రేషన్‌కార్డుకు విద్యుత్ షాక్ | Ration card electric shock | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డుకు విద్యుత్ షాక్

Published Tue, Feb 16 2016 2:57 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

రేషన్‌కార్డుకు విద్యుత్ షాక్ - Sakshi

రేషన్‌కార్డుకు విద్యుత్ షాక్

 బోగస్‌కార్డుల పేరుతో ఇప్పటికే పెద్దసంఖ్యలో రేషన్‌కార్డులను ప్రభుత్వం తొలగించింది. తాజాగా విద్యుత్‌బిల్లుతో లింకు పెట్టి మరికొన్ని కార్డులను తొలగించే కసరత్తు ప్రారంభించింది. రూ.వెయ్యి కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు కట్టే వారి రేషన్‌కార్డులను రద్దుచేసే ప్రక్రియ చేపట్టింది.
  

 విద్యుత్‌బిల్లు, వాహనాలు, భూమితో లింకు
భారీగా రేషన్‌కార్డుల రద్దుకు యత్నం

 
 
నెల్లూరు(పొగతోట)/ఉదయగిరి:  ప్రజాపంపిణీ వ్యవస్థలో భారాన్ని తగ్గించుకునేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తొలుత ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డులను తొలగించే పనిలో ప్రభుత్వం పడింది. ఇచ్చేది గోరంత.. తొలగించేది కొండంత అన్న చందంగా ప్రభుత్వ పాలన సాగుతోంది. జన్మభూమి కార్యక్రమంలో 55 వేల కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసింది. ప్రస్తుతం 1.50 లక్షల రేషన్‌కార్డులు తొలగించే విధంగా ప్రభుత్వం పావులుకదుపుతోంది.
 


 జిల్లాలో 8.16 లక్షల తెల్లకార్డులు
 జిల్లాలో 8.16 లక్షల తెల్లరేషన్‌కార్డులున్నాయి. 1872 రేషన్ దుకాణాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 24 లక్షల మంది రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌కార్డుకు ఆధార్ లింకు పేరుతో 50 వేల కార్డులు పైగా తొలగించారు. అంతటితో ఆగకుండా ఏదో ఒక లింకుతో గణనీయంగా కార్డులు తగ్గించేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. జిల్లాలో ఏడు లక్షలు పైగా గృహవిద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో సుమారు 50 వేల మందికి పైగా నెలకు రూ.1000 కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నట్లు అంచనా. ఇటీవల విద్యుత్ బిల్లులు భారీగా పెంచడంతో రూ.వెయ్యి కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు కట్టే వారి సంఖ్య పెరిగింది. దీనినే ఆసరాగా చేసుకుని 50 వేలకు పైగా రేషన్‌కార్డులు తొలగించేందుకు డిస్కం అధికారులద్వారా సమాచారం తెప్పించుకునే పనిలో ప్రభుత్వం ఉంది. అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే నెలకు రూ.650 కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లించే వారి సంఖ్యను కూడా చేర్చాలని  ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. వీరిని కూడా పరిగణనలోకి తీసుకుంటే   మరో 50 వేలకు పైగా కార్డులు రద్దవడం ఖాయం.


 వాహనాలతోనూ లింకు
 విద్యుత్ బిల్లుతోనే కాకుండా వాహనాలు కలిగి ఉన్న వారి సంఖ్యను కూడా లెక్క తేల్చాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. అంటే నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనాలు కలిగిన వారి కార్డులుకూడా రద్దుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో 31 వేల వరకు కార్లు ఉన్నాయి. వీటిలో చాలామంది బతుకుదెరువు కోసం వివిధ బ్యాంకుల్లో రుణం పొందో లేక అప్పోసొప్పో చేసి కార్లు నడుపుతున్నారు. వీరికి కూడా తెల్లరేషన్‌కార్డు రద్దయ్యే అవకాశముంది. అంతేకాకుండా 3.60 లక్షల ద్విచక్ర వాహనాలు జిల్లాలో ఉన్నాయి. ఇవి ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే మరో మూడు లక్షల కార్డులు రద్దయ్యే అవకాశముంది. అంతేకాకుండా భవనాలు కలిగిన వారిని కూడా సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. పక్కా భవనాలు కలిగిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇంకా చాలా కార్డులు రద్దయ్యే అవకాశముంది.

 ఐదెకరాలు భూమి ఉంటే కార్డు గోవిందా..
 ఐదెకరాలకు మించి మెట్ట, రెండున్నర ఎకరాకు మించి మాగాణి పొలం ఉంటే తెల్ల రేషన్‌కార్డులు రద్దుకానున్నాయి. జిల్లాలో మెట్ట మండలాలల్లో ఐదెకరాలు మించి చాలామందికి భూములున్నాయి. వీటిలో చాలామందికి దేనికీ పనికిరాని బంజరు భూములున్నాయి. ఇలాంటి వారు కూడా కార్డులు కోల్పోయే ప్రమాదముంది. రాష్ట్రంలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో ఒక ఎకరా భూమి సరాసరిన రూ.20 లక్షలు పైనే పలుకుతుంది. అదే ఒక ఎకరా భూమి నెల్లూరు జిల్లా ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో రూ.లక్ష కూడా పలికే పరిస్థితి లేదు. మరి రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని ఈ షరతును అమలు చేస్తే రాష్ట్రంలోని వెనుకబడిన మండలాల్లోని అనేక కుటుంబాలు తెల్ల రేషన్‌కార్డులు కోల్పోయే ప్రమాదముంది. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో నాడు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అనేక పథకాలు అమలులోకి తేగా, నేటి ప్రభుత్వం పథకాలలో లోటుపాట్లు, సవరణ అంటూ అనేకమంది అర్హులకు కూడా ఇబ్బందికలగజేస్తోంది. జన్మభూముల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా చెబుతూనే మరోవైపు దొడ్డిదారిన పెద్ద సంఖ్యలో కార్డులు తొలగించే ప్రక్రియ చేపట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement