింది. కొత్తగా మీ సేవ కేంద్రాల ద్వారా కోటా విడుదల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలో 1,852 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,164, జీహెచ్ఎంసీ పరిధిలో 688 దుకాణాలు కొనసాగుతున్నాయి. మీ సేవ కేంద్రాల్లో చెల్లింపులు.. చలానా పద్ధతికి స్వస్తి పలికిన పౌరసరఫరాల శాఖ.. ఇకపై మీ సేవ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి రసీదు పొందిన డీలర్లకు మాత్రమే సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకుగాను మీ సేవ కేంద్రాలకు ఆన్లైన్లో లింకు కలిపింది. కోటాకు సంబంధించి డబ్బులు మీసేవ కేంద్రాల్లో చెల్లిస్తే.. ఆ మేరకు మీ సేవ నిర్వాహకుడు రసీదు ఇస్తాడు. చెల్లింపు సమాచారాన్ని స్థానిక తహసీల్దారుకు ‘ఈ మెయిల్’ ద్వారా చేరవేస్తాడు. దశలవారీగా పరిశీలన.. మీ సేవ కేంద్రం నుంచి ‘ఈ మెయిల్’ అందుకున్న తహసీల్దారు... కోటాకు సంబంధించిన వివరాలను పరిశీలించిన అనంతరం నిర్ధారించుకుని కోటా మంజూరుకు అంగీకారం తెలుపుతారు. అనంతరం ఆ సమాచారాన్ని ఆన్లైన్లో మండలస్థాయి స్టాక్ పాయింట్‌కు చేరవేస్తారు. అలా కోటా సమాచారాన్ని నిర్ధారించుకున్న ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి ఆ మేరకు స్టాకును తరలిస్తారు. సరుకులు తీసుకున్న డీలర్.. తిరిగి నెల పూర్తయిన తర్వాత కార్డుదారులకు పంపిణీ.. మిగులు స్టాకు వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. దీంతో తదుపరి నెలలో గత మిగులును పరిగణిస్తూ తక్కిన కోటాను విడుదల చేస్తారు. ఇలా దశలవారీగా పర్యవేక్షణ నిర్వహించడంతో సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత ఉంటుందని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తున్నామని, ఆగస్ట్ నెలకు సంబంధించి మీ సేవ కేంద్రాల నుంచి రసీదులు సమర్పిస్తే చాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ పేర్కొన్నారు. -
రేషన్ సరుకులు కొన్నా, అమ్మినా కేసు!
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి నిరుపేదలకు అంది స్తున్న బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడం క్షమించరాని నేరమన్నారు. రేషన్ బియ్యం కొన్నా, అమ్మినా నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర అధికారులతో తన అధికారిక నివాసంలో ఆయన ఈ అంశంపై చర్చించారు. రేషన్ కాజేసేందుకు పెద్ద రాకెట్ నడుస్తోందన్నారు. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, బోగస్ కార్డులు ఏరివేయడం సహా ఇతర చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం సూచించారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: రజత్‌కుమార్ నిత్యావసర సరుకుల్లో జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. రేషన్ అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వారిపై పీడీ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
పేదల బియ్యం.. దళారులకు వరం
జిల్లా నుంచి వేల క్వింటాళ్లు అక్రమంగా తరలింపు కాకినాడ పోర్టు ద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా నిఘా ఉన్నా ఆగని అక్రమార్కులు విజిలెన్స్ దాడుల్లో దొరికేది స్వల్పమే.. ! విజయవాడ : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడితప్పింది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గత నెల 1 నుంచి ఈ నెల 15వ తేదీ మధ్య అక్రమంగా తరలిస్తున్న 1,204 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. కొందరు దళారీలు రేషన్ బియ్యాన్ని కిలో ఆరు రూపాయల చొప్పున డీలర్ల నుంచి కొనుగోలుచేస్తున్నారు. వాటిని పాలిష్ చేసి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర కలిగిన బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. కొందరు వందలాది క్వింటాళ్లను పోగుచేసి కాకినాడ పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. డీలర్లకు పెట్టుబడి పెడుతున్న ‘దొంగ’ వ్యాపారులు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు కొందరు దొంగ వ్యాపారులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ముందుగానే రేషన్ డీలర్లకు పెట్టుబడి పెడుతున్నారు. విజయవాడ నగరంలో ఇటువంటి వ్యాపారులు పది మంది వరకూ ఉన్నారు. వీరు పటమట, కృష్ణలంక, భగత్‌సింగ్‌నగర్, వించిపేట, కొత్తపేట, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో ఉంటున్నట్లు విజిలెన్స్ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. వీరు దళారుల సాయంతో డీలర్ల నుంచి పోగుచేసిన బియ్యాన్ని లారీలు, ప్యాసింజర్ రైళ్లలో ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాల సిబ్బందికి కూడా మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీ డ్రైవర్లు చాకచక్యంగా జిల్లాలోని చెక్‌పోస్టులు దాటించేందుకు క్వింటాకు రూ.7.50 చొప్పున ప్రత్యేకంగా చెల్లిస్తారు. కాకినాడ పోర్టుకు చేరిస్తే క్వింటాకు రూ.15లు ఇస్తున్నట్లు విజిలెన్స్ దాడుల్లో స్పష్టమైంది. భారీగా బ్లాక్‌మార్కెట్‌కు... జిల్లాలో సాధారణ తెల్లకార్డులు 10,83,413 ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన కార్డులు 70,153, అన్నపూర్ణ కార్డులు 636 ఉన్నాయి. అన్నీ కలిపి 11,54,202 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 20,150 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 15వేల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ఇస్తోంది. అయితే భారీగా బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. అధికారులు నిఘా పెట్టినా అక్రమాలు ఆగటం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూనట్లు వ్యవహరించడమే ఇందుకు కారణమే అరోపణలు ఉన్నాయి. -
పేదలకు ఉచిత వైద్యపరీక్షలు
బీపీఎల్లకు వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉచిత మందులు కూడా పీడీఎస్‌లో సంస్కరణల దిశగా న్యూఢిల్లీ: ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్)లో సంస్కరణలు చేపట్టి, పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న పేదలకు స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వాలని యోచిస్తోంది. అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారిని, ఉన్నతాధికారులను పీడీఎస్ పరిధి నుంచి మినహాయించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ‘సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీఎల్ కేటగిరీలో ఉన్నవారికి రేషన్ కార్డుల ఆధారంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు, మందులు ఇవ్వాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి’ అని ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పీటీఐకి చెప్పారు. పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పథకంపై రాష్ట్రాలను సంప్రదిస్తామన్నారు. . ఆహార భద్రత చట్టంపై చిన్నచూపు లేదు గత యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆహార భద్రత చట్టంపై మోదీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందని వస్తున్న ఆరోపణలను మంత్రి పాశ్వాన్ తోసిపుచ్చారు. ఆ చట్టం అమలుకు తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ‘ప్రస్తుతం ఈ చట్టాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అందులో హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాయి’ అని తెలిపారు.