Ration of rice
-
620 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం
మహబూబ్‌నగర్: జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన దాడుల్లో పెద్దఎత్తున రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. లబ్దిదారులకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయనే సమచారంతో రగంలోకి దిగిన అధికారులు మండల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 620 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ లారీ, బొలెరో వాహానాలను సీజ్ చేశారు. -
రేషన్ బియ్యం తిననివారు తీసుకోకండి!
⇒ లబ్ధిదారులు ఇతరులకు బియ్యం అమ్మడం నేరం ⇒ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: ‘రేషన్ బియ్యం తిననివారు తీసుకోకండి. ఈ బియ్యాన్ని లబ్ధిదారులు ఇతరులకు అమ్మడం నేరం. ప్రజా పంపిణీ ద్వారా ప్రజల కోసం రూ.6,500, కోట్లను ఖర్చు చేస్తున్న సంస్థ ఇది. పారదర్శకంగా సరుకుల సరఫరాకు కమిషనర్ సి.వి. ఆనంద్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. ఈ శాఖలో మార్పులకు సహకరిస్తున్న ఉద్యోగులకు అభినందనలు’ అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్టకు పౌరసరఫరాలశాఖ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను సోమాజిగూడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసింది. మంగళవారం మంత్రి ఈటల ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. బియ్యం తీసుకోకపోతే కార్డు తిరిగివ్వా లని కోరుతున్నానని ఈటల అన్నారు. సంక్షేమ ఫలాలు పక్కదారి పట్టకుం డా కమాండ్ కంట్రోల్ చేపట్టడం అభినందనీయమని సీఎస్ అన్నారు. త్వరలో అన్ని రేషన్ షాపుల్లో ఈ పాస్: త్వరలో అన్ని రేషన్ షాపుల్లో ఈ పాస్ అమలు చేస్తామని, అన్నీ గోడౌన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సివిల్ సప్లైస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చెప్పారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం పనితీరు గురించి, శాఖలో చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. రైస్ మిల్లర్స్ నుంచి బకాయిల వసూళ్లు, గన్నీ బ్యాగుల రిటర్న్, సకాలంలో బియ్యం అందించడం వంటి చర్యలు చేపట్టామని.. దీనివల్ల రూ. 600 కోట్ల లాభం చేకూరిందని చెప్పారు. -
కదిలిన అధికార గణం..
- రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై విస్తృతంగా సోదాలు - ఆదిలాబాద్‌లో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు - మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు.. పలుచోట్ల బియ్యం పట్టివేత - రాష్ట్రవ్యాప్తంగా దందాకు చెక్ పెట్టేందుకు విజిలెన్స్ సన్నద్ధం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘లారీ.. లారీ.. నడుమ దళారీ’ కథనం పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ వర్గాల్లో కదలికతెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ పట్టణాల్లోని పలుచోట్ల సోదాలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సహాయ సరఫరాల అధికారి(ఏఎస్వో) జితేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మహారాష్ట్ర సరిహద్దుల్లోని అంతర్గావ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. జన్నారం మండలం ఇందన్పల్లి వద్ద పోలీసులు బియ్యాన్ని తరలిస్తున్న ఓ ఆటోను సీజ్ చేశారు. మంచిర్యాలలోని ఎన్టీఆర్ కాలనీలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 10.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లకూ రేషన్ బియ్యమే రేషన్ బియ్యం హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లకు కూడా తరలుతోంది. హోటళ్లు, హాస్టళ్లలో బియ్యం పిండితో చేసే దోశ, రొట్టెలు, ఇతర వంటకాలకు ఈ బియ్యాన్నే వాడుతున్నారు. లబ్ధిదారుల నుంచి కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు చేస్తున్న దళారులు దీన్ని ప్రైవేటు వ్యాపారులకు రూ.15కు విక్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా కొనసాగుతున్నా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. నిఘా వర్గాలు చెబుతున్న మేరకు... ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఏటా 6 వేల నుంచి 10 వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. దాని విలువ సుమారు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఉంటుంద ని పేర్కొంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దందాను కలుపుకుంటే దాని విలువ రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అక్రమాల్లో డీలర్ల పాత్రే ఎక్కువగా ఉండటంతో ఇటీవల జంట నగరాల పరిధిలో విసృ్తత తనిఖీలు చేశారు. ఇందులో ఒక్క రంగారెడ్డిలోనే 6(ఏ) కింద 400 కేసులు, మరో 90 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో పౌర సరఫరాల శాఖ ద్వారా గోధుమలను మాత్రమే సరఫరా చేస్తున్నారు. రాయితీ బియ్యం ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాపారులు ఇక్కడి రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి, భోరజ్ చెక్‌పోస్టుల నుంచి, నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్ సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అలాగే మహబూబ్‌నగర్ నుంచి రాయచూర్ మీదుగా కర్ణాటకకు, నల్లగొండ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ దందాపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. మొత్తం ఆన్లైన్ చేస్తాం రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను సమకూర్చుతాం. దీంతోపాటు ‘సరఫరా వ్యవస్థ నిర్వహణ’ (సప్లై చైన్ మేనేజ్మెంట్)ను అమలు చేస్తాం. సరకుల సరఫరా మొదలు పంపిణీ వరకు మొత్తం ఆన్లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపడతాం. రాష్ట్రంలోని 172 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. జీపీఎస్ వ్యవస్థ ద్వారా అక్రమ రవాణాను అరికడతాం. - సీవీ ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
విజిలెన్స్‌కు చిక్కిన రేషన్ దొంగలు
రేషన్ గోధుమలు, బియ్యం పట్టివేత ఇద్దరిపై క్రిమినల్ కేసు సిరిసిల్ల టౌన్ : రేషన్ బియ్యం, సబ్సిడీ గోధుమలు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న ఇద ్దరు విజి‘లెన్స్’కు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు గురువారం పట్టణంలో ఆకస్మిక దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఎసై రాజేశం తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లకు చెందిన వంగరి గోపి, నగునూరి శ్రీకాంత్ అక్రమంగా రేషన్ బియ్యం, గోధుమలు కొని వాటిని బ్లాక్మార్కెట్లో ఎక్కువగా అమ్ముకుంటారు. ఈవిషయంపై స్థానికులు రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారి వెంకటరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై రాజేశం తన సిబ్బందితో నిందితుల దుకాణాలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వంగరి గోపి వద్ద 12 క్వింటాళ్ల బియ్యం, 30 క్వింటాళ్ల గోధుమలు, శ్రీకాంత్ వద్ద 10 క్వింటాళ్ల బియ్యం, 30 క్వింటాళ్ల గోధుమలు దొరికాయి. ఈ సరుకులను ఇద్దరూ ఇతర ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌తోపాటు విజిలెన్స్ కానిస్టేబుళ్లు రవీందర్, రాజయ్య ఉన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
► అక్రమంగా తరలిస్తున్న 126 బస్తాల బియ్యం స్వాధీనం ఎమ్మిగనూరురూరల్: ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఆదివారం సాయంత్రం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ 21 టీయూ 2619, ఏపీ 21 టీఎక్స్ 2149 నంబర్ గల రెండు బొలెరో జీపులను పట్టణంలోని అన్నమయ్య సర్కిల్ దగ్గర విజిలెన్స్ కానిస్టేబుల్ మధు తనిఖీ చేశారు. వాటిలో 126 బస్తాలలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా వాటిని తరలిస్తుండడంతో జిల్లా విజిలెన్స్ అధికారులకు కానిస్టేబుల్ సమాచారం అందించారు. వెంటనే కర్నూలు నుంచి విజిలెన్స్ సీఐ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ తహసీల్దార్ రామకృష్ణ ఆదోనికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ ఆదోని నుంచి పట్టణంలో ముగతి రోడ్డులో ఉండే లక్ష్మీనరసింహ స్వామి రైస్ మిల్లుకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు చెప్పారు. పట్టుకున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించామని తెలిపారు. ఈ బియ్యం ఏ రేషన్ షాప్ నుంచి వచ్చాయి.. ఎన్ని రోజులుగా ఈ తతంగం సాగుతోంది అనే విషయంపై విచారణ చేపట్టినట్లు చెప్పారు. విజిలెన్స్ అధికారులతో పాటు సీఎస్‌డీటీ మల్లేష్, వీఆర్వో స్నేహలత, కానిస్టేబుల్ శేఖర్ తదితరులు ఉన్నారు. -
రేషన్ సరుకులు కొన్నా, అమ్మినా కేసు!
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి నిరుపేదలకు అంది స్తున్న బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడం క్షమించరాని నేరమన్నారు. రేషన్ బియ్యం కొన్నా, అమ్మినా నిత్యావసర సరుకుల చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర అధికారులతో తన అధికారిక నివాసంలో ఆయన ఈ అంశంపై చర్చించారు. రేషన్ కాజేసేందుకు పెద్ద రాకెట్ నడుస్తోందన్నారు. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం, బోగస్ కార్డులు ఏరివేయడం సహా ఇతర చర్యలపై ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం సూచించారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: రజత్‌కుమార్ నిత్యావసర సరుకుల్లో జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. రేషన్ అక్రమాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, దీనికి బాధ్యులైన వారిపై పీడీ యాక్టు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
తూప్రాన్ : అక్రమంగా అటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఆదివారం మండలంలోని పోతరాజుపల్లి చౌరస్తా వద్ద వేలురు గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి అక్రమంగా ఎనిమిది క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నాడు. సదరు వ్యాపారి ఆటోలో బియ్యం తరలిస్తుండగా పోతరాజుపల్లి కమాన్ వద్ద పోలీసులు పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వీటి ధర సుమారు రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. దీంతో బియ్యం తహశీల్దార్ కార్యాలయంలో వేసి ఆటోను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపట్టి రేషన్ బియ్యం విక్రయించిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప‘రేషన్’
దుకాణాలకు చేరని రేషన్ బియ్యం! కర్నూలు: పౌర సరఫరాల శాఖకు ఈ-పాస్ అమలు కుదిపేస్తోంది. రేషన్ కోటా తీసుకెళ్లేది లేదని డీలర్లు మొండికేస్తుండగా.. నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 10 శాతం సరుకు మాత్రమే చౌకధరల దుకాణాలకు చేరింది. అది కూడా ఈ-పాస్ యంత్రాలు లేని దుకాణాలకు సరుకు చేర్చిన అధికారులు అంతా సవ్యంగానే ఉన్నట్లు చాటుకుంటున్నారు. మరోవైపు భారత ఆహారసంస్థ(ఎఫ్‌సీఐ) గోదాముల నుంచి తూకాలు వేసి నేరుగా చౌక డిపోలకు బియ్యం సరఫరా చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయంతో హమాలీలు ఆందోళన చేపట్టారు. దీంతో మధ్యాహ్నం వరకూ గోదాములకు తాళాలు పడ్డాయి. చివరకు ఆందోళన కొలిక్కి వచ్చినప్పటికీ సరుకు తీసుకునేందుకు డీలర్లు జిల్లాలో లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. చౌక డిపోల్లో ఈ-పాసు యంత్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ చౌక డిపో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నుంచి భారీ ఎత్తున డీలర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సోమాజీగూడలోని సివిల్ సప్లయ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఫలితంగా ఏప్రిల్ నెల సరుకులు కాస్తా సకాలంలో వినియోగదారులకు అందే పరిస్థితి కరువైంది. సాంకేతిక ఇబ్బందులు గోదాముల నుంచి చౌక దుకాణాలకు సరుకుల తరలింపు, అనంతరం కార్డుదారులకు సరఫరా మొత్తం ఈ-పాసు యంత్రాల ద్వారా తూకాలు వేసి పంపిణీ జరగాల్సి ఉంది. అయితే గోదాముల వద్ద ఒక్కో ప్యాకెట్ 50 కిలోల 650 గ్రాములు లెక్కకట్టి ఇవ్వాల్సి ఉండగా కేవలం 48 కిలోలు మాత్రమే ఇస్తుండటంతో డీలర్లు బియ్యం తీసుకుపోవడానికి ముందుకు రాని పరిస్థితి. తమకు సరైన తూకంలో సరుకులు ఇస్తేనే ఈ-పాస్ అమలుకు ఒప్పుకుంటామని డీలర్లు మొండికేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఈ-పాస్ అమలు చేయాలంటే 3జీ సిమ్ అవసరం ఉంది. అయితే, జిల్లాలో అనేకచోట్ల నెట్వర్క్ లేకపోవడంతో త్రీజీ సిమ్ పనిచేసే అవకాశం లేదు. అంతేకాకుండా కర్నూలు పట్టణంలోని ఓల్డ్‌సిటీలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ-పాస్ అమలుకు ఇచ్చిన ఐడియా సిమ్‌లు పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోడౌన్ వద్ద హమాలీల ఆందోళన వేయింగ్ మిషన్ ద్వారా బియ్యం లారీని తూకం వేసి ఇవ్వాలని డీలర్లు పట్టుబట్టడంతో ఖాళీ లారీని కాటా వేసి లోడు లారీతో మరోసారి కాటా వేయడానికి ఎక్కువ సమయం పడుతున్నందున ట్రక్కు డ్రైవర్లు అందుకు నిరాకరించారు. దీంతో ఎఫ్‌సీఐ గోడౌన్ వద్దే లోడు చేసిన లారీని వేయింగ్ మిషన్‌లో కాటా వేసేలా పౌర సరఫరాల శాఖ అధికారులు ట్రక్కు డ్రైవర్లను ఒప్పించారు. అయితే అందువల్ల తాము ఉపాధి కోల్పోతామంటూ మండల స్టాక్ పాయింట్ వద్ద పనిచేస్తున్న హమాలీలు మంగళవారం ఆందోళనకు దిగారు. బియ్యం లోడుతో సరుకులు బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసి ఆందోళనకు దిగడంతో డీఎస్ఓ ప్రభాకర్‌రావు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేష్‌తో పాటు ఇతర అధికారులు గోదాము వద్దకు చేరుకుని హమాలీలతో చర్చలు జరిపారు. గోదాములో ఉన్న నిల్వలన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచే సరుకులు రవాణా చేయాలన్న ఒప్పందంతో ఆందోళన విరమించారు. హమాలీల ఆందోళనతో మధ్యాహ్నం వరకు సరుకు రవాణా స్తంభించింది. తర్వాత హమాలీలు ఆందోళన విరిమించినప్పటికీ కోటాను తీసుకునేందుకు డీలర్లు మాత్రం ముందుకు రాలేదు. -
పేదల పొట్టలు కొట్టి..రూ. కోట్లు ఆర్జన !
అధికార పార్టీ అండ ఉంటే ఎంతటి అక్రమమైనా సునాయాసంగా సాగిపోతుందనడానికి రేషన్ బియ్యం మాఫియా ఆగడాలే నిదర్శనం. చిలకలూరిపేట నియోజకవర్గం, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో యథేచ్ఛగా సాగిపోతున్న అక్రమబియ్యం వ్యాపారానికి అధికారపార్టీ నేతల అండదండలు, కాసులకు కక్కుర్తిపడిన అధికారుల సహకారం అనుకూలంగా మారింది. చిలకలూరిపేట : పేదల బియ్యం అమ్ముకుంటున్న రేషన్ మాఫియా రూ. కోట్లు గడిస్తోంది. డీలర్ల నుంచి కిలో తొమ్మిది రూపాయల వంతున బియ్యం కొనుగోలు చేసి, ఆ తరువాత పాలిష్ పట్టించి రూ. 21 వంతున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వినుకొండకు చెందిన ఓ వ్యాపారి, చిలకలూరిపేట నియోజకవర్గంలో ముగ్గురు వ్యాపారులు, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఈ వ్యాపారంలో సిద్ధహస్తులని పేరుంది. నెలలో మూడో తేదీ నుంచి 20 వరకు ప్రకాశం జిల్లా కోనంకి, ఉప్పుమాగులూరు, చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం, యడవల్లి, మిట్టపాలెం, ఈవూరివారిపాలెం గ్రామాలకు సంబంధించి నాదెండ్లలోని వినాయకుని గుడి సమీపంలో, యడ్లపాడులో జాలాది బ్రిడ్జి, కారుచోల, పట్టణంలోని బాలాజీ థియేటర్ సెంటర్, చెరువుకు వెళ్లేదారిలో రాత్రి 11 గంటల నుంచి రెండు గంటల వరకు లోడింగ్ చేస్తుంటారు. రెండు గంటల తర్వాత బియ్యం లారీలు రోడ్డుపైకి వచ్చేలా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి గుంటూరు, విజయవాడ, గన్నవరం మీదుగా తాడేపల్లిగూడెం, మండపేటలోని మిల్లులకు రీసైక్లింగ్ కోసం తరలిస్తారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి నెలకు 30 లారీలు, ప్రకాశం జిల్లా నుంచి మరో 30 లారీలు తరలి వెళ్తుంటాయి. లారీకి 170 క్వింటాళ్ల చొప్పున బియ్యం లోడ్ చేస్తారు. ఇలా కోట్ల రూపాయలు అక్రమవ్యాపారుల జేబుల్లోకి చేరుకుంటున్నాయి. అధికారులకు నజరానా ... లారీలు లోడ్ చేస్తున్న సమయంలో బీటు పోలీసులు, హోంగార్డులు కనబడితే వెయ్యి నుంచి ఐదు వేల వరకు అందజేస్తారు. ఈ మొత్తాల కోసమే రాత్రి బీటు చేయటానికి కొంతమంది పోలీసులు పోటీపడుతున్నారు. రోడ్డు మీదకు చేరుకోవటానికి చెక్‌పోస్టు వారికి లారీకి రూ. వెయ్యి అందిస్తారు. టోల్‌ప్లాజా వద్ద నుంచి గన్నవరం వరకు తరలిపోవటానికి లారీ ఒక్కింటికి రూ. 1500 చొప్పున సేల్స్‌ట్యాక్స్ అధికారికి అందజేస్తుంటారు. గతంలో గుంటూరులో విధులు నిర్వహించి ప్రస్తుతం కావలిలో పనిచేస్తున్న వాణిజ్యపన్నుల అధికారి ఒకరు ఫోన్ల ద్వారా తమ శాఖ అధికారులకు సూచనలు అందజేస్తుంటారని తెలిసింది. నాదెండ్ల మండలం నుంచి లారీలు బయటకు రావటానికి ఓ అధికారికి 50 వేలు, పట్టణ, రూరల్ పరిధి నుంచి బయటపడటానికి మరో అధికారికి లక్ష రూపాయలు ముట్టజెప్తున్నట్లు సమాచారం. వీటితో పాటు పట్టణానికి చెందిన అధికార పార్టీ యువ నాయకుడికి ప్రతి నెలా, ప్రతి వ్యాపారి లక్ష రూపాయలు అందజేయాల్సి ఉంటుందని సమాచారం. పెద్దలపై చర్యలేవీ....? పోలీసు ఉన్నతాధికారులకు అందే సమాచారం మేరకు స్థానిక అధికారులు అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో లారీడ్రైవర్లను మాత్రమే అరెస్టు చేసి బియ్యం వ్యాపారులను వదిలివేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 22 తెల్లవారు జామున పట్టణంలోని సింగ్‌నగర్‌లో ఆరుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని మాత్రమే అరెస్టు చేశారు. అసలు వ్యాపారం చేసేవారిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఎఫ్ఐఆర్లో అందరు నిందితుల వివరాలు పొందుపరిచిన పోలీసులు ఆ ఇద్దరి పేర్లకు సంబంధించి కనీసం ఇంటిపేర్లు, వయస్సు, తండ్రిపేర్లు పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద స్వాధీనం చేసుకున్న నాలుగు లారీల అక్రమ రేషన్ బియ్యం కేసులో కూడా సూత్రధారులను అరెస్టు చేయలేదు. గతంలో వినుకొండకు చెందిన బియ్యం వ్యాపారి బెయిల్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాక తీరికగా అరెస్టు చేశారు. దీనిని బట్టి ఇక్కడ అధికారులు అక్రమార్కులకు ఎంతగా సహకారమందిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. -
కోటా బియ్యానికి కోటింగ్!
సన్న బియ్యం పేరుతో కోటా బియ్యం విక్రయాలు దండిగా లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు కన్నెత్తి చూడని పౌరసరఫరాల శాఖ నక్కపల్లి/ నక్కపల్లి రూరల్ : మిల్లర్లకు కాలం కలిసొచ్చింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ఈ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ట్రేడింగ్ మిల్లుల్లో తక్కువ ధరకు సన్నబియ్యం విక్రయించవచ్చన్న ఆదేశం మిల్లర్లను మరిన్ని అక్రమాలకు పురిగొల్పినట్టయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యంలో రేషన్ బియ్యం కలిపేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల హుద్‌హుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం ఉచితంగా 25, 50కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసింది. జిల్లావ్యాప్తంగా వేలాది టన్నుల కోటాబియ్యం పంపిణీ జరిగింది. ఈ బియ్యాన్ని కార్డుహోల్డర్ల నుంచి కొంతమంది అక్రమవ్యాపారులు, రైసుమిల్లర్లు కొనుగోలు చేశారు. ఇవే బియ్యాన్ని రీ సైక్లింగ్‌తో సన్నబియ్యం, సాంబమసూరు, సోనామసూరు, ఆర్జీఎల్ తదితర రకాలపేరుతో సంచులు మార్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రేడింగ్ మిల్లుల నుంచి లెవీ తగ్గించి రు.30లకే సన్న అమ్మాలనే ప్రభుత్వ ఆదేశాలతో మిల్లర్లు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. సన్నబియ్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి మా ర్కెట్లో సాధారణ బియ్యం మాదిరిగా విక్రయిస్తున్న మిల్లర్లకు సన్నబియ్యం అమ్మకాలు చేయమన్న ప్రభుత్వ ఆదేశాలు కొండంత అండనిస్తున్నాయి. ప్రస్తుతం నాణ్యమైన సాంబమసూరి, సోనామసూరి, బీపీటీ సన్నాల బియ్యం ధరలు మార్కెట్లో క్వింటా రు.4వేల వరకు అమ్ముతున్నారు. మిల్లర్లు రైతుల వద్ద సాంబమసూరి, ఆర్జీఎల్ తదితర రకాల 75కిలోల బస్తారూ.1400నుంచి 1500లకు కొనుగోలుచేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా సేకరించిన బియ్యాన్ని సన్నబియ్యంతో కలిపి విక్రయించడంతో మిల్లర్లకు దండిగా లాభాలు వస్తున్నాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రూ. 30లకే సన్నబియ్యం సాధ్యమేనా... మిల్లర్లు, వ్యాపారస్తులు రైతుల నుంచి సాంబమసూరి, సోనామసూరి ఆర్జీఎల్ తదితర ధాన్యం రకాలను 75 కేజీల బస్తాను రు.1500ల వరకు కొనుగోలుచేస్తున్నారు. సన్నబియ్యం రకాల దిగుబడి ట్రేడింగ్ మిల్లుల్లో 150 కేజీల ధాన్యంకు 85 నుంచి 90 కేజీల వరకు బియ్యం దిగుబడి ఉంటోంది. క్వింటాలు సన్నబియ్యం ఉత్పత్తికి మిల్లర్లకు, వ్యాపారస్తులకు రు.3500ల నుంచి4వేలు వరకు (కొనుగోలు, మిల్లింగ్‌కు కలిపి) ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యాపారస్తులు, మిల్లర్లు కేజీ రు.30లకే (క్వింటా రు.3వేలు) సన్నబియ్యం అమ్మకాలు ఏవిధంగా చేస్తున్నారన్న ప్రశ్నలకు రేషన్ బియ్యమే సమాధానమిస్తున్నాయన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యంలో కల్తీ ఏవిధంగా అంటే.... సన్నబియ్యం ధాన్యం రకాలను 6బస్తాలను మిల్లింగ్‌చేసి ఒక లేయర్ (గీటర్) తొలగిస్తారు. ఈ బియ్యాన్ని ఒక నెట్టెగా వేసి 5రోజులపాటు నిల్వ ఉంచుతారు. కొద్దిగా ముక్కిన తర్వాత ఒక రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కలిపి మళ్లీ మిల్లింగ్ చేసి పాలిష్పెడతారు. ఈ విధంగా పాలిష్‌చేసిన బియ్యాన్ని సన్నబియ్యంగా అమ్మకానికి ఉంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పరోక్షంగా రేషన్ బియ్యాన్నే సన్నబియ్యంగా ప్రజలచే కొనుగోలుచేయిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యవేక్షణ లేదు... సన్నబియ్యం అమ్మకాలు ప్రారంభించిన అధికారులు పర్యవేక్షణ విషయాన్ని పక్కనబెట్టారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు ఏ బియ్యాన్ని అమ్ముతున్నారన్న విషయమై తనిఖీలు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం మిల్లర్లు అమ్ముతున్న సన్నబియ్యం రకాలను తేమ, నూకల శాతం పరీక్షించినట్టయితే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పౌర సరఫరా శాఖ అధికారులు, రెవిన్యూ పర్యవేక్షణలో మిల్లింగ్‌చేసి సన్నబియ్యాన్ని విక్రయించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం జరిగే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాన్ట్రేడి ంగ్ మిల్లుల్లో ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు. 500కు పైగా రైసు మిల్లులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నాన్‌ట్రేడింగ్ మిల్లులే. ఈ మిల్లుల్లో కేవలం రైతువారీ ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలి. వీటిలోచాలా చోట్ల ట్రేడింగ్ (మిల్లింగ్, విక్రయాలు) జరుగుతున్నా పౌరసరఫరా శాఖ అధికారులు పట్టించుకోకపోవడవం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా మిల్లర్ల నుంచి లక్షలాది రూపాయల మామూళ్లు అందడంవల్లే అధికారులు ఈ అక్రమాలపై కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. -
గోదాం
