- నిల్వలో తేడాలున్నట్లు గుర్తింపు
- నిర్వాహకులకు తాత్కాలికంగా బ్రేక్
- పక్క డిపోకు బాధ్యతలు అప్పగింత
మునగపాక, న్యూస్‌లైన్ : రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయన్న ఫిర్యాదు మేరకు పౌరసరఫరాల అధికారులు శనివారం గవర్లఅనకాపల్లి డిపోపై దాడులు చేశారు. సరుకు నిల్వల్లో తేడాలున్నట్లు గమనించి నిర్వాహకులను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించారు. సమీపంలోని టి.సిరసపల్లి డీలర్ వీరునాయుడుకు బాధ్యతలు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే...గవర్లఅనకాపల్లిలో నెహ్రూ యూత్ క్లబ్ సభ్యులు రాజకీయాలకు అతీతంగా డిపో నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ డిపో నుంచి 9 బస్తాలతోపాటు మరో 6 ప్లాస్టిక్ బ్యాగుల్లో బియ్యం ఆటోలో వేసి తరలిస్తుండగా గ్రామానికి చెందిన పొలమరశెట్టి సత్యనారాయణ గమనించారు. వెంటనే ఆయన పౌరసరఫరాల అధికారులు, మునగపాక రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో చోడవరం, కె.కోటపాడు సీఎస్‌డీటీలు నానాజీ, సీతారామ్‌లు హుటాహుటిన డిపోకు చేరుకుని సరుకు రిజిస్టర్‌లు తనిఖీ చేశారు. మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్నవి రేషన్ బియ్యంగా గుర్తించి పౌరసరఫరాల శాఖ సరఫరా చేసే గోనెసంచుల్లో ఎందుకు ఉంచలేదని ప్రశ్నించారు. అలాగే గోధుమలు, ఉప్పు, కందిపప్పు, పంచదార నిల్వల్లోనూ తేడాలున్నట్లు గుర్తించారు. బియ్యం 24 కిలోలు అదనంగా ఉన్నట్లు గమనించారు.
ఫిర్యాదుదారునితోపాటు ముగ్గురు సాక్షులను విచారించాక నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామని స్పష్టం చేశారు. తాత్కాలికంగా డిపో నిర్వాహకులను బాధ్యతల నుంచి తప్పించి సిరసపల్లి డీలర్‌కు అప్పగిస్తున్నట్లు చెప్పారు.
రాజకీయం దురదృష్టకరం
డిపో నిర్వహిస్తున్న నెహ్రూయూత్ క్లబ్ సభ్యులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన వారితో కమిటీ ఏర్పాటుచేసి డిపో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన ఆదాయాన్ని సైతం గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు.
అక్రమ వ్యాపారం చేయాల్సిన అవసరం తమకు లేదని, కేవలం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి కుట్రకు తెరలేపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా డిపో నిర్వహణను తాముకూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మాజీ ఎంపీపీ కొయిలాడ వెంకట్, విశ్రాంత తహశీల్దార్ కాండ్రేగుల సూర్యనారాయణ, సర్పంచ్ వీరమహలక్ష్మినాయుడు అధికారులకు వివరించారు.