తెల్ల దొరలు | It is an example of how misleading | Sakshi
Sakshi News home page

తెల్ల దొరలు

Published Sat, Aug 2 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

It is an example of how misleading

 తెల్లరేషన్‌కార్డులు ఎలా పక్కదారి పట్టాయో మచ్చుకో ఉదాహరణ ఇది. రేషన్‌కార్డులే కాదు.. కొందరు అంత్యోదయ కార్డులు పొంది నెలనెలా రూపాయికే కిలో చొప్పున 35 కిలోల బియ్యం పొందుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ రికార్డుల ప్రకారం 16వేల కుటుంబాలు ఉండగా.. 22,769 కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 12,232, తెల్లరేషన్‌కార్డులు 7,663, రచ్చబండ కూపన్లు 2,850, అన్నపూర్ణ కార్డులు 24 ఉన్నాయి. ఇందులో సగానికి పైగా బోగస్ రేషన్‌కార్డుదారులే. పేదలకు అంత్యోదయ కార్డుద్వారా నెలనెలా 35కిలోల బియ్యం ఇవ్వడం ధర్మమే అయినా... కోటీశ్వరులను... గరీబులను ఒకేగాటన కట్టి ఎడాపెడా కార్డులివ్వడంతో ప్రజాధనం వృథా అవుతోంది.
 
 సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణంలోని రేషన్‌కార్డుదారులకు నెలకు 5,669.96 క్వింటాళ్ల బియ్యం ప్రజాపంపిణీ ద్వారా సరఫరా అవుతున్నాయి. ఇందులో 50 శాతం మేర అర్హతలేనివారు, బినామీ కార్డుదారులు బియ్యం పొందుతున్నారు. ఆ బియ్యాన్ని తిరిగి కిరాణ దుకాణాల్లో క్వింటాల్‌కు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కిలో బిప్రభుత్వం క్వింటాల్ బియ్యాన్ని రూ.2,348కి కొనుగోలు చేస్తూ రూ.100కే పేదలకు అందిస్తోంది. ప్రతీ క్వింటాల్‌పై రూ.2,248 ప్రభుత్వం భరిస్తోంది. నెలనెలా సిరిసిల్లలో 2,834.98 క్వింటాళ్ల బియ్యం దారి మల్లుతున్నాయి. ఈ లెక్కన ఒక్క సిరిసిల్ల పట్టణ పరిధిలోనే నెలకు 66.56 లక్షల ప్రభుత్వ ధనం వృథా అవుతోంది.
 
 ఉత్తుత్తి సర్వేలు
 సిరిసిల్లలో బోగస్ రేషన్‌కార్డులు ఉన్నట్లు రెండేళ్ల క్రితం గుర్తించిన అప్పటి జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల రెవెన్యూ అధికారులతో సిరిసిల్లలో సర్వే చేయించారు. సర్వేల్లో రెండు వేల అంత్యోదయ కార్డులు తొలగించారు. సర్వేలో వాస్తవాలను వెల్లడించకుండా అధికారులు కొంతమేరకే తనిఖీలు చేయడంతో కొన్ని కార్డులు రద్దయ్యాయి.  క్షేత్రస్థాయి సర్వేలు చేయకుండా వారం రోజుల పాటు సిరిసిల్లలో రెవెన్యూ యంత్రాంగం కాలక్షేపం చేసింది.
 
 ఫలితంగా ఉత్తుత్తి సర్వేలతో అనర్హులకు అంత్యోదయ కార్డులు, తెల్లరేషన్‌కార్డులు దక్కాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు మైక్ ద్వారా మళ్లీ ప్రచారాన్ని చేపట్టారు. ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు తెల్లరేషన్‌కార్డులను తీసుకోరాదంటూ మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా అనర్హులు తెల్లరేషన్‌కార్డులు ఉంచుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాంటివారు ఉంటే కార్డులను తహశీల్దార్ కార్యాలయాల్లో అప్పగించాలని చెబుతున్నారు. అయినా ఎవరూ తిరిగివ్వడం లేదు.
 
 క్రిమినల్ కేసులు పెడతాం
 అర్హత లేకుండా రేషన్‌కార్డు, ఏఏవై కార్డులు కలిగి ఉన్నవారిని ఎవరినీ వదలం. స్వచ్ఛందంగా రేషన్‌కార్డులు అప్పగిస్తే వదిలేస్తాం. గడువు దాటాక ఎవరైనా రేషన్‌కార్డులను ఉంచుకుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా వారు పొందిన లబ్ధిని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా కక్కిస్తాం.
 - మన్నె ప్రభాకర్, తహశీల్దార్
 
  గాంధీచౌక్ ప్రాంతంలో నివాసముండే మధుసూదన్‌కు మూడు దుకాణాల రెండస్తుల భవనం ఉంది. అద్దె భారీగానే వస్తుంది. వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఇవేమీ గుర్తించకుండా సిరిసిల్ల రెవెన్యూ అధికారులు గుడ్డిగా తెల్లకార్డులను అందించారు. వీరంతా నిజంగా రేషన్ బియ్యం తిని బతుకుతున్నారా... అంటే ఆ భగవంతునికి... కాదంటే కార్డులు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులకే తెలియాలి.
 
  సిరిసిల్ల కొత్తబస్టాండ్‌లోని డీవీకే కాంప్లెక్స్ భవనం. రెండు షట్టర్లలో మెడికల్ షాప్, బేకరీ నడుస్తున్నాయి. ఎంతలేదన్నా నెలకు రూ.10 వేల వరకు అద్దె వస్తోంది. మొదటి అంతస్తు నిర్మాణంలో ఉంది. ఈ భవనం గాంధీనగర్‌లోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్ వద్ద నివాసముండే ద్యావనపల్లి వెంకటేశంది. ఇతను కూడా నిరుపేదేనట. అలా గుర్తిస్తూ రెవెన్యూ అధికారులు వెంకటేశంకు తెల్ల రేషన్‌కార్డు ఇచ్చారు.
 
  సిరిసిల్ల గాంధీచౌక్‌లో వ్యాపారం చేసే చీకోటి
 రాజేశంకు గాంధీనగర్‌లో రెండస్తుల అందమైన భవనం ఉంది. ఒక కారు కూడా ఉంది. ఇతన్ని
 కూడా పేదగానే పేర్కొంటూ తెల్లరేషన్‌కార్డు
 ఇచ్చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement