రోజుకో నాటకం..పూటకో మెలికతో రుణ మాఫీకి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతుల్ని దూరం చేసేందుకు సర్కారు పన్నాగం పన్నుతోంది. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు అంటూ రోజుకో కొత్త నిబంధన పెడుతూ రైతులను ఇక్కట్లకు గురిచేస్తోంది. తమ రుణాలు మాఫీ అవుతాయని గంపెడాశతో ఉన్న అన్నదాతలకు ప్రభుత్వ చర్యలు అశనిపాతంలా మారాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దాని అమలులో తాత్సారం చేస్తోంది. సాధ్యమైనంత మందిని రుణమాఫీకి అనర్హులను చేయడమే లక్ష్యంగా రోజుకో ఆదేశాలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆధార్ అనుసంధానం చేయాలని నిబంధన పెట్టిన ప్రభుత్వం కొత్తగా ఆధార్‌తోపాటు రేషన్ కార్డు కూడా ఉండాలని నిబంధన విధించింది. జిల్లాలోని రైతుల వద్ద ఆధార్ ఉంటే రేషన్ కార్డు లేనివారు, రేషన్ కార్డు ఉంటే ఆధార్‌లేని వారి సంఖ్య గణనీయంగా ఉందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఈ రెండు ఉండాలన్న నిబంధన వల్ల మరికొంతమంది లబ్ధిదారులకు రుణమాఫీ అందకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.
అర్హుల జాబితా తయారీలోనూ జాప్యం
పంట రుణాల మాఫీకి అర్హత ఉన్న రైతుల జాబితా తయారు చేయడంలో బ్యాంకర్లు, అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. సెప్టెంబర్ 15లోగా తుదిజాబితా తయారు చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకూ ఈ జాబితాల తయారీ జరగలేదు. మరో రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ జాబితాలు తయారు చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మాత్రమే జాబితాల తయారీలో పురోగతి సాధించాయి.
లబ్ధిదారుల పూర్తి వివరాలను డేటాబేస్‌లోకి మార్చే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ బ్యాండ్‌విడ్త్ తక్కువగా ఉండటంతో సవరణలు కూడా అక్కడి నుంచి చేసే అవకాశం లేకుండా పోతోందని, దీని కోసం ఒంగోలు రావాల్సి వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. మిగిలిన బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది. ఎప్పటికి పూర్తవుతుందనే విషయాన్ని వారు చెప్పడం లేదు. అర్హులను తేల్చే ప్రక్రియ పూర్తికావడానికి మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది.
రుణ మాఫీకి కొత్త మెలికలు
Published Sun, Sep 14 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement