రేషన్ సరుకులు కొన్నా, అమ్మినా కేసు!
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి నిరుపేదలకు అంది స్తున్న బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడం క్షమించరాని నేరమన్నారు. రేషన్ బియ్యం కొన్నా, అమ్మినా నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర అధికారులతో తన అధికారిక నివాసంలో ఆయన ఈ అంశంపై చర్చించారు. రేషన్ కాజేసేందుకు పెద్ద రాకెట్ నడుస్తోందన్నారు. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, బోగస్ కార్డులు ఏరివేయడం సహా ఇతర చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం సూచించారు.
అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: రజత్‌కుమార్
నిత్యావసర సరుకుల్లో జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. రేషన్ అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వారిపై పీడీ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.