వరుసగా అధికారుల రాజకీయ బదిలీలు
♦ చక్రం తిప్పుతున్న తెలుగుతమ్ముళ్లు
♦ అక్రమమైనా సక్రమంగా చేయాల్సిందే
♦ అధికార పార్టీ నేతల హుకుం
♦ ఆందోళనలో అధికార, ఉద్యోగ వర్గాలు
నెల్లూరు జిల్లా అంటేనే అన్నిశాఖల అధికారులు, ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. ఇక్కడ ఉద్యోగం చేయాలంటేనే వారికి క త్తిమీద సాములాగా మారింది. జిల్లాలో రాజకీయ బదిలీలు బాగా పెరిగిపోతున్నాయి. తమ మాట వినని అధికారులను సాగనంపడమే లక్ష్యంగా తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పుతున్నారు. వారి అధికార దాహానికి ఉన్నతాధికారులూ బలవుతున్నారు.
నెల్లూరు (టౌన్) : ఏ అధికారి ఎప్పుడు బదిలీ అవుతారో తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొంది. బదిలీల విషయంలో నిబంధనలు ఉన్నా తెలుగు తమ్ముళ్లు ముందు అవి బలాదూరే. అధికార పార్టీకు చెందిన నేతలు చేసే పనులు అక్రమమైనా అధికారులు మా త్రం సక్రమమైనవిగానే భావించి చక్కబెట్టాలి. ఏమాత్రం కుదరదని చెప్పినా జిల్లాలో ఎంతకాలం పనిచేస్తారో తెలియని పరిస్థితి. 4 నెలల క్రితం జేసీ రేఖారాణి, 2నెలల క్రితం ఎస్పీ సెంథిల్ కుమార్, ఆతర్వాత కొద్దిరోజులకే కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్‌బాబు, వారంరోజుల క్రితం జెడ్పీ సీఈఓ జితేంద్ర, మొన్న ఎక్సైజ్ ఉప కమిషనర్ చైతన్యమురళీ, నేడో, రేపో శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి, ఆ మరుసటి రోజు ఎవరు అవుతారోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది.
ఎవరైనా మాట వినాల్సిందే..
జిల్లాలో 2013 ఏప్రిల్‌లో జేసీగా రేఖారాణి బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే ఓ అధికార పార్టీ నేతకు దేవాదాయశాఖకు చెందిన భూమిని కట్టబెట్టలేదన్న కారణంతో పనిగట్టుకుని బదిలీ చేయిం చారు. జిల్లా ఎస్పీగా శాంతిభద్రతలు, అక్రమ రవాణాను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చిన సెంథిల్‌కుమార్ సైతం తెలుగు తమ్ముళ్ల రాజకీయ క్రీడలో బలయ్యారు. బాధ్యతలు చేపట్టిన కొద్దినెలలకే తనదైన శైలిలో జిల్లాలో నేరాలను కట్టడి చేశారు. ప్రధానంగా ఎర్రచందనం, బియ్యం అక్రమ రవాణాపై దృష్టిసారించి పూర్తిగా నిరోధించగలిగారు. తెలుగుతమ్ముళ్లు అధికార దాహానికి ఎక్కడా లొంగకుండా పనిచేశారు.
ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు ఎస్పీని బదిలీ చేయాలని జిల్లా మంత్రి వద్ద పట్టుబట్టారు. సీఎంకు సైతం ఫిర్యాదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న కొంతమంది తెలుగుతమ్ముళ్లు ఎస్పీ బదిలీకి తీవ్రంగా కృషిచేశారు. దీంతో ఎస్పీ ఏడాది తిరగకుండానే బదిలీపై వెళ్లారు. నగర కమిషనర్ చక్రధర్‌బాబు ముక్కుసూటిగా వ్యవహరిస్తుండ టంతో అధికారపార్టీకి చెందిన నేతలకు మింగుడు పడలేదు. తెలుగుతమ్ముళ్లు పట్టుబట్టి మరీ కమిషనర్‌ను బదిలీ చేయించారు.
జెడ్పీ సీఈఓ సైతం టీడీపీ నేతల ఆగ్రహానికి బలయ్యారు. కేవలం మహాసంకల్పం సభ జరుగుతుంటే జెడ్పీ సమావేశాన్ని వాయిదా వేయకుండా నిర్వహించడంపై తెలుగు తమ్ముళ్లు కన్నెర్ర చేశారు. ఫలితంగా సీఈఓ జితేంద్ర బదిలీ అయ్యారు. ఇదేకోవలో ఎక్సైజ్ ఉప కమిషనర్ చైతన్యమురళీ బదిలీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా తెలుగుతమ్ముళ్లు చెప్పిన వారిపై కేసులు పెట్టకపోవడం, వారు చెప్పిన వారికి దుకాణాలు కేటాయించకపోవడం కారణంగా చెబుతున్నారు.
చైతన్యమురళీ బదిలీ కోసం గత 2నెలలుగా టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. వారు ఒత్తిడి తేవడంతో ఆయనను శుక్రవారం బదిలీ చేసి వెనువెంటనే రిలీవ్ కూడా చేశారు. దీంతో అధికార పార్టీ నేతలకు తలొగ్గి పనిచేయలేక, బదిలీపై పొవడం ఇష్టంలేక అటు అధికారులు, ఇటు ఉద్యోగులు లొలోన తీవ్రంగా మదనపడుతున్నట్లు తెలిసింది.
నేతల టార్గెట్లో మరికొంతమంది
అధికారపార్టీ నేతల టార్గెట్లో మరికొంతమంది అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఐసీడీఎస్ పీడీ విద్యావతిని బదిలీ చేయించేందుకు తమ్ముళ్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పీడీని బదిలీ చేస్తామని ఇప్పటికే మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఏజేసీగా పనిచేస్తున్న సాల్మన్‌రాజ్‌కుమార్ ను కూడా బదిలీ చేయించేందుకు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన జిల్లా టీడీపీ సమావేశంలో జిల్లా పరిశీలకుల ముందు సోమిరెడ్డి ఏజేసీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. అయనను బదిలీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఏజేసీ కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీఎస్‌యూ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న శివశంకర్‌ను బదిలీ చేయించేందుకు టీడీపీ నేతలతో పాటు టీఎన్‌ఎస్‌ఎఫ్ కూడా ప్రయత్నాలు ప్రారంభించిం ది. వీరితో పాటు మరికొంతమంది అధికారులు తెలుగుతమ్ముళ్లు టార్గెట్‌లో ఉన్నట్లు తెలిసింది. కిందిస్థాయి అదికారులు, ఉద్యోగులను తమ చేతికిందకు తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలు బదిలీ అస్త్రాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వినకుంటే వేటే
Published Sun, Jun 28 2015 4:36 AM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM
Advertisement