‘చౌక’గా సంపాదన | Black market heavily ration rice | Sakshi
Sakshi News home page

‘చౌక’గా సంపాదన

Published Thu, Sep 18 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

‘చౌక’గా సంపాదన

‘చౌక’గా సంపాదన

  • బ్లాక్ మార్కెట్‌కు భారీగా రేషన్ బియ్యం    
  •  ఎవరి వాటాలు వారికే..
  •  విజిలెన్స్ దాడులు నామమాత్రమే  
  •  రేషన్‌డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లకు లాభాల పంట
  • మచిలీపట్నం : జిల్లాలోని పేదలకు అందాల్సిన బియ్యానికి రెక్కలొచ్చాయి. కొందరు పెద్దలు గద్దల్లా మారి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు ఇక్కడే ఎఫ్‌సీఐకే మళ్లీ విక్రయిస్తున్నారు. కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వస్తోంది. ఈ అక్రమ తంతు అధికారులకు తెలిసినా మామూళ్లు తీసుకుని నోరుమెదపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 11,23,934 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి.

    ఈ కార్డుదారులకు కిలో రూపాయి చొప్పున ప్రతి నెలా 13,452 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని 2,300కు పైగా ఉన్న రేషన్ షాపులకు అందజేస్తున్నారు. డీలరుకు కిలోకు 20 పైసలు కమీషన్ చెల్లిస్తారు. రేషన్ డీలర్లు తమకు వచ్చిన బియ్యాన్ని కార్డుదారులందరికీ పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ప్రతి నెల 16వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాలి. డీలర్లు నాలుగు రోజులు ముందుగానే బియ్యం అయిపోయాయంటూ బోర్డు తిప్పేస్తున్నారు.

    ఒక్కో డీలరు వద్ద కనీసం వంద రేషన్‌కార్డులు బోగస్‌వి ఉంటాయని అంచనా. మరికొన్ని కార్డులను తాకట్టు పెట్టుకుని తమ వద్దే ఉంచుకుంటున్నారు. బోగస్ కార్డులు, తాకట్టు పెట్టిన కార్డులకు బియ్యం ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేస్తున్నారు. మరికొందరు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 4వేల టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్లు సమాచారం.
     
    కాకినాడ నుంచి ఇతర దేశాలకు..

    జిల్లాలో సేకరించిన రేషన్ బియ్యం కాకినాడలోని ఎగుమతిదారులకు విక్రయిస్తారు. కాకినాడ పోర్టు నుంచి థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. విదేశాలకు ఎగుమతయ్యే రేషన్ బియ్యంలో నూక ఉన్నా పెద్దగా పట్టించుకోరని సమాచారం. కాకినాడకు రేషన్ బియ్యాన్ని పంపటంలో ఇబ్బందులు ఎదురైతే మిల్లర్లు లెవీ బియ్యంగా మళ్లీ ఎఫ్‌సీఐకే ఈ బియ్యాన్ని రూ.26 చొప్పున విక్రయిస్తారు.
     
    తహశీల్దార్ కార్యాలయానికి మామూళ్లు ఇలా..

    ప్రతి డీలరు తనకు వచ్చిన బియ్యం మొత్తం పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేస్తారు. కానీ, ఎన్ని క్వింటాళ్లు అక్రమంగా తరలించా రనే విషయం తహశీల్దారు కార్యాలయాల్లో పక్కా సమాచారం ఉంటుంది. ఈ మేరకు క్వింటాలుకు రూ.20 చొప్పున మామూళ్లు అందజేస్తారు. దీంతో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అన్ని రికార్డులు సరిగానే ఉన్నాయని నిర్ధారిస్తారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి నెలకొంది.
     
    దాడుల్లో దొరికేది నామమాత్రమే..

    గత పది రోజులుగా జిల్లావ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. నాలుగు రోజుల క్రితం గూడూరు మండలం తరకటూరులోని ఓ మిల్లులో 191 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మైలవరం బైపాస్‌రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. వేలాది టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నా విజిలెన్స్ దాడుల్లో అతి తక్కువ మొత్తంలోనే దొరకటం గమనార్హం. రేషన్‌షాపుల ద్వారా ఈ-పీడీఎస్ పద్ధతిలో సరుకులు కేటాయిస్తున్నా, డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లు యథేచ్ఛగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించటం గమనార్హం.
     
    అక్రమాలు ఇలా...

    పేదలకు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా మిల్లర్ల నుంచి లెవీ(దాళ్వా) బియ్యాన్ని కిలోకు రూ.26 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఈ విధంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని తెల్ల కార్డుదారులకు కిలో రూపాయికి చొప్పున పంపిణీ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని ఎఫ్‌సీఐకి ప్రభుత్వం చెల్లిస్తుంది. బహిరంగ మార్కెట్లో లెవీ బియ్యం కిలో రూ.22 ధర పలుకుతోంది. డీలర్లు తమ వద్ద మిగిలిన బియ్యాన్ని కిలో రూ.9 చొప్పున బ్రోకర్లకు విక్రయిస్తారు. బ్రోకర్లు రూ.13 నుంచి రూ.14 చొప్పున రైస్‌మిల్లర్లకు విక్రయిస్తారు.

    మిల్లరు తాము కొనుగోలు చేసిన లెవీ బియ్యాన్ని కొత్తవిగా మార్చేందుకు పాలిష్ పడతారు. ఈ లెక్కన పది క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయిస్తే ఖర్చులన్నీ మినహాయించగా రేషన్ డీలరుకు రూ. 9వేలు, బ్రోకర్‌కు రూ. 3వేలు, మిల్లర్‌కు రూ.14వేలు చొప్పున మిగులుతాయని తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతి మండలంలోనూ ఇద్దరు, ముగ్గురు బ్రోకర్లు ఉన్నారు. వీరి కనుసన్నల్లోనే డీలర్ల నుంచి బియ్యం సేకరించటం, వాటిని ఆటోలు మినీ లారీల్లో మిల్లుకు చేర్చటం వంటివి పకడ్బందీగా నిర్వహిస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement