టీడీపీ తమ్ముళ్ల ‘ముజ్రా’ మజా | Obscene Dance At Vijayawada Hotel, 55 Arrested | Sakshi
Sakshi News home page

టీడీపీ తమ్ముళ్ల ‘ముజ్రా’ మజా

Published Fri, Jul 20 2018 3:23 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

Obscene Dance At Vijayawada Hotel, 55 Arrested - Sakshi

విజయవాడ భవానీపురం ఆర్టీసీ కాలనీ సమీపంలోని అలివ్‌ గ్రీన్‌ హోటల్‌లో అదుపులోకి తీసుకున్న నిందితులను బస్సులో తరలిస్తున్న దృశ్యం

సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు విశృంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. విజయవాడను అశ్లీల నృత్యాలకు అడ్డాగా మార్చివేస్తున్నారు. పోలీసుల బుధవారం అర్ధరాత్రి చేసిన దాడుల్లో పలువురి తెలుగు తమ్ముళ్ల బండారం బయటపడింది. విజయవాడకు చెందిన వివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే బినామీకి చెందిన ఓ హోటల్‌లో ముజ్రా పార్టీ పేరుతో అశ్లీల కార్యకలాపాలు నిర్వహిస్తు ఆయన అనుచరులు పట్టుబడటం స్థానికంగా సంచలనం రేపింది.

పోలీసులు ముజ్రా పార్టీ నిర్వాహకులైన ఆ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ముగ్గురితో పాటు 50 మంది విటులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 47వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు కొల్లూరు రామకృష్ణ, ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు సామా చైతన్యతో పాటు పలువురు స్థానిక టీడీపీ నేతలు, తెలుగు యువత నేతలు, వ్యాపారులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న యువతులను పోలీసులు విజయవాడలోని వాసవ్య మహిళా మండలికి తరలించారు.

పక్కా సమాచారంతో దాడులు..
వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో స్థానిక భవానీపురంలోని ఆలీవ్‌ ట్రీ హోటల్‌పై నగర పోలీసులు దాడులు చేశారు. జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి.

ఆ సమయంలో హోటల్‌లో అశ్లీల నృత్యాలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముజ్రా పార్టీ నిర్వాహకులు ముగ్గురు ఉన్నారు. పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్‌ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నవారిని భవానీపురం, విజయవాడ వన్‌టౌన్, ఇబ్రహీంపట్నం, గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఆ హోటల్‌ను లీజుకు తీసుకున్న వ్యక్తిని, ముజ్రా పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు.


ఎమ్మెల్యే అనుచరుడి హోటల్‌
ఆలివ్‌ టీ హోటల్‌ నిర్వాహకుడు ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు. ఈ హోటల్‌ను టీడీపీ ఎమ్మెల్యే ఏడాది క్రితం తన బినామీ పేరుతో  కొనుగోలు చేశారని తెలుస్తోంది. అనంతరం తన ప్రధాన అనుచరుడికి లీజుకు ఇచ్చారు. ప్రతి నెలా మూడో బుధవారం ఆ హోటల్‌లో ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రవేశ రుసుంగా రూ. 5 వేలు వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్, భీమవరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఇదే సమయంలో మద్యం, గంజాయి విక్రయాలు కూడా జోరుగా సాగిస్తున్నారు. ఈ ముజ్రా పార్టీలకు పలువురు టీడీపీ నేతలు, వ్యాపారవేత్తలు హాజరవుతున్నారు. ఇప్పటి వరకూ తమ దందా సజావుగా సాగుతుండటంతో ఈ ముజ్రా పార్టీలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించడానికి ఎమ్మెల్యే సన్నిహితులు సిద్ధమయ్యారని తెలిసింది. దాడుల్లో దొరికిన నిర్వాహకులు, విటులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని గురువారం న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement