శనివారం క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి,ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్
♦ ఒకే చోట పౌరులకు సంబంధించిన సమస్త సమాచారం
♦ సమగ్ర పౌర సమాచార కేంద్రంపై సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సరుకులు పక్కదారి పట్టడం వంటి అవలక్షణాలను రూపుమాపేందుకు సమగ్ర పౌర సమాచార నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కూడా ఈ అప్లికేషన్‌ను వినియోగిస్తే దుర్వినియోగమైపోతున్న కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, దుర్ఘటనలు సంభవించినప్పుడు టెక్నాలజీ ఉపయోగం ఎంతో ఉంటుందన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే సుపరిపాలన ఎంతో కీలకమని, ఇందు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త కొత్త యాప్‌లను వినియోగంలోకి తేవడం సరైందని ముఖ్యమంత్రి అన్నారు.
సమగ్ర పౌర సమాచార నిధి కేంద్రం ఏర్పాటుపై శనివారం అధికారిక నివాసంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పౌరులకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసి అవసరమైన క్లిష్ట సమయాల్లో విశ్లేషించగల ఈ అప్లికేషన్‌ను ప్రభుత్వం రూపొందించనుంది. ఇప్పటికే ఈ యాప్‌ను వాణిజ్య పన్నుల శాఖలో పన్ను ఎగవేతదారులను పట్టుకోవడానికి ప్రయోగాత్మకంగా అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయని యాప్ తయారీదారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ యాప్‌ను పోలీసు శాఖ, శాంతి భద్రతల అంశానికే పరిమితం చేయకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు, శాఖలకు విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమను గమనిస్తున్నారనే ధ్యాస ఉద్యోగి సహా ప్రతీ పౌరునికి ఉండడం వల్ల తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు వీలుంటుందని, అందుకు ఈ యాప్ దోహదపడుతుందని చెప్పారు.
విరివిగా వినియోగించాలి..: ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాలనలో సాంకేతికతను, వినూత్న యాప్‌లను విరివిగా వినియోగించుకోవాలని సూచిం చారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు గురించి మీడియా తదితర సాంకేతిక మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. సమయం వృథా కాకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మంత్రులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.
ప్రజల కోసం ప్రభుత్వాలు అమలు చేసే నూతన విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉండడమే కాకుండా వారిని భాగస్వాములు చేసే విధంగా ఉండాలని, అప్పుడే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోలేని గత ప్రభుత్వాలు ‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్’ అన్న పద్ధతిలో పరిపాలన చేశాయని కేసీఆర్ విమర్శించారు. ప్రభుత్వ విభాగాల పనితీరులో పారదర్శకత లేని అస్తవ్యస్త పాలనను అందించాయని, సాంకేతికతను జోడించి సుపరిపాలన అందించాలనే చిత్తశుద్ధి లోపించడమే దీనికి కారణమని చెప్పారు. ఈ సమావేశంలో మీ సేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు, పోలీసు ఉన్నతాధికారి నాగిరెడ్డి, ఐటీ విభాగం నిపుణులు శ్రీధర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.