దారి మళ్లుతున్న రేషన్‌బియ్యం తంగడపల్లిలో లారీని తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు 213 క్వింటాళ్ల బియ్యానికి ఉన్నది 176 క్వింటాళ్లే.. రేషన్ బియ్యం గోదాములనుంచే పక్కదారి పడుతుందని చెప్పడానికి బలం చేకూర్చే ఘటన చౌటుప్పల్ మండలం తంగడపల్లిలో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో సోమవారం వెలుగుచూసింది. కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్‌చార్జ్‌లు, రేషన్‌డీలర్లు కలిసి గోదాముల నుంచే లారీల బియ్యాన్ని మాయం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చౌటుప్పల్ రేషన్ బియ్యం సరఫరా చేసే కాంట్రాక్టర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్‌చార్జ్‌లు, రేషన్ డీలర్లు కుమ్మక్కై ఐఎంజీ గోదాముల నుంచే లారీలకొద్దీ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల నుంచి రాత్రి పూట వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అమ్ముకునే వారు. ఇటీవలి కాలంలో అంతా కుమ్మక్కై గోదాముల నుంచే కాంట్రాక్టర్లే పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వైనంపై గత నెల 25న ‘లారీల కొద్దీ పక్కదారి’ అనే శీర్షికన కథనం ప్రచురించాం. అధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో గోదాం నుంచి బియ్యం పక్కదారి పడుతున్న వైనాన్ని ప్రత్యక్షంగా వెలుగులోకి తెచ్చేందుకు సోమవారం సాక్షి, సాక్షి టీవీ రంగంలోకి దిగింది. బియ్యాన్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారో బట్టబయలైంది. చౌటుప్పల్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఏపీ16టీటీ 4921అనే నంబరు గల లారీ 213.67క్వింటాళ్ల బియ్యం, 8క్వింటాళ్ల చక్కెరతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరింది. సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి, రాధానగర్‌తండా, మర్రిబావింతండాల్లోని రేషన్ దుకాణాలకు సరఫరా చేయాలి. గోదాంలోనే 45క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తగ్గించి, సంస్థాన్ నారాయణపురం మండలానికి లారీ వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు గోదాం నుంచే వెంబడించింది. సుమారు 2కి.మీ.ల దూరం వెళ్లాక తంగడపల్లిలో లారీని ఆపి, పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులకు సమాచారమివ్వడంతో, అధికారులు వచ్చి లారీలోని బియ్యాన్ని లెక్కించారు. 427బస్తాలకు గానూ 353బస్తాలే ఉన్నాయి. 74బస్తాలు అనగా, 37.17క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్టు అధికాారులు గుర్తించారు. పంచనామా నిర్వహించారు. కాంట్రాక్టర్‌పై, ఐఎంజీ గోదాం ఇన్చార్జ్పై చర్య తీసుకోమని జాయింట్ కలెక్టర్‌కు నివేదించనున్నట్టు డివిజనల్ విజిలెన్స్ ఇన్చార్జ్ అధికారి ఉదయ్‌కుమార్, డీటీసీఎస్ ఎల్లేశం, ఆర్ఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. రెండు దుకాణాలకు చెందిన బియ్యమే పంపా : మాధవిలత, గోదాం ఇన్చార్జి రాధానగర్ తండా, వావిళ్లపల్లి గ్రామాలకు చెందిన రెండు రేషన్ దుకాణాలకు సంబంధించిన 166.11క్వింటాళ్ల బియ్యాన్ని మాత్రమే పంపా. మర్రిబావితండాకు సంబంధించి పంపలేదు. నేను రికార్డులు రాసుకుంటూ పనిలో ఉన్నా. హామాలీలు ఎన్ని బస్తాలు వేసుకెళ్లారో తెలియదు. జేసీకి నివేదించా గోదాం ఇన్చార్జి, లారీడ్రైవర్ కుమ్మక్కై బియ్యాన్ని పక్కదారి పటించినట్టు అవగతమవుతోంది. ఇద్దరూ కలిసి రెండు రేషన్ దుకాణాలకు చెందిన బియ్యమేనని వాంగ్మూలమిచ్చారు. రెండు దుకాణాలకు చెందిన బియ్యమే అయితే 166.11క్వింటాళ్లుండాలి. కానీ లారీలో 176క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించాం. వారు చెప్పినట్టు 10క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా ఉండడానికి కూడా వీల్లేదు. ఇదే విషయాన్ని జేసీకి మెసేంజర్ ద్వారా సోమవారం రాత్రే నివేదించా. - ఉదయ్‌కుమార్, సివిల్సప్లై విజిలెన్స్ డివిజన్ ఇన్చార్జ్, భువనగిరి -
ఇక కార్డుల కోత!
వచ్చే నెల 15 తర్వాత సర్వే పింఛన్ల గుర్తింపు తరహాలోనే ప్రక్రియ రాజకీయ జోక్యంపై ప్రజాసంఘాల ప్రతినిధుల ఆందోళన జనవరిలో కొత్త కార్డుల పంపిణీకి కసరత్తు విజయవాడ : ఆధార్ సీడింగ్ పేరుతో ఇప్పటికే లక్షలాది మంది పేదలకు రెండు నెలలుగా రేషన్ బియ్యంలో కోత విధిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏదో ఒక కారణం చూపి కార్డులనే తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పింఛన్ల ఏరివేతకు అనుసరించిన విధానంలోనే సర్వే చేపట్టాలని నిర్ణయించింది. డిసెంబరు 15వ తేదీ తర్వాత ఈ సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జన్మభూమి కార్యక్రమం ముగిసిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది. సర్వే అనంతరం బోగస్ కార్డులను తొలగించి, ఆ తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి జనవరి నుంచి కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్వేకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం ఉన్నతాధికారులకు అందించింది. ప్రభుత్వ కసరత్తు ఫలించేనా.. జిల్లాలో 2,150 చౌకధరల దుకాణాలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో తెల్లకార్డులు 10,46,106, ఏఏవై కార్డులు 66,649, అన్నపూర్ణ కార్డులు 466 ఉన్నాయి. గత ఏడాది రచ్చబండలలో 50వేల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమిలో కూడా రేషన్ కార్డుల కోసం భారీగానే దరఖాస్తులు అందుతున్నాయి. దీంతో ఒక్కో కుటుంబానికి నలుగురు చొప్పున లెక్కిస్తే కార్డులకు, జిల్లా జనాభాకు పొంతన ఉండటం లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆధార్ అనుసంధానం వల్ల కొన్ని బోగస్ కార్డులు బయటపడుతున్నప్పటికీ, కొందరు పెద్ద రైతులు, డబ్బు ఉన్నవారు కూడా తెల్లకార్డులు కలిగి ఉన్నట్లు సమాచారం. మరోవైపు అనేకమంది డీలర్లు వేల సంఖ్యలో కార్డులను తమ వద్ద పెట్టుకుని సరకులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న విషయం పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చింది. విజయవాడలో ఏఎస్‌వోల సంతకాలు కూడా ఫోర్జరీ చేసి దొంగ రేషన్ కార్డులు సృష్టించిన ఘనటలు అనేకం ఉన్నాయి. ఇటీవల గుడివాడలో నకిలీ రేషన్ కార్డులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రేషన్ డీలర్ల పాత్ర కూడా ఉందని తేలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బోగస్ కార్డుల ఏరివేతకు సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. పింఛన్ల గుర్తింపు కోసం చేపట్టిన తరహాలోనే సర్వే ప్రక్రియ కొనసాగితే స్థానిక నేతలు ఇష్టానుసారంగా కార్డులు తొలగించే పరిస్థితి ఉంటుంది. కొందరి బోగస్ కార్డులను కొనసాగించే అవకాశముంటుంది. కాబట్టి ప్రభుత్వ కసరత్తు ఫలించేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ జోక్యం లేకుండా అధికారులకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని ప్రజాసంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అందరికీ కొత్త కార్డులు ఇవ్వాలి.. బోగస్ కార్డుల ఏరివేత, కొత్త కార్డుల మంజూరుతోపాటు పాత కార్డుల స్థానంలో అందరికీ కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాత కార్డుల్లో చనిపోయినవారి పేర్లు తొలగించాలని, కొత్తగా ఇంట్లో సభ్యులైన వారి పేర్లు చేర్చాలని సూచిస్తున్నారు. అలా చేసినప్పుడే వాస్తవ లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
‘చౌక’గా సంపాదన
బ్లాక్ మార్కెట్‌కు భారీగా రేషన్ బియ్యం ఎవరి వాటాలు వారికే.. విజిలెన్స్ దాడులు నామమాత్రమే రేషన్‌డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లకు లాభాల పంట మచిలీపట్నం : జిల్లాలోని పేదలకు అందాల్సిన బియ్యానికి రెక్కలొచ్చాయి. కొందరు పెద్దలు గద్దల్లా మారి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు ఇక్కడే ఎఫ్‌సీఐకే మళ్లీ విక్రయిస్తున్నారు. కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వస్తోంది. ఈ అక్రమ తంతు అధికారులకు తెలిసినా మామూళ్లు తీసుకుని నోరుమెదపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 11,23,934 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు కిలో రూపాయి చొప్పున ప్రతి నెలా 13,452 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని 2,300కు పైగా ఉన్న రేషన్ షాపులకు అందజేస్తున్నారు. డీలరుకు కిలోకు 20 పైసలు కమీషన్ చెల్లిస్తారు. రేషన్ డీలర్లు తమకు వచ్చిన బియ్యాన్ని కార్డుదారులందరికీ పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ప్రతి నెల 16వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాలి. డీలర్లు నాలుగు రోజులు ముందుగానే బియ్యం అయిపోయాయంటూ బోర్డు తిప్పేస్తున్నారు. ఒక్కో డీలరు వద్ద కనీసం వంద రేషన్‌కార్డులు బోగస్‌వి ఉంటాయని అంచనా. మరికొన్ని కార్డులను తాకట్టు పెట్టుకుని తమ వద్దే ఉంచుకుంటున్నారు. బోగస్ కార్డులు, తాకట్టు పెట్టిన కార్డులకు బియ్యం ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేస్తున్నారు. మరికొందరు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 4వేల టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి ఇతర దేశాలకు.. జిల్లాలో సేకరించిన రేషన్ బియ్యం కాకినాడలోని ఎగుమతిదారులకు విక్రయిస్తారు. కాకినాడ పోర్టు నుంచి థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. విదేశాలకు ఎగుమతయ్యే రేషన్ బియ్యంలో నూక ఉన్నా పెద్దగా పట్టించుకోరని సమాచారం. కాకినాడకు రేషన్ బియ్యాన్ని పంపటంలో ఇబ్బందులు ఎదురైతే మిల్లర్లు లెవీ బియ్యంగా మళ్లీ ఎఫ్‌సీఐకే ఈ బియ్యాన్ని రూ.26 చొప్పున విక్రయిస్తారు. తహశీల్దార్ కార్యాలయానికి మామూళ్లు ఇలా.. ప్రతి డీలరు తనకు వచ్చిన బియ్యం మొత్తం పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేస్తారు. కానీ, ఎన్ని క్వింటాళ్లు అక్రమంగా తరలించా రనే విషయం తహశీల్దారు కార్యాలయాల్లో పక్కా సమాచారం ఉంటుంది. ఈ మేరకు క్వింటాలుకు రూ.20 చొప్పున మామూళ్లు అందజేస్తారు. దీంతో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అన్ని రికార్డులు సరిగానే ఉన్నాయని నిర్ధారిస్తారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి నెలకొంది. దాడుల్లో దొరికేది నామమాత్రమే.. గత పది రోజులుగా జిల్లావ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. నాలుగు రోజుల క్రితం గూడూరు మండలం తరకటూరులోని ఓ మిల్లులో 191 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మైలవరం బైపాస్‌రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. వేలాది టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నా విజిలెన్స్ దాడుల్లో అతి తక్కువ మొత్తంలోనే దొరకటం గమనార్హం. రేషన్‌షాపుల ద్వారా ఈ-పీడీఎస్ పద్ధతిలో సరుకులు కేటాయిస్తున్నా, డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లు యథేచ్ఛగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించటం గమనార్హం. అక్రమాలు ఇలా... పేదలకు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా మిల్లర్ల నుంచి లెవీ(దాళ్వా) బియ్యాన్ని కిలోకు రూ.26 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఈ విధంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని తెల్ల కార్డుదారులకు కిలో రూపాయికి చొప్పున పంపిణీ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని ఎఫ్‌సీఐకి ప్రభుత్వం చెల్లిస్తుంది. బహిరంగ మార్కెట్లో లెవీ బియ్యం కిలో రూ.22 ధర పలుకుతోంది. డీలర్లు తమ వద్ద మిగిలిన బియ్యాన్ని కిలో రూ.9 చొప్పున బ్రోకర్లకు విక్రయిస్తారు. బ్రోకర్లు రూ.13 నుంచి రూ.14 చొప్పున రైస్‌మిల్లర్లకు విక్రయిస్తారు. మిల్లరు తాము కొనుగోలు చేసిన లెవీ బియ్యాన్ని కొత్తవిగా మార్చేందుకు పాలిష్ పడతారు. ఈ లెక్కన పది క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయిస్తే ఖర్చులన్నీ మినహాయించగా రేషన్ డీలరుకు రూ. 9వేలు, బ్రోకర్‌కు రూ. 3వేలు, మిల్లర్‌కు రూ.14వేలు చొప్పున మిగులుతాయని తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతి మండలంలోనూ ఇద్దరు, ముగ్గురు బ్రోకర్లు ఉన్నారు. వీరి కనుసన్నల్లోనే డీలర్ల నుంచి బియ్యం సేకరించటం, వాటిని ఆటోలు మినీ లారీల్లో మిల్లుకు చేర్చటం వంటివి పకడ్బందీగా నిర్వహిస్తారు. -
పేదల బియ్యం..పెద్దల పరం
చీరాల: రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. రేషన్ డీలర్లు, వ్యాపారులు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై బియ్యాన్ని జిల్లాలు దాటిస్తున్నారు. లారీలు, ఆటోలు, రైళ్లు, పార్శిల్ వాహనాలు, ద్విచక్రవాహనాల్లో దేని ద్వారా సులువుగా ఉంటుందో ఆ మార్గంలో తరలించి జేబులు నింపుకుంటున్నారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ పుంజుకుంది. ఇటీవల నాగులపాలెం పాత పౌరసరఫరాల గౌడౌన్లో దాచి ఉంచిన 547 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. గురువారం నూతలపాడులో ఓ కొష్టం వద్ద తరలించేందుకు సిద్ధం చేసుకున్న 363 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం గమనార్హం. చీరాల రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలులో రేషన్ బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు శనివారం తహశీల్దార్, ఎన్ఫోర్స్మెంట్ డీటీలకు ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో వారు 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీరాల నుంచి రోజూ ఆటోలు, రైళ్లలో బియ్యాన్ని తరలించడం పరిపాటిగా మారింది. పాత వ్యాపారంతో పాటు కొత్తగా చాలా మంది ఈ వ్యాపారంలోకి దిగారు. రేషన్‌డీలర్ల వద్ద కేజీ 10 చొప్పున కొనుగోలు చేసి దానిని గుంటూరు జిల్లా బాపట్ల, కాకినాడ తరలించి కిలో 14 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో మండలానికి సుమారు 500 నుంచి 700 క్వింటాళ్ల బియ్యం కేటాయిస్తారు. అందులో ఒక వంతు మాత్రమే పేదలకు అందగా, మూడోవంతు అక్రమ వ్యాపారులు, రేషన్ డీలర్లకు భోజ్యంగా మారుతోంది. కళ్లకు గంతలు కట్టుకున్న రెవెన్యూ అధికారులు... రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. తాము చెడు వినం... చెడు చూడం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కుల పని పట్టేందుకు ఏ ఒక్క చర్య చేపట్టడం లేదు. రేషన్ షాపుల అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. తహశీల్దార్ కార్యాలయంలో పనితోనే తమకు సరిపోతుందని చెబుతున్నారు. అయితే రేషన్ డీలర్లతో పాటు అక్రమ వ్యాపారులు ప్రతినెలా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో రేషన్‌షాపు డీలరు నెలకు *1200 రెవెన్యూ అధికారులకు మామూలు చెల్లిస్తారని, వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పంచుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి రేషన్ డీలర్ల ద్వారా రెవెన్యూ అధికారులకు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు అందుతున్నట్లు సమాచారం. దీంతోనే వారు రేషన్ డీలర్లపై గానీ, అక్రమ వ్యాపారులపై గానీ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైనా దాడులు చేసి పట్టుకుంటే 6ఏ కేసులు మినహా పీడీయాక్టులు పెట్టే పరిస్థితులు లేకపోవడంతో అక్రమార్కులకు పాడికుండగా మారిన వ్యాపారాన్ని వదిలిపెట్టడం లేదు. 6ఏ కేసుల వలన ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో డీలర్లు, అక్రమ వ్యాపారులు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంటున్నారు. దీంతో పేదల బియ్యం జిల్లాలు దాటి చివరకు పెద్దల పరం అవుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రిస్తాం. ఎన్ఫోర్స్మెంట్ డీటీ రమేష్ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అక్రమ రవాణాదారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశాం. ఈ రవాణాను నియంత్రించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. బియ్యం రవాణాను అడ్డుకుంటాం. మేము డీలర్ల వద్ద నుంచి ఎటువంటి వసూళ్లు చేయడం లేదు. సిబ్బందికి ఆదేశాలిచ్చాం.. బి.సత్యనారాయణ, తహశీల్దార్, చీరాల రేషన్‌బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు వీఆర్వోలను ఆదేశించాం. డీలర్ల నుంచి రెవెన్యూ అధికారులెవరూ వసూళ్లకు పాల్పడటం లేదు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. -
గుట్టుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్
కీసర: రేషన్ బియ్యం రీసైక్లింగ్ గుట్టును అధికారులు రట్టు చేశారు. ఓ రైస్‌మిల్లుపై దాడి చేసి 650 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో శుక్రవారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా బొమ్మలరామారం నివాసి చంద్రమౌళి నిరుపేదలకు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని కొన్నేళ్లుగా గ్రామాల నుంచి దళారుల ద్వారా సేకరిస్తున్నాడు. కీసర మండల పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ఓ రైస్‌మిల్లులో గుట్టుగా రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. రీసైక్లింగ్ చేసిన రేషన్ బియ్యాన్ని గురువారం లారీలో బహిరంగ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమవుతుండగా విశ్వసనీయ సమాచారంతో రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. రైస్‌మిల్లులో నిల్వ ఉంచిన బియ్యం, మార్కెట్‌కు తరలించేందుకు లారీలో ఉన్న బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్‌జోన్ సివిల్ సప్లై అధికారి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిమిత్తం బియ్యాన్ని ల్యాబ్ పంపినట్లు తెలిపారు. రైస్‌మిల్లును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కీసర తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తెలిపారు. -
బియ్యం ధరలు పైపైకి...
సరిపోని రేషన్ బియ్యం - జాడలేని ప్రభుత్వ సన్నరకం విక్రయ కేంద్రాలు - ప్రైవేటు దుకాణాల్లో ఇష్టారాజ్యంగా ధరలు - సామాన్యులకు తప్పని కష్టాలు లక్సెట్టిపేట : బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. జిల్లాలో ప్రధాన పంటగా వరి పండిస్తున్నా బియ్యం ధరలు మాత్రం రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. వాటి ధర వింటేనే.. పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పుణ్యమా అని వారు మూడు పూటలా అన్నం తినే పరిస్థితి లేకుండాపోయింది. అన్నం తప్పనిసరి.. జిల్లా ప్రజల్లో మూడు పూటలా అన్నం తినేవారి సంఖ్యే ఎక్కువ. జొన్న రొట్టె, చపాతితోపాటు అన్నం కచ్చితంగా ఉండాల్సిందే. అన్నంకు ఇక్కడి ప్రజలు అంతగా ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో కూరలేమి లేకపోయినా వేడి అన్నంలో కాస్త ఊరగాయ వేసుకుని పెరుగుతో భోజనం ముగించి, తమతమ పనులకు వెళ్తుంటారు. అయితే పెరిగిన బియ్యం ధరలతో కడుపునిండా అన్నం తినే పరిస్థితి పేద, మధ్యతరగతి ప్రజలకు లేకుండా పోయింది. రోజూ దొడ్డు బియ్యం తింటూనే బంధువులు వస్తే సన్నబియ్యం వండిపెట్టేవారు ప్రస్తుత ధరలతో బెంబేలెత్తుతున్నారు. అయితే వీరి అవసరం.. బియ్యం వ్యాపారులకు వరంగా మారింది. కొందరు ఇష్టారాజ్యంగా దొడ్డు, సన్నరకం బియ్యం ధరలు పెంచేసి అందినంత దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. సరిపోని రేషన్ బియ్యం.. ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డు ద్వారా నెలకు ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున అందించే బియ్యం పక్షం రోజులకే సరిపోతున్నాయి. దీంతో మిగతా రోజుల గాసానికి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దుకాణాలు, రైస్డిపోల నుంచి బియ్యం కొనాల్సిన పరిస్థితి. మార్కెట్లో కిలో దొడ్డు రకం బియ్యం ధర రూ.16 ఉండగా.. సన్నరకాల ధర రూ.40 పైనే ఉంది. అటు అధిక ధరలకు బియ్యం కొనలేక.. ఇటు రేషన్ బియ్యం సరిపోక పేద, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గత్యంతరం లేక ఉన్నవాటిలో కాస్త తక్కువ ధరకు లభించే బియ్యాన్ని కొంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నరకం బియ్యం కేంద్రాలేవీ..? సామాన్యులు సైతం సన్నరకం బియ్యం తినాలనే లక్ష్యంతో ప్రభుతం కొన్ని నెలల క్రితం సన్నరకం బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించింది. అధికారులు ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో తెల్లరేషన్ కార్డుదారులకు రూ.29లకు కిలో బియ్యం చొప్పున విక్రయించింది. ఈ కేంద్రాల ఏర్పాటుతో సన్నరకం బియ్యం తినగలమనే ధీమా పేద, మధ్యతరగతి ప్రజల్లో కలిగింది. అయితే ఈ కేంద్రాలను ప్రారంభించిన నెల రోజులకే ఎత్తివేయడంతో పేదలకు నిరాశే మిగిలింది. రేషన్ బియ్యం సరిపోక.. బహిరంగ మార్కెట్లో సన్నరకం బియ్యం కొనుగోలు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. పుట్టగొడుగుల్లా బియ్యం దుకాణాలు మండల కేంద్రంలో బియ్యం దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రోజురోజుకు బియ్యం దుకాణాల సంఖ్య పెరుగుతోంది. కొందరు వ్యాపారులు సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యం అమ్ముతూ పేదలను దోచుకుంటున్నారు. మరికొందరు నాసిరకం, పురుగులు ఉన్నవి అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం ధరలను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. -
ముక్కిపోయిన రేషన్ బియ్యం
తిరువూరు : తిరువూరు రాజుపేటలోని ఒక రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌరసరఫరాల అధికారులు తదుపరి వాటి గురించి పట్టించుకోకపోవడంతో ముక్కిపోయి పనికిరాకుండా పోయాయి. 2012 జనవరిలో తిరువూరు ఎంఎల్ఎస్ పాయింటుకు చేరాల్సిన రేషన్‌బియ్యం బస్తాల లోడును నల్లబజారుకు తరలించడంలో భాగంగా రాజుపేట మిల్లులో నిల్వచేశారు. రేషన్‌బియ్యంతోపాటు స్వాధీనం చేసుకున్న మిల్లులో అనధికారికంగా ఉంచిన సాంబమసూరి బియ్యం మాత్రం పౌరసరఫరాల అధికారులు వేలం వేసి పాడుకున్న వ్యక్తికి అప్పగించారు. రేషన్‌బియ్యాన్ని కనీసం ఎంఎల్ఎస్ పాయింటుకు తరలించకపోవడం, గత ఏడాదిన్నర కాలంగా మిల్లులో ఉన్న బియ్యం పరిస్థితిని పట్టించుకోకపోవడంతో పురుగులుపట్టి ముక్కిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. శుక్రవారం పౌరసరఫరాల విభాగం అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్ భరద్వాజ ఈ బియ్యాన్ని పరిశీలించారు. రైస్‌మిల్లు యజమాని హరి తమ మిల్లునుంచి ఈ బియ్యం బస్తాలను తొలగించాలని పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరువూరు తహశీల్దారు బాలకృష్ణారెడ్డిని పీడీఎస్ అధికారులు సంప్రదించారు. నిబంధనల పేరుతో కాలయాపన చేసిన అధికారులు రేషన్‌బియ్యాన్ని వృథా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. -
రేషన్ డిపోపై దాడి
నిల్వలో తేడాలున్నట్లు గుర్తింపు నిర్వాహకులకు తాత్కాలికంగా బ్రేక్ పక్క డిపోకు బాధ్యతలు అప్పగింత మునగపాక, న్యూస్‌లైన్ : రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయన్న ఫిర్యాదు మేరకు పౌరసరఫరాల అధికారులు శనివారం గవర్లఅనకాపల్లి డిపోపై దాడులు చేశారు. సరుకు నిల్వల్లో తేడాలున్నట్లు గమనించి నిర్వాహకులను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించారు. సమీపంలోని టి.సిరసపల్లి డీలర్ వీరునాయుడుకు బాధ్యతలు అప్పగించారు. వివరాల్లోకి వెళితే...గవర్లఅనకాపల్లిలో నెహ్రూ యూత్ క్లబ్ సభ్యులు రాజకీయాలకు అతీతంగా డిపో నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ డిపో నుంచి 9 బస్తాలతోపాటు మరో 6 ప్లాస్టిక్ బ్యాగుల్లో బియ్యం ఆటోలో వేసి తరలిస్తుండగా గ్రామానికి చెందిన పొలమరశెట్టి సత్యనారాయణ గమనించారు. వెంటనే ఆయన పౌరసరఫరాల అధికారులు, మునగపాక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో చోడవరం, కె.కోటపాడు సీఎస్డీటీలు నానాజీ, సీతారామ్‌లు హుటాహుటిన డిపోకు చేరుకుని సరుకు రిజిస్టర్లు తనిఖీ చేశారు. మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్నవి రేషన్ బియ్యంగా గుర్తించి పౌరసరఫరాల శాఖ సరఫరా చేసే గోనెసంచుల్లో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. అలాగే గోధుమలు, ఉప్పు, కందిపప్పు, పంచదార నిల్వల్లోనూ తేడాలున్నట్లు గుర్తించారు. బియ్యం 24 కిలోలు అదనంగా ఉన్నట్లు గమనించారు. ఫిర్యాదుదారునితోపాటు ముగ్గురు సాక్షులను విచారించాక నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలికంగా డిపో నిర్వాహకులను బాధ్యతల నుంచి తప్పించి సిరసపల్లి డీలర్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు. రాజకీయం దురదృష్టకరం డిపో నిర్వహిస్తున్న నెహ్రూయూత్ క్లబ్ సభ్యులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన వారితో కమిటీ ఏర్పాటుచేసి డిపో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన ఆదాయాన్ని సైతం గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అక్రమ వ్యాపారం చేయాల్సిన అవసరం తమకు లేదని, కేవలం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి కుట్రకు తెరలేపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా డిపో నిర్వహణను తాముకూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్, విశ్రాంత తహశీల్దార్ కాండ్రేగుల సూర్యనారాయణ, సర్పంచ్ వీరమహలక్ష్మినాయుడు అధికారులకు వివరించారు.