బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణసాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ బండారం బయటపడుతోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన ఆ పార్టీ అధినేత తీరు ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. రైతులు.. డ్వాక్రా మహిళలు.. ఇలా ఎంతోమందిని మోసగించేందుకు సిద్ధమవుతుండటంతో ఆయా వర్గాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి.
రుణ మాఫీపై తొలి సంతకం చేశారన్న మాటే తప్పిస్తే.. ఆ హామీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా ఆ భారం తగ్గించుకునేందుకు రోజుకో నిబంధన తెరపైకి తీసుకొస్తుండటం విమర్శలకు తావిస్తోంది. తొలుత ఆధార్, రేషన్‌కార్డుల్లో ఏదో ఒకటి ఇచ్చినా రుణమాఫీ వర్తిస్తుందని చెప్పినా.. ప్రస్తుతం రేషన్‌కార్డును తప్పనిసరి చేయడం రైతులను కలవరపరుస్తోంది. జిల్లాలో 42లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 36,31,324 మంది మాత్రమే ఆధార్ కార్డులు పొందారు. లక్ష మందికి పైగా రేషన్ కార్డుల్లేవు. వీరంతా దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ లెక్కన ఆధార్, రేషన్‌కార్డులు లేని రైతులకు రుణ మాఫీ వర్తించే పరిస్థితి లేదని తేలిపోయింది. ఆధార్ కార్డు లేకపోయినా ఒకటి రెండు రోజులు క్యూలో నిల్చొని కనీసం నెంబర్ తీసుకునే వీలుంది.
అయితే రేషన్ కార్డు లేని రైతుల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. కల్లూరు మండలంలోని ఉలిందకొండ కోఆపరేటివ్ బ్యాంకు పరిధిలో మొత్తం 740 మంది రైతులు రూ.1.60 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇందులో 200 మంది రైతుల వివరాలను సేకరించగా.. 50 మంది రైతులకు ఆధార్, రేషన్‌కార్డులు లేవని గుర్తించారు. డోన్ ఆంధ్రా బ్యాంకు పరిధిలో 5,600 మంది రైతులు రుణాలు పొందగా.. 530 మందికి రేషన్ కార్డులు, 600 మందికి ఆధార్ కార్డులు లేవని వెల్లడైంది.
ఆలూరు పరిధిలో 60వేల మంది రైతులు రుణాలు తీసుకోగా.. ఇప్పటి వరకు వివరాలు అందజేసిన రైతుల్లో 15వేల మందికి పైగా అనర్హులను గుర్తించినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 6లక్షల మందికి పైగా రైతులు రుణాలు తీసుకోగా.. 35 శాతం మందికి పైగా రైతులు రుణ మాఫీకి అనర్హులయ్యే పరిస్థితి నెలకొంది. వీరంతా తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఎన్నికలకు ముందు ఇంటింటికి తిరిగి రుణాలు చెల్లించక్కర్లేదని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రుణాలన్నింటినీ మాఫీ చేస్తారని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తుండటం గమనార్హం.
రుణమాఫీ చుట్టూ నీలినీడలు
Published Mon, Sep 8 2014 11:38 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement