White ration cards
-
వచ్చే నెల నుంచి కొత్త రేషన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి, వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేస్తామన్నారు. రేషన్ బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల కోసం తెల్లరేషన్ కార్డులున్న వారి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నాలుగోసారి సమావేశమై చర్చించింది. ప్రభుత్వానికి కొన్ని మధ్యంతర సిఫార్సులు చేసింది. అనంతరం మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మీడియాతో మాట్లాడారు. అర్హతలపై పునః సమీక్ష చేస్తున్నాం.. తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారుల అర్హతలను పునఃసమీక్షిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ నెల 21న ఇంకోసారి సమావేశమై కొత్త విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటికి 91,68,231 రేషన్‌కార్డులు, 3,38,07,794 మంది లబ్ధిదారులు ఉంటే.. గత ప్రభుత్వం పాత రేషన్‌కార్డులన్నీ రద్దు చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించిందని చెప్పారు. అప్పట్లో 89,21,907 కొత్త రేషన్‌కార్డులను జారీ చేయగా.. 2,70,36,250 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షికాదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల్లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని.. 3.5 ఎకరాలు/ఆ లోపు తడి, 7.5 ఎకరాలు/ఆ లోపు మెట్ట భూములు ఉండాలని చెప్పారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లలో అమలు చేస్తున్న ఆదాయ పరిమితులను పరిశీలించామని.. రాష్ట్రంలో లబ్ధిదారుల ఆదాయ పరిమితిని పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలనే కొనసాగించాలా? అన్న అంశాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కోరుతూ లేఖలు రాయగా.. ఇప్పటివరకు 16 మంది నుంచి స్పందన వచ్చిందన్నారు. మిగతావారు ఈ నెల 19లోగా అభిప్రాయాలను పంపితే.. పరిశీలిస్తామని చెప్పారు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ.. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీని జనవరి నుంచి ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిరుపేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రిసైక్లింగ్‌కు దారితీస్తోందని.. సన్న బియ్యంతో ఈ సమస్య ఉండదని వివరించారు. వానాకాలంలో పండించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని తెలిపారు. ఉప ఎన్నికలుంటేనే రేషన్ కార్డులిచ్చారు: పొంగులేటి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 2016–2024 మధ్య కాలంలో 6,47,479 కొత్తకార్డులు జారీ చేయగా.. 5,98,000 కార్డులను తొలగించిందని చెప్పారు. అంటే ఇచ్చినది 49,476 కార్డులేనని పేర్కొన్నారు. తాము పారదర్శకత కోసం ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, వారు విలువైన సలహాలిస్తే భేషజాలకు పోకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం మధ్యంతర సిఫారసులివీ.. – క్యూఆర్ కోడ్/ మైక్రో చిప్/ బార్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయాలి. – ప్రస్తుత అర్హతలను కొనసాగించాలి. – ‘పరిమితికి లోబడి భూమి ఉండడం ఒక్కటే అర్హత కాదు. భూమి ద్వారా వచ్చే ఆదాయం సైతం ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి’అనే నిబంధనను తొలగించాలి. గందరగోళానికి గురిచేసే ఈ నిబంధన అనవసరం. – సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సక్సేనా కమిటీ సిఫారసులను పరిశీలించాలి. -
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్‌కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్‌కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
తెల్లరేషన్ కార్డుల పునఃపరిశీలన.. ఇళ్ల వద్దకు అధికారులు
2016లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అనర్హుల పేరుతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వందలాది తెల్లకార్డులను తొలగించింది. లబ్ధిదారులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కార్డులను రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ... గతేడాది ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేసును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని వివరణ కోరి పలు సూచనలు చేసింది. రద్దు చేసిన తెల్ల రేషన్‌కార్డులపై పునఃపరిశీలన జరిపి వారికి నోటీసులు జారీ చేయాలని పేర్కొంది. దీంతో నేటి నుంచి తెల్లరేషన్ కార్డుల పునఃపరిశీలణను జిల్లా అధికార యంత్రాంగం ప్రారంభించింది. సాక్షి, మేడ్చల్ జిల్లా: చనిపోయిన వారు, ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, ఆధార్ సంఖ్య రెండు సార్లు నమోదైన వారు, గ్రామంలో లేకుండా పూర్తిగా వెళ్లిపోయిన వారు, నిబంధనలకు మించి భూములు కలిగి ఉన్న వారు... తదితర కారణాలతో కార్డులను గతంలో రద్దు చేశారు. అయితే వారికి ఫలానా కారణంగా కార్డు రద్దు చేస్తున్నామనే నోటీసులు జారీ చేయకపోవడంతో ప్రస్తుతం మళ్లీ విచారించి నోటీసులు జారీ చేయాల్సి వస్తోంది. వివిధ కారణాలతో గతంలో రద్దయిన తెల్ల రేషన్ కార్డుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం నుంచి తనిఖీల నిమిత్తం సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విచారణ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి (రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశీలన అనంతరం అర్హులకు కార్డులు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 95,040 తెల్లరేషన్ కార్డులు తొలగించారు. రద్దయిన ఈ కార్డులను పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి పరిశీలన అనంతరం అర్హులైన వారికి తిరిగి తెల్ల రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లకు అధికారులు రద్దు చేసిన తెల్లరేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకొని నోటీసులు జారీ చేసే ప్రక్రియకు జిల్లా పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రద్దయిన కార్డుల జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో ఉంచింది. వాటిని ఆయా మండలాల తహసీల్దారులు డౌన్లోడ్ చేసుకొని విచారణ సాగిస్తున్నారు. రద్దయిన కార్డుదారులను కలిసి నోటీసులు జారీ చేసి వివరాలను సేకరిస్తున్నారు. విచారణలో అర్హులుగా తేలిన వారికి కార్డులను పునరుద్ధరిస్తారు. మేడ్చల్ జిల్లాలో రద్దయిన తెల్లరేషన్ కార్డులు: 95,040 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మొత్తంగా 95,040 తెల్ల రేషన్ కార్డులు రద్దు అయ్యాయి. మండలాలు, జీహెచ్ఎంసీ మున్సిపల్ సర్కిళ్ల వారీగా రద్దయిన తెల్ల రేషన్‌కార్డుల ఈ విధంగా ఉన్నాయి. బాచుపల్లి మండలంలో 2,378 తెల్లరేషన్ కార్డులు రద్దు కాగా, ఘట్కేసర్లో 2,273, కాప్రాలో 2,263, కీసరలో 3,388, మేడ్చల్‌లో 2,306, మేడిపల్లిలో 4,165, శామీర్‌పేట్‌లో 893, మూడు చింతలపల్లి మండలంలో 328 రేషన్‌కార్డులు రద్దయ్యాయి. ► అలాగే, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 తెల్ల రేషన్ కార్డులు రద్దు అయ్యాయి. రద్దయిన కార్డుదారులు అందుబాటులో ఉండాలి గతంలో రద్దయిన రేషన్ కార్డుదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి. విచారణకు నియమించబడిన అధికారులు తనిఖీల నిమిత్తం మీ ఇంటి వద్దకు వస్తారు. జిల్లాలో మొత్త గా 95,040 తెల్లరేషన్ కార్డులు రద్దయ్యాయి. ఇంటి చిరునామా, ఫోన్ తదితర విషయాలలో ఏమైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే సంబంధిత తహసీల్/సహాయ, పౌర సరఫరాల కార్యాలయంలో సంప్రదించాలి. – ఏనుగు నర్సింహారెడి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) -
నేరుగా ఇంటికే రేషన్ సరుకులు..
సాక్షి, గుడివాడ: తెల్లకార్డు దారులు రేషన్ డిపోలకు వెళ్లనవసరం లేదని.. గుడివాడ పట్టణంలో ప్రయోగాత్మకంగా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే రెండో విడత ఉచిత రేషన్ సరుకులు అందిస్తున్నామని తహశీల్దార్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలో ఉన్న 24 వేల తెల్ల కార్డుదారులకు 46 రేషన్ డిపోల ద్వారా పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తెల్ల కార్డు ఉన్న కుటుంబంలో మనిషికి 5 కేజీలు బియ్యం, 1 కేజీ శనగలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. రేషన్‌షాపుకు ఒక్కో వాహనం చొప్పున ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా రేషన్ సరుకులు అందిస్తున్నామని తెలిపారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పంపిణీ చేస్తామన్నారు. కరోనా వైరస్ విజృభింస్తున్న నేపథ్యంలో కార్డుదారుల బయో మెట్రిక్ రద్దు చేసినట్లు తెలిపారు. రేషన్‌షాపు పరిధిలో ప్రభుత్వ ఉద్యోగి బయో మెట్రిక్ ద్వారా వాలంటీర్లు ఇంటికే రేషన్ సరుకులను అందజేస్తారని శ్రీనివాసరావు తెలిపారు. -
నాలుగు రోజుల్లో అర్హుల తుది జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బియ్యం కార్డులకు సంబంధించిన అర్హుల తుది జాబితాను నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఉన్న 1.47 కోట్ల తెల్ల రేషన్‌కార్డుల వివరాలను గ్రామ వలంటీర్లకు అందజేసి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు.. తదితర కారణాలతో దాదాపు 18 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తాము బియ్యం కార్డులు పొందడానికి అర్హులమేనని పేర్కొంటూ పున:పరిశీలన కోసం 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ విచారణ సాగిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఈ పని పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అర్హుల ఎంపిక ప్రక్రియను జాయింట్ కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఎవరికీ అన్యాయం జరగబోదని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు బియ్యం కార్డులు లేని మరో 1.50 లక్షల మంది గ్రామ సచివాలయాల ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. పున:పరిశీలనకు భారీగా దరఖాస్తులు గుంటూరు జిల్లాలో 98,035, నెల్లూరులో 64,519, కృష్ణాలో 95,716, కడపలో 50,446, చిత్తూరులో 66,407, ప్రకాశంలో 55,890, అనంతపురంలో 69,758, తూర్పు గోదావరిలో 86,842, కర్నూలులో 55,253, విశాఖపట్నంలో 57,198, పశ్చిమ గోదావరిలో 60,540, విజయనగరంలో 31,247, శ్రీకాకుళం జిల్లాలో 31,982 దరఖాస్తులు పున:పరిశీలన కోసం వచ్చాయి. ఆయా దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యం కా>ర్డు పొందడానికి అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దరఖాస్తు అందిన వెంటనే పరిశీలించి, ఐదు రోజుల్లోగా బియ్యం కార్డు మంజూరు చేస్తాం. పేదలు బియ్యం కార్డు కోసం ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
అమరావతి భూ అక్రమాలపై సీఐడీ విచారణ
-
ఎక్కడ నుంచైనా రేషన్..వలసదారులకు వరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్ సరుకులను ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం (పోర్టబిలిటీ) వలసదారులకు వరంలా మారింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటి. ఇటువంటి వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి లక్షలాది మంది వలస వెళ్తున్నారు. ఇలాంటి వారికి కూడా ఆయా రాష్ట్రాల్లోనే సబ్సిడీ సరుకులు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డులు కల్గి ఉండి తెలంగాణలో ఉంటున్న వారు ఈ–పాస్ ద్వారా సరుకులు తీసుకునే విధానాన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రేషన్ తీసుకునే విధానం విజయవంతమైతే ఈ విధానాన్ని దేశమంతటా అమలుచేయనున్నారు. కాగా, ఏపీలోనే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే రాష్ట్రానికి చెందిన మరికొందరికి లబ్ధి చేకూరుతుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్ ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ నుంచి ప్రజా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా.. 5, 10, 20 కిలోల బ్యాగుల ద్వారా బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్లకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వచ్చినా వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా రేషన్ డీలర్ (స్టాకు పాయింట్లు) వద్దే సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు ఈ–పాస్ మిషన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఎక్కడ, ఏ రేషన్ దుకాణంలో ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకెళ్లారో ఆన్లైన్లో నమోదవుతుంది. కాగా, ఏదేని రేషన్ షాపులో 50 శాతం సరుకు పూర్తికాగానే సంబంధిత జిల్లా డీఎస్‌ఓలను అప్రమత్తం చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్ వెళ్తుంది. తద్వారా సంబంధిత షాపులకు అదనంగా కోటాను అందుబాటులోకి తెస్తారు. -
ఈకేవైసీ నమోదుకు రేషన్ డీలర్ల విముఖత
సాక్షి, అమరావతి: తెల్లరేషన్ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు చేసేందుకు పలువురు రేషన్ డీలర్లు విముఖత చూపుతున్నారు. వారికి బిజీగా ఉన్నామని, తర్వాత రావాలంటూ రోజుల తరబడి తిప్పుకుంటూ చుక్కలు చూపుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ప్రయోజనం కన్పించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.47 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 4.16 కోట్ల మంది పేర్లు (యూనిట్లు) నమోదై ఉన్నాయి. రేషన్ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేసినప్పటికీ 72 లక్షల మంది (యూనిట్లు) ఇప్పటికీ ఈ–పాస్ మిషన్లలో ఈకేవైసీ నమోదు చేసుకోలేదు. దీంతో వీరికి సంబంధించిన వేలిముద్రల వివరాలు అందుబాటులో లేవు. ఈ కారణంగా ఇందులో చాలా మంది తిరిగి మరోచోట తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల ఒక్కో కుటుంబానికి రెండు మూడు రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ఇలాంటి వారు రెండు మూడు కార్డులకు కూడా సబ్సిడీ బియ్యం తీసుకుంటున్నారు. ఈకేవైసీ చేసుకోనందున అనర్హుల చేతుల్లో కార్డులు ఉండి అర్హులైన పేదలకు అందకుండా పోతున్నాయి. -
ఇళ్లను మించిపోయాయి..
సాక్షి, బలిజిపేట (విజయనగరం): ప్రజా సాధికారిత సర్వే.. ఇంటింటా సర్వే... మరుగుదొడ్ల నిర్మాణ సమయంలో గ్రామాలు, పట్టణాలలో సర్వేలు... ఇలా ఎన్ని సర్వేలు నిర్వహించినా ఇళ్ల కంటే తెలుపు రంగు రేషన్‌కార్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డుల మంజూరులో నియంత్రణ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నివాస గృహాలకు మించి రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ.. ఎలా పుట్టుకొస్తున్నాయనే దానిపై అధికారులు స్పందించకపోవడం విశేషం. ఇల్లు ఒకటే ఉన్నా కార్డులు మాత్రం ఒకటి కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత ప్రభుత్వం సంక్షేమ పథకానికి తెలుపు రేషన్‌కార్డు అర్హతగా నిర్ణయించడంతో లెక్కకు మించి తెలుపు రంగు కార్డులు సృష్టించబడ్డాయనే విమర్శలు విని పిస్తున్నాయి. తెలుపు రేషన్‌కార్డు కావాలంటే టీడీపీ ప్రభుత్వంలో 1100 నంబర్‌కు డయల్ చేసి చెప్పాల్సి రావడంతో స్థానికంగా అధికారుల ప్రమేయం లేకుండా పోయింది. అనర్హుడుకి కార్డు వచ్చినా దానిని తొలగించేందుకు అధికారులకు ఎటువంటి అధికారం లేకుండా పోయింది. దీంతో పదేసి ఎకరాలున్నవారికి కూడా తెలుపు కార్డులు మంజూరయ్యాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల పేరు మీద కార్డులు పొందడం విశేషం. కార్డుదారులు మృతిచెందినా వారి కార్డులు తొలగించకపోవడం తదితర కారణాల వల్ల కార్డులు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. తెలుపు రేషన్‌కార్డుకు అర్హులు.. గ్రామంలోనే నివాసముండాలి. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఇన్‌కమ్‌టాక్స్ పరిధిలోకి రాకూడదు. పెద్దపెద్ద వాహనాలు ఉండకూడదనే నిబంధనలున్నాయి. ఇన్ని నిబంధనలున్నా కార్డులు విపరీతంగా మంజూరయ్యాయి. అందుకు కారణం స్థానికంగా ఉండే అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే అని చెప్పుకోవచ్చు. సంక్షేమ పథకాలకు తప్పనిసరి ఇల్లు, పింఛన్, కార్పొరేషన్ రుణాలు పొందాలన్నా.. ఇతరత్రా ఎటువంటి సంక్షేమ పథకం అయినా పొందాలంటే తెలుపు రంగు రేషన్‌కార్డు ఉండాల్సిందే. దీంతో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నవారు కూడా అప్పటికప్పుడు కార్డులో ఉన్న పేర్లు తొలగించుకుని కొత్తగా రేషన్‌కార్డులు పొందారు. ఒక దశలో భార్యాభర్తలు వేర్వేరుగా ఉన్నట్లు కూడా 1100కు డయల్ చేసి తెలుపు కార్డులు పొందిన సంఘటనలున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సన్న, చిన్నకారు రైతులకే కాకుండా భూస్వాములకు సైతం తెలుపు రేషన్ కార్డులు కేటాయింపులు జరగడం విశేషం. అదనంగా ఉండవు రేషన్‌కార్డుకు ఆధార్ లింక్ అవుతుంది కనుక అదనపు కార్డులు అనేవి ఎక్కడా ఉండవు. కుటుంబాల సంఖ్య పెరిగినందున కార్డులు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ విధానం అయినందున ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశాలు లేవు. – సుబ్బరాజు, డీఎస్ఓ, విజయనగరం -
ఇక సన్న బియ్యం సరఫరా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 1.47 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సన్నబియ్యాన్ని గ్రామ వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే పంపిణీ చేసే ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, శ్రీరంగనాథరాజు, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తదితరులు శుక్రవారం సచివాలయంలో సమావేశమై సన్న బియ్యం సేకరణ, పంపిణీపై చర్చించారు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన బియ్యం నాసిరకమైనవి కావడంతో వండుకుని తినడానికి పనికి రాలేదనే ఆరోపణలున్నాయి. దీంతో చాలా మంది పేదలు సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్లో తక్కువ ధరకే విక్రయించేవారు. ఇవే బియ్యం రీసైక్లింగ్ ద్వారా ఎఫ్‌సీఐకి వెళ్లి తిరిగి రేషన్ షాపులకు వచ్చే విధానం ఇన్నాళ్లూ కొనసాగింది. ప్రజలు ఏ రకం బియ్యం తింటున్నారో అవే పంపిణీ.. ప్రజలు ఏరకం బియ్యం తింటున్నారో అవే రకం బియ్యాన్ని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేయడంతో బియ్యం సేకరణపై సమావేశంలో చర్చించారు. స్వర్ణ, 1121 రకానికి చెందిన బియ్యం ప్రస్తుతం ఏమేరకు అందుబాటులో ఉన్నాయో వివరాలు సేకరించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా టీంలను పంపారు. రాష్ట్రంలో 1000, 1010, 1001 రకం బియ్యం రైతులు పండిస్తున్నా రాష్ట్రం ఆ రకానికి చెందిన బియ్యం తినడం లేదని సమావేశంలో చర్చకు వచ్చింది. ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సరఫరా విషయమై చర్చించేందుకు ఈ నెల 26వతేదీన సరఫరాదారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కల్తీలేని, తినేందుకు అనువైన సన్నబియ్యాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పేదలకు పంపిణీ చేస్తామన్నారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని గుర్తించామని, సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై రూ.1000 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేశామని మంత్రి కొడాలి వివరించారు. -
అంతా మాయ!
‘హలో... మీకు తెల్ల రేషన్‌కార్డు ఉందా... ఉంటే 1 నొక్కండి... లేదంటే 2 నొక్కండి’ అంటూ ఇటీవల కొందరికి ప్రభుత్వం తరఫున ఫోన్‌కాల్స్ వచ్చాయి. అందులో లేదు అని నొక్కినవారందరికీ అర్హతలతో సంబంధం లేకుండా తెల్ల రేషన్‌కార్డు మంజూరు చేసేశారు. నాలుగున్నరేళ్లుగా కార్డులకోసం కళ్లు కాయలు కాసేలా చూస్తున్న ఎంతోమందికి మొండి చెయ్యి చూపిన సర్కారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ... అమాంతం ప్రేమ పుట్టుకొచ్చేసి... కొత్తగా తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేశారు. తీరా వచ్చిన జాబితాలో 25శాతానికి పైగా ప్రభుత్వ ఉద్యోగులే ఉండటంతో అంతా ఖంగు తిన్నారు. విజయనగరం గంటస్తంభం: సాంకేతికత అంటే అంతా సక్రమంగా ఉంటేనే. లేదంటే లేనిపోని తలనొప్పులకు తావిస్తుంది. ఇప్పుడు రియల్టైమ్స్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) కూడా ఇలాంటి కొత్త సమస్యలనే తెచ్చింది. క్షేత్రస్థాయిలో సక్రమంగా పరిశీలనలు జరపకుండా ఏ పథకానికి ఎవరు అర్హులో గుర్తించకుండా... ఏకంగా సచివాలయం నుంచే అన్ని పథకాలకూ లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పి అర్హులకు మొండిచెయ్యి చూపుతున్నారు. పనిలోపనిగా అనర్హులకు అన్నీ వర్తింపజేసేస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తికమక అంతా ప్రభుత్వోద్యోగులకు తెల్ల రేషన్‌కార్డులను మంజూరు చేయడమే. ఇక తెలియని ఎన్ని పథకాలు అనర్హులకు అందుతున్నాయనేది ఒక్కసారి పరిశీలించుకోవాల్సిందే. అన్నింటికీ అదే కారణం రేషన్‌కార్డు ఎందుకు రాలేదు... పింఛను ఎం దుకు పోయింది?... ఇళ్లు మంజూరుకు దరఖాస్తు పెట్టినా ఎందుకు మంజూరు కాలేదని లబ్ధిదారులు అడిగితే అధికారులు చెప్పే మాట ఆర్టీజీఎస్. తమ చేతిలో ఏదీ లేదని అం తా ఆ విధానం ద్వారానే జరుగుతుందని తప్పుకుంటున్నారు. తాజాగా జిల్లాకు ప్రభుత్వం 9165 తెల్ల రేషన్‌కార్డులు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ వివరాలు ఇటీవల జిల్లా పౌరసరఫరాల అధికారులకు పంపించారు. లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. ఆ సమయంలోనే అసలు లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ప్రభు త్వ ఉద్యోగులకు రేషన్‌కార్డులు మంజూరయ్యా యి. ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి, అక్కడివారు ఆర్టీ జీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అదంతా నిజ మేనని నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్‌కార్డులు మంజూరైనట్లు తేలింది. జిల్లాలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు 2809మందికి రేషన్‌కార్డులు మంజూ రైనట్లు స్పష్టమైంది. మండలాల వారీగా వారి జా బితాను ఉన్నతాధికారుల నుంచి జిల్లాకు అందిం ది. విజయనగరం మండలంలో 806మం ది, కొత్తవలసలో 254, ఎస్కో టలో 263మంది ఉద్యోగులకు తెల్ల కార్డులు వచ్చి నట్లు సమాచారం. మిగతా మండలాల్లో పదులు, వందల సంఖ్యలో ఇలా కార్డులు మం జూరైనట్లు సమాచారం. దీంతో వారి కార్డులు నిలుపుదల చేయాలని అధికారులు నిర్ణయిం చారు. అంతేగాదు... మంజూరైనవారిలో ఇంకొంతమంది అనర్హులు ఉన్నట్టు తెలుస్తోంది. గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెం దిన రిటైర్డు ఉద్యోగి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చిం తల అప్పారావుకు రేషన్‌కార్డు మంజూరు కావడం ఇందుకు నిదన్శనం. పూర్తిస్థాయి విచారణ జరిగితే ఎంతమంది అధికా రపార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర అనర్హుల కు కార్డులు మంజూరయ్యాయో స్పష్టమవుతుంది. విధానంలోనే లోపాలు వాస్తవానికి ఇప్పుడు రేషన్‌కార్డు మంజూరైందని చెబుతున్నవారెవరూ స్థానికంగా అధికారులకు దరఖాస్తు చేసుకోలేదు. అధికారులు విచారణ చేసి అర్హత తేల్చలేదు. 1100, ఆర్టీజీఎస్ ద్వారా ప్రభు త్వ పనితీరుపై సమాచారం తెలుసుకునేందుకు, రేషన్ సిస్టమ్‌పై అభిప్రాయం కోసం ఫోన్లు చేస్తున్న విషయం తెలిసిందే. వారు అడిగిన ప్రశ్నల్లో రేషన్‌కార్డు ఉందా లేదా అని అడిగి లేదని నమోదు చేసుకోగానే వారికి తెల్ల రేషన్‌కార్డు మం జూరు చేశారు. మంజూరుకు ముందు ప్రజా సాధికార సర్వే డేటాను అనుసంధానం చేసినా వీరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తెలుపు రేషన్‌కార్డు లింకు అయి ఉండకపోవడం కూడా ఇందు కు కారణమే. ఇదంతా చూస్తే ఉద్యోగుల ప్రమే యం లేకుండా రేషన్‌కార్డులు మంజూరు కావడం వెనుక ఆర్టీజీఎస్ లోపమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం మంజూరైన మిగతా కార్డులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనతోనే న్యాయం సాధారణంగా ఏదైనా పథకానికి అర్హులైనవారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న తరువాతనే ఎంపిక చేయాలి. అలా కాకుంటే లేని పోని తలనొప్పులు వస్తాయి. రేషన్‌కార్డులు మంజూరు విషయంలో గతంలోనూ పొరపాటు జరిగింది. «నవనిర్మాణ దీక్ష సందర్భంగా జిల్లాకు 6530 రేషన్‌కార్డులు మంజూరు చేశారు. ఈ వివరాలు జిల్లా పౌరసరఫరాల అధికారులకు కూడా పంపించా రు. కార్డులు మంజూరైనట్లు వారు వెల్లడించారు. అయితే ఆర్టీజీఎస్ అధికారులు తర్వాత కార్డుదారులు వివరాలను ప్రజాసాధికారసర్వేతో లిం కు చేయడంతో అందులో 283 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. మిగతావన్నీ రద్దు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్టీజీఎస్ పని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచా రం మొత్తం సక్రమంగా లేకుండా ఇలాంటి ప్ర యో గాలు, ఎంపిక విధానాలు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో విచారణ చేసి అసలైన అర్హులకు కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మంజూయ్యాయి రేషన్‌కార్డులు మంజూరులో మా పాత్ర లేదు. అంతా ఆర్టీజీఎస్ విధానంలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కానీ జిల్లాలో అనేకమంది ఉద్యోగులకు కార్డులు వచ్చాయి. ఆ వివరాలు ఉన్నతాధికారులు పంపించారు. కావున వాటిని నిలుపుదల చేస్తాం. మిగతా కార్డుదారుల అర్హత విషయంలోనూ క్లారిటీ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం.– ఎం.రవిశంకర్, ఏఎస్వో, విజయనగరం -
దరఖాస్తులు కొండంత.. మంజూరు గోరంత!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : తెల్లరంగు రేషన్‌కార్డు (బీపీఎల్)! ఇప్పుడది కావాలంటే పచ్చచొక్కాల జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి! కాదని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం! సంతృప్తికరస్థాయిలో అర్హులందరికీ రేషన్ కార్డులిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మరో హామీ కూడా హుష్‌కాకి అయిపోయింది. కొత్త రేషన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ దఫాలోనూ నిరాశే మిగిలింది. కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా కార్డు వస్తుందని ఆశించి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. మూడో వంతు బుట్టదాఖలే... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. 2016 డిసెంబరు నాటికి 51,340 వేల కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 26,529 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే సగానికి సగం దరఖాస్తులను ప్రభుత్వం చెత్తబుట్టలో వేసింది. మళ్లీ 2017 జనవరి నుంచి డిసెంబరు వరకూ 25,883 కుటుంబాలు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రెండు విడతల్లో 7,094 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే నాలుగో వంతు మాత్రమే వచ్చాయి. తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకూ 4,487 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, కేవలం 908 కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. అంటే ఏడాదిన్నర కాలంలో 30,370 కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం కేవలం 8,002 కార్డులను మాత్రమే మంజూరు చేసింది. కోరినవారందరికీ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి సహా టీడీపీ నాయకులు ప్రతి వేదికపై ఊదరగొడుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం కనీసం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎక్నాలెడ్జ్మెంట్ నంబరు పొందిన కుటుంబాలకు రేషన్ కార్డు మంజూరుకావట్లేదు. ఈ కార్డుల విషయంలోనూ జన్మభూమి కమిటీలు చక్రం తిప్పి తమకు అనుకూలమైనవారికి, చేయి తడిపినవారికే కార్డులు దక్కేలా చూస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సంక్షేమం’ తగ్గించేసినా... దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు తెలుపు రేషన్‌కార్డు మంజూరైతే వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు నెలానెలా అందించాల్సి ఉంది. గత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతినెలా తొమ్మిది నిత్యావసర సరుకులు రేషన్ డిపోల ద్వారా అందేవి. అంతేకాదు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సదుపాయం కూడా లభించేది. పిల్లలకు ఉపకార వేతనాల మంజూరులోనూ ఈ కార్డే కీలకంగా ఉండేది. ఈ ఆశతోనే తెల్లరేషన్ కార్డు తమకొక హక్కుగా పేద, సామాన్య కుటుంబాలు భావించేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యం వరకే సరుకుల పంపిణీని పరిమితం చేసింది. ఆరోగ్య శ్రీ పథకం పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చినా కొన్ని రకాల చికిత్సలను తొలగించింది. అయినప్పటికీ తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య తగ్గట్లేదు. రిజిస్ట్రేషన్ కోసం అగచాట్లు.. రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియలోనూ వ్యయప్రయాసలు తప్పట్లేదు. దరఖాస్తుతో పాటు కుటుంబసభ్యుల ఫొటో, ఆధార్ కార్డు నకలు జత చేయాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు అంతకుముందు ఏదైనా కార్డులో తమ పేరు నమోదై ఉంటే ముందుగా తొలగించుకోవాలి. ఈ ప్రక్రియ సవ్యంగా పూర్తి చేస్తేనే దరఖాస్తు రిజిస్ట్రేషన్ అవుతుంది. తద్వారా ఎక్నాలెడ్జ్మెంట్ నంబరు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏడాది పొడవునా సాగినప్పటికీ జన్మభూమి కమిటీలు మూకుమ్మడిగా సిఫారసు చేసిన దరఖాస్తులకే మంజూరు కావడం గమనార్హం. మిగతా దరఖాస్తులను ప్రభుత్వం అకారణంగా తిరస్కరిస్తోంది. చివరకు సింగిల్ యూనిట్ (కుటుంబంలో ఒకే సభ్యులు) ఉన్నవారికి రిజిస్ట్రేషన్‌కూ అవకాశం లేకుండా చేసింది. మంజూరు జాబితాలో పేరులేకపోతే మళ్లీ కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. మళ్లీ ప్రక్రియ మొదటికొస్తుందన్న మాట! రాజకీయ కక్షాలతో తొలగింపు... రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ గ్రామస్థాయిలో ఆయా దరఖాస్తుల విచారణ రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. తర్వాత జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉంది. ఇక్కడే తిరకాసు పెడుతున్నారు. తమకు అనుకూలమైన, టీడీపీ కార్యకర్తల కుటుంబాల దరఖాస్తులకే సిఫారసు పంపిస్తున్నారు. తమకు అనుకూలంగా లేనివారు, గత ఎన్నికలలో సహకరించనివారు తెల్ల రేషన్‌కార్డు పొందేందుకు అర్హులైనప్పటికీ ఈ కమిటీలు అడ్డుకుంటున్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ రాజకీయ పక్షపాత ధోరణి వల్ల నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త కార్డుల కోసం గతంలోనున్న కార్డుల్లో పేరును తొలగించుకోవడంతో తీరా కొత్త కార్డు రాక, పాత కార్డులో పేరు లేక రెండు విధాలా నష్టపోతున్నారు. ఒకప్పుడు రేషన్ కార్డు మంజూరు అధికారం తహసిల్దారు పరిధిలో ఉండేది. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం తహసిల్దార్లకు కాదు కదా జాయింట్ కలెక్టరు, జిల్లా కలెక్టర్‌కూ కూడా లేకుండా చేశారు. నేరుగా పౌరసరఫరాల కమిషనరేట్ నుంచే మంజూరు ప్రక్రియ చేపడుతున్నారు. దీంతో అర్హులకు తెల్లరేషన్‌కార్డు అనేది అందని ద్రాక్షగా మారింది. -
దారిద్య్ర రేఖకు దిగువన 2.74 కోట్ల మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) 2.74 కోట్ల మంది ప్రజలున్నారని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర నిబంధనల ప్రకారం ఈ సంఖ్య తక్కువ ఉందని, కానీ రాష్ట్రంలో ఉదారంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉదారంగా సాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా బీపీఎల్ సంఖ్యను నిర్ధారించామన్నారు. 2 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుల కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ రేషన్ కార్డులు కేవలం బియ్యం కోసమేనన్నారు. వరుసగా మూడు నెలలు బియ్యం తీసుకోని వారి కార్డులు రద్దవుతున్నాయన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు. అయితే బియ్యం తీసుకోబోమని ఎవరైనా తమకు విన్నవిస్తే.. ఆయా కార్డులపై ఒక స్టాంప్ వేసి అవి రద్దు కాకుండా చూస్తామని చెప్పారు. వారం పది రోజుల్లో పూర్తి చెల్లింపులు.. రబీలో రికార్డు స్థాయిలో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఈటల తెలిపారు. వారం రోజుల్లోగా చివరి గింజ వరకూ రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. వారం పది రోజుల్లోగా కొన్న ధాన్యానికి పూర్తిస్థాయిలో చెల్లింపులు జరుపుతామన్నారు. డీలర్లకు కమీషన్ పెంచే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
రేషన్ కార్డుకు అవాంతరాలు
సాక్షి, రాజమహేంద్రవరం: తెల్ల రేషన్ కార్డు మంజూరుకు అర్హులైన లబ్ధిదారులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నా యి. అర్హత ఉన్నా ప్రజా సాధికారిత సర్వేలో తమ పేర్లు నమోదు చేసుకోకపోవడం, ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో పేర్లు ఉండ డం కొత్త కార్డు మంజూరుకు అవరోధంగా మారాయి. కొత్త రేషన్ కార్డు పొందడానికి లబ్ధిదారులు చేయాల్సిన పనులపై యం త్రాంగం అవగాహన కల్పించకపోవడంతో ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల్లో తీసుకున్నారు. జిల్లాలో 33 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖా స్తు ఎప్పడు ఇచ్చినా జనవరిలో నిర్వహించే జన్మభూమి సభల్లో కొత్తకార్డులు మంజూ రు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. సభల్లో 16,200 మందికి కార్డులు మంజూరు చేశారు. మిగిలిన వారికి ఎందుకు రాలేదోనన్న విషయంపై స్పష్టత కరువైంది. తమకు కార్డు ఎందుకు రాలేదో అన్న విషయం జన్మభూమి సభల్లో అడిగినా అధికారుల నుంచి సమాధానం కరువైంది. కొంతమంది తమకు కార్డు ఎందుకు రాలేదు? అంటూ తహసీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెట్టారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డులో మీరు సభ్యులుగా ఉన్నారంటూ కార్యాలయాల్లోని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దరఖాస్తుదారుల్లో కొంతమంది వివరాలు ప్రజా సాధికారిత సర్వేలో నమోదు కాకపోవడం వల్ల కార్డులు మంజూరు కాలేదు. ఇప్పుడూ పాత కథే.. జూన్ రెండో తేదీన కొత్త రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ఆదివారం నుంచి అనుమతిచ్చింది. ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మంగళవారం వరకూ గడువు ఇచ్చింది. జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు ఆదివారం నుంచి రాత్రి వేళల్లో కూడా పని చేసి ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎప్పటిలాగే పాతకథే పునరావృతం అయింది. ప్రజా సాధికారిత సర్వేలో పేర్లు నమోదు చేసుకోకపోవడం వల్లే అత్యధిక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటికే తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులుగా ఉండడం వల్లనూ దరఖాస్తులు ఆన్లైన్ కాలేదు. ఎమ్మెల్యే పంపారు.. ఎందుకు రాదు? కొత్త కార్డు కోసం పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫారసులతో తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. వారి దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లు ప్రయత్నిస్తుండగా కారు, ఆదాయం ఎక్కువగా ఉండడం, ప్రజా సాధికారిత సర్వేలో లేకపోవడం, ఇప్పటికే కార్డులో సభ్యులుగా ఉండడంతో ఆన్లైన్ కావడంలేదు. అదే విషయాన్ని కంప్యూటర్ ఆపరేటర్లు వారికి చెబుతున్నా ‘ఎమ్మెల్యేగారు, ఎమ్మెల్సీగారు పంపారు? ఎందుకు కాదు?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారికి వివరంగా, అర్థమయ్యేలా చెప్పేసరికి కంప్యూటర్ ఆపరేటర్ల తల ప్రాణం తోకకు వస్తోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ పరిశీలిస్తే కొత్త కార్డులు ఎంత శాతం వస్తాయో అర్థం చేసుకోవచ్చు. 50 డివిజన్ల నుంచి 1,062 దరఖాస్తులు రాగా ఇందులో 600 దరఖాస్తులకు సంబంధించి ప్రజా సాధికారత సర్వేలో లబ్ధిదారుల వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఆన్లైన్ కాలేదు. మరో 353 దరఖాస్తులు ఇప్పటికే కుటుంబ సభ్యుల కార్డుల్లో నమోదై ఉండడంతో వెబ్సైట్ తిరస్కరించింది. 9 దరఖాస్తులు ఇప్పటికే ఆన్లైన్ అవగా కొత్తగా 100 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ అవడం గమనార్హం. దీనినిబట్టి నగరంలో దరఖాస్తు చేసుకున్న 1,062 మందికిగాను 109 మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. ఈ దరఖాస్తులను కూడా అధికారులు ఆరు దశల్లో పరిశీలన చేసిన తర్వాత కార్డులు మంజూరు చేయనున్నారు. -
సర్వేశ్వరా..!
తెల్లకార్డు.. పేదలకు ఆధారం.. పల్లె నుంచి పట్టణ ప్రజల వరకు కార్డు కోసం ఎదురు చేస్తుంటారు.. రేషన్ నుంచి వైద్యం వరకు కార్డుతోనే లబ్ధి.. సబ్సిడీ అవకాశం ఉండడంతో పేదలు ఆసరాగాభావిస్తున్నారు.. ప్రభుత్వం మాత్రంఎప్పటికప్పడు దొడ్డిదారిన తొలగించేందుకు ఎత్తులు వేస్తుంటోంది.. అందులో భాగంగా సాధికార సర్వే చేయించింది. దీంతో లక్షల కార్డులు రద్దుకానున్నాయని వార్తలు వస్తున్నాయి.. దీంతో పేదలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, విజయవాడ: జిల్లా 12.57లక్షల తెల్ల రేషన్‌కార్డు లున్నాయి. గత ఏడాది జిల్లాలో నిర్వహించిన సాధికార సర్వేలో వేలాది మంది సర్వే చేయించుకోలేకపోయారు. ప్రస్తుతం తెల్లరేషన్‌కార్డు ఉండి సాధికార సర్వే చేయించుకోని వారు జిల్లాలో 2.07 లక్షలు మంది ఉన్నట్లు పౌరసరఫరాల అధికారులు నిర్ధారించారు. ఈ కార్డులను త్వరలోనే సాధికార సర్వే చేయించాలని, సాధికార సర్వేలో గుర్తింపు పొందని కార్డులను తొలగించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. సర్వేలో ఆర్థిక పరిస్థితిని తెల్లకార్డు కొనసాగించలా లేదా అని నిర్ణయించనున్నారు. సర్వే జరుగుతున్న సమాచారం చాలా మందికి తెలియదు. సర్వే చేసిన రెవెన్యూ, నగర పాలకసంస్థ సిబ్బంది కేవలం కొన్ని ప్రాంతాలను మాత్రమే చేసి, పేదల బస్తీలు, మారు మూల ప్రాంతాలను సర్వే చేయలేదు. సర్వే సరిగా చేయకుండా ఇప్పుడు కార్డులు తొలగిస్తే తాము ఇబ్బంది పడిపోతామని కార్డుదారులు వాపోతున్నారు. కొత్త రేషన్ కార్డులకు సాధికార సర్వేఅవసరం... జనవరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లాలో సుమారు 30 వేల మంది కొత్తగా తెల్లరేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుతో పాటు సాధికార సర్వే చేయించినట్లు గుర్తింపు ఉంటేనే కొత్త కార్డు జారీ చేస్తామని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. అందువల్ల సాధికార సర్వే చేయించుకోకపోతే చేయించుకుని ఆ తరువాతనే తెల్ల రేషన్‌కార్డులు తీసుకోవాలని సూచిస్తున్నారు. తిరిగి సాధికార సర్వే... జిల్లాలో మరోకసారి సాధికార సర్వే చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 15 రోజుల్లో సర్వేలో ప్రతిఒక్కరూ పాల్గొన్నాలని కలెక్టర్ లక్ష్మీకాంతం కోరారు. దీనికోసం తిరిగి టీమ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా తెల్లకార్డు కలిగి ఉండి సాధికార సర్వేలో చేయించుకోని వారు తక్షణం సర్వేలో పాల్గొనాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వరరావు తెలిపారు. అందువల్ల తెల్లకార్డుదారులు తప్పని సరిగా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి సాధికార సర్వేలో తమ పేర్లు నమోదయ్యేటట్లు చూసుకోవాలన్నారు. -
23.89 లక్షల కార్డులకు రేషన్ బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 23.89 లక్షల మంది తెల్లరేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సబ్సిడీ సరుకులు అందే పరిస్థితి కనిపించటం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బహిరంగంగా ప్రకటించడంతో పేదల్లో ఆందోళన మొదలైంది. ‘ప్రజా సాధికార సర్వే (పల్స్)లో నమోదు చేసుకోని కార్డుదారులకు మార్చి నెల నుంచి రేషన్ నిలిపివేయబడుతుంది’ అని పలు రేషన్ దుకాణాల వద్ద నోటీసులు అతికించారు. పల్స్ సర్వేలో ఇప్పటివరకు వివరాలు నమోదు చేసుకోని తెల్లరేషన్ కార్డుదారులు ఈ నెలాఖరులోగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళ్లి వివరాలు అందచేయాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సరుకులు ఇవ్వబోమని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల తెల్ల రేషన్ కార్డులుండగా 23.89 లక్షల మంది కార్డుదారులు ప్రజా సాధికార సర్వేలో వివరాలను నమోదు చేసుకోలేదని గుర్తించారు. -
తెలుపు రేషన్ కార్డులు పునరుద్ధరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన తెలుపు రంగు రేషన్ కార్డులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. బియ్యం, ఇతర సరుకులు అందజేయాలని కోరుతూ జిల్లా వీఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలు చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను, సంక్షేమాలను, రెవెన్యూ సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సక్రమంగా అందిస్తున్నారని చెప్పారు. వీఆర్ఏలను అన్ని పనులకు, పౌర సరఫరాల పనులకు వాడుకుంటున్నారని, అయితే తమ తెలుపు రంగు రేషన్ కార్డులు ఎత్తివేశారని ఆవేదన చెందారు. దీంతో కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రేషన్ కార్డులు పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం నాయకులు వై.అప్పలస్వామి, జె.ఎర్రయ్య, పి.శ్రీనివాసరావు, రాజయ్య, ప్రసాదరావు, రామచంద్రుడు, పున్నయ్య, రమణ, రాజారావు, లక్ష్మి, చిట్టయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు అఖిల పక్షాల నాయకులతో కలిసి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో రత్నాల నర్సింహమూర్తి, చౌదరి సతీష్, ఎ.రాధ, చాపర సుందర్‌లాల్, చౌదరి తేజేశ్వరరావు, తాండ్ర ఆరుణ, తదితరులు ఉన్నారు. -
నగరంలో సంపన్నుల కక్కుర్తి బయటపడింది
సాక్షి, సిటీబ్యూర్: గ్రేటర్ హైదరాబాద్‌లో సంపన్నుల కక్కుర్తి బయటపడింది. సొంత ఇల్లు, కారు ఉన్నవారు, బడా వ్యాపారులు కూడా ఆహార భద్రత కార్డులు పొందినట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. తాజాగా కుటుంబ సమగ్ర సర్వే వివరాలతో ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల ఆధార్‌ను అనుసంధానం చేయడంతో వారి చిట్టా వెలుగు చూసింది. మరోవైపు ఆస్తి పన్నుతో సైతం లబ్ధిదారుల ఆధార్ నంబర్‌ను పరిశీలిస్తున్నారు. నెల రోజుల నుంచి జరుగుతున్న పరిశీలనలో సుమారు 1.20 లక్షల కార్డుదారులు ఉన్నట్లు గుర్తించారు. అందులో హైదరాబాద్ పౌరసరఫరాల విభాగం పరిధిలో సుమారు సుమారు 70 వేల కార్డుదారులు, శివారులోని రంగారెడ్డి జిల్లా అర్బన్ పరిధిలో సుమారు 50 వేల కార్డులు ఉన్నాయి. దిద్దుబాటు........ పౌరసరఫరాల శాఖ తప్పుల దిద్దుబాటులో పడినట్లు కనిపిస్తోంది. తెల్లరేషన్ కార్డులను రద్దు చేసిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆధార్ ఆధారంగా అడ్డగోలుగా ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఆయితే సంఖ్యకు మించి కార్డులు జారీ కావడంతో వడపోత ప్రారంభించింది. గత ఆరు నెలలుగా కేటగిరి వారీగా పరిశీలిస్తూ అనర్హుల ఏరివేత కొనసాగిస్తోంది. తాజాగా సొంత కారు, ఇల్లు, వ్యాపారం కలిగిన కుటుంబాలను అనర్హులుగా గుర్తిస్తూ వారి కార్డుల రద్దుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 80 శాతం పైగా వడపోత పూర్తయిందని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
రేషన్‌కార్డుకు విద్యుత్ షాక్
బోగస్‌కార్డుల పేరుతో ఇప్పటికే పెద్దసంఖ్యలో రేషన్‌కార్డులను ప్రభుత్వం తొలగించింది. తాజాగా విద్యుత్‌బిల్లుతో లింకు పెట్టి మరికొన్ని కార్డులను తొలగించే కసరత్తు ప్రారంభించింది. రూ.వెయ్యి కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు కట్టే వారి రేషన్‌కార్డులను రద్దుచేసే ప్రక్రియ చేపట్టింది. విద్యుత్‌బిల్లు, వాహనాలు, భూమితో లింకు భారీగా రేషన్‌కార్డుల రద్దుకు యత్నం నెల్లూరు(పొగతోట)/ఉదయగిరి: ప్రజాపంపిణీ వ్యవస్థలో భారాన్ని తగ్గించుకునేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తొలుత ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులను తొలగించే పనిలో ప్రభుత్వం పడింది. ఇచ్చేది గోరంత.. తొలగించేది కొండంత అన్న చందంగా ప్రభుత్వ పాలన సాగుతోంది. జన్మభూమి కార్యక్రమంలో 55 వేల కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసింది. ప్రస్తుతం 1.50 లక్షల రేషన్‌కార్డులు తొలగించే విధంగా ప్రభుత్వం పావులుకదుపుతోంది. జిల్లాలో 8.16 లక్షల తెల్లకార్డులు జిల్లాలో 8.16 లక్షల తెల్లరేషన్‌కార్డులున్నాయి. 1872 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 24 లక్షల మంది రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌కార్డుకు ఆధార్ లింకు పేరుతో 50 వేల కార్డులు పైగా తొలగించారు. అంతటితో ఆగకుండా ఏదో ఒక లింకుతో గణనీయంగా కార్డులు తగ్గించేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. జిల్లాలో ఏడు లక్షలు పైగా గృహవిద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 50 వేల మందికి పైగా నెలకు రూ.1000 కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నట్లు అంచనా. ఇటీవల విద్యుత్ బిల్లులు భారీగా పెంచడంతో రూ.వెయ్యి కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు కట్టే వారి సంఖ్య పెరిగింది. దీనినే ఆసరాగా చేసుకుని 50 వేలకు పైగా రేషన్‌కార్డులు తొలగించేందుకు డిస్కం అధికారులద్వారా సమాచారం తెప్పించుకునే పనిలో ప్రభుత్వం ఉంది. అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే నెలకు రూ.650 కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లించే వారి సంఖ్యను కూడా చేర్చాలని ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. వీరిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 50 వేలకు పైగా కార్డులు రద్దవడం ఖాయం. వాహనాలతోనూ లింకు విద్యుత్ బిల్లుతోనే కాకుండా వాహనాలు కలిగి ఉన్న వారి సంఖ్యను కూడా లెక్క తేల్చాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అంటే నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనాలు కలిగిన వారి కార్డులుకూడా రద్దుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 31 వేల వరకు కార్లు ఉన్నాయి. వీటిలో చాలామంది బతుకుదెరువు కోసం వివిధ బ్యాంకుల్లో రుణం పొందో లేక అప్పోసొప్పో చేసి కార్లు నడుపుతున్నారు. వీరికి కూడా తెల్లరేషన్‌కార్డు రద్దయ్యే అవకాశముంది. అంతేకాకుండా 3.60 లక్షల ద్విచక్ర వాహనాలు జిల్లాలో ఉన్నాయి. ఇవి ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే మరో మూడు లక్షల కార్డులు రద్దయ్యే అవకాశముంది. అంతేకాకుండా భవనాలు కలిగిన వారిని కూడా సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. పక్కా భవనాలు కలిగిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇంకా చాలా కార్డులు రద్దయ్యే అవకాశముంది. ఐదెకరాలు భూమి ఉంటే కార్డు గోవిందా.. ఐదెకరాలకు మించి మెట్ట, రెండున్నర ఎకరాకు మించి మాగాణి పొలం ఉంటే తెల్ల రేషన్‌కార్డులు రద్దుకానున్నాయి. జిల్లాలో మెట్ట మండలాలల్లో ఐదెకరాలు మించి చాలామందికి భూములున్నాయి. వీటిలో చాలామందికి దేనికీ పనికిరాని బంజరు భూములున్నాయి. ఇలాంటి వారు కూడా కార్డులు కోల్పోయే ప్రమాదముంది. రాష్ట్రంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో ఒక ఎకరా భూమి సరాసరిన రూ.20 లక్షలు పైనే పలుకుతుంది. అదే ఒక ఎకరా భూమి నెల్లూరు జిల్లా ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో రూ.లక్ష కూడా పలికే పరిస్థితి లేదు. మరి రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని ఈ షరతును అమలు చేస్తే రాష్ట్రంలోని వెనుకబడిన మండలాల్లోని అనేక కుటుంబాలు తెల్ల రేషన్‌కార్డులు కోల్పోయే ప్రమాదముంది. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో నాడు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అనేక పథకాలు అమలులోకి తేగా, నేటి ప్రభుత్వం పథకాలలో లోటుపాట్లు, సవరణ అంటూ అనేకమంది అర్హులకు కూడా ఇబ్బందికలగజేస్తోంది. జన్మభూముల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా చెబుతూనే మరోవైపు దొడ్డిదారిన పెద్ద సంఖ్యలో కార్డులు తొలగించే ప్రక్రియ చేపట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది. -
చంద్రన్న...ఇవేమి కానుకలన్నా..
కల్తీ గోధుమ పిండి-సుద్ద బెల్లం కందిపప్పులో బఠాణీలు కార్డుదారుల ఆగ్రహం పెనమలూరు సుద్ద బెల్లం..తవుడు కలిసిన గోధుమ పిండి..కందిపప్పులో బఠాణీలు ఇవీ సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులు. సరుకులు నాసిరకంగా ఉండడంతో పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు ఆరు రకాల సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మండలంలో మొత్తం 30వేల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. క్రిస్మస్ సందర్భంగా సుమారు ఐదుల కార్డుదారులకు క్రిస్మస్ కానుక అందజేశారు. ప్రస్తుతం వాటిని మినహాయించి మిగిలిన 25 వేల కార్డుదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మండలంలోని 53 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రతీ తెల్లరేషన్ కార్డుదారుకు ఆరు రకాల సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో బెల్లం, కందిపప్పు, శెనగపప్పు అరకిలో చొప్పున, నెయ్యి వంద గ్రాములు, గోధుమ పిండి కిలో, అరలీటరు పామాయిల్ ఉన్నాయి. ఈ సరుకులను గురువారం నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేశారు. సరుకులు తీసుకున్న లబ్ధిదారులు వాటిని చూసి తెల్లమొఖం వేశారు. బెల్లం నల్లగా, సుద్దగా ఉంది. ఇక కందిపప్పులో బఠాణీ గింజలు కలసి నాసిరకంగా ఉంది. గోధుమ పిండి జల్లడపడితే తవుడు బయట పడింది. ఇక మిగితా సరుకులు అంతంతమాత్రంగా ఉన్నాయి. కార్డుదారులు పెదవి విరుస్తున్నారు. పేదలంటే అలుసా..? చంద్రన్న కానుక కింద ఇచ్చిన సరుకులు కల్తీ, నాసిరకంగా ఉన్నాయని, వీటిని చంద్రబాబు తిని చూపితే తాము తింటామని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల సొమ్ముతో అవినీతికి పాల్పడి ఇటువంటి సరుకులు పండుగకు ఇవ్వటం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సరుకులు తీసుకుని పండుగకు ఏ వంటకాలు చేసుకోవాలని వాపోతున్నారు. రేష్షాపుల్లో నాణ్యమైన సరుకులు ఇస్తారని ఎంతగానో ఆశపడ్డామని తీరా సరుకులు తీసుకెళ్లిన తర్వాత నిరాశేమిగిలిందని తెలిపారు. కొత్త కార్డులకు అందేనా? జన్మభూమి సభల్లో పంపిణీ చేస్తున్న తెల్లరేషన్‌కార్డులకు చంద్రన్న కానుక సరుకులు అందుతాయో లేదో తెలియన లబ్ధిదారులు అయోమయంలో ఉన్నాయి. మండలంలో కొత్తగా సుమారు 2,500 కార్డులు పంపిణీ చేశారు. వీరికి కూడా సరుకులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో వారిలో ఆశలు చిగురించాయి. అయితే గురువారం నుంచి పంపిణీ ప్రారంభించిన డీలర్లు కొత్తకార్డులకు సరుకులు ఇవ్వడం లేదు. రెండురోజుల తర్వాత ఇస్తారని భావిస్తున్నారు. ఇదేమి బెల్లం రేషన్ షాపుల్లో చంద్రన్న కానుక కింద ఇచ్చిన బెల్లం దారుణంగా ఉంది. ఈ బెల్లం తింటే జబ్బులు వచ్చి మంచాన పడతాము. బెల్లం నల్లగా ఉండి కారిపోతుంది. పండుగకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. కె.పంచాద్రీయరావు, యనమలకుదురు కందిపప్పులో బఠాణీలు కందిపప్పులో బఠాణీ గింజలు కలిపారు. పైగా పప్పు మందంగా ఉంది. దీనిని వండుకోవటం వలన ఉపయోగంలేదు. పండుగకు నాసిరకం సరుకులు ఇవ్వటం తగదు. నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలి. ఎం.నిర్మల, యనమలకుదురు గోధుమ పిండి పనికిరాదు గోధుమ పిండిలో తవుడు కలిపారు. ఈ పిండి తో ఏమి చేయాలో తెలియటంలేదు. ఈ పిండితో చేసిన వంటకాలు తింటే ఇబ్బందే. పండుగకు నాసిరకం సరుకులు ఇవ్వటం తగదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచి సరుకులు ఇవ్వాలి. చల్లా జయలక్ష్మి, యనమలకుదురు -
తెల్లకార్డులకు కత్తెర
ప్రస్తుతం 85 శాతం మందికే సరుకులు ఆహార భద్రతా చట్టం ప్రకారం 67 శాతం మందికే అంటున్న కేంద్రం మిగిలిన 18 శాతం మందికి ఎగనామం జిల్లాలో 3.2 లక్షల కార్డుల తొలగింపునకు సన్నాహాలు దరఖాస్తు చేసుకున్నా కొత్త కార్డులు ఇక లేనట్టే అయోమయంలో పేదలు తెల్ల రేషన్‌కార్డులకు కోతపెట్టేందకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనలను సాకుగా చూపి కొత్తకార్డుల జారీకి మంగళం పాడేందుకు రెడీ అయిపోయింది. మరో సారి సర్వేల పేరుతో ఉన్నకార్డులను ఊడబెరికి పచ్చచొక్కాలోళ్లకు కట్టబెట్టేందుకు సమాయత్తమైంది. చిత్తూరు:కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దారిద్య్రరేఖకు దిగువునున్న తెల్ల రేషన్కార్డుదారులైన పేదలకు శాపంగా మారింది. 67 శాతం మందికి జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని వర్తింపచేస్తామని తాజాగా ప్రకటించింది. దీన్ని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున తెల్లరేషన్‌కార్డుల తొలగించేందుకు సమాయ త్త మవుతోంది. ఇప్పటివరకు జిల్లా జనాభాలో 85 శాతం మందికి తెల్లరేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తాజా గా ప్రకటించినట్లు 67 శాతం మందికి మాత్రమే ఆహార భద్రత చట్టం వర్తింపజేసే పక్షంలో మిగిలిన 18 శాతం మంది పేదలు ఆహారభద్రత కోల్పోతారు. వారికి నిత్యావసర సరుకులు అందే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాలో 10,39,953 నివాస గృహాలు ఉండగా 41,74,064 వేల జనాభా ఉన్నారు. వీరిలో 9,80,888 కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డులున్నాయి. 1,34,162 కుటుంబాలకు చక్కెర కార్డులున్నాయి. వీరుగాక మరో 1,17,524 మంది కొత్తగా తెల్లరేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 1,06,811 మంది తెల్లరేషన్‌కార్డులకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. కానీ రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 67 శాతం మందికి మాత్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సరుకులు పంపిణీ చేస్తామని తేల్చి చెప్పిన నేపథ్యంలో మిగిలిన 18 శాతం మందిని ఆహార భద్రతా చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ప్రస్తుతమున్న 9,80,888 తెల్లరేషన్‌కార్డుల్లో 6,57,195 (67 శాతం) తెల్లకార్డులను మాత్రమే ఉంచి, మిగిలిన 3,23,693 (18శాతం) తెల్లరేషన్‌కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. గుత్తమొత్తంగా అన్ని కార్డులను ఒకేసారి తొలగి స్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో మరోమారు బోగస్ కార్డుల ఏరివేత సాకుతో తెల్లకార్డులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెల్లరేషన్‌కార్డుల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడినట్లే. కార్డుల కోసం ఎదురుచూస్తున్న 1,17,524 మంది పేదలకు కార్డులు అందే అవకాశం లేనట్టేనని సమాచారం. తెలుగు తమ్ముళ్లకే తెల్లకార్డులు కేంద్ర ఆహారభద్రతా చట్టం సాకుతో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పి వారికి మినహా మిగిలిన వారి తెల్లకార్డులన్నింటినీ తొలగించేందుకు అధికార పార్టీ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే జన్మభూమి కమిటీల మాటున అర్హులైన పేదల కార్డులను ఏకపక్షంగా తొలగిస్తున్న అధికార పార్టీ నేతలు కేంద్రం తాజా ఉత్తర్వులను అనువుగా చేసుకు పెద్ద ఎత్తున అర్హుల రేషన్‌కార్డులను తొలగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రత్యేకించి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల తెల్లకార్డుల తొలగింపే ధ్యేయంగా తెలుగు దేశం నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బంగారు తెలంగాణ ఇలా?
బంగారు తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత తహసిల్దార్లపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడం వాస్తవం. ప్రజల కోసం పనిచేసే అధికార్లలో తహసిల్దార్లదే ప్రథమస్థానం. ఎందుకంటే ప్రభు త్వ పథకాలు ఠంచనుగా ప్రజల చేతికి అందాలంటే తహసిల్దార్ల పాత్ర ను ఎవరూ తక్కువ చేయకూడదు. 2012లో ఒక తహసి ల్దారిణి సింగరేణి ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నా యని తెలిసి వంద రేషన్ కార్డులను ఏరివేశారు. తన కార్యాలయాన్ని అవినీతికి ఆమడదూరంలో ఉంచారు. 2013 జనవరిలో ఈమె తాండూరు తహసిల్దారుగా నిత్యావసర వస్తువుల అక్రమ సరఫరాను అడ్డుకుని 200 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనపర్చుకుని భారత ఆహార కార్పొరేషన్ -ఎఫ్‌సీఐ-కి పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిజాయితీపరులైన అధి కారుల సేవలను, అంకితభావాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఆహార భద్రత పథకం నిజమైన అర్హులకు మాత్రమే అంది పేదల కడుపు నిండుతుం ది. వీలైతే ఉత్తరప్రదేశ్‌లో గుత్తేదార్ల అవినీతిని అడ్డుకుని విశేష ప్రచారం పొందిన ఈ గడ్డకు చెందిన ఉన్నతాధికారిణి చంద్రకళను డిప్యుటేషన్‌పై తెలంగాణకు రప్పించాలి. నిజాయితీ ఉన్న అధికారులను కాపాడుకు నేలా, ప్రోత్సహించేలా కేసీఆర్ తగు చర్యలు చేపట్టాలని విన్నపం. -
17.39 లక్షల రేషన్ కార్డులు కట్
* రచ్చబండలో జారీ చేసిన 8.50 లక్షల కూపన్లపైనా దృష్టి * భారం తగ్గించుకునేందుకు సర్కారు ఎత్తుగడలు * లబ్ధిదారులు స్థానికంగా లేరంటూ సాకులు సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. లబ్ధిదారులు స్థానికంగా లేరని, కార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డులు లేవనే తదితర కారణాలు చూపుతూ కోత పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నాటికి రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇచ్చిన కూపన్లతో సహా రాష్ర్టంలో 1,40,21,870 తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ పేరుతో ఇప్పటివరకు 17,39,014 తెల్ల రేషన్ కార్డులను తొలగించింది. రచ్చబండ కార్యక్రమంలో కూపన్లు పొందిన 8.50 లక్షల మంది లబ్ధిదారులకు కూడా రేషన్ నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కువమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే లబ్ధి చేకూరిందని అందులోనూ సగంపైగా అనర్హులు ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకు పనులు కూడా గుర్తించకపోవడంతో లక్షలాది మంది కూలీలు పనులకోసం కర్ణాటక తదితర ప్రాంతాలకు వలసలు వెళ్ళారు. విచారణకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు స్థానికంగా లేరనే కారణం చూపి రేషన్ కార్డులను రద్దు చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మరింత భారం తగ్గించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ-పాస్ విధానం ద్వారా రేషన్‌ను పంపిణీ చేయాలని భావిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయడంతో లీకేజీలు తగ్గించి రూ. 5 కోట్ల వరకు ఆదా అయిందని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. రెండో విడతగా కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రం అంతటా ఈ-పాస్ విధానం అమలు చేస్తే భారీ ఎత్తున లీకేజీలను అరికట్టి తద్వారా రూ.1,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా వస్తుందని అంచనా వేశారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు అప్పట్లో జారీ చేసిన 8.50 లక్షల తాత్కాలిక రేషన్ కూపన్ల గడువు పూర్తయినా పొడిగించే ప్రయత్నాలు చేయలేదు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత బాధ్యతలు స్వీకరించిన రోజున రేషన్ కూపన్లను ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నాటికి గడువు ముగిసినా వాటిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రంలో కుటుంబాలకు మించి రేషన్ కార్డులున్నాయని ఏదో ఒక విధంగా ఇప్పుడున్న రేషన్ కార్డుల్లో 30 శాతం మేరకైనా తగ్గించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రేషన్ కార్డులకు ఆధార్ లింకు అనుసంధానం లేదనే సాకు చూపి గ్రామీణ ప్రాంతాల్లో సరిగా రేషన్ ఇవ్వకుండా లబ్ధిదారులకు చుక్కలు చూపుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతి నెలా 1,59,523 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. వీటిలో పతి నెలా కనీసం 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం తగ్గితే కొంత ఉపశమనం పొందవచ్చని ఆమేరకు రేషన్ కార్డులు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
యజమాని లేడా.. రేషన్‌కార్డు రద్దే!
ఆధార్ ఇచ్చినా విడుదల కాని బియ్యం ఆందోళనలో లబ్ధిదారులు మండలంలో తగ్గిన 800 క్వింటాళ్ల కోటా కుటుంబ యజమాని చనిపోతే.. ఇక ఆ ఇంటి రేషన్‌కార్డు రద్దు అయింది. కుటుంబసభ్యులున్నా రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయింది. ఈనెల విడుదలైన రేషన్ బియ్యంలో ఈ విషయం వెల్లడైంది. మండల వ్యాప్తంగా సుమారు 800ల క్వింటాళ్ల బియ్యం తగ్గాయి. దీంతో ఇటూ డీలర్లు అటు లబ్ధిదారులు ఆం దోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. తెల్లరేషన్ కార్డులున్నవారు కుటుంబ సభ్యులతోపాటు కార్డుల్లో నమోదైన వారి ఆధార్‌కార్డులను సేకరించారు. ఆధార్ కార్డులు ఇవ్వని వారి కార్డులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో సదరు డీలర్లు తమ కోటా తగ్గుతుందని భావించి లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఆధార్‌కార్డులను సేకరించారు. వాటిని గడువులోగా రెవెన్యూ కార్యాలయంలో అందజేశారు. వ్యక్తి మరణిస్తే ఇక అంతే.. ఇదిలా ఉండగా పదేళ్ల క్రితం కుటుంబ యజమానిపై తెల్లరేషన్‌కార్డు జారీ అయింది. అయితే ఆ వ్యక్తి మృతి చెందడంతో అతడి ఆధార్‌కార్డు సమర్పించలేదు. దీంతో కంప్యూటర్లో ఇంటి యజమాని పేరుపై ఉన్న ఆధార్‌కార్డు నంబర్లేక అది స్వీకరించలేదని అధికారులు అంటున్నారు. కార్డుకు సంబంధించిన డేటా రాక బియ్యం విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు నాలుగు వందల అంత్యోదయ కార్డులున్నా వాటి పరిస్థితి కూడా ఇదే విధంగా నెలకొంది. ఆధార్‌కార్డులు ఇచ్చినా కార్డు ఎందుకు రద్దు చేశారని లబ్ధిదారులు ఆందోళన చెందారు. ఇటీవల లబ్ధిదారులు రేషన్డీలర్లను నిలదీశారు. అయితే అధికారులు ఇచ్చిన జాబితా మేరకు తాము పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. రెండు రోజులుగా లబ్ధిదారులను అధికారులను ప్ర శ్నించేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తుండగా.. ఆఫీసర్లు మాత్రం సర్వేలో నిమగ్నమై ఉండటంతో ఏం చేయాలో తోచడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. డీలర్లకు కోత.. మండల వ్యాప్తంగా 46 రేషన్‌షాపులున్నాయి. వీటిలో ఒక్కొక్క డీలర్‌కు 15 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు బియ్యం కోత పడిందని డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి చిలగాని మోహన్ తెలిపారు. అలాగే చక్కెర కూడా మూడు క్వింటాళ్ల వరకు తగ్గిందన్నారు